Saturday, July 16, 2016

యత్ర యత్ర రఘునాధ కీర్తనం! తత్ర తత్ర కృతమస్తకాంజలిం!!

రోజూ పొద్దున్నే "బంటు రీతి కొలువు" "పాహి రామ ప్రభో" ఇలా రామ కీర్తన ఆర్ద్రతతో, భక్తితో, ఎలుగెత్తి, పాడుతూ ఉంటే ఏమవుతుంది?

ఏమవుతుంది! ఏదవ్వాలో అదే అయ్యింది ;)

నిన్న యధావిధిగా వంటా వార్పూ కార్యక్రమం పూర్తి చేశా. చాలా రోజుల తర్వాత కంద బచ్చలి కూర! ఏ మాటకా మాటే! కూర ఆదరః!!

మధ్యాన్నం ఒంటిగంటకి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఇంక భోజనానికి కూర్చోపోతూంటే వంటింట్లో పెద్ద శబ్దం వచ్చింది. పరిగెత్తికెళ్ళి చూస్తే రెండు కోతులు వంటింట్లో ఉన్నాయి :(

నేను వెంటనే వంటింటి పక్కనే ఉన్న బెడ్ రూమ్ తలుపు వేసి బైట గొళ్ళెం పెట్టేసా. ఎందుకంటే ఆ బెడ్ రూమ్ లో మా అమ్మ, అత్తగారు ఇద్దరూ అప్పుడే భోజనం చేసి నడుం వాల్చారు. ఈ కోతులు కాని ఆ గదిలోకి వెళ్లాయంటే మట్టుకు రచ్చ రచ్చే!! (మా అత్తగారు కూడా మా ఇంట్లో సంవత్సరంలో చాలా నెలలు ఉంటారు!) వాళ్ళకి వెంటనే అర్ధం అయ్యింది. ఏదో అయ్యిందని. లోపలినించి కేకలు. నేను పట్టించుకోలేదు. ముందు కోతుల సంగతి చూడాలి కదా?

ఒక కోతి మెల్లిగా గట్టెక్కి, స్టవ్ పక్కన సెటిల్ అయ్యి అక్కడే ఒక టమాటో ఉంటే దాన్ని మహా శిరస్తాగా, అతి నెమ్మదిగా తినడం మొదలెట్టింది. రెండో కోతి పక్కనే ఉన్న తలుపులు లేని అరలు ఎక్కి మూడో అరలోపలికి దూరిపోయింది ;) నేను వెంటనే ఆ అరలో ఏమున్నాయో అని గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేసాను. కానీ నాకు గుర్తొచ్చే అవసరం లేకుండా అది ఆ అరలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలని ఒకటొకటి కింద పడెయ్యడం మొదలెట్టింది :( బ్రతికాం. పక్క అరలోకి వెళ్ళలేదు. అందులో గాజు సీసాలు అన్నీ !!

ఒక రెండు డబ్బాలు పడేసాక కిందకి దూకి ఒక డబ్బా పట్టుకొని గుమ్మం బైట బాల్కనీ లోకి వెళ్లి దాని మూత నోటితో తీసిపడేసి అందులో ఉన్న శెనగపప్పు మొత్తం కింద ఒంపి, శుభ్రంగా కూర్చొని ఒక్కో పలుకు ఎడం చేత్తో నోట్లో వేసుకొని ఆనందించడం మొదలెట్టింది!

అది ఇంటి బైటికి వెళ్ళింది కాబట్టి నేను నా దృష్టి స్టవ్ పక్కనున్న కోతి మీద పెట్టా. అది ఏమీ తొందర లేకుండా దాదాపు 5 నిమిషాలు ఆ టమాటో ని తింది. తిన్నాక స్టవ్ కి అటువేపు వెళ్లి అక్కడున్న ఒక పొట్లం విప్పే ప్రయత్నం చేసింది. దానివల్ల కాలేదు. ఆ కోపంతో నా మీదకి దూకింది. నేను వెంటనే డైనింగ్ రూమ్ లోకి జంప్! నా వెనకాలే కోతిగారు! 

మా ఆవిడ వెంటనే ఫ్రిజ్ లోంచి రెండు టమాటో లు తీసి ఇచ్చింది. అది చాల ఇష్టంగా తింటోంది కదా ఇవి ఇవ్వండి అని! అవి ఇస్తే ఏమవుతుంది? ఇంకో అరగంట తింటుంది కాని థాంక్స్ చెప్పి రెండు టమాటాలు రెండు చేతుల్లో పట్టుకొని, బైటికి వెళ్లిపోతుందా? ఏమిటో? ఇలాంటి టెన్షన్ సమయాల్లో బుర్రలు పని చేసి చావవు కదా ఎవరికైనా?

నేను టమాటో సంతర్పణ కార్యక్రమం ఆపి దాన్ని బైటికి పంపించే ప్రయత్నం చేశా. అది మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. అమ్మయ్య బైటకి వెళ్లిపోతుందేమో అనుకుంటే వంటింట్లో నేల మీద తల నేలకానించి నిద్ర పోవడానికి ప్రయత్నించింది. నా గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ కోతిగారు అలా చిన్న కునుకు తీస్తే ఎలా? ఎంతసేపు బొజ్జుంటుందో? లాభం లేదని ఉస్సు, బస్సు మని శబ్దాలు చేసా దగ్గరకెళ్ళి. నాకప్పుడప్పుడూ విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది లెండి ;)

ఈ లోపల మా ఆవిడ నా చేతిలో మూడు అరిటిపళ్ళు పెట్టి వాటిని బైటకి వెయ్యమంది. అలా వేస్తె ఈ ఆడకోతి కూడా బైటకి వెళ్తుందని మా ఆవిడ ప్లాన్! నాకు అనుమానం వచ్చింది ఇదేదో బెడిసి కొడుతుందేమో అని. కానీ నా దగ్గర ఏమీ ఆక్షన్ ప్లాన్ లేకపోవడంతో సరేనని ఆ నిద్రపోతున్న కోతి పక్కకెళ్ళి బైట ఉన్న కోతి మీదకి ఆ మూడు అరటిపళ్ళు విసిరా. బైట కోతి ఆ పళ్ళని పక్కన పెట్టి, నాలుగు శెనగపప్పు గింజలు తినడం, ఒక అరటిపండు వలిచి ఓ ముక్క కొరకడం ;)

ఈ ఆడకోతి నేను పక్కన నిలపడి అరటిపళ్ళు విసిరితే నిద్రాభంగం అయ్యి దాని మధ్యాన్నం బ్యూటీ స్లీప్ చెడకొట్టానని దానికి భలే కోపం వచ్చింది. అసలే అడ కోతి!! మళ్ళీ అది నా మీదకి, నేను డైనింగ్ రూమ్ లోకి, జంప్! అది నా వెనకాలే వచ్చేసింది. నేను ఆగితే పళ్ళు ఇకిలించి మొహం భీకరంగా పెట్టి నన్ను భయపెట్టడానికి ప్రయత్నించింది. రెండు మూడు సార్లు. నేను భయపడినా, బైటికి నేను కూడా భీకరంగా మొహం పెట్టి ధైర్యంగా దాని వేపు చూసా! ఒకసారి మనం భయపడ్డట్టు కనిపిస్తే చాలు మీద పడి రక్కేస్తుంది. చాలా జంతువులు కూడా అంతే. 

ఈ లోపల మా ఆవిడ కిందకెళ్ళి మా ఓనర్ ని పిలుచుకొచ్చింది. ఇహ చూస్కోండి. నా వెనకాల నిలపడి వాళ్ళిద్దరూ కోతుల మనస్తత్వాలా మీద, వాటి బిహేవియర్ మీద, వాటిని బైటికి ఎలా పంపించాలి, సులభ మార్గాలేమిటి ఇలాంటివి అన్నీ విపరీతంగా చర్చించేస్తూ మధ్య మధ్యలో నన్ను భయపెట్టడం "అలా దగ్గరకెళ్ళకండీ! పీకేస్తుంది" "పోనీ ఏదైనా కర్రతో బెదిరిస్తే" "అమ్మో మొన్న ఇలాగే ఒకావిడ కర్రపెట్టి బెదిరిస్తే ఆవిడ మీద పడి పీకినంత పని చేసాయి! వద్దులెండి" ఇలా వాళ్లకి తోచిన అయిడియాలు, నన్ను భయపెట్టడాలు. అసలే ఆ కోతిని బైటికి ఎలా పంపించాలో అర్ధం కాక నేనేడుస్తూంటే వెనకాతల నించి వీళ్ళ హడావిడి! 

ఇంతలో అలా నా వెనక వచ్చేన ఆ కోతి హద్దిరబన్నా అని డైనింగ్ టేబుల్ మీదకి ఒక్క గెంతు గెంతింది. ఎంచక్కా అన్నీ దానికోసం రెడీ టు ఈట్ పెట్టినట్టు ఫీల్ అయ్యిపోయి!! అయ్యిపోయామురా దేవుడా!! ఇంక ఈ పూట పస్తే మాకు :(

ఆ కోతి ముందస్తుగా పెరుగు గిన్నె మూత తీసి మూతి లోపల పెట్టింది. దానికి ఆ పెరుగు వాసన నచ్చినట్టు లేదు. వెంటనే చారు గిన్నె మూత తీసింది. ఊహూ! చారు కూడా నచ్చలేదు! ఈ మధ్య నాక్కూడా చారు ఎందుకో నచ్చటం లేదు!! నెక్స్ట్ నేను కస్టపడి చేసిన కంద బచ్చలి కూర గిన్నె. నాకు ఏడుపొక్కటే తక్కువ! "క్షణంక్షణం" సినిమాలో శ్రీదేవి లాగా "దేవుడా! దేవుడా!" ఆ కోతిగారికి నా కూర నచ్చ కూడదు అని యమ స్పీడ్ గా ప్రార్ధించా! నా మొర చివరికి దేవుడాలకించాడు! కోతిగారు కూర మూత తియ్యగానే టక్కున మళ్ళీ మూత పెట్టేసింది. షాక్ కొట్టిన దానిలా!అలా మూత పడేసి నా వేపు ఒక రకంగా చూసింది. ఆ చూపుకర్ధం నాకు ఓ గంట తర్వాత అర్ధం అయ్యింది! అదేమిటంటే "చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగే మేము ఆకులు అలములు తిన్నామంటే అర్ధం ఉంది! శుభ్రంగా మాంచి కొంపల్లో ఉంటూ కూడా ఈ మనుషులు ఆకులు తినడం ఏమిటి? ఖర్మ కాకపొతే? అని" :(

అలా నాకిష్టమైన, నేనే స్వయంగా వండిన కూరని రక్షించాక ఇహ మిగిలింది నన్ను నేను రక్షించుకోవడం! ఇప్పుడే దేవుడు నా కూరని రక్షించాడు కాబట్టి మళ్ళీ వెంటనే నన్ను రక్షించడు ఏమో అని డౌట్ వచ్చి,  మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం మనం చెయ్యాలి కదా అని మళ్ళీ ఉస్సు, బస్సు మని కసిరా...చేతులు ఊపుతూ. అది వెంటనే కుర్చీ మీదకి ఒక్క గెంతు గెంతి కుర్చీతో సహా కింద పడింది.. వెంటనే వెళ్లి ఫ్రిజ్ పక్కనే గోడని పట్టుకొని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. నా ఉద్దేశంలో ఇది ఏ పక్కింట్లోనో శుష్టుగా తిండి లాగించేసింది. అందుకే దానికి అలా చీటికి మాటికి నిద్ర కుమ్మేస్తోంది! నేను ఈ సారి అది కళ్ళు మూసే లోపల భారత నాట్యం మొదలెట్టా పిచ్చి అరుపులు అరుస్తూ! దానికి ఇంక అర్ధం అయ్యిపోయింది. ఈ కొంపలో సుఖంగా నిద్రపోనిచ్చెట్టు లేరని! ఇంక చేసేది లేక మెల్లిగా వంటింట్లోంచి బైటికి వెళ్ళిపోయింది.

హమ్మయ్య! గండం గడిచింది!. నేను వెంటనే ఒక్క గెంతులో వెళ్లి పెరటి తలుపు వేసేసా. ఆ బైట శెనగపప్పు తింటున్న కోతి ఇంకా అలా స్లో మోషన్ లో తింటూనే ఉంది. నన్నేమీ పట్టించుకోకుండా! అది మగ కోతి! 

ఈ మొత్తం కార్యక్రమం సుమారు 20 నిమిషాలు జరిగింది. ఈ మధ్యలో మా ఆవిడ  వెనక నించి ప్రామ్టింగ్. "దగ్గరకెళ్ళకండి" "అరటిపళ్ళు విసరండి" "వెనక్కి రండి" "అమ్మో కరుస్తుందేమోనండీ" ఇలా రకరకాల ఆర్డర్స్, రున్నింగ్ కామెంటరీ! నాకసలే టెన్షన్. నేనేమన్నా కోతుల శాస్త్రం తెలిసిన వాడినా? ఎదో మొత్తానికి నా అదృష్టం బాగుండి వాటిని బైటికి పంపించాను.

ఇదంతా నేను రోజూ రామకీర్తన చెయ్యడంతో వచ్చిందని నాకు అనుమానం! "యత్ర యత్ర రఘునాధ కీర్తనం! తత్ర తత్ర కృతమస్తకాంజలిం" అని  అంజనేయుల వారు వచ్చేసారు. క్షమించాలి. విచ్చేశారు! నిజం చెప్పాలంటే ఈ ప్రహసనం మధ్యలో హనుమాన్ చాలీసా గట్టిగా పాడుదామనే ఆలోచన వచ్చింది. కానీ ఈ మానవానర సంగ్రామంలో ఎక్కడైనా తప్పు చదివినా, ఒకటో రెండో వాక్యాలు లేపేసినా, ఎక్కడ అంజనేయుల వారికి కోపం వచ్చి మీద పడి రక్కేసి, నా బుర్రమీద రామకీర్తన చేస్తారో అని భయమేసి ఆ ఆలోచన విరమించా!!

మొత్తానికి అలా ఆ కోతిని సాగనంపాక భోజనానికి కూర్చుంటే అప్పుడు నా కాళ్ళు వణకడం మొదలెట్టాయి చూడండి! ఒక పావుగంట నేను భోచేస్తున్నంత సేపు అవి అలా వణుకుతూనే ఉన్నాయి :( అప్పుడు తెలిసింది అన్నమాట నా శరీరానికి తప్పించుకున్న ప్రమాదం విషయం!!

మోరల్ అఫ్ ది స్టొరీ ఏమిటంటే మీరు కూడా నాలా ప్రతి రోజూ ఆర్ద్రతతోనూ, భక్తితోనూ రాముల వారి కీర్తనలు, భజనలు పాడుతే మాత్రం వీధి తలుపు, పెరటి తలుపు వేసి ఆ కార్యక్రమం చెయ్యండి. లేకపోతె కించిత్ ప్రమాదం! తస్మాత్ జాగ్రత్త!! ఈ తలుపులు వెయ్యడం పాడుతున్నప్పుడే కాదు! ఎల్లప్పుడూ!

NB: ఇంత హడావిడి, టెన్షన్ లోనూ ఏ మాత్రం భయపడకుండా, ప్రాణాలకి తెగించి, నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటోగ్రాఫర్ లాగా  కొన్ని ఫోటోలు తీసా!! ఫేస్బుక్ లో పెట్టాలి కదా ;)  

Disclaimer: No animals were harmed during the shooting :P





1 comment:

  1. Two things came out. You cook food in your house and your wife and her mother eat and rest. Second your wife calls you (still) "andee".

    Hilarious Taking photos in that tension shows your technological brain. If you gave the camera to "HANUMANI" (lady monkey) she could have taken a "selfie" with her hubby, and for that she would have gone out or who knows, she could have called him inside. Double whammy.

    In future, you can suggest to them to join their clan in AAP.

    ReplyDelete