Thursday, January 28, 2016

Service to nation!

ఈ మధ్య గబుక్కున ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే నన్నెవరైనా హటాత్తుగా "ఈ దేశం నీకేమిచ్చిందన్నది కాదు పాయింట్! నువ్వు దేశానికి ఏమిచ్చావు అన్నదే ప్రశ్న" అని పదిమందిలో అడిగారనుకోండి. అప్పుడు నా గతేమిటి? ఎంత ఆలోచించినా ఈ దేశానికి ఏమిచ్చానో తట్టలేదు. ఆదాయపు పన్నంటారా? అది నేను మనస్పూర్తిగా ఇవ్వలేదు. సర్కారు వాళ్ళే బలవంతంగా తీసుకున్నారు :(

ఆ ఆలోచన వచ్చిన దగ్గరి నించి నిద్ర తగ్గిపోయింది. కాస్సేపు కునుకు తీసినా ఒకటే పీడకలలు! నేనొక పెద్ద కాలేజీ లోనో, లేక ఒక పెద్ద కంపెనీ లోనో భారీ స్పీచ్ ఇస్తూంటే ఒక కుర్రకారు అదిగో అదే ప్రశ్న ఆ మహా సభలో వేసినట్టు, సమాధానం లేక, కల్పించి (కలలో కూడా!) చెప్పలేక అలనాడు మయసభలో దుర్యోధనుడి లాగా భారీ అవమానం పాలయినట్టు కలలు! ఇలా లాభం లేదని ఈ దేశానికి ఏదో ఒకటి అర్జెంటు గా చేసెయ్యాలి అని నిర్ణయించాను. అంతమట్టుకు బాగుంది. ఈ వయస్సులో సైన్యంలో చేరలేను. స్వచ్ఛ భారత్ అంటూ వీధులు తుడవలేను. మరేం చెయ్యాలి? మరేం చెయ్యాలి? (సినిమాల్లో లాగా ఈ చివరి ప్రశ్న అలా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది).

అలా కొన్నాళ్ళు మధన పడగా పడగా ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. (ఈ ఐడియా నా జీవితాన్నే మార్చేస్తుందేమో?!) అదేమిటంటే ఇటీవలి కాలంలో అందరూ వాతావరణం, పర్యావరణం లో భారీ మార్పులు వచ్చేస్తున్నాయి. పట్టించుకోని ప్రతి వాళ్ళు చెట్లు పెంచండి అని ఘోషిస్తున్నారు కదా?

(పిడకలవేట: చెట్లు ఎలా పెంచాలో, పెంచుతారో తెలీదు నాకు! ఎవరైనా మొక్కలు పెంచుతారు. అవి పెద్దయితే చెట్లు అవుతాయి. ఇంకా భారీగా పెరిగితే చెట్టు అంటే బాగోదేమో అని వృక్షం అంటాం. కాని చెట్లు ఎలా పెంచుతాం?!)

సరే నా వంతు కృషి మొక్కలు పెంచుదామని నిర్ణయించాను. వెంటనే ఒక బుజ్జి కుండీలో ఒక అర డజను ధనియాలు మట్టిలో పాతిపెట్టి, రోజూ నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను. చిన్ని మొక్క రాగానే మహా ఆనందపడిపోయాను. దేశానికి నా సేవాంకురం అని! రోజూ చాల ప్రేమగా ఇంకు ఫిల్లెర్ తో నీళ్ళు పోసాను. మగ్గుతోనో, చెంబుతోనో పోస్తే ఆ నీటి ధాటికి తట్టుకోలేక చచ్చిపోతాయేమోనని భయమేసి. ఒక్కోటి ఒక రెండు అంగుళాలు పెరిగాయి.హమ్మయ్య! నా వంతు దేశసేవ చేసేసాను.

కాని ఇంతలో దినపత్రికల భాషలో చెప్పాలంటే నిన్న సాయంత్రం ప్రకృతి విలయతాండవం చేసింది. అంతే. అనుకోకుండా విచిత్రంగా వర్షాకాలంలో వాన పడ్డం మొదలెట్టింది. నేనేమో బైటికి పని మీద వెళ్ల్లాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ వాన అలా చినికి చినికి భారీ వర్షంగా మారింది. నా కారుకి ఈత రాదు. అందుకని అదెక్కడా మునిగిపోకుండా అష్టకస్టాలు పడి మొత్తానికి ఎలాగైతేనేం ఒక రెండు గంటల తర్వాత ఇంటికొచ్చాను. వచ్చి చూస్తె ఏముంది. చెప్పానుగా ప్రకృతి విలయతాండవం అని. నా కొత్తిమీర మొక్కలన్నీ నామ, రూపాలు లేకుండా పోయాయి. బుజ్జి కుండీ కూడా పగిలిపోయి ఆ ముక్కలన్నీ చెల్లాచెదురు అయ్యిపోయి కనిపించాయి. అంతే! నాకు దుఃఖం ఆగలేదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నా మొక్కలన్నీ సమూలంగా నాశనం అయ్యిపోయాయి.

అందుకే అంటారు కంటే ఖర్మం కాని పెంచుకుంటే ప్రారబ్ధం అని. నాలుగు రోజులు పెంచిన నాలుగు మొక్కలు చచ్చిపోతేనే నాకింత బాధగా ఉందే. మరి నాలుగు నెలలు పెంచి పోషించిన పంట నాశనం అయిపోతే రైతుల గుండెలు ఆగిపోయాయంటే ఆశ్చర్యం లేదు. అతిశయోక్తి కాదు.

చివరాఖరికి నా దేశసేవకి అలా ఆరు ఆకులతోనే నిండు నూరేళ్ళు నిండాయి :( ఇంకెలా ఈ దేశానికి సేవ చెయ్యాలో అలా అలోచిస్తూనే ఉన్నా!

సశేషం!!
 
#Telugu

Monday, January 25, 2016

A chapter for my (auto)Biography!!

2011 లో నాకు జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసిన స్వీయ రచన!

ఆ మధ్య ఒక "గొప్ప" ఆలోచన వచ్చింది. అదేమిటంటే ముందు ముందు నేను గొప్పవాడిని అయితే ఎవరో ఒకరు నా జీవిత చరిత్ర రాయడానికి పూనుకుంటారు కదా? ఎవరూ ముందుకు రాకపోతే అధమపక్షం నేనే స్వయంగా స్వీయచరిత్ర రాసే అవకాశం కూడా లేకపోలేదు. కాని అపుడు ఒక "గొప్ప" చిక్కొస్తుంది. అదేమిటంటే గొప్పవాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు, సన్నివేశాలు ఉండాలి కదా! కాని నా జీవితంలో ఇప్పటిదాకా అలాంటి "గొప్ప" సంఘటనలు ఏవి జరగలేదే? మరేమిటి దారి? అని ఆలోచించగా, చించగా ఒక "గొప్ప" ఆలోచన వచ్చింది.

ఎవరైనా గొప్పవాళ్ల్లయ్యాక గొప్ప పనులు చెయ్యడం పెద్ద గొప్ప కాదు. గొప్పవాళ్ళు కాకముందే చెయ్యాలి.

(పిడకల వేట : ఉదాహరణకి ఎవరైనా బాగా ఆస్థిపరుడు, సంఘంలో పేరున్న వ్యక్తి సిటీ బస్సు ఎక్కారనుకోండి. సాధారణంగా అది ముందస్తుగా టీవీ న్యూస్ చానల్స్ వాళ్లకి ఉప్పందించి చేస్తారనుకోండి. అప్పుడు అంతా ఆహా! ఓహో! ఏమి సింప్లిసిటీ, ఏమి హుంబుల్నెస్ అంటూ ఆకాశానికి ఎత్తుతారు. అదే నాలాంటి వాడు ఎక్కితే "చూసారా? అంత డబ్బులుండీ కూడా సిటీ బస్సు ఎక్కాడు. కక్కుర్తికి పరాకాష్ట కాకపొతే ఇంకేమిటి" అని దుమ్మెత్తిపోస్తారు! లోకంపోకడ అంతే లెండి.)

సరే ఇప్పుడు నేను అర్జెంటుగా చెయ్యగలిగిన "గొప్ప" పనులు ఏమున్నాయి అని మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాను. ఏమిటో జీవితం అంతా ఆలోచనలతోనే సరిపోతోంది. అప్పుడు చరిత్రలో జరిగిన ఒక "సాధారణ" సంఘటన ప్రపంచ చరిత్రలో "గొప్ప" మార్పులు తెచ్చిన సంఘటన గుర్తొచ్చింది. మీ అందరికీ కూడ తెలిసినదే. ఒక మహాత్ముడిని రైల్లోంచి తోసేస్తే ఆయన మన దేశ చరిత్రనే మార్చేసారు!  అది నాకు గొప్ప ప్రేరణ లాగ పనిచేసింది. కనీసం నన్ను బస్సులోంచైనా ఎవరైనా తోసేస్తే నేను కూడా ఒక గొప్ప ఉద్యమం ఏదైనా మొదలెట్టేసి గొప్ప వాడిని అయ్యిపోవచ్చు కదా ఎవరైనా  నన్ను బస్సులోంచి తోయ్యలంటే నేను ముందు బస్సు ఎక్కాలి కదా.  

అంతే వెంటనే ఒక మంచి రోజు చూసుకుని ముందస్తుగా గడ్డం పెంచడం మొదలెట్టాను. మధ్యలో అడ్డంగా ఈ గడ్డం గొడవేమిటి అంటారా? వస్తున్నా, వస్తున్నా. అక్కడికే వస్తున్నా. మీరు చిన్నప్పుడు పూర్వం రాజుల కథలు చదివారుకదా. వాటిల్లో కొన్ని కొన్ని కథల్లో రాజుగారు ఏం చేసేవారు. మారు వేషం వేసుకుని తన రాజ్య ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో స్వయంగా చూద్దామని దేశం అంతా కాకపోయినా కాళ్ళు నొప్పెట్టేదాక తిరిగేవాళ్ళు  (లోపాయికారీ కారణం ఏమిటంటే తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని, వేగుల వాళ్ళ మీద నమ్మకం లేక!) కాని ఇక్కడ నాకొక్క విషయం అర్థం అయ్యేది కాదు. అలా మారువేషం వేసుకున్న రాజు గారెప్పుడూ రాత్రుళ్ళు మాత్రమే రాజ్యంలో తిరిగేవాళ్ళు. పగలు, పగటి వేషగాడిలాగా కనిపిస్తారేమోనని భయంతోనా? ఇంతకీ ఆ రాజుల అర్థరాత్రి తిరుగుళ్ళకి నా గడ్డానికి సంబంధంఏమిటంటారా. నేను కూడా ఆ రాజుల్లాగా సిటీ బస్సు ఎక్కి నా దేశ సామాన్య ప్రజలు ఎలా జీవితున్నారో ప్రత్యక్షంగా చూస్తాను కదా! కాబట్టి నేను కూడా నన్నెవరూ గుర్తుపట్టకుండా గడ్డం పెంచాను. మీ పిచ్చికాని ఒక్క గడ్డం పెంచేస్తే మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరా మరీ చోద్యం కాకపొతే అని కొంతమంది లోపల్లోపల అనుకోవచ్చు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం. 60, 70 దశాబ్దాలలో తీసిన తెలుగు సినిమాలు చూడండి. అప్పుడు మాట్లాడండి. ఆ సినిమాల్లో హీరో విలన్ డెన్ కి "ధైర్యంగా" వెళ్ళినప్పుడు తననెవరూ గుర్తుపట్టకూడదని, ఒక కూలింగ్ గ్లాస్, ఒక పిల్లిగడ్డం పెట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళని ఒక్కడు కూడా, అప్పుడప్పుడూ హీరోయిన్ కూడా గుర్తుపట్టేది కాదు. అదే నా గడ్డానికి ప్రేరణ. (సినిమాల ప్రభావం ప్రజల మీద భారీగా ఉంటుంది అనడానికి ఇదొక మచ్చు తునక!)

సరే ఇలా ఒక పదిహేను రోజులు గడ్డం పెంచాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వయస్సులో భారీ తెల్ల గడ్డాన్ని చూసి నా ఆఫీసు లో ఆడంగులు తట్టుకోలేరని వాళ్ళతో నేను ఒక రెండు, మూడు నెలలు సబ్బాటికల్ (sabbatical అన్న ఇంగ్లీష్ మాటకి తెలుగు పదం లేదు! ఉంటే నాకు తెలీదు!!) తీసుకుంటున్నానని ఒక నిజమైన అబద్ధం చెప్పాను. వాళ్ళకి పాపం ఏమీ అర్థం కాలేదు, ఇప్పటి దాక బాగానే ఉన్నారు కదా అప్పుడే ఏమయ్యింది. అని (బాస్ ని పట్టుకుని అడగలేరు కదా!) వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కొని ఉంటారు.

అలా ఒక పదిహేను రోజులు గడ్డం పెంచాక ఒక మధ్యాన్నం భోజనం అయ్యాక ఒక చిన్న కునుకు తీసి (ఆఫీసు మానేసాక ఇదో కొత్త అలవాటు!) నా దేశపర్యాటనకి బయల్దేరాను కారులో. ఇదేమిటి బస్సు ఎక్కుతానని ఇప్పుడు ఈ కారులో బయల్దేరడం ఏమిటి? అంతా తొండి! మేమొప్పుకోం! అని తొందరపడి నానా యాగీ చెయ్యకండి. సిటీ బస్సు మన ఇంటి దగ్గరకి రాదు కదా. అందుకని ముందు కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అక్కడి నించే కదా బస్సులు బయల్దేరేది. ఎంచక్కా కూర్చోడానికి సీట్ కూడా దొరుకుతుంది స్టార్టింగ్ స్టాప్ లో ఎక్కితే. ఇక్కడ ఇంకో గిమ్మిక్ చేసాను. కారు మూడు, నాలుగు గంటలు స్టేషన్ పార్కింగ్ లో పెడితే తడిసి మోపెడు అవుతుందని కొంచం దూరంలో అపోలో హాస్పిటల్ పక్క వీధిలో పార్క్ చేసాను. అక్కడ అయితే ఫ్రీ పార్కింగ్! (మధ్య తరగతి తెలివితేటలు!)

సరే అలా పార్క్ చేసి స్టేషన్ కి వెళ్లి AC బస్సులో ఎక్కాను. అలిసిపోకూడదు కదా అందుకని AC బస్సు. అలవాటు లేని ఆపోషణ! ఆ బస్సు గచ్చిబౌలి కి వెళ్తుంది. కనీసం ఒక గంటన్నర ప్రయాణం. కిటికీ పక్క సీట్ లో కూర్చోని  హాయిగా బైట ప్రపంచం చూడ్డం మొదలెట్టాను. కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్ పక్క ఉన్నవి చూసే టైం, అవకాశం ఉండవు! ఎన్నో కొత్త కొత్త బిల్డింగ్స్, షాపులు కనిపించాయి. ఇవన్నీ ఎప్పుడు కట్టారో?!

ఈ లోపల బస్సులో ఒకతను మొబైల్ లో గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు. మొదలెట్టాడు అని ఎందుకన్నానంటే అతను ఆ కాల్ ఆపలేదు! ఈ "కాల్" అన్న మాటకి తెలుగేమిటో? అతని జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ అవతలి వ్యక్తితో డిస్కస్ చేసాడు. దరిదాపుగా అతని జీవితచరిత్ర అంతా నాకు తెలిసిపోయింది. ఫర్వాలేదు. నా దేశంలో సామాన్య ప్రజలకి సమస్యలు, అతను మాట్లాడే తీరుని బట్టి చూస్తే, అనంతంగా ఉన్నట్తున్నాయి!!

కాస్సేపయ్యాక ఆయనకీ పోటీగా ఇంకొక అమ్మాయి మాట్లాడడం మొదలెట్టింది మొబైల్లో! ఈవిడ ఆ ఫోన్ పట్టుకునే తీరు చూస్తే పోలీస్ డిపార్టుమెంటు లో పని చేస్తోందా అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ ఫోన్ ని పోలీస్ వాళ్ళు వాకీ, టాకీ పట్టుకోనేట్టు మూతికి ఎదురుగా పెట్టుకోని మాట్లాడడం, అవతలి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చెవి దగ్గర పెట్టుకోవడం! అమ్మాయి కాబట్టి మూతి దగ్గరే ఎక్కువ సేపుంది ఆ ఫోన్!! అవతలి అబ్బాయి ఎవడో కానీ వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దులిపేస్తోంది. ఆ అబ్బాయి ఫోన్ పక్కని పెట్టేసి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి అతని పని అతను చేసుకుంటున్నాడేమో కూడా. కేవలం వినడమే కదా
 
మంద్దేశంలో సామాన్య ప్రజలు ఇంత ఫ్రీగా పబ్లిక్ ప్రదేశాల్లో అందరికీ వినిపించేట్టు ఫోన్లు మాట్లాడుకుంటున్నారా? ఎటు పోతోందీ (నా) దేశం?


ఇంకో అమ్మాయి బస్సు ఎక్కింది అమీర్ పేట్ లో. ఏమిటో తనలో తనే నవ్వేసుకుంటోంది. తనలో తనే మాట్లడుకుంటోంది. నాకు ఒక్క రెండు నిమిషాలు అర్థం కాలేదు. పాపం పిచ్చిదేమో అనుకున్నా. కాని అలా కనిపించటంలేదు. బట్టలు చింపుకోలేదు. జుత్తు చెరుపుకోలేదు. మరి ఈ పిచ్చి చేష్టలు ఏమిటి. బహుశా టీవీ సీరియల్స్ ప్రభావం ఏమో? వాటిల్లో అందరూ ఇంకో వ్యక్తి తో మాట్లాడడం కంటే వాళ్ళలో వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటూటారు . ఈ అమ్మాయి కూడా అదే టైపు ఏమో. కాని మెల్లిగా టికెట్ తీసుకున్నాక నా సీట్ ముందున్న సీట్ లో కూర్చుంది. దగ్గరకి వచ్చాక అసలు విషయం అర్థం అయ్యింది. ఆమె రెండు చెవుల్లో ఇయర్ ఫోన్లు, ఆమె చేతిలో ఉన్న మొబైల్ కి కనెక్ట్ చేసి ఉన్నాయి. అదన్న మాట సంగతి. ఇంత సేపూ మొబైల్ లో మాట్లాడుతోంది అన్నమాట.

ఇలా ప్రజల మొబైల్ వ్యవహారం, వ్యసనం చూస్తూ, బైట కొత్తగా కనిపిస్తున్న పాత బిల్డింగ్స్ చూస్తూ కాలక్షేపం చేసాను. ఇంతలో బస్సు తిన్నగా వెళ్లి సాయంత్రం అయిదున్నరకి గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ ఆఫీసు ముందు ఆపేసాడు. హమ్మయ్య. నేను కూడా డ్రైవర్, కండక్టర్ తో పాటు బస్సు దిగాను. కుసింత సేపు పచ్చి గాలి పీల్చుకుని, ఒక చాయ్ కొట్టి (హైదరాబాద్ లో టీ అంటే కొడతారు! చాయ్ అనాలి! టీ తాగుతాను అంటే మళ్ళీ కొడతారు! కొట్టాను అనాలి!! ) మళ్ళీ అదే బస్సు లో ఎంచక్కా వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా. కాని తానొకటి తలిస్తే అన్నట్టు నేను చాయ్ కొట్టి కాళ్ళూపుకుంటూ బస్సు దగ్గరకి వచ్చేటప్పటికి షాక్!! 

ఈ రచన ఏదైనా పత్రికకి పంపిస్తే దీన్ని రెండు సంచికల్లో వేసి మొదటి సంచిక ఇక్కడ ఈ సస్పెన్స్ తో ఆపెయ్యాలి అని ఎడిటర్ గారికి విన్నపం చేసేవాడిని! ఇక్కడ నేనే ఎడిటర్ ని కాబట్టి ఇక్కడ ఆపేసి మిగతాది రేపు ;) ఆ తర్వాతేం జరిగింది! చెప్తాను. వింటూనే ఉండండి... రేడియో మిర్చి 98.FM ..ఇది చాలా హాట్ గురూ ;) రోజూ పొద్దున్నే దేవరాగం విత్ భారతి విని విని ఇలా అయిపోయాను ;)  రేపటిదాకా ఎందుకు లెండి?  హిప్పుడే చదివెయ్యండి

అక్కడ నేను దిగిన బస్సు గుర్తు పట్టడానికి వీలు లేకుండా అలాంటివే ఇంకో నాలుగు బస్సులు, ఇంకో నాలుగో, ఐదో నాన్ AC బస్సులు ఉన్నాయి. దానికి పెద్ద షాక్ ఎందుకు సార్. " మీరు రజని టైపు! ఒక్క బస్సు దిగితే పది బస్సులు రెడీ మీకోసం!!  సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళే AC బస్సు ఏదో చూసి హాయిగా ఎక్కేయ్యచ్చు కదా" అంటారేమో. అక్కడే ఉంది షాక్. అన్ని బస్సుల ముందు బోర్డులు ఇన్ఫోసిస్ స్పెషల్ అని పెట్టేసారు! ఇదేం గొడవ. ఒక కండక్టర్ ని అడిగాను. ఇదేంటి బాస్? అన్నీ ఇన్ఫోసిస్ అని బోర్డులు పెట్టారు అని. వాడు నన్ను చూసి వీడెవడో బైటి ఊరునించి ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాడిలాగా ఉన్నాడు అనుకోని (ఆయన గారు కూడా ఆ ఎర్ర బస్సు సంస్థలో పని చేస్తున్నా!) "సార్ సాయంత్రం అయిదు తర్వాత ఇక్కడికి వచ్చే బస్సులు అన్నీ ఇన్ఫోసిస్ స్టాఫ్ స్పెషల్ అవుతాయి" అని విశదీకరించాడు.

మరి నా గతేమిటి. ఇలా దేశం కాని దేశంలో ఊరి చివర సాయంత్రం వేళ ఇలా ఒంటరిగా ఎలా వెళ్ళాలి నా కొంపకి? క్షణం క్షణం లో శ్రీదేవి లాగ "దేవుడా, దేవుడా" అనుకోవడం మొదలెట్టాను. (ఇలా "దేవుడా! దేవుడా!" అని జనరిక్ గా వేడుకుంటే ఏ దేవుడూ కాపాడ్దేమో అని ఒక అనుమానం! అందుకని కొంచం పేరు పెట్టి ఏదో ఒక దేవుడిని, మన కులదేవతనో, ఇలవేలుపునో, పరిస్థితి మరీ విషమంగా ఉంటే ఇద్దరు ముగ్గురు దేవుళ్లనో పేరు పెట్టి పిలిచి వేడుకుంటే పనవ్వుతుంది.)  రోడ్ అటు వేపు చూస్తె బోల్డు ఆటో లు వీలయినంత మందిని అంటే ఒక అర డజను కి తక్కువ కాకుండా ఎక్కించేసుకొని ఒక దాని వెనకాల ఒకటి రయ్యి రయ్యిమని వెళ్ళిపోతున్నాయినేను కూడా రోడ్ దాటి వెళ్లి అక్కడ నలుగురు నిలపడితే నలుగురితో నారాయణా అనుకోని,  వాళ్ళతో పాటు నిలపడ్డాను. ఒక ఆటో వచ్చింది ముగ్గురితో. అంతే నా పక్కని ఉన్న నలుగురు ఒక్క దూకు దూకారు ఆ ఆటోలోకి. ముందు డ్రైవర్ కి రెండు వేపులా ఇద్దరు, వెనకాల ఇద్దరు. నాకు ఒక్క క్షణం భయం వేసింది. బహుశా ఇదే చివరి ఆటో ఏమో అందుకే ఆటోలో చోటు లేక పోయినా నలుగురు ఎక్కేసారు. నేను కూడా వాళ్ళతో పాటు అడ్జెస్ట్ అవ్వక పొతే ఇక్కడే ఈ రాత్రి గడపాలేమో. ఎందుకొచ్చిన గొడవ. అని నేను కూడా వెనక సీట్ లోకి ఒక్క దూకు దూకాను. దూకాను అనుకున్నా! సగం శరీరం ఆటో బైటే వెళ్ళాడుతోంది. అలాగే ప్రాణ భయంతో లోపల ఉన్న వాడిని ఒక చేత్తో , ఆటో రాడ్ని ఇంకో చేత్తో పట్టుకొని కూర్చున్నాను. అదృష్టం ఏమిటంటే "ఎక్కడికి" అని ఆటో వాడు అడగలేదు ఎవర్నీ. అడిగితే నా దగ్గర సమాధానం ఉంటేగా. ఆ ఆటో ఎక్కడికి వెళ్తుందో తెలీదు. నేనెక్కడ దిగాలో తెలీదు. మొత్తానికి ఊళ్లోకే వెళ్తున్నాడు కదా అని ఒక ధైర్యం. వాడు ఆ ఆటోని విష్ణు చక్రంలా తిప్పేస్తూ సందులు, గొందులు తిప్పేస్తూ, రోడ్ మీద గతుకులు, గుంటలు పట్టించుకోకుండా రయ్యి రయ్యిమని దూసుకుపోతున్నాడు. వాడికి అలవాటు. రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తే అంత ఎక్కువ సంపాదించచ్చు. నా పక్కని కూర్చున్న వాళ్ళంతా వయసులో ఉన్న టెకీస్! వాళ్ళంతా ఇదేమీ పట్టనట్టు హాయిగా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకేమో ఒళ్ళు హూనం. నా దేశ సామాన్య ప్రజల కష్టాల సంగతేమో కాని నా కష్టం మట్టుకు భరించడం కష్టం గా ఉంది.

మొత్తానికి ఒక పావుగంట అయ్యాక ఆటో కొండాపూర్ జంక్షన్ దగ్గర ఆపాడు. హమ్మయ్య, ఇక్కడినించీ నాకు తెలిసిన హైదరాబాద్! ముందు బస్సు ప్రయాణానికి, తర్వాత బస్సు లేని టెన్షన్ కి, అటు పిమ్మట ఈ ఆటో ప్రహశనానికి బాగా అలిసి పోయానేమో విపరీతంగా ఆకలెయ్యడం మొదలెట్టింది

వెంటనీ పక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్ లో ఒక మసాలా దోశ లాగించేసాను!

ఆ తర్వాత హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా (కడుపు నిండింది కదా!) వచ్చి బస్సు స్టాప్ లో నిలపడ్డాను. సిటీ బస్సులు నాలుగయిదు ఒకదాని తోక పట్టుకొని ఇంకొకటి వచ్చాయి, కష్టాల్లాగా!  అన్ని బస్సుల్లోనూ పెజానీకం ద్వారం బైటి దాకా వేళ్ళాడుతూ ఉన్నారు. అయినా సరే అస్సలు పట్టించుకోకుండా స్టాప్ లో ఉన్న పెజలు అంతా ఆ నాలుగయిదు బస్సుల్లో దూరిపోయారు. ఆ బస్సులన్నీ నా కళ్ళకి అభినవ పుష్పక విమానాల్లా కనిపించాయి. ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఎక్కినా ఇంకా ఒక అర డజనుకి తక్కువ కాకుండా జనం ఎక్కేయచ్చు వాటిల్లో ;)

ఈ పెజలంతా రోజూ అలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఎక్కేసి గంటలు గంటలు ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డ పెజానీకం. నేనలా కాదు కదా. చస్తే అలా భారీగా జనమున్న బస్సులో ఎక్కదలుచుకోలేదు. ఇది అతిశయోక్తి ! ఎందుకంటే ఒహ వేళ అలాంటి దుస్సాహసం చేద్దామనుకున్నా అది నా వల్ల కాని పని. ఎక్కబోయి కాలు జారి, చెయ్యి పట్టు తాపీ దభీమని కింద పడే ప్రమాదమే ఎక్కువ. అందుకని ఎంతసేపయినా సరే ఖాళీ బస్సులోనే ఎక్కాలని డిసైడ్ అయ్యిపోయా. ఒహవేళ అలా పడకుండా  పద్మవ్యూహంలోకి అభిమన్యుడు చొచ్చుకెళ్ళినట్టు, లోపలికి దూసుకెల్లితే ఇంకో ప్రమాదం ఉంది! అలవాటు లేని వ్యవహారం కదా? నా చొక్కా చింపుతారు, పర్సు కొట్టేస్తారు, షూ తొక్కేస్తారు, కళ్ళజోడు విరిచేస్తారు, జుట్టు చెరిపేస్తారు, వాచీ లాగేస్తారు :( ఎందుకొచ్చిన రిస్క్ ఈ వయసులో. కాసేపాగితే కొంపలేం మునగవుగా?

ఆ బస్సులన్నీ అలా దాదాపుగా నా స్టాప్ లో ఉన్న పెజలనదరినీ ఎక్కించెసుకొని వెళ్ళిపోయాయి. నేను ఇంకో ముగ్గురు మిగిలాం. తర్వాత ఒక రెండు నిమిషాలకే ఇంకో బస్సు వచ్చింది. దాదాపు ఖాళీగా! జనాలందరినీ ఆ ముందరి కాన్వోయ్ బస్సులన్నీ ఎక్కించేసుకున్నాయిగా! పాపం వీడికి డీజిల్ ఖర్చులు కూడా వచ్చేట్టులేవు ఇలా ఖాళీగా వెళ్తే! అయినా వాడి లాభ, నష్టాల సంగతి నాకెందుకు? హాయిగా ఎక్కి, దర్జాగా కిటికీ సీట్లో కూర్చున్నా. ఇది నాన్ AC! సాయంత్రం అయ్యిందిగా ఫర్వాలేదు. చల్లగానే ఉంది కాబట్టి సామాన్య పెజానీకంలాగా సర్దుకుపోవచ్చు.

అలా మొత్తానికి మళ్ళీ స్టేషన్ కొచ్చి ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి 9 అయ్యింది. మళ్ళీ ఆ బస్సు ప్రయాణానికి అందులో నాన్ AC బస్సేమో భారీగా అలిసిపోయాను. విపరీతంగా ఆకలేసి డిన్నర్ కుమ్మేసి నిద్రోయా!

ఇంతకీ నా ముఖ్యోద్దేశం నెరవేరినట్టేనా?! అంటే ఈ సంఘటనని నా స్వీయజీవిత చరిత్రలో కాస్త చిలవలు, పలవలు చేసి ఒక చాప్టర్ చెయ్యచ్చా? వచ్చా ఏమిటి ఇంత కష్ట పడ్డాకఒక చాప్టర్ రెడీ ;)

Saturday, January 16, 2016

Cycling in 70's!!

1970's!! ఆ రోజుల్లో కుర్రకారు కి పేరులోనే కారు.. ఇప్పటి యువత లాగా ఇంటర్ లో బైక్, డిగ్రీ లో కారు లేదు మాకు :(

ఆ రోజుల్లో సైకిల్ ఉంటే కాస్త ఉన్న వాళ్ళకింద లెక్క! హంబర్ సైకిల్ ఉంటే కాలర్ ఎగరెయ్యడమే ;) ఇంతకీ అప్పట్లో నాకు హంబర్ సైకిల్ ఉండేది. ఇహ చూడండి. నా వైభోగం. ఊరంతా రయ్యిరయ్యిమని తిరిగెయ్యడమే! ఒహటి రెండు సార్లు మా నాన్నకి కొంతమంది (నా లాగ స్పీడుగా సైకిల్ తోక్కలేని వృద్ధులు!) కంప్లైంట్ చేసేవాళ్ళు! "మీ అబ్బాయి ఈ మధ్య సైకిల్ మరీ స్పీడుగా తొక్కుతున్నాడు" అని! మా నాన్న దాన్ని చాలా లైట్ తీసుకోని "మీ పిచ్చి కాని, కుర్రాళ్ళు కాకపోతే మనం తొక్కుతాముటండీ స్పీడుగా" అని సుతారంగా వాళ్ళ కంప్లైంట్ ని బుట్ట దాఖలు చేసేవాళ్ళు!

అసలు సైకిల్ కొన్నప్పుడు చూడాలి నా మొహం! పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది! నిజానికి సైకిల్ పార్ట్శ్ అన్నీ మనం కొన్నప్పుడు షాప్ వాడు బిగించి సైకిల్ చేస్తాడని అప్పుడే తెలిసింది! వాడు అలా నా సైకిల్ మొత్తం తయారు చేస్తున్నప్పుడు నేనలా తన్మయత్వంతో చూస్తూ తెగ ఆనంద పడిపోయాను! దానికొక చుక్కల చుక్కల బ్లూ కలర్ సీట్ కవర్ వేయించాను. దాంట్లో కొంచం స్పాంజ్ ఉండి కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ఉండేది. ట్రింగ్ ట్రింగ్ మనే కొత్త బెల్ :) దాని శబ్దం వినడానికి చాలా బాగుండేది. అందుకని ఎవరూ అడ్డు లేకపోయినా అప్పుడప్పుడూ ఆ బెల్ గణగణమనిపించేవాడిని! అల్ప సంతోషిని కదా!!

సైకిల్ కొన్న దగ్గరినించీ అన్ని బైటి పనులు అంటే కూరలు తేవడం, రోజూ పొద్దున్నే పాలవాడి దగ్గరకి వెళ్లి పాలు కాన్ లో తేవడం, పచారీ సామాన్లు తేవడం, అక్కలిద్దరినీ బజారుకి తీసుకెళ్లడం (ఇద్దరినీ ఒక్కసారి కాదండోయ్! విడివిడిగా!!), అప్పుడప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా, ఇలా ఒహటేమిటి నానా గోత్రస్య అన్ని పనులకి నేను నా సైకిల్ ఎవరెడీ ;)

ఇందాకలే పేపర్ లో చూసాను! పోయినేడాది దాదాపు పది వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్ళు నడిపి దొరికి పోయారుట హైదరాబాద్ లో! ఆ రోజుల్లో మా లాంటి కుర్రాళ్ళని కూడా పోలీసులు భారీ ఎత్తుని పట్టుకొనే వాళ్ళు. రాత్రి పూట సైకిల్ కి లైట్ లేకుండా తొక్కినా, లేదా డబుల్స్, ట్రిపుల్స్ తొక్కినా :( ఆ రోజుల్లో ఆ రెండూ చాల పెద్ద నేరాలు!! లైట్ కోసం డైనమో పెడితే టైర్ అరిగి పోతుందని హేండిల్ బార్ ముందు బాటరీ లైట్ పెట్టెవాడిని! దాన్ని సాయంత్రం బైటికి వెళ్ళినప్పుడల్లా హేండిల్ బార్ కి తగిలించడం. ఇంటికొచ్చాక తీసి లోపల పెట్టడం! ఇప్పుడు హెల్మెట్ లాగ :)

అప్పుడప్పుడూ ఆ పోలిసుల బారిని పడడం, మర్నాడు మాజిస్త్రేట్ కోర్ట్ లో దోషుల్లా నిలపడి జరిమానా కట్టడం. ఇంట్లో వాళ్లకి తెలియకుండా!

ఒకసారి గుంటూరు లో బ్రాడిపేట్ ఓవర్ బ్రిడ్జి కష్టపడి తొక్కి, ఎక్కాను. అటు వేపు దిగడం మొదలెట్టిన వెంటనే ఉంటుంది ఆనందం! అది అనుభవించిన వారికే తెలుస్తుంది! ఒక్కో గజం కిందకి దొర్లుతున్న కొద్దీ సైకిల్ స్పీడ్ ఎక్కువ అవుతూంటుంది. "బ్రిడ్జి దిగడంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుయునులే! భలే భలే!" అప్పుడప్పుడూ అలా బ్రిడ్జి దిగుతున్నప్పుడు హేండిల్ బార్ వదిలేసి రెండు చేతులు పైకెత్తి హీరో లాగ పోజులు కొట్టిన సందర్భాలు లేకపోలేదు!

ఇంతకీ అప్పుడేమయ్యిందంటే నాకు ముందు ఒక రిక్షా దాని పక్కనే రెండు సైకిళ్ళు పక్క పక్కనే వెళ్తున్నాయి! అవి కూడా స్పీడుగానే.. నా సైకిల్ స్పీడ్ చూస్తే ఇంకో 5 సెకండ్లలో వాళ్ళని దాటేస్తాను! వాళ్ళని ఓవర్ టేక్ చేద్దామంటే ఎదురుగా ఒక కారు! బ్రేక్ వేసాను. కాని స్పీడ్ తగ్గలేదు. బ్రేక్ సరిగ్గా పని చేసినట్టు లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది! ఇహ లాభం లేదని బ్రహ్మాస్త్రం బెల్ కొట్టాను! కాని హాశ్చర్యం. విచిత్రం! అది మోగలేదు :( దాని పైన ఉండే స్టీల్ డోమ్ కింద ప్లేట్ కి తగులుతోంది. టిక్కు టిక్కుమని నాకే వినిపించని శబ్దం చేసింది !! అయిపోయింది. నేనెళ్ళి వాళ్ళని గుద్దెయ్యడమే మిగిలింది :(

అలా నేను బ్రిడ్జి మీద అంతకంతకూ పెరుగుతున్న వేగంతో దూసుకుపోతున్న సైకిల్ కి బ్రేకులు, బెల్ రెండూ ఒకే సారి పని చెయ్యకపోవడంతో నా బుర్ర కూడా బుర్రలాగా సరిగ్గా పని చెయ్యక, పాదరసంలా పని చెయ్యడంతో ఒక్కసారిగా వచ్చిన మెరుపులాంటి ఆలోచన!

"బెల్! బెల్! బెల్!!" అని నా శక్తి కొద్దీ చాలా  గాఠిగా అరిచాను ;)  

ఎప్పుడూ వినని ఈ హఠాత్ అరుపులకి ఝడుసుకున్న ఒక సైకిల్ వాడు బాలన్స్ తప్పి పడిపోయాడు! వెనువెంటనే రెండో సైకిల్ రిక్షా ముందుకెళ్లాయి! అంతే ఆ పడిపోయిన సైకిల్ వాడి పక్కనించి నా సైకిల్ దూసుకెళ్ళిపోయింది! ఇదంతా ఎలా జరిగింది అని నా మెదడు రికార్డు చేసేలోపలే రెండు క్షణాల్లో జరిగిపోయింది!   
 
#Telugu

Friday, January 8, 2016

Brother In Law - Bike !!

సుమారు ముప్ఫై సంవత్సరాల క్రితం ఒకసారి మా బావ హైదరాబాద్ వచ్చి నా మోటార్ సైకిల్ తీసుకొని పొద్దున్నే ఊళ్లోకెళ్ళి సాయంత్రం 8 గంటలకి తిరిగి వచ్చారు! అది మామూలే! కాకపోతే వచ్చిన వెంటనే నన్నడిగిన ప్రశ్నకి నా గుండె గుభేల్లంది :(

ఏమని అడిగారో తెలుసా?! "ఏమోయ్ అరుణా! ఇంతకీ నీ మోటార్ సైకిల్ కి ఎన్ని గేర్లు?" అని!! మరి నా గుండె ఆగినంత పనయ్యింది అంటే అవదా? ఇదెక్కడి చోద్యం? ఎవరైనా ఈ ప్రశ్న పొద్దున్నే తీసుకేళ్తున్నపుడు అడుగుతారు. ఎందుకంటే ఈ గేర్లు అనేవి మోటార్ సైకిల్లల్లో రకరకాలుగా ఉంటాయి. మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళకి, లేదా అప్పుడప్పుడూ ఇంకోళ్ళ మోటార్ సైకిల్ నడిపే వారికి ఈ విషయాలు సుపరిచితమే!

కొన్ని మోటార్ సైకిల్ల్స్ కి అన్ని గేర్లు కిందకే! మరి కొన్నిటికి అన్నీ పైకే! ఇంకోన్నిటికి ఫస్ట్ గేర్ పైకి, మిగతావన్నీ కిందకీ! మరి కొన్నిటికి ఫస్ట్ గేర్ కిందకి, మిగతావి పైకి! ఇహ బులెట్ మోటార్ సైకిల్ కి అయితే అది అన్నిటికీ విరుద్ధం! నేను చెప్పేది పాతకాలం క్లాసిక్ బులెట్ సంగతి. దానికైతే తతిమ్మా మోటార్ సైకిళ్ళకి విరుద్ధంగా దాని ప్రత్యేకత చూపించాలని గేర్ రాడ్ కుడి వేపు ఉంటుంది. బ్రేక్ ఎడం వేపు! ఈ మధ్య ప్రస్తుత కుర్రకారు దాన్నిహేండిల్ చెయ్యలేరేమోనని బులెట్ ని కూడా మిగతా మోటార్ సైకిళ్ళ లాగా కుడి వేపుకి బ్రేక్ మార్చారు! నాకీ విషయం నచ్చలేదు కాని నేనా విషయం ఆ కంపెనీ వాళ్లకి చెప్పలేదు. నాకు నచ్చని మార్పులు చేసే వాళ్ళతో నాకు మాటలేంటి? కటీఫ్!!

ఇంతకీ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకోళ్ళ మోటార్ సైకిల్, మనకి అలవాటు లేని బ్రాండ్ తీసుకున్నప్పుడు ముందస్తుగానే ఈ గేర్ల విషయం తెలుసుకుంటాం! ఇలా 10 గంటలు తిరిగొచ్చాక కాదు :(

సరే నా మనో వేదనంతా గుండెల్లోనే దాచేసుకొని గుండె రాయి చేసుకొని సమాధానం ఇచ్చాను "ఏమో సార్? పొద్దున్న నేనిచ్చినప్పుడైతే నాలుగు గేర్లు! మరిప్పుడెన్నో తెలీదు? చూడాలి!" అని.
 

Monday, January 4, 2016

అనిర్వచనాలు! Definitions in Telugu!!



అనిర్వచనాలు!

మూర్ఖుడు : తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనేవాడు

మూర్ఖుల్లో మేధావి : తా పట్టింది కుందేలు కాదు చెవులపిల్లి అనేవాడు

ప్రజలు : చూడుడు అమాయకులు

అమాయకులు : మూర్ఖుడుని, మూర్ఖుల్లో మేధావిని అలవాటుగా, ఆనవాయితీగా నమ్మేసేవాళ్ళు

వేదాంతి: పట్టింది ఎవడు? పట్టుబడింది ఎవడు? అంతా మిధ్య! భ్రమ! మాయ! అనేవాడు

వ్యాపారవేత్త: మూడు కాళ్ళున్న అరుదైన కుందేలని (ఒక కాలుతో దాన్ని పట్టుకొని!) ఎక్కువ రేట్ కి అమ్మేసి డబ్బు సంపాదించేవాడు! ఏమి అనడు

టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు: అసలు మనుషులు కుందేళ్ళని ఎందుకు పట్టుకుంటారు? పట్టుకుంటే దాని కాళ్ళ గురించి ఎందుకు చర్చించుకుంటారు? ఇదేమన్నా మానసిక వ్యాధా? ఉంటే దీనికేమైనా చికిత్స ఉందా? అని ఒకడు గంభీరంగా అంటున్నాననుకుంటూ భీకరంగా అరుస్తూ ఈ స్లైడ్స్ రోజంతా చూపించి, చివరికి సాయంత్రం ఒక ఎవరివో హక్కుల సంఘం అధ్యక్షు(రా)లిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక వాస్తు/ జ్యోతిష్య పండితుడిని పిలిచి వాళ్ళతో ఒక పానెల్ డిస్కషన్ పెట్టి విసిగించేవాళ్ళు

న్యూస్ ఛానల్ కాంపిటీటర్ ఛానల్ : అమాయకపు చెవుల పిల్లిని పట్టుకొని, దాని కాలు ఒకటి విరిచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకి అడ్డంగా దొరికిన ప్రముఖ నటుడు! కేవలం మా ఛానల్ లోనే తాజా ఫోటోలు అని ఫోటోలు చూపించకుండా కేవలం స్లైడ్స్ కనీసం 8 గంటలు నాన్ స్టాప్ చూపించేవాళ్ళు

యువత : ఇలా కుందేళ్ళని పట్టడం తరతరాలుగా ఉన్న, వస్తున్న అసాంఘిక, ఆటవిక, సామాజిక, ఇంకేవో "క" అని ఫేస్బుక్ లో వాపోయేవాళ్ళు

సీనియర్ సిటిజన్స్ : అన్నిటికీ "కలికాలం అండీ! కలికాలం!! ఇంతే! అంతే! మనం ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలో అని వాపోయి, వెంటనే వెళ్లి టీవిలో డైలీ సీరియల్ చూసి కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదేసుకొనేవాళ్ళు

సీనియర్ సీనియర్ సిటిజన్స్ : హవ్వ! హవ్వ! మా కాలంలో ఇలాంటి వేషాలు ఎరగం అమ్మా! కుందేలు పట్టుకోగానే దాని కాళ్ళు, కళ్ళు లెక్క పెట్టడం ఏమిటి? వెంటనే డిన్నర్ కి లాగించెయ్యక ? పిదప కాలం. పిదప బుద్ధులు! అని భారీగా నిట్టూర్చేవాళ్ళు

అధికార పార్టీ నాయకులు: హద్దిరబన్నా! ఇదేదో టైం (లీగా) కి దొరికింది! దీని మీద సభలో చర్చ ప్రవేశ పెడితే మన స్కామ్స్, స్కీమ్స్ గురించి డిస్కషన్ కి టైం ఉండదు అని వెంటనే ఆ పని మీద ఉండేవాళ్ళు

ప్రతిపక్షం నాయకులు: పెరగని ఆదాయాలు! పెరుగుతున్న బీపీలు!! వీటి మీద చర్చించకుండా సభా సమయం వృధా చెయ్యడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర! మేము వెంటనే ఈ సభనించి వాక్ అవుట్ చేస్తున్నాం అని బైటికెల్లి ఎంచక్కా శీతాకాలంలో ఎండలో కూర్చునేవాళ్ళు

ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షం లోనూ లేని రాజకీయ నాయకుడు: ఈ కుందేళ్ళు పట్టడం వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది! దానికి ప్రభుత్వం లో ఉన్న పార్టీ అండదండలున్నాయి! దీని మీద సిబిఐ విచారణ చేసి దీని వెనకాల ఉన్న అందరు నాయకులని బైట పెట్టాలి అని గొంతు చించుకొని అరిచేవాడు!

ట్వీపుల్ (అనగా ట్విట్టర్ లో పెజానీకం!) : ట్విట్టర్ లో యమ స్పీడ్ గా #సేవ్ కుందేలు #సేవ్ చెవులపిల్లి అని హాష్ ట్యాగ్ లు స్టార్ట్ చేసి నానా హడావిడి చేసి ఇంకో హాట్ సబ్జెక్టు దొరగ్గానే వెంటనే దాని మీదకి జంప్ అయ్యేవాళ్ళు.

ఒక రకం ట్వీపుల్ : ఏ హాష్ ట్యాగ్ పెట్టకపోతే ఏమవుతుందో అని అన్ని హాష్ ట్యాగ్ లు పెట్టి ఇక తను రాయడానికి అక్కడ అక్షరాలు మిగలలేదని ఏమి చెయ్యాలో పాలుపోక అసలా సబ్జెక్టు జోలికే పోనీ పెజలు

అవకాశవాది : అర్జెంటు గా "చెవులపిల్లి" "మూడుకాళ్ల కుందేలు" "కుందేలా! మజాకా" "అల్లుడు కుందేలు! మామ కుదేలు" వగైరా, వగైరా సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసేవాడు

"ఎవరివో" హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు/ రాలు : కుందేలుని ఎప్పుడూ చూడకపోయినా, దానికి ఎన్ని కాళ్ళో తెలీకపోయినా, అణు ఆయుధాలనించీ, ఆవకాయ పెట్టడం వరకూ ప్రతి పానెల్ డిస్కషన్ లో పాల్గొనే వ్యక్తి .

మేధావి వర్గం : ఆదివారం సాయంత్రం పిల్లా మేకతో "కుందేళ్ళని రక్షించండి" "కుందేళ్ళు మాకంటే అమాయక జీవులు" అని బానర్స్ పట్టుకొని కాండిల్ మార్చ్ చేసేవాళ్ళు

టీవీ న్యూస్ జర్నలిస్ట్ : రోడ్డు మీద పోతున్న జనాలని పట్టుకొని "దీనిమీద మీ స్పందన" అని మోహంలో మైక్ గుచ్చేవాళ్ళు! ఆ మైక్ నించీ, దాన్ని పట్టుకున్న వాడి నించీ తప్పించుకోవాలంటే వేరే మార్గం లేక కొంతమంది, ఇన్నాళ్ళకి టీవిలో కనిపించే అవకాశం వచ్చింది కదా అని ఆనంద పడిపోతూ ఇంకొంతమంది "ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే! దీనిమీద వెంటనే ఒక కమిటీ వేసి ప్రభుత్వమే స్పందించాలి" అని స్పందించేవాళ్ళు

మూఢ భక్తులు: ఆ కుందేలు నిస్సందేహంగా ఆ భగవంతుడి ప్రతీక అని నిర్ధారించి దానికి, ఎందుకైనా మంచిదని చెవులకి కూడా, కుంకుమ బొట్లు పెట్టి, నమస్కార ప్రదక్షిణాలు చేసేవాళ్ళు

దొంగ భక్తులు: ఇదే సందని ఆ కుందేలుకి గుడి కట్టిస్తామని డబ్బాలు పట్టుకోని భూ(భా)రి విరాళాలు సేకరించి ఉడాయించేవాళ్ళు

మెజీశియన్ : ఈ హడావిడి చూసి ఎందుకైనా మంచిదని తన టోపీలో కుందేలు ఉందొ లేదో ఒక సారి తడిమి చూసుకొనే వాడు

(అ)సామాన్యుడు : ఇవేవి మనకి తిండి పెట్ట్టవన్న నగ్న సత్యాన్ని ఆపోషణ పట్టి ఊసురో మంటూ స్టార్ట్ అవ్వని స్కూటర్ ని తోసుకుంటూ, లేదా అమ్ముకోడానికి అరటి పళ్ళ బండీని తోసుకుంటూ, బ్రతుకు బండీ కిందా మీదా పడి లాగేవాడు

Telugu