Thursday, December 24, 2020

వీలునామా

తిరగ మోత! ఏమిటో ఈ కోవిడ్ పుణ్యమా అని రోజూ వంట చేస్తూంటే జంట పదాలన్నీ వంట పదాలే వస్తున్నాయి! నేను రాద్దామనుకున్న మాట తిరగమోత కాదు! "తిరిగి రాత"!
ఇహ పోస్టులోకొస్తే ....
ఇవాళ పొద్దున్నే ఒక హీరోచితమైన, ఒహరకంగా ప్రాణాలకి తెగించి ఓ సాహసం చెయ్యడానికి సిద్ధపడ్డాను.
ఈనాడువారి భాషలో ఇక వివరాల్లోకి వెళ్తే ....
హైదరాబాద్లో గత వారం రోజులుగా వాతావరణం ఎలా ఉందో పాఠకులకి విదితమే. నిన్ననే ప్రస్తుత హైదరాబాద్ వాతావరణం హెంత చచ ల్లల్ల గాగా ఉందొ నా స్టైల్ లో పోస్టు పెట్టాను.
మరంచేత వారం రోజులుగా నేను తలంటు పోసుకోలేదు. కోవిడ్ భయంతో మంగలి షాప్ కి వెళ్లటంలేదు. మా ఆవిడే వీలు చూసుకుని, చెయ్యి ఖాళీ ఉన్నప్పుడు, తోటమాలి అంటు కత్తెరతో మొక్కలు కత్తిరించినట్టు, నాకు క్షవరం చేస్తోంది. పైపెచ్చు నా పిలక ఎప్పుడూ వాళ్ళ చేతుల్లోనేగా!
కానీ ఈమధ్య నా జుత్తు భారీగా పెరిగినా ఆవిడ పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు మీ అందం ఎవరు చూడొచ్చారు? ఓ వారం క్షవరం లేట్ అయితే ఏం ఫర్వాలేదు లెండి అని రోజూ నాకు క్షవరం చేయడం కోర్టులో సివిల్ కేసుల్లాగా వాయిదా మీద వాయిదా వేసుకొస్తోంది.
అందువలన చెప్పొచ్చేదేమిటంటే రోజులు గడుస్తున్నకొద్దీ తలంటు పోసుకోని కారణంగా దురద ద్విగుణీకృతం అయ్యి ఒక చెయ్యి చాలక సిగ్గు, బిడియం, మొహమాటం వగైరా అన్నీ హోల్సేల్ గా వదిలేసి రెండు చేతుల్తో గోక్కోవాల్సిన అవసరం వచ్చే పరిస్థితికి దారి తీస్తుందేమోనని మా చెడ్డ అనుమానం వచ్చి ఇవాళ ఎలాగైనా తలంటు పోసుకోవాలని ముందూ వెనక ఆలోచించకుండా దృఢ నిర్ణయం తీసేసుకున్నా!
అంతవరకు బాగుంది. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంత వేన్నీళ్లతో పోసుకున్నా ఈ తలంటు కార్యక్రమం ప్రస్తుత పరిస్థితుల్లో బాగా రిస్క్ తో కూడిన వ్యవహారం కదా ? పైగా నాకు వయసు మళ్లిందాయే. కాస్త అటూ ఇటూ అయితే పెద్ద ప్రాణానికే ముప్పు. అంటే కికింగ్ ద బకెట్. ఏ మాటకా మాటే. ఈ కికింగ్ ద బకెట్ కి బాత్రూం చక్కగా సరిపోయే ప్రదేశం! పైగా ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి డైరెక్ట్ స్వర్గానికి వీసా.
ఏది ఏమైనా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినని టైపు కాబట్టి తువ్వాలు నడుముకు చుట్టి యుద్దానికి వెళ్లే సైనికుడిలా తెగ ఫీల్ అయిపోతూ బాత్రూంలోకెళ్లి తలుపుకి గడియ పెట్టబోతూంటే ఎంతైనా నాది ఒకింత మేధావి బుర్రకదా ఠక్కున ఓ ఐడియా వచ్చింది.
వెంటనే తలుపు తీసి మా ఆవిడని పిలిచా. అవిడగారు అబ్బబ్బా ఏమిటండీ. ఓ పక్క టైం అవుతోంది. మీకూ పిల్లలకీ దోశలు వెయ్యాలి. (అక్కడికి ఆవిడకి దోసెలు అక్కరలేనట్టు!) అని నాకు సుపరిచితమే అయిన దండకం చదువుతోంది. ఈ ఆడాలెప్పుడూ ఇంతే. సమయం సందర్బం చూడకుండా అలా అలవాటుగా రొటీన్ డైలాగ్స్ వదులుతారు.
ఇప్పుడు నేను పిలిచింది ఒహరకంగా చివరి చూపులు చూసుకోమని కదా? అర్ధం చేసుకోరూ?
సరే నేను ఆవిడ వచ్చేదాకా విసిగిస్తాగా ? నా బాధ పడలేక ప్రత్యేక దర్శనం ఇచ్చింది మా ఆవిడ. వెంటనే అప్పగింతలు కార్యక్రమం మొదలెట్టా!
"మా ఆవిడ బంగారం" అని మనసా వాచా నమ్మా కాబట్టి, "మీకేంటండీ! ఇద్దరు బంగారం లాంటి పిల్లలున్నారు" అని పెజానీకం కోడై కూస్తే అమాయకుడిని కాబట్టి నమ్మేసి, ఏతా వాతా ఇంత బంగారం ఉన్నాక ఇంకా బంగారం కొనడం ఎందుకని నీకు వీసమెత్తు బంగారం కూడా కొనలేదు" అని అన్నానో లేదో "పోనీలెండి! మీ ప్రేమ నాకు తెలీదా? 1987 లో నాకు గుజరాత్ నించి మాంచి చీర పట్టుకొచ్చారు. అదే నాకు బంగారం" అంది.
ఇందులో ఏదో శ్లేష ధ్వనించింది కానీ అదేమిటా అని విచారించి, తదుపరి మరీ ఇంత మాట అనేసిందేటి అని మళ్ళీ విచారించి, ఘాటుగా తిరుగు సమాధానం ఇవ్వలేకపోతున్నామని పునః విచారించే సమయం సందర్భం కాదు.
మరందుకని వదిలేసి ఆ డైలాగ్ వినీ విననట్టు నటించి, "వీలు చూసుకుని వీలునామా రాద్దామనుకున్నా కానీ గుండ్రాయిలా ఉన్నా కదా, కానీ ఇలా అర్ధాంతరంగా… " అని రాబోతున్న దుఃఖాన్ని యుద్దానికి బయలుదేరుతున్న వీర సైనికుడిలాగా లోపలే తొక్కేసి "నా ఆస్తులు నీకు చెప్పాలిగా! 1995 లో ఆ స్టెర్లింగ్ వాడు సవగ్గా అమ్ముతున్నాడని నా తదనంతరం ఏపుగా పెరిగి నీకు పిల్లలకి ఆదుకుంటుందని ఓ పది టేకు చెట్లు కొన్నా! కానీ వాడు నిండా మోసగాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, నా చెట్లు ఏం చేసాడో. కాస్త ఓపిక చేసుకొని వాణ్ని పట్టుకున్నావంటే నీకిక డబ్బుకిబ్బంది ఉండదు. అలాగే ఈ పదేళ్ల కారు అమ్మకండి. అమ్మితే ఏం రాదు. మళ్ళీ కొనాలంటే లక్షల్లో పని. నా మొబైల్ నువ్వు వాడుకో. పిల్లలకి ఈ పాత చైనా మోడల్ నచ్చదు. అలాగే అయిదేళ్ళ నించీ బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకుని ప్రతేడాదీ దాన్ని రెన్యూ చేసుకుంటూ వస్తున్నానని నీకు తెలుసుగా? (ఎందుకు తెలీదు? ఆవిడ వంటి మీదున్న బంగారం కంటే బ్యాంకులోనే ఎక్కువుంటే! అయినా ఏమాటకామాటే! మనింట్లోకన్నా బ్యాంకువాడి దగ్గర బంగారం సేఫ్ కదా?) ఎవరి దగ్గరన్నా ఓ రెండ్రోజులకి అప్పు తెచ్చి ఆ బంగారం లోన్ తీర్చేసి కుంచెం బంగారం అమ్మేస్తే ఆ తెచ్చిన అప్పు తీర్చేయచ్చు.. ఇప్పుడసలే బంగారం తులం యాభై వేలు."
"అవన్నీ తరువాత. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఓ ఇరవై నిమిషాల తర్వాత బాత్రూం లోపలినించి ఏవీ శబ్దాలు రాకపోతే గట్టిగా పిలవండి. నేను పలక్కపోతే వెంటనే 108 కి ఫోన్ కొట్టి, దగ్గర వాళ్లకి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను బాత్రూం లోపల గడియ పెట్టను. ఏవన్నా అటూ ఇటూ అయితే తలుపు బద్దలు కొడితే ఆదో అనవసర ఎక్స్ట్రా ఖర్చు. నా గురించి బెంగ పెట్టుకోకు. పైన దేవుడికి బాగా క్లోజ్ గా ఉంటాగా? నాకేం ఫర్వాలేదు. దేవుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి కాస్త నీకేమైనా పింఛను లాంటిది ఏర్పాటు చెయ్యమని ఓ అర్జీ పెట్టుకుంటా. ఆ పైనా దేవుడి దయ. నీ అదృష్టం" అని అప్పగింతలు పెట్టా
ముందస్తు సంజాయిషీ : ఇదేటిది ముందస్తు అని చివరి మాటగా రాస్తున్నారు అంటే, అదంతే . ఇదో ప్రయోగం.
ఇంతకీ సంజాయిషీ ఏమిటంటే ఇదేమిటండీ పొద్దున్నే అశుభం మాటలు అని మీరెవరన్నా బాగా ఫీల్ అయి కామెంట్ పెట్టడం, దాంతో నేను బాగా ఫీల్ అయి మీకు సమాధానం చెప్పడం. ఇంతమంది ఎందుకు ఫీల్ అవ్వాలని ముందస్తు సంజాయిషీ. అసలు ఈ సంజాయిషీ అన్న మాట కరెక్ట్ కాదు . కానీ సరైన మాట గుర్తొచ్చేలోపల పుణ్యకాలం కాస్త అయిపోతుందేమోనని
సంజాయిషీ: నా ఆల్మోస్ట్ పెతీ పోస్ట్ ద్వందార్ధముతో ఉంటుంది. అంటే తెలుగు సినిమాలకి అలవాటు పడ్డ పెజలు అర్ధం చేసుకునే ద్వందార్ధం కాదండోయ్!
ఇక్కడ రెండర్ధాలు ఏమిటంటే ఒహటి చదవగానే నాలాంటి అమాయకులకు అర్ధమయ్యే అర్ధం! రెండోది ఒహింత మేధావులు కూసింత తెలివితేటలు ఉపయోగిస్తే వాళ్లకి తట్టే నిగూడార్థం!
ఇప్పుడు ఈ పోస్ట్ లో కూడా గసుంటిదే ఓ భారీ నిగూడార్థం embedded! చెప్పెయ్యమంటారా? అలాగే కానివ్వండి. మనందరికీ అంటే మనుషులందరికీ బుద్దుడు చెప్పినట్టు ఓ తప్పుడు అభిప్రాయం ఉంది. అదేమిటంటే మనం చాలాకాలం బ్రతికేస్తాం అని! అది తప్పని తెలిసినా జీవితః బుద్బుద ప్రాయః అన్న నిజం ఒప్పుకోడానికి మనసొప్పదు. మరంచేత ఇంకా బోల్డు జీవితం ఉందికదా తర్వాత చెపుదాం లే అని మన పెళ్లాలకి (ఇక్కడ నిఝముగా ద్వందార్ధము లేదు!) మన ఆస్తి అప్పుల చిట్టా చెప్పం. LIC ఏజెంట్ భాషలో ఇహ పొతే ఆ తర్వాత మనకేం ఆస్తులున్నాయి. ఇచ్చిన అప్పులేమిటి. వసూలు చెయ్యాల్సిన అప్పులేమిటి ఇత్యాది వివరాలు మనతోనే ఖతం ! పన్ ఆక్సిడెంటల్!
మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ ఆవిడకి మీ బాలన్స్ షీట్ తెలుసా? దస్తావేజులు, నోటిమాటలు, తెలుగు వాళ్ళ భాషలో ఇచ్చిన, పుచ్చుకున్న హాండ్ లోన్స్ వగైరా అన్నీ ఏకరువు పెట్టారా? విపులంగా చెప్పారా? కనీసం మీ లాప్టాప్ లో మీరు పాస్వర్డ్ తో మైంటైన్ చేస్తున్న ఎక్సెల్ ఫైల్ పేరు, ఆ 123456 పాస్వర్డ్ అయినా చెప్పారా?
ఎందుకంటే నేనన్నానని బాధ పడకండి. ఈ మధ్య చెప్పా పెట్టకుండా పోతున్నారు. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో. బోల్డు సంవత్సరాల క్రితం అయితే నేనెళ్లిపోతున్నారా. బైట వసారాలో మంచమేసి పడుక్కోపెట్టండి. ఇవాళ తిధి బాలేదు. ఇంట్లో పోతే ఇల్లు ఓ సంవత్సరం వదిలేయాలని చెప్పి మరీ వెళ్లిపోయేవాళ్ళు.
ఇప్పటికి అర్ధం అయ్యిందా. నా పోస్టుల్లో ఉన్న ద్వందార్ధము కేవలం లోకకల్యాణం కోసమని!
"వీలు"నామా అంటే వీలు చూసుకొని రాసేది కాదురా బాబూ!