Thursday, January 28, 2021

పర్యావరణ రక్షణ, దేశ సేవ

 ఈ మధ్య గబుక్కున ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే నన్నెవరైనా హటాత్తుగా "ఈ దేశం నీకేమిచ్చిందన్నది కాదు పాయింట్! నువ్వు దేశానికి ఏమిచ్చావు అన్నదే ప్రశ్న" అని పదిమందిలో అడిగారనుకోండి. అప్పుడు నా గతేమిటి? ఎంత ఆలోచించినా ఈ దేశానికి ఏమిచ్చానో తట్టలేదు. ఆదాయపు పన్నంటారా? అది నేను మనస్పూర్తిగా ఇవ్వలేదు. సర్కారు వాళ్ళే బలవంతంగా తీసుకున్నారు 🙁

ఆ ఆలోచన వచ్చిన దగ్గరి నించి నిద్ర తగ్గిపోయింది. కాస్సేపు కునుకు తీసినా ఒకటే పీడకలలు! నేనొక పెద్ద కాలేజీ లోనో, లేక ఒక పెద్ద కంపెనీ లోనో భారీ స్పీచ్ ఇస్తూంటే ఒక కుర్రకారు అదిగో అదే ప్రశ్న ఆ మహా సభలో వేసినట్టు, అప్పుడు ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేక, కల్పించి (కలలో కూడా!) చెప్పలేక అలనాడు మయసభలో దుర్యోధనుడి లాగా భారీ అవమానం పాలయినట్టు కలలు! ఇలా లాభం లేదని ఈ దేశానికి ఏదో ఒకటి అర్జెంటు గా చేసెయ్యాలి అని నిర్ణయించాను. అంతమట్టుకు బాగుంది.

ఏది ఒకటి అంటే ఏమిటి?

అందరు రాజకీయ నాయకులనీ సరి సమానంగా బూతులు తిట్టి సామాజిక న్యాయం చేయలేను. ఎందుకంటే తిట్టించుకోవడానికి వాళ్ళు ఎవరెడీ అయినా బూతులు తిట్టడానికి xxx సబ్బుతో బట్టలుతుక్కుంటున్న నా సంస్కారం అడ్డొస్తోంది!

ఈ వయస్సులో సైన్యంలో చేరలేను. స్వచ్ఛ భారత్ అంటూ వీధులు తుడవలేను.
మరేం చెయ్యాలి? మరేం చెయ్యాలి? (సినిమాల్లో లాగా ఈ చివరి ప్రశ్న అలా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది).

అలా కొన్నాళ్ళు మధన పడగా పడగా ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. (ఈ ఐడియా నా జీవితాన్నే మార్చేస్తుందేమో?!)

అదేమిటంటే ఇటీవలి కాలంలో అందరూ వాతావరణం, పర్యావరణం లో భారీ మార్పులు వచ్చేస్తున్నాయి. మనందరం ఇప్పుడు పట్టించుకొని ఏదైనా చేయకపోతే ముందు తరాల వాళ్ళకి మట్టి, మశానమే అని లోకం కోడై కూస్తోంది. అందుకని అధమపక్షం అందరూ ముందస్తుగా చెట్లు పెంచండి అని ఘోషిస్తున్నారు కదా?

(పిడకలవేట: చెట్లు ఎలా పెంచాలో, పెంచుతారో తెలీదు నాకు! ఎవరైనా మొక్కలు పెంచుతారు. అవి పెద్దయితే చెట్లు అవుతాయి. ఇంకా భారీగా పెరిగితే చెట్టు అంటే బాగోదేమో అని వృక్షం అంటాం. కాని చెట్లు ఎలా పెంచుతాం?!)

సరే నా వంతు కృషిగా మొక్కలు పెంచుదామని నిర్ణయించాను. వెంటనే ఒక బుజ్జి కుండీలో ఒక అర డజను ధనియాలు మట్టిలో పాతిపెట్టి, రోజూ నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను. చిన్ని మొక్క రాగానే మహా ఆనందపడిపోయాను. దేశానికి నా సేవాంకురం అని!

రోజూ చాల ప్రేమగా ఇంకు ఫిల్లర్తో నీళ్ళు పోసాను. మగ్గుతోనో, చెంబుతోనో పోస్తే ఆ నీటి ధాటికి తట్టుకోలేక చచ్చిపోతాయేమోనని భయమేసి. ఒక్కోటి ఒక రెండు అంగుళాలు పెరిగాయి. 

హమ్మయ్య! నా వంతు దేశసేవకి అరంగేట్రం చేసేసాను.

ఇంకో రెండంగుళాలు పెరగ్గానే మొక్కలు పీకేసి పచ్చడి చేసుకు తినెయ్యడమే! అంటే కొంతమంది కోడికి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వగైరా పోషకాహారం బాగా తినిపించి అది ఏపుగా(!) పెరగ్గానే గుట్టు చప్పుడు కాకుండా దాన్ని బిర్యానీ చేసి లాగించేసినట్టు.

కాని ఇంతలో దినపత్రికల భాషలో చెప్పాలంటే నిన్న సాయంత్రం ప్రకృతి విలయతాండవం చేసింది. అంతే. అనుకోకుండా విచిత్రంగా వర్షాకాలంలో వాన పడ్డం మొదలెట్టింది!
నేనేమో బైటికి పని మీద వెళ్ల్లాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ వాన అలా చినికి చినికి భారీ వర్షంగా మారింది. నా కారుకి ఈత రాదు. అందుకని అదెక్కడా మునిగిపోకుండా అష్టకస్టాలు పడి మొత్తానికి ఎలాగైతేనేం ఒక రెండు గంటల తర్వాత ఇంటికొచ్చాను.

వచ్చి చూస్తె ఏముంది. చెప్పానుగా ప్రకృతి విలయతాండవం అని. నా కొత్తిమీర మొక్కలన్నీ నామ, రూపాలు లేకుండా పోయాయి. బుజ్జి కుండీ కూడా పగిలిపోయి ఆ ముక్కలన్నీ చెల్లాచెదురు అయ్యిపోయి కనిపించాయి. అంతే! నాకు దుఃఖం ఆగలేదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నా మొక్కలన్నీ సమూలంగా నాశనం అయ్యిపోయాయి.

అందుకే అంటారు కంటే ఖర్మం కాని పెంచుకుంటే ప్రారబ్ధం అని. నాలుగు రోజులు పెంచిన నాలుగు మొక్కలు చచ్చిపోతేనే నాకింత బాధగా ఉందే. మరి నాలుగు నెలలు పెంచి పోషించిన పంట నాశనం అయిపోతే రైతుల గుండెలు ఆగిపోయాయంటే ఆశ్చర్యం లేదు. అతిశయోక్తి కాదు.
చివరాఖరికి నా దేశసేవకి అలా మూడు మొక్కలు, ఆరు ఆకులతోనే నిండు నూరేళ్ళు నిండాయి 🙁

ఇంకెలా ఈ దేశానికి సేవ చెయ్యాలో అలా అలోచిస్తూనే ఉన్నా! మీకేమయినా ఐడియాలు తడితే చెప్పండి.

సదా మీ దేశ సేవలో

ఓ "అతి" దేశ భక్తుడు

సశేషం!!