Showing posts with label breathless. Show all posts
Showing posts with label breathless. Show all posts

Wednesday, September 25, 2019

Breathless blog!

రైల్వే స్టేషన్ కి హడావిడిగా, ఆడరాబాదరాగా, రైలు బయల్దేరడానికి ఇహ కేవలం ఐదే నిమిషాలు ఉన్నప్పుడు ఆటోీ లోంచి చెంగున గెంతి, స్ట్రాలీని బరబరా, గొరగొరా లాక్కుంటూ, ఆయాసపడుతూ, ఒక్కరవ్వ ముందెందుకు బయల్దేరలేదని మనల్ని మనం తిట్టుకుంటూ, హైదరాబాద్ రోడ్లనీ, "వెధవ" ట్రాఫిక్ నీ కూడా జమిలిగా తిడుతూ, ఆలీసం అవ్వడంతో ఆటో వాడి దగ్గర మనకి రావాల్సిన పది రూపాయలు వదిలేయాల్సి వచ్చిందని బాధ పడుతూ స్టేషన్ లోకి అడుగెట్టగానే మనం ఎక్కాల్సిన రైలు అరగంట ఆలస్యంగా వస్తుందన్న బోర్డ్ చూడగానే హమ్మయ్య అని పరుగులాంటి నడకకి ఎయిర్ బ్రేక్ వేసి బాబా రాందేవ్ చెప్పినట్టు మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసి వదిలి, స్లో మోషన్లో మన రైలు వచ్చే ప్లాట్ఫారం కి వెళ్లి, ఇంకోసారి హమ్మయ్య అనుకుని, మనవాళ్ళకి ఫోన్ కొట్టి "రైలు మిస్సయ్యినంత పనయ్యింది. వెధవ ట్రాఫిక్, వెధవ రోడ్లు, పైగా మేమెక్కింది ఓ డొక్కు ఆటో, ఒరే అబ్బీ కొంచెం వేగిరం పోనివ్వరా రైలు తప్పిపోతామో ఏమిటో అని ఎన్నిసార్లు చెప్పినా ఆ ఆటో స్పీడ్ వెళ్తేనా, సౌండ్ ఎక్కువ, స్పీడ్ తక్కువ, అయినా అదృష్టం. రైలు అరగంట లేటుట! చెప్పడం మర్చిపోయాను. నీకసలే మతిమరుపు ఎక్కువ. రాత్రి పడుకునేముందు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చెయ్యడం మర్చిపోకు. అలాగే పాలు తోడు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా" అని ధారాప్రవాహంగా అనర్గళంగా, అవిరామంగా ఓ పది నిమిషాలు అప్పగింతలు పెట్టి ఇంతలో మైకులో మన రైలు ఇంకో అరగంట ఆలస్యంగా వస్తుందన్న అనౌన్స్మెంట్ విని అప్పటిదాకా రైలు ఆలస్యం మన అదృష్టంగా భావించామన్న విషయం అలవోకగా మర్చిపోయి "మనదేశం ఇంతే. వెధవ రైళ్లు ఎప్పుడూ ఆలస్యమే. ఈ దేశం బాగుపడదు. దీన్ని బాగుచెయ్యడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అని రైల్వే వాళ్ళని, భారద్దేశాన్ని, మన తలరాతని విడివిడిగా, జమిలిగా తిట్టుకుంటూ ఒరే అబ్బీ కాఫీ ఎంత? ఓ కప్పందుకో, వెధవ రైల్వేస్టేషన్ కాఫీ దరిద్రంగా ఏడుస్తుంది కాఫీ ఏమిటి నా మొహం రంగు నీళ్లు కానీ ఏం చేస్తాం ఇంకో అరగంట కాలక్షేపం చెయ్యాలిగా ఆలస్యం అవుతోందని అమ్మాయి కాఫీ తాగి వెళ్ళమన్నా ఆగకుండా తాగకుండా వచ్చామాయే. ఏమో మళ్లీ ఇంకో అరగంట అలీసం అంటాడేమో అని ఆ గోరువెచ్చటి కాఫీ రంగు నీళ్లు సగం తాగి సగం వదిలేసి, ఆ కప్పుని కిటికీలోంచి బైటికి అతి సున్నితంగా తోసేసి, ఏమండీ హడావిడిలో నీళ్ల సీసా పెట్టుకోడం మర్చిపోయాం ఓ రెండు వాటర్ బాటిల్స్ కొనండి అమ్మాయి రాత్రికి పులిహోర ఆవకాయ ప్యాక్ చేసి ఇచ్చింది మీకసలే హడావిడిగా తినడం ఎక్కిళ్ళు తెచ్చుకోవడం పెద్ద బాడ్ హ్యాబిట్ ఆనక నీళ్లు లేకపోతె ఇబ్బంది పడిపోతారు అని ముగుడుగారికి పురమాయించి, తీరిగ్గా ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఐ హేట్ ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ నెవర్ కం ఆన్ టైం అని ఓ పోస్ట్ పడేసి ఆ రోజుకి చేయాల్సిన సామాజిక బాధ్యత పూర్తి చేసామన్న సంతృప్తితో ఆయనగారు కొన్న వాటర్ బాటిల్ అయన చేతే ఓపెన్ చేయించి ఓ గ్లాసుడు నీళ్లు తాగి హమ్మయ్య అనుకుంది ఒహావిడ

NB: పై రచన ఆసాంతం ఒకే వాక్యమని గమనించి, వీలయితే మీరు కూడా ఊపిరి తీసుకోకుండా ఆసాంతం ఒక్కసారిగా breathless పాట టైపులో చదవడానికి ప్రయత్నించండి


Thursday, October 27, 2016

Breathless!

BREATHLESS!!

హైదరాబాద్ లో సూపర్ మర్కెట్ లో కూరలు ఏరుకొన్నాక అవి వెయ్యడానికి పక్కనే ఉన్నరోల్ లో ప్లాస్టిక్ కవర్ చించి దాన్ని అటు పక్కకి, ఇటు పక్కకి, పైకి, కిందకి, చివరిగా 360 డిగ్రీల్లోనూ విపరీతంగా నలిపి ఇక మనవళ్ళ కాదని ఒక డెసిషన్ కి వచ్చేసి దగ్గరలో ఎవరన్నా సేల్స్ గర్ల్ ఉందేమోనని అన్ని వేపులా వెదికేస్తూ, చేతులు ఖాళీగా ఉండడం ఎందుకని నలపడం కంటిన్యూ చేస్తున్నప్పుడు, చివరికి ఒక సేల్స్ గర్ల్ అల్లంత దూరంలో కనిపించగానే మనం మూగవాడిలాగా చేతుల్లో ఉన్న ఆ విసిగిస్తున్న కవర్ వాళ్ళ దృష్టిలో పడేట్టు చెయ్యగానే ఆ అమ్మాయి మాకివన్నీ మామూలే "చస్తున్నాం ఈ చేతకాని మగాళ్ళతో" అన్నట్టు మన వేపు కొంచం జాలిగానూ, వెటకారంగానూ చూస్తోందేమోనన్న అనుమానం మనల్ని కుళ్ళపొడిచేస్తూంటే, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఎందుకొచ్చామురా బాబూ ఈ షాపింగ్ కి అని మనల్ని మనమే తిట్టేసుకుంటూ ఉంటే, ఆ సదరు సేల్స్ గర్ల్ పెళ్లి కూతురు లాగా కాట్ వాక్ చేస్తూ మన దగ్గరకి వస్తూంటే ఆమెని మధ్యలో ఇంకో కస్టమర్ ఆపితే, వాళ్ళిద్దరినీ విడిగానూ, జమిలిగానూ తిట్టుకుంటూ, కవర్ నలపడం కంటిన్యూ చేస్తూంటే, అలా సేల్స్ గర్ల్ వేపే చూస్తూండడం బాగోదేమోనని కాస్త చూపు పక్కకి తిప్పగానే మనకి ఎదురుగా మనలాంటి ఇంకో మగజీవి అదే మనలాంటి అసహాయ వీరుడు, నిస్సహాయ శూరుడు మనలాంటి బాధే పడుతూ అదే టైం కి ఆతను కూడా మనల్ని చూసి, ఇద్దరం పరస్పరం ఓ వెర్రి నవ్వు నవ్వుతూంటే, వెంటనే మన కళ్ళ ముందు ఒక మెరుపు మెరవకుండానే, ఈ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చెయ్యలేకపోవడం అన్నది కేవలం మన ఒక్కళ్ళ పురుషత్వానికి మాత్రమే అగ్ని పరీక్ష కాదని, పెపంచికంలో ఉన్న యక్ష కిన్నర కింపురుష పుంగవులందరికీ పరిక్షని, కాబట్టి మనం మనల్ని కించ పరుచుకోనవసరం లేదని ఒక యూనివర్సల్ ట్రూత్ అర్ధం అయ్యి యురేకా అని కేకెట్టబోయి, అలా కేకెడితే తర్వాత రైలులో చైన్ లాగిన వాడిలాగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సోస్తుందని అరక్షణంలో తట్టి, ఆ కేకని గొంతులోనే నొక్కేసి, ఆ ఆనందం ఎలా బైట పెట్టాలో తెలీక బైటికి ఒక చిన్న చిరు మందహాసంగా వెలువడితే, ఈ లోపల ఇంకోపక్కనించి ఇంటావిడ ఇంకో నాలుగు కూరలు ఏరేసి, ఏమిటీ ఇంకా ఒక్క కవర్ కూడా ఓపెన్ చెయ్యలేదా? పెద్ద మగాడిలా పోజులు కొడతారు ఈ మాత్రం చెయ్యలేరా అన్న అర్ధం వచ్చేలా మన వేపు ఒక చూపు చూస్తే, తట్టుకోలేక, పబ్లిక్ గా తిట్టుకోలేక, మన అసహాయతకి మనల్ని మనమే తిట్టేసుకుంటూ, అసలు ఈ తొక్కలో ప్లాస్టిక్ రోల్ టెక్నాలజీ ఏ దిక్కుమాలిన వాడు కనిపెట్టాడు అని తెలీని, కనిపించని వాడిని విపరీతంగా తిట్టేసుకుంటూ, ఈ లోపల ఆ పెళ్లికూతురు అదేనండీ ఆ సేల్స్ గర్ల్ మనల్ని కరుణించి మనదగ్గరకొచ్చి ఆ కవర్ ఇటివ్వండి అన్నట్టు చెయ్యి చాపగానే, మనం అప్పటిదాకా నలిపిన కష్టానికి ప్రతిఫలంగా, చిల్లర దేవుడు కరుణించి ఆ కవర్ టక్కున ఓపెన్ అయితే రెస్ట్ తీసుకోకుండా ఎవరెస్ట్ ఎక్కినవాడిలా ఆహా ఎంత ఆనందం!!

ఈ మధ్య కొన్ని సినిమా పాటలు Breathless గా పాడడం అన్న ట్రెండ్ ని రాయడంలో చూపించడానికి నే చేసిన విచిత్ర ప్రక్రియ. మీరు కూడా ఆసాంతం ఊపిరి పీల్చకుండా, పీలిస్తే వదలకుండా చదవడానికి ప్రయత్నించండి!!