Showing posts with label బెండకాయలు. Show all posts
Showing posts with label బెండకాయలు. Show all posts

Tuesday, July 21, 2020

Magallu! vantaa varpoo!

ఈ పోస్ట్ కేవలం పురుషులకి మాత్రమే!

అలా హెడ్డింగ్ చూడగానే ఆడోళ్ళందరూ ఈ పోస్ట్ ఆసాంతం చదివేస్తారని తెలుసు! బట్ ఐయామ్ హెల్ప్ లెస్ యు నో. వాళ్ళని ఎప్పుడాపగలం కనక!

ఇహ పోతే 

ఉరేయ్! వంటొచ్చిన, వంట చేస్తున్న మొగుళ్ళూ! ఇదేటిది ఉరేయ్ గిరేయ్ అనేస్తున్నాడు అని తెగ ఫీల్ అయిపోకండి. అది బుడుగు స్టైల్ అనుకరణ! వంట చేస్తున్న అంటే అచ్ఛంగా ఎప్పుడూ అని కాదు కనీసం ఈ కోవిడ్ సమయంలో అన్నమాట. 

ఇప్పుడు మనం అంటే వంట చేసే మగాళ్ళం, మొగుళ్ళం వంట చేస్తున్నప్పుడు చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి బోల్డు కిటుకులు, చిటుకులు, సులభ మార్గాలు వగైరా కనిపెడతాం కదా? ఆడోళ్లయితే వంట  ఓ పెద్ద పనిలాగా ఫీల్ అయిపోయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎలాగోలాగ గబగబా, కసాపిసా చేసి పారేసి వంటింట్లోంచి బైట పడదామా అని చూస్తారు. అలాగే చేస్తారు.  

మనం అలాక్కాదే. చాలా శ్రద్ధగా, ప్రేమతో వండుతాం. 

ఉదాహరణకి కూరలు తరగడం తీసుకోండి. ఈ పెళ్ళాలు ఎలా తరుగుతారు? మీకు తెలీనిదేముంది? పనిమనిషితోనో, పక్కింటావిడతోనో పిచ్చాపాటి మాట్లాడుతూ ఏదో  తరగాలి కాబట్టి తరిగి పడేస్తారు. 

కానీ మనం అలాక్కాదే ? ఉదాహరణకి బెండకాయలు ప్రతి ముక్క ఒకే సైజులో ఉండేట్టు  ఎంతో శ్రద్ధగా, ఓ గోడ అందంగా ఇటుకలు పేర్చి కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టూ ఎంతో ప్రేమతో వాటిని తిరుగుతాం. నేనైతే అప్పుడప్పుడూ 90 డిగ్రీల్లో కాకుండా 45 డిగ్రీస్ లో తరుగుతాను. లేదా సన్నగా ఒక్కరవ్వ పొడుగ్గా తరుగుతాను డిజైనర్ కట్  అన్నమాట! ఫోటో చూడుడి లోపాయికారీ మనలో మన మాట పనిమనిషులతో, పక్కింటి అంటీలతో ముచ్చట్లు చెప్పుకునే సదుపాయాలు మనకి లేవుగా!


నా మట్టుకు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్లుంటుంది కానీ చెప్పక తప్పటం లేదు. నేను చెప్పకపోతే మీ అందరికీ ఎలా తెలుస్తుంది. 

నేను ఏ పనయినా చాలా సైంటిఫిక్ గా చేస్తాను. ఉదాహరణకి కూరలో కారం ఒక స్పూన్ వెయ్యాలనుకోండి. ఆడోళ్లయితే మొత్తం చెంచాడు ఒకే చోట పడేస్తారు మూకుట్లో. ఆలా చేస్తే మొత్తం అన్ని కూర ముక్కలకీ దాదాపు సరిసమానంగా  ఆ కారం పట్టే అవకాశం తక్కువ. మరంచేత నేనేం చేస్తానంటే ముందు ఒక అర చెంచా కారం వేసి కూర ముక్కలని పైకి కిందకి ఒక్క సారి కలుపుతాను. అప్పుడు కిందనున్న ముక్కలు పైకొస్తాయి. అప్పుడు ఇంకో అర చెంచా కారం మూకుట్లో వలయాకారంలో చుట్టూ తిప్పుతూ వేసి మళ్ళీ బాగా కలుపుతాను. అలా చేస్తే కారం అన్నిటికీ బాగా పడుతుంది. 

ఇంకో ఉదాహరణ. కూరలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వగైరా వగైరా రెండు మూడు పొడులు వెయ్యాల్సి వస్తే ఈ ఆడోళ్లున్నారే,  లారీ లోంచి ఇసుక కిందకి ఒకే చోట పెద్ద కుప్పలా ఒంపినట్టు అన్ని పొడులూ కూరలో ఒకే చోట కుమ్మరిస్తారు. అప్పుడు కూడా పైన చెప్పినట్టు పెద్దగా కలవ్వు. 

నేను అలా రెండు మూడు పొడులు వేయాల్సి వస్తే అవన్నీ చిన్ని గిన్నెలో వేసి చెంచాతో బాగా కలిపి పైన చెప్పిన విధంగా నాలుగు దఫాలుగా వేసి కలుపుతా. అప్పుడు చూడండి నా సామిరంగా. కూర అదరః ! చూడుడు ఫోటో 


ఇహ కొత్త కొత్త ప్రయోగాలంటే మొన్న పోస్ట్ చేసినట్టు బెండకాయ ముచ్చికలు అచ్చిక బుచ్చిక లాడుతూ కూర చేస్తా! 

ఇంకో చిన్ని టిప్! అర చెంచా వాము, అరచెంచా మిరియాలు కలిపి పొడి చేసి చాలా కూరల్లో చివరిగా వేస్తా. జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్న మిరియాల  ఘాటు తగులుతుంది!. మా ఆవిడ అన్నిట్లో వేస్తారేంటి అంటుంది  ఏం అన్నిట్లో తను కారప్పొడి వేస్తె నేనెప్పుడన్నా పల్లెత్తు మాటన్నానా? మొగుడన్నాక ఆ మాత్రం స్వతంత్రం లేకపోతె ఏం సుఖం. అందుకని నేను అవన్నీ పట్టించుకోను. మనం కొన్ని కొన్ని విషయాల్లోనైనా అలా గట్టిగా , ఖచ్చితంగా లేకపోతె చాలా కష్టం బాబూ 

ఇంతకీ మీరిటువంటి చిటుకులు, కిటుకులు, చిట్కాలు  ఏమన్నా కనిపెట్టి ఉంటే మీతో(బో)టి మొగుళ్ళతో ఇక్కడ పంచుకోండి.  

Saturday, January 5, 2019

కూరలు అద్భుతమైన రుచి రావాలంటే?.... ఓ సీక్రెట్!!

ఈ పోస్ట్ కేవలం వంటవారికి మాత్రమే! అంటే వంటచేయు ఆడ, మగవారికి!

అలా పైవిధంగా హెచ్చరించినా మిగతా అశేష ప్రజానీకం కూడా చదువుతారని నాకు తెలుసు! చదవండి! కానీ మీకేం ఉపయోగపడదు! ఆనక నన్నేమీ తిట్టద్దు!

పొద్దున్నే అంటే హైదరాబాద్భాషలో చెప్పాలంటే మబ్బుల్లో లేవడం ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలీక మా ఆవిడకి సాయం చేసినట్టుంటుంది, కాలక్షేపం అవుతుంది అని ఏదో ఒక కూరచేసి పారేయ్యడం! అంటే ఏదో వ్యావహారిక పదప్రయోగం చేశా కానీ చేసిన కూర తినలేక పారేయ్యడం కాదని వివరణ!

అలాగే ఇవాళ కూడా మబ్బుల్లో లేచి ఎప్పటికి న్యూస్పేపర్ రాకపోతే కనీసం కూరైనా అవుతూంటుంది అని ముందస్తుగా పొపేసి బెండకాయలు వేసేటప్పటికి పేపర్ వచ్చింది.

మరిహ నిన్న చంద్రబాబుని PM, ఇంకో CM లేటెస్ట్ గా నిన్న ఏం ఆడిపోసుకున్నారో సవివరంగా చదవడంలో మునిగిపోయాను. ఇటీవల అదేగా రోజూ హెడ్లైన్స్!

కొత్త విమర్శలు కొన్ని చదివాక ఏదో మాడుతున్న వాసన రావడం మొదలయ్యింది. పొద్దున్నే లేచాక కేవలం ఓ కప్పు కాఫీ తాగుతా తప్పిస్తే టిపినీలు గట్రా తొమ్మిదింటికే! అప్పటిదాకారోజూ నా కడుపు మాడుతూంటుంది కానీ ఇలా మాడిన వాసన రావడం ఇదే మొదలు. ఇదేదో డికెష్టి చెయ్యాల్సిందే అని డికెష్టి ఎక్కడినించి మొదలెట్టాలా అని క్లూస్ కోసం చూసేంతలో వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాడు వాసన మరింత పెరిగింది. ఇహనేం అదేనా మొదటి క్లూ!

మునుపు శబ్దాన్ని వెదుకుతూ వెళ్లే శబ్దభేది బాణంలా నేనే ఓ బాణంలా వాసనని పోలీసుకుక్కలా వాసన చూసుకుంటూ వెళ్ళా. పోలీసుకుక్క నేరస్తుడి దగ్గరకి తీసుకెళ్లినట్టు నన్నా మాడు వాసన దాని జన్మస్థానానికి తీసుకెళ్లింది.

అదేదో వేరే చెప్పాలా? మూకుడులో నేను వేగుతోందనుకున్న కూర

ఉల్లిపాయలు సన్న సెగమీద వేగేదాకా ఆగలేక నేను రోడ్డు పక్కన ఈటింగ్ జాయింట్ వాడు వండేట్టు స్టవ్ హెచ్చించి ఉల్లిపాయలు వేచుతాను!

స్టవ్ హైలోనే ఉందన్న విషయం మర్చిపోయి తర్వాత బెండకాయలు మూకుడులో వేసి, హాల్లోకి వెళ్లి తాపీగా పేపర్ తిరగేస్తూ సెటిల్ అయ్యిపోయా. మరి కూర మాడిందంటే మాడదా?

వెంటనే ఆ మాడుతున్న కూరని సముద్రంలో సునామీ టైపు లో కిందనించి పైకి, పైనించి కిందకి, కుడినించి ఎడమకి, ఎడమనించి కుడికి, ఇలా వాషింగ్ మెషిన్ లో బట్టలు తిరిగినట్టు కలియతిప్పా! అప్పుడు తెలిసింది. మాడింది కూర మొత్తం కాదు. కేవలం కింద భాగం అని. కానీ గమ్మత్తు ఏమిటంటే అలా ఓ పావు వంతు మాడిన కూర సివరాకరికి అద్భుతమైన రుచి వచ్చింది.

దీన్నిబట్టి నాకు తెలిసిన, మీ అందరికీ అంటే కేవలం వంటవారికి, తెలియచెప్పే, విశేష సీక్రెట్ ఏమిటంటే కూరలు మాంఛ్చి రుచిగా రావాలంటే కావాలని ఒకింత దగ్గరుండి మాడ్చండి 😎