Tuesday, March 24, 2020

Ugadi. ఉగాది శుభాకాంక్షలు

ఓపిక, తీరిక లేనివాళ్ళందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఇదేటిదీ ఇలగంటున్నానేటి అని సంబ్రమాశ్చర్యపడకండి. నేను కోడికంటే ముందు లేస్తాను కాబట్టి నాకు బోల్డు సమయం ఉంది బోల్డు పెద్ద పోస్ట్ రాయడానికి సంకల్పించాను. మరది సదవాలంటే మీక్కూడా బోల్డు టైం ఉండాలిగా? అది లేనివాళ్ళకి ముందస్తుగా చెప్పేసాను.

ఇహ తీరిక ఉన్నవాళ్లు, తీరిక చేసుకున్నవాళ్ళు అమెరికావాడిలాగా ఓ పెద్ద జగ్గు సైజు మగ్గులో వేడి కాఫీ పోసుకొని, పడక్కుర్చీలో కాళ్ళు బార్ల చాపుకొని ఆ కాఫీ ఆస్వాదిస్తూ సదూకోండ్రి.

ఇవాళ ఉగాది అన్న విషయం తెలుగు పెజానీకానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పటి తరాలకి తెలీని విషయాలు ...

ఇవాళ తెల్లారగట్లే లేచి .... ఎందుకులెండి... యువతరం బాధపడతారు... పొద్దున్నే లేచి (పొద్దున్నే అంటే ఏ గొడవా ఉండదు... పదింటికి లేచినా పొద్దున్నే!)... కూసీపయ్యాక జుట్టుకు భారీ ఎత్తున నూనె, నువ్వుల నూనె అయితే భేష్, మర్దనా చేసి అంటే హెయిర్ కటింగ్ సెలూన్లో మంగలాడు తబలా వాయించినట్టు అన్నమాట, ఆపై వళ్ళంతా శుభ్రంగా నలుగుపెట్టుకుని ..ఇగో కుర్రాళ్లు నలుగు పెట్టడం అంటే ఏంటి ఇది మాకు అవుట్ అఫ్ సిలబస్ అని నన్ను సింపుల్గా దాన్ని వివరించమని అడక్కండి. ఆశ, దోస, అప్పడం, ఆవడ! ఛస్తే చెప్పను. నాకసలే బోల్డు పనులున్నాయి. కావాలంటే మీ ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళని అడగండి. లేకపోతె గూగుల్ చెయ్యండి.

నలుగు పెట్టుకుని ఓ చిన్ని తువ్వాలు చుట్టుకుని అంటే జ్యోతిర్లచ్మి సీరంత తువ్వాలు అన్నమాట! అలా ఓ గంటసేపు ఎండలో సంచరించండి. ఒళ్ళంతా చిమచిమలాడాక కుంకుడుకాయలతో అభ్యంగనస్నానం చెయ్యండి. ఈ కుంకుడుకాయలేంటి అంకుల్ అని విసిగించకండి. ఈ అంకుల్ అంటీ పిలుపులంటే నాకు మా సెడ్డ సిరాకు. కుంకుడుకాయలంటే కూరొండుకునే బెండకాయ, వంకాయ టైపు కాదు! అవెట్టి అంటే వాటిని ఓ గుండ్రాయితో పగలకొట్టి మీరు షాంపూ తో తలస్నానం చేసినట్టు చెయ్యడం! ఈ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయని మరింకో యక్షప్రశ్న వెయ్యద్దు. అమెజాన్ వాడు ఈపాటికి అమ్మడం మొదలెట్టే ఉంటాడు! కుంకుడు కాయల్ని ఇంగ్లీష్ లో ఏమంటారని మళ్ళీ నన్నడగద్దు. నేనేమీ గూగుల్ కాదు. అప్పుడప్పుడూ వాడిని కూడా  విసిగించండి. ఇంతకీ ఆ ఇంగ్లీష్ మాట తెలీగానే అమెజాన్ లో ఆర్డర్ సెయ్యండి. వచ్చే ఉగాదికయినా పనికొస్తాయి. ఎన్నేళ్లయినా పాడవ్వవు. అన్నట్టు కుంకుడుకాయలు బద్దలుకొట్టినప్పుడు లోపల నల్లటి గుండ్రంగా ఉన్న గింజలు ఉంటాయి. ఓ గింజనట్టుకుని గచ్చుమీద పదిసార్లు బాగా రుద్ది వెంటనే పక్కనోళ్ళ చేతిమీద పెట్టి చూడండి. మస్తుగుంటది! మనకి. వాళ్ళక్కాదు

అలా అభ్యంగనస్నానం ... ఓహో ఇది కూడా తెల్దుగా ... సింపుల్గా మీకర్ధమయ్యేట్టు చెప్పాలంటే తలంటు! ఈ కార్యక్రమం జయప్రదంగా ముగించాక ఇంకో పావుగంట ఓ మంచి కాలక్షేపం పనోటుంది. అదేటంటే ఆ కుంకుడుకాయ తొక్కలు, గింజ ముక్కలు మీ జుట్టులో ఇరుక్కుపోయిన వాటిని ఒకటొకటి పీకడం. బోల్డు టైం పాస్... ఓ పక్క ఈ ఫేస్బుక్ సూస్తూ.

లేకపోతే ఒక కోతి ఇంకో కోతికి తల్లో పేలు చూసినట్టు, మీరు ఇంకోళ్ళ జుత్తులో ఉన్నవి పీకి మీ జుత్తులోవి వాళ్ళని పీకమనండి. ఎవరు ఎక్కువ పీకితే వాళ్లకి రెండో వాళ్ళు ఓ నూట పదహార్లు సదివించుకోవాలని ఓ పందెం పోటీ కూడా సర్దాగా పెట్టుకోవచ్చూ.

ఆ పైన మీ ఇంట్లో ఉన్న దేవుడికి ఓ చిన్ని నమస్కారం పడేసి మీకు కంఠతా రాకపోతే గూగుల్ చేసి "శుక్లాంబరధరం ... " అని ఓ రెండు లైన్ల శ్లోకం సదివేసి... దానర్ధం తర్వాత తీరిగ్గా తెలుసుకుందారి ... అది తప్పులు పోకుండా సదివి... ఆ తర్వాత ఉగాదిపచ్చడి తిని, ఒకింత తాగితే ... అందులో ఉన్న షడ్రుచులు ... ఇదేటి మాస్టారూ ఆడపడుచులు అని విన్నాం కానీ ఈ షడ్రుచులు ఏటంటారా? కూసింత అప్పుడప్పుడూ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. షడ్రుచులు అంటే ఆరు రుచులు ... బహుశా ఆరు ఋతువులకి గుర్తుగానేమో . అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు! ఇవన్నీ ఆ ఉగాదిపచ్చడిలో ఉంటాయి. భారీఎత్తుని తినండి! తాగండి! ఇక్కడ ఓ నమ్మకం ఉందండోయ్! ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే మనకి ముందస్తుగా ఏ రుచి తగులుతుందో ఇహా ఈ సంవత్సరం అంతా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి అని! ఉదాహరణకి తీపి తగిలితే ఇంకేముంది హోల్ ఇయర్ హోల్ సేల్ గా తీపి గుర్తులే! ఇక్కడ వాస్తు మార్పులు చేసి మన అదృష్టాన్ని మనకిష్టం వఛ్చినట్టు మార్చేసినట్టు, మనకి ఏ అనుభవం కావాలనుకుంటే తత్సంబంధమైనది ఒకింత ఎక్కువ వేసి పచ్చడి చేస్తే సరి! ఉదా: బెల్లం ఎక్కువేస్తే ఇహ మరి తియ్యగానే కదా ఉండేది! మరింకేం రెచ్చిపోండి.

అన్నట్టు సెప్పడం మర్సేపోయా మీకు పండక్కి, పబ్బానికి (లోపాయికారీ మేటర్ ఏమిటంటే ఈ పబ్బానికి అన్న మాటకి అర్ధం నాకూడా తెలీదు!) కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం ఉంటే అవి వేసుకుని ఆ పైన దేవుడికి దండం, తర్వాత తొంగోడం1

అన్నట్టు మర్సేపోయా! తొంగోడానికంటే ముందు పంచాంగ శ్రవణం! అంటే ఇంట్లో పంచాంగం ఉందనో, లేక ఆన్లైన్ లో చూసో మీ రాశిఫలాలు చదివేసుకోవడం కాదు! శాస్త్రం ఒప్పుకోదు! ఇంకొకళ్ళు చదివితే వినడం! రాశిఫలాలే కాదు, దేశానికి ప్రపంచానికి కూడా వార్షిక ఫలితాలు చెప్తారు. ఏ కొరోనా ఎప్పుడు పోతుందో కూడా దుర్భిణీ వేసి చూసి సెప్తారు. 

ఆ తర్వాత పచ్చడి (మెతుకుల)తో కడుపు నిండదు కాబట్టి... పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇవ్వాళ కూడా పొద్దుగాల ఉప్మా చేసుకోకుండా ఇంకేదైనా వెరైటీ టిఫినీ చేసుకొని తినండి.

తర్వాతేముంది ...షరా మామూలే... వాట్సాప్ లో వచ్సిన ప్రతి మెసేజ్ ని ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చెయ్యడం, ఇక్కడ ఓ పోస్టు పడెయ్యడం. తర్వాత అబ్బా బాగా అలిసిపోయాం అని బోయనం టైం దాకా ఓ కునుకెయ్యడం. ఏ మాటకామాటే! నలుగెట్టుకొని, తలంటోసుకున్నాక నిద్రొస్తుంది చూడండి...

నిద్ర లేచాక, క్షమించాలి లేపాక... భారీగా ఆవలించి ఏమిటి పండగ స్పెషల్ అని మీ ఆవిడనో, ముమ్మీనో విసిగించి ఆవిడ పెట్టినవి తిని netflix లో, అమెజాన్ ప్రైమ్ లో ఓ అరా డజనుకు తక్కువ కాకుండా సినిమాలు సీరియళ్లు బింజ్ వాచింగ్!

మరిహ డిన్నరయ్యాక ఢాంమ్మని మంచం మీదకి గెంతి బొబ్బొడం!

ఇలా చేసిన వాళ్లందరికీ, వచ్చే ఏడాది చేద్దాంలే అనుకుని ఇవాళ ప్రతి రోజులాగే సాదా సీదాగా గడిపేసే వాళ్లందరికీ ... ఇవన్నీ ఎందుకు మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ముఖ్య గమనిక: ఇవాళ ఏం చేసినా, ఎలా చేసినా మీ ఇష్టం. కానీ మీ కొంప నాలుగు గోడల మధ్యే చేయండి. లేప్పోతే తర్వాత నవ్వలే"క రోనా"