Wednesday, July 19, 2023

వానాకాలం చదువులు!

 36 గంటల నుంచీ హైద్రాబాద్లో జోరుగా ఆగకుండా వాన పడుతోంది. 


నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇలా వాన పడితే స్కూల్ సెలవు! సెలవిచ్ఛేవాళ్ళా లేక మనం డుమ్మా కొట్టేవాళ్లమా అన్నదానికి చరిత్ర పుటల్లో క్లారిటీ లేదు. 


అదే కాలేజీకి వచ్చాక నిక్కర్ల నించి పాంట్లకి ఎదిగాం కాబట్టి కాస్త పెద్ద మనుషులం అయ్యామని ఒకింత బాధ్యతతో ఎంత వాన పడుతున్నా పట్టించుకోకుండా హీరోచితంగా ఆయాసపడుతూ, వానలో అయినా చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. 


ఇప్పటి కుర్రాళ్ళలాగా పదో క్లాసు నుంచి ఆక్టీవా స్కూటర్లు, పాకెట్ మనీలు లేవు మాకు ఆ రోజుల్లో. కాస్త ఓ మాదిరి మిడిల్ క్లాస్ అయితే ఓ సైకిల్ కొనిచ్చేవాళ్ళు. 


సైకిల్ అయితే ఉంది కానీ సినిమా టికెట్ కి డబ్బులో. అబ్బో ఆ రోజుల్లో ఎంటీవోడు ఒక నెలంతా రాత్రిళ్ళు సైకిల్ తొక్కి లక్ష రూపాయలు సంపాదించే దానికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఓ అయిదు రూపాయల కోసం! 


అయిదు రూపాయలుంటే కుర్చీ టికెట్ 1-80 చొప్పున ఇద్దరికీ 3-60. ఇంటెర్వల్స్లో తలా రెండు బుజ్జి సమోసాలు, రెండు టీలు. రెండు సైకిళ్లకు సైకిల్ స్టాండ్ ఖర్చులు! అన్నీ కలిపి హాయిగా అయిదు రూపాయల్లో సినిమా చూసేసేవాళ్ళం. పది పైసలో పావలానో మిగిలేది కూడా! ఇప్పటి సంగతి చెప్పాలా? సినిమాకి వెళ్లాలంటే బ్యాంకు లోన్ తీసుకునే పరిస్థితి. 


కానీ ఆ అయిదు రూపాయలు "సంపాదించడం" బోల్డు కష్టం అయ్యేది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల లాగ కూరలు తెచ్చినప్పుడో అర్ధ రూపాయో, అదృష్టం బాగుంటే ఓ రూపాయో, నెలవారీ సరుకులు తెచ్చినప్పుడు మట్టుకు పదో పరకో నొక్కేసో , అప్పుడప్పుడూ పోపుల డబ్బా మీద దాడి చేసో, కిందా మీద పడి అయిదు రూపాయలు సంపాదించి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడో ఇంట్లో మంచం మీద వెల్లకిలా పడుకుని మొబైల్లో, ఓపికుంటే హాల్లో సోఫాలో కూలబడి టీవీలోనో రోజుకో రెండు చెప్పున చూసేస్తున్నారు. నేను అనవసరంగా బోల్డు ముందు పుట్టేసానా అని బాధ పడిపోతూంటాను తీరిక వేళల్లో,  


ఇంతకీ అంత వానలో పొద్దున్నే కాలేజీకి ఎందుకు అంటే ఇక్కడో సీక్రెట్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పితే ఏం ప్రాబ్లెమ్ లేదు కాబట్టి సీక్రెట్ ఓపెన్గా చెప్పేస్తా. వారంలో కనీసం రెండు సినిమాలకి కాలేజీ ఎగ్గొట్టి మ్యాటినీకి చెక్కేసేవాడిని నా బెస్ట్ ఫ్రెండ్ తో! ఇలా వాన పడిందని ఇంట్లో కూర్చుంటే మధ్యాన్నం సినిమా టైంకి కాలేజీకి అని బయల్దేరితే ఇంట్లో ఒప్పుకోరుగా? పొద్దున్న ఏం ఉడతలు పట్టావు? అప్పుడు వెళ్ళనిది ఇప్పుడెందుకో? ఓవర్ ఆక్షన్ ఆపి ఇంట్లో పడుండు అని మన ప్లాన్ కి అడ్డం పడతారుగా?


అందుకే పొద్దున్నే కాలేజీకి దేవుడా అంటూ, ఊసురోమంటూ వెళ్లడం! నా చిన్నప్పుడు నే పడ్డ కస్టాలు పగవాడికి కూడా వద్దు!


అంత కస్టపడి కాలేజీకి వస్తే మెచ్చి మేక తోలు కప్పక పోయినా కనీసం మన ఆదర్శాన్ని గుర్తించచ్చుగా లెక్చరర్లు? అబ్బే! ఆ రోజుల్లో అంత గుర్తింపు ఉండేది కాదు మా బోటి సిన్సియర్ విద్యార్ధులకి. 


"ఏం బాబూ? గాలి ఇటు మళ్లింది! మార్నింగ్ షో కి టికెట్స్ దొరకలేదా? "అని సూటిపోటి మాటలతో నా హృదయం ముక్కలు చేసేవాళ్ళు. అప్పుడు నా హృదయానికి పడ్డ క్రాక్స్ మొన్నీ మధ్య కార్డియాలజిస్ట్ చూసి బోల్డు హాశ్చర్యపడిపోయాడు. ఇన్నేళ్లు అసలు ఎలా బ్రతికారు మీరని! ఆ లెక్చరర్ల మాటలకి క్రాక్స్ ఇచ్చినా గుండెని రాయి చేసుకుని గుండ్రాయిలా అయిపోయాం కదా? అందుకని గుండులా ఇన్నాళ్లు బ్రతికేసా అని ఆయనకి  తెలీదు! నేను చెప్పలేదు!


అలా హృదయం  క్రాక్ అయ్యిందని చెప్పి ఎవ్వరికీ ఇవ్వకుండా మన దగ్గరే ఉంచేసుకోము కదా? ఓ అమ్మాయితో అన్నా "నా క్రాకులు పడ్డ హృదయం నీకే అంకితం" అని. నువ్వో క్రాక్ గాడిలా ఉన్నావని సుతారంగా తిరస్కరించింది. 


ఇన్ని మాటలు లెక్చరర్ల దగ్గర పడాల్సిన ఖర్మ మనకేంటి అని వాళ్ళు అలా తిట్టగానే "మాకు అటెండన్స్ వేస్తె మా దారి మేం చూసుకుంటాం మీకు, మిగతా సిన్సియర్ విద్యార్ధులకి ఇబ్బంది లేకుండా. లేదంటే ఇక్కడే కూర్చొని కాకిగోల చేస్తాం అని అల్టిమేటం ఇచ్చేసేవాడిని లెక్చరరుకి. మన లాంటి వుడ్ బి రౌడీలతో ఎందుకని పొండిరా అటెండన్సేగా వేస్తాలే అనేవాళ్ళు. (కానీ దుర్మార్గులు మోసం చేసేవాళ్ళు. డిగ్రీ మూడేళ్లు అటెండన్స్ తక్కువయ్యి కాండోనేషన్ కట్టాను) వెంటనే లేచి విజయ గర్వంతో బైటికి వాక్ అవుట్ చేసి కాసేపు కాలేజీ కాంపౌండ్ లో తచ్చాలాడి, ప్రిన్సిపాల్ కంట్లో పడితే మేటర్  ఎస్కలేట్ అయ్యి ఇంట్లోవాళ్ళకి మన నిర్వాకం తెలిసిపోయి కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉందని బైటికి వెళ్లి అలా ఉమెన్స్ కాలేజీ చుట్టూ గానుగెద్దులా ఓ సారి సైకిల్ తొక్కుతూ,ఇంకోసారి దాన్ని నడిపించుకుంటూ  అమ్మాయిలు ఎంతైనా బుద్ధిమంతులు. కాలేజీ వదిలి బైట మనలా బేవార్స్ గా తిరగరు అని తెలిసినా సరే తిరిగి ఒక్కమ్మాయి కనిపించక ఇహ చేసేది లేక ఇంకో జంక్షన్ కి వెళ్లి ఓ టీ తాగి లంచ్ టైం కి ఇంటికెళ్లి ఆవురావురుమంటూ భోజనం లాగించి మళ్ళీ సైకిల్ వేసుకుని "కాలేజీకి" వెళ్ళేవాళ్ళం!


వేటగాడు సినిమాలో రాజబాబు చెప్పినట్టు "ఏంటో గురూ? ఆ రోజులే వేరు"?