Showing posts with label గుంటూరు. Show all posts
Showing posts with label గుంటూరు. Show all posts

Thursday, January 16, 2025

Fond memories of cycle!

 పాత రచన పునర్ముద్రణ! కొన్ని సవరణలు, వివరణలతో 


1970's!! అంటే మూగమనసులు సినిమా మొదటి సీన్లో ముసలతను చెప్పినట్టు "అబ్బో అదెప్పటి మాటా?" ఓ 50 ఏళ్ళ కిందటి సంగతులు!


ఆ రోజుల్లో కుర్రకారు కి పేరులోనే కారు.. ఇప్పటి యువత లాగా ఇంటర్ లో బైక్, డిగ్రీ లో కారు లేదు మాకు 🙁


ఆ రోజుల్లో సైకిల్ ఉంటే కాస్త ఉన్న వాళ్ళకింద లెక్క! హంబర్ సైకిల్ ఉంటే కాలర్ ఎగరెయ్యడమే! 


ఇంతకీ అప్పట్లో నాకు  హంబర్ సైకిల్ ఉండేది. ఇహ చూడండి. నా వైభోగం. ఊరంతా రయ్యిరయ్యిమని తిరిగెయ్యడమే! 


ఒహటి రెండు సార్లు మా నాన్నకి కొంతమంది (నా లాగ స్పీడుగా సైకిల్ తోక్కలేని వృద్ధులు!) కంప్లైంట్ చేసేవాళ్ళు! "మీ అబ్బాయి ఈ మధ్య సైకిల్ మరీ స్పీడుగా తొక్కుతున్నాడు" అని! మా నాన్న దాన్ని చాలా లైట్ తీసుకోని "మీ పిచ్చి కాని, కుర్రాళ్ళు కాకపోతే మనం తొక్కుతాముటండీ స్పీడుగా" అని సుతారంగా వాళ్ళ కంప్లైంట్ ని బుట్ట దాఖలు చేసేవాళ్ళు! ఆ మాట నా చెవిని పడగానే నేను మరీ రెచ్చిపోయి శాయశక్తులా వీర స్పీడుగా సైకిల్ తొక్కడం మొదలెట్టా!


నాకు సైకిల్ ఎలా వచ్చిందంటే నేను తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు సైకిల్ కొన్నారు మా నాన్న! నిజానికి అయన కోసమే కొనుక్కున్నారు కానీ కొన్న రెండు నెలలకే ఆయనకి సబ్ జడ్జి నుంచి డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోషన్ తో పాటు గుంటూరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కుటుంబాన్ని అమలాపురంలోని వదిలేసి తను ఒక్కరు వెళ్లిపోయారు.ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో మేము నలుగురు పిల్లలం ఊరు మారడం కష్టం కాబట్టి. సైకిల్ వదిలేసి వెళ్లారు! అలా వారసత్వం టైపులో నాకు దక్కింది ఆ సైకిల్.  అప్పుడు చూడాలి నా మొహం! పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది! అది కొన్నప్పుడు షాపుకి నేను వెళ్ళాను. నిజానికి సైకిల్ పార్ట్శ్ అన్నీ మనం కొన్నప్పుడు షాప్ వాడు బిగించి సైకిల్ చేస్తాడని అప్పుడే తెలిసింది! వాడు అలా నా(!) సైకిల్ మొత్తం తయారు చేస్తున్నప్పుడు నేనలా తన్మయత్వంతో చూస్తూ తెగ ఆనంద పడిపోయాను! 


దానికొక చుక్కల చుక్కల బ్లూ కలర్ సీట్ కవర్ వేయించాను. దాంట్లో కొంచం స్పాంజ్ ఉండి కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ఉండేది. ట్రింగ్ ట్రింగ్ మనే కొత్త బెల్ 🙂 దాని శబ్దం వినడానికి చాలా బాగుండేది. అందుకని ఎవరూ అడ్డు లేకపోయినా అప్పుడప్పుడూ ఆ బెల్ గణగణమనిపించేవాడిని! అల్ప సంతోషిని కదా!!


సైకిల్ నా పరం అయ్యిన దగ్గరినించీ అన్ని బైటి పనులు అంటే కూరలు తేవడం, రోజూ పొద్దున్నే పాలవాడి దగ్గరకి వెళ్లి పాలు కాన్ లో తేవడం, పచారీ సామాన్లు తేవడం, అక్కలిద్దరినీ బజారుకి తీసుకెళ్లడం (ఇద్దరినీ ఒక్కసారి కాదండోయ్! విడివిడిగా!!), అప్పుడప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా, ఇలా ఒహటేమిటి నానా గోత్రస్య అన్ని పనులకి నేను, నా సైకిల్ ఎవరెడీ 😉


తదుపరి మేమంతా కూడా గుంటూరు వచ్చేసాం. కానీ మా నాన్న జిల్లా జడ్జిగా సైకిల్ తొక్కడం బాగోదని పదివేలు పెట్టి సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. కానీ అప్పుడప్పుడూ వెరైటీగా ఆఫీస్ కి సైకిల్ తొక్కుకుని వెళ్ళేవారు! ఆయన సైకిల్ తొక్కుతూంటే ముందర కారు డ్రైవర్ తనో సైకిల్ మీద, వెనకాల డవాళ బంట్రోతు ఇంకో సైకిల్ మీద!


ఆ మధ్య పేపర్ లో చదివాను! కొన్ని వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్ళు నడిపుతూ దొరికి పోయారుట హైదరాబాద్ లో! 


ఆ రోజుల్లో మా లాంటి కుర్రాళ్ళని కూడా పోలీసులు భారీ ఎత్తుని పట్టుకొనే వాళ్ళు. రాత్రి పూట సైకిల్ కి లైట్ లేకుండా తొక్కినా, లేదా డబుల్స్, ట్రిపుల్స్ తొక్కినా! ఆ రోజుల్లో ఆ రెండూ చాల పెద్ద నేరాలు!! 


లైట్ కోసం డైనమో పెడితే టైర్ అరిగి పోతుందని హేండిల్ బార్ ముందు హుక్కుకి బాటరీ లైట్ పెట్టెవాడిని! దాన్ని సాయంత్రం బైటికి వెళ్ళినప్పుడల్లా హేండిల్ బార్ కి తగిలించడం. ఇంటికొచ్చాక తీసి లోపల పెట్టడం! ఇప్పుడు హెల్మెట్ లాగ 🙂 


అప్పుడప్పుడూ ఆ పోలిసుల బారిని పడడం, మర్నాడు మాజిస్త్రేట్ కోర్ట్ లో దోషుల్లా నిలపడి జరిమానా కట్టడం. ఇంట్లో వాళ్లకి తెలియకుండా! 


ఓసారి నా ఫ్రెండ్స్ ఇద్దరినీ ఎక్కించుకుని ట్రిపుల్ రైడింగ్ చేస్తూ శంకరవిలాస్ సెంటర్ కి వెళ్లాను. సెంటర్ ఇంకొంచం దూరం ఉందనగా అక్కడ పోలీసులు ఉంటారని దిగండిరా అని ఫ్రెండ్స్ తో అంటే "మీ నాన్న జిల్లా జడ్జి! నిన్నెవడురా పట్టుకునేది? మేము దిగం" అని భీష్మించుకుని కూర్చున్నారు! ఇహ చేసేదేం లేక సెంటర్ దాకా వెళ్లడం ఏమిటి ఓ పోలీసు కానిస్టేబుల్ గయ్యిమని విజిల్ వేసుకుంటూ మమ్మల్ని ఆపాడు. 


వెంటనే నా ఫ్రెండ్స్ ఇద్దరూ జంప్! నేను మా నాన్న జిల్లా జడ్జి అని చెప్పడానికి మనసు రాక చెప్పలేదు. కానిస్టేబుల్ సైకిల్ తీసుకుని రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వచ్చి జరిమానా కట్టి సైకిల్ విడిపించుకోమన్నాడు!


ఇంకేం చేసేది. ఏడుపు మొహంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళా! మా నాన్నంటే ఆ రోజుల్లో మాకు సింహస్వప్నం. ఆయన నవ్వుతూ పిలిచినా మేము మా జాగ్రత్తలో మేముండేవాళ్ళం. సింహం నవ్వుతోందని వెళ్లి జోకులు  వేస్తామా ఏమిటి?


అందుకని మెల్లిగా మా అమ్మకి చెప్పా సైకిల్ సంగతి. ఎంత పని చేసావురా అని నన్ను తిట్టాక ఇహ తప్పదని వెళ్లి మా నాన్న దగ్గర గొణిగింది. అయన అప్పటికి ఇంకా తీయని సినిమా "జస్టిస్ చౌదరి" టైపు! చట్టానికి న్యాయానికి ముందు కుటుంబం కూడా కనిపించదు! ఆ రోజుల్లో దాదాపు అందరు జడ్జీలు చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు. అలాంటివాళ్లే ఆ సినిమాకి ప్రేరణ!


"రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వెళ్లి చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పి జరిమానా కట్టి రమ్మను! అప్పటికి కానీ బుద్ధిరాదు. ఇహ ముందు ఇలాంటి వెధవ పనులు చెయ్యడు" అని హుకుం జారీ చేసారు! సైకిల్ డబుల్స్ తొక్కడం వెధవ పనా?! హేమిటో?


కానీ మా అమ్మ ఎంతైనా మాతృ హృదయం కదా మర్నాడు పొద్దున్న ఓ బంట్రోతుని కోర్ట్ కి పంపించి సైకిల్ విడిపించింది. 


ఇంకోసారి గుంటూరులోనే  బ్రాడిపేట్ ఓవర్ బ్రిడ్జి కష్టపడి తొక్కి, ఎక్కాను. అటు వేపు దిగడం మొదలెట్టిన వెంటనే ఉంటుంది ఆనందం! అది అనుభవించిన వారికే తెలుస్తుంది! ఒక్కో గజం కిందకి దొర్లుతున్న కొద్దీ సైకిల్ స్పీడ్ ఎక్కువ అవుతూంటుంది. "బ్రిడ్జి దిగడంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుయునులే! భలే భలే!" అప్పుడప్పుడూ అలా బ్రిడ్జి  దిగుతున్నప్పుడు హేండిల్ బార్ వదిలేసి రెండు చేతులు పైకెత్తి హీరో లాగ పోజులు కొట్టిన సందర్భాలు లేకపోలేదు! 


ఇంతకీ అప్పుడేమయ్యిందంటే నాకు ముందు ఒక రిక్షా దాని పక్కనే రెండు సైకిళ్ళు  పక్క పక్కనే వెళ్తున్నాయి! అవి కూడా స్పీడుగానే.. నా సైకిల్ స్పీడ్ చూస్తే ఇంకో 5 సెకండ్లలో వాళ్ళని దాటేస్తాను! వాళ్ళని ఓవర్ టేక్ చేద్దామంటే ఎదురుగా ఒక కారు! బ్రేక్ వేసాను. కాని స్పీడ్ తగ్గలేదు. బ్రేక్ సరిగ్గా పని చేసినట్టు లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది! ఇహ లాభం లేదని బ్రహ్మాస్త్రం బెల్ కొట్టాను! కాని హాశ్చర్యం. విచిత్రం! అది మోగలేదు! దాని పైన ఉండే స్టీల్ డోమ్ కింద ప్లేట్ కి తగులుతోంది. టిక్కు టిక్కుమని నాకే వినిపించని శబ్దం చేసింది !! అయిపోయింది. నేనెళ్ళి వాళ్ళని గుద్దెయ్యడమే మిగిలింది. 


అంతే బుర్ర పాదరసంలా పని చేసింది!! వెంటనే నేనొక పని చేసాను. అదేమిటంటే వెంటనే గట్టిగా "బెల్! బెల్!" అని అరిచాను. అంతే వెంటనే నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అదేదో బుల్ అన్నట్టు వినిపించిందేమో ఎటువాళ్ళు అటు పారిపోయి నాకు రహదారి రాచమార్గం చేసారు! వాళ్ళ మధ్యలోంచి పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూసుకెళ్లినట్టు దూరిపోయి వెళ్ళిపోయా స్పీడుగా!


ఈ సైకిల్ తో ఇంకా చాలా మధుర స్మృతులున్నాయి. మరింకెప్పుడైనా చెప్తా. 


సైకిల్ AI  సౌజన్యంతో 


Saturday, May 19, 2018

My college days!

నా యవ్వనం వృధా అవ్వడానికి , తదుపరి ఒకింత, ఒక్కరవ్వ నా జీవితం ఇలా ఉండడానికి కారణం నా నాన్న !

నమ్మలేని నిజం ! అసలేం జరిగిందంటే .... చెప్తా . వినండి ... అదేనండి ... సదవండ్రి

నాలుగు దశాబ్దాల పై చిలుకు సంఘటన! నేను యవ్వనంలోకి , కాలేజీ లోకి అడుగు పెట్టాను . ఈ యవ్వనంలోకి అడుగు పెట్టడం అన్నది ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రకృతి సహజంగా జరిగిందనుకోండి . కానీ ఈ కాలేజీ లోకి అడుగు పెట్టడం అన్న దగ్గరే ఆదిలోనే హంసపాదు.

మా ఊళ్ళో అంటే అప్పుడు గుంటూరులో బోల్డు కాలేజీలు ఉన్నాయి. కానీ నా నాన్న నన్ను హిందూ కాలేజీ లో తీసుకెళ్లి పడేసారు! కుర్రాణ్ణి కదా ఎదురు తిరగకుండా నోరు మూసుకొని జాయిన్ అయ్యాను. అయ్యాక తీరా చూస్తే ఏముంది? తీవ్ర నిరాశ.. ఎందుకంటే హిందూ కాలేజీ కేవలం అబ్బాయిలకే. యవ్వనంలోకి అడుగుపెట్టిన అబ్బాయికి ఇంతకంటే చిత్ర హింస ఏమన్నా ఉంటుందా చెప్పండి . ఆ కాలేజీ కి కేవలం అరకిలోమీటర్ దూరంలో AC కాలేజీ కో ఎడ్యుకేషన్. బోల్డు మంది అమ్మాయిలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది . నన్ను ఆ కాలేజీ లో జాయిన్ చేసి ఉంటె నా చదువు చట్టబండలు అయ్యేది కాదు, నా జీవితం కేవలం హై సెకండ్ క్లాస్ కి పరిమితం అయ్యేది కాదు .

ఇహ అలా బోల్డు రోజులు నిరాశ, నిస్పృహలతో బాధపడి, భారంగా నిట్టూర్చి, ముక్కు చీదేసి, కళ్ళు తుడిచేసుకుని తదుపరి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని అలోచించి, ఒక భారీ నిర్ణయం తీసుకున్నాను

అదేమిటంటే రోజూ మా కాలేజీకి వెళ్లి అటెండన్స్ పలికేసి ఫస్ట్ రెండు పీరియడ్స్ కి, వెంటనే నేను నా ఆప్త మిత్రుడు చెరో సైకిల్ మీద అలా తొక్కుకుంటూ, మా అవస్థని తిట్టుకుంటూ ఆ AC కాలేజీ పక్కనే మా కాలేజీ మగ విద్యార్థుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన కేవలం అమ్మాయి కాలేజీ చుట్టూ భూమి చుట్టూ శాట్లైట్ తిరిగినట్టు అలా స్లో మోషన్ లో సైకిల్ తొక్కుతూ, అప్పుడప్పుడూ తొక్కకుండా సైకిల్ ని స్టైల్ గా ఒక చేత్తో పట్టుకుని హుందాగా నడిపిస్తూ, నడుస్తూ ఆ కాలేజీ అమ్మాయిల వేపు దొంగ చూపులు చూస్తూ రోజులు వెళ్ళబుచ్చాలని!

ఇహ అప్పటినించీ అయిదు సంవత్సరాలు అదే పని. మరి హై సెకండ్ క్లాస్ వచ్చిందంటే రాదా? అదే అమ్మాయిలున్న కాలేజీ లో పడేస్తే క్లాస్ రూంలో బల్లల్లా ఎప్పుడూ అక్కడే పడుండేవాళ్ళం కదా? అలా పడున్నప్పుడు ఒకప్పుడు కాకపొతే ఒకప్పుడైనా టెక్స్ట్ పుస్తకాలు అలా క్రీగంట అయినా చూసే వాళ్ళం కదా? అలా రోజూ క్రీగంట చూస్తే సంవత్సరానికి బోల్డు గంటలు అలా పుస్తకాల వేపు చూసి చూసి కొంత అయినా మ్యాటర్  మన బుర్రలోకి ఎక్కి ఆ హై సెకండ్ క్లాస్ కాస్త జస్ట్ అత్తెసరు ఫస్ట్ క్లాస్ గా మారుండేది కదా. అప్పుడు లైఫ్ అంతా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నోయ్ అని చెప్పుకునే వాడిని కదా? ఇన్ని "కదా"లు కేవలం "కదా"లు గానే ఉండిపోయి నా కధ మారింది .

సరే ఎలాగూ నా యవ్వనం అడవి కాచిన వెన్నల అయిన వైనం తెలిసిపోయింది కాబట్టి ఆ "మధుర రోజులు" గురించి మరిన్ని విశేషాలు..

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. అమ్మాయిల చూట్టూ తిరగడం అన్నది కేవలం యవ్వనంలో ఉన్న అబ్బాయిల లక్షణమే కాదు, అమ్మాయిలకి కూడా అబ్బాయిలని "కసిగా" చూడాలని ఉండేది! కాకపొతే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నంత "స్వాతంత్రం" లేదు కాబట్టి వాళ్ళు కూడా అలా వాళ్ళ కాలేజీ చూట్టూ తిరిగే శాట్లైట్ అబ్బాయిలని దొంగ చూపులు చూసేవాళ్ళు. మేము వాళ్లలో మాకు తరుచుగా కనిపించే అమ్మాయిలకి బోల్డు పేర్లు పెట్టేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు పేరు అన్నమాట. ఒకళ్ళని "తింగరి" అని, ఇంకోళ్ళని "మిస్ ఇన్నోసెన్స్" అని అలా. మరి వాళ్ళు మాకేం నిక్ నేమ్స్ పెట్టేవాళ్ళొ చరిత్రలో మరుగున పడిపోయిన నిజం.

ఓ సారి ఓ అమ్మాయి ఒంటరిగా చేతిలో బోల్డు బుక్స్ పట్టుకుని (ఆ రోజుల్లో అమ్మాయిలు ఎడం చెయ్యి సగానికి మడిచి పుస్తకాలు పట్టుకునేవాళ్ళు) అలా, అలా వీలయ్యినంత వయ్యారంగా నడుస్తూ వెళ్తూంటే మేము వెనకాల ఓ పదడుగుల దూరంలో (సేఫ్టీ ఫస్ట్ యు నో ) సైకిల్ నడిపించుకుంటూ వెళ్తూంటే నా ఫ్రెండ్ కి ఒకింత ధైర్యం వచ్ఛేసి, ఎందుకంటే రోడ్ అంతా ఖాళీ, చిన్నగా ఓ పాట వాడి కాకి గొంతుతో పాడడం మొదలెట్టాడు. నాకు కాళ్ళు వణకడం మొదలయ్యింది. వీడేటి ఇలా రెచ్చిపోతున్నాడని. ఆ పాట "నీ అందాల చేతులు కందేను పాపం.. ఎందుకు ఆ బెడద" అంతదాకా పాడాడో లేదో ఆ అమ్మాయి సర్రున చిరంజీవి వెనకాల వస్తున్న రౌడీలని కొట్టడానికి తిరిగినట్టు అంత ఫాస్ట్ గా తిరిగింది. నాకప్పుడు చేతులు కూడా వణకడం మొదలయ్యింది. వెనక్కి తిరిగి "ఏం మోస్తావా? రా"! అంది. ఖర్మ. మా వాడు పెట్టుకోక పెట్టుకోక  ఓ ఆడ రౌడీతో పెట్టుకున్నాడు. ఈ హఠాత్  సంఘటనకి ఇద్దరం ఓ రెండు సెకండ్లు షాక్ లోకి వెళ్లి, కోమాలోకి జారే లోపలే విపత్కర పరిస్థితుల్లో బుర్ర పాదరసంలా పని చేసి, వెంటనే చిరంజీవి కంటే స్పీడు గా సైకిల్ మధ్య రాడ్ ఒక చేత్తో పట్టుకొని సైకిల్ పైకెత్తి వెనక్కి తిప్పి, రెండో సెకండ్ లో మళ్ళీ చిరంజీవి గుర్రం మీదకి ఎగిరినట్టు సైకిల్ మీదకి ఎగిరి, మూడో సెకండ్ లో సైకిల్ తొక్కడం మొదలెట్టి నాలుగో సెకండ్లో ఆ వీధి చివరికి చేరి టర్నింగ్ కొట్టి ఓ రెండు కిలో మీటర్లు తొక్కి తొక్కి అప్పటికి గుండె కొట్టుకునే స్పీడ్, ఇహ తొక్కలేక మా సైకిల్ స్పీడ్ తగ్గాక ఆగి ఓ హోటల్ లోకి వెళ్లి కూలపడి ఓ వన్ బై టు స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసి అదొచ్చేలోపల నా ఫ్రెండ్ ని నాకు ఆ రోజుల్లో వఛ్చిన, విన్న అన్ని బండ బూతులు ఊపిరి పీల్చకుండా తిట్టి, తర్వాత ఆ కాఫీ తాగి మామూలు మనిషిని అయ్యాను. (చిరంజీవితో పోల్చాను కానీ ఆ రోజుల్లో చిరంజీవి కూడా అప్పుడే సినిమాల్లో అడుగు పెట్టారు!)

ఆ రోజుల్లో కుంచం ధైర్యం చేసి ఎవరన్నా అమ్మాయితో స్నేహం చేద్దామని ప్రయత్నిస్తే ఆ అమ్మాయి "ఛీ ఫో" అంటే లైట్ గా తీసుకొని, దులిపేసుకొని నువ్వే ఫో అని మనసులో అనుకోని, ఈ జగదేక సుందరి కాకపొతే ఇంకో అతిలోక సుందరి అనుకోని ఇంకో అమ్మాయి వెనకాల పడేవాళ్ళం. అంతే కానీ ఇప్పటి అబ్బాయిల్లాగా అలా ఒప్పుకొని అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, వాళ్ళని పబ్లిక్ లో చంపెయ్యడం గిసుంటి "పిదప కాలం, వెధవ బుధ్ధులు, చేష్టలు" చేసే వాళ్ళం కాదు. ఏం చేసినా కేవలం సరదాకే.

ఇంకోటండోయ్! ఆ రోజుల్లో కుర్రకారు అమ్మాయిలని "కలర్" అనేవాళ్ళు! దీనిఆరిజిన్ నాకు తెలీదు. కానీ మా ముందు తరాల అబ్బాయిలని గౌరవిస్తూ మేము కూడా అలా "కలర్" సాంప్రదాయాన్ని గౌరవించాం!

ఇంతకీ మోరల్ అఫ్ ది స్టోరీ ఏమిటంటే అప్పుడప్పుడూ తెలిసీ తెలియని పిల్లల యవ్వనం, భవిష్యత్తు వాళ్ళ తల్లితండ్రులు తెలీకుండా అనుకోకుండా పాడు చేస్తారు!

Saturday, June 25, 2016

హుస్సేన్ సాగర్!! Hussain Sagar!!



నా కాలేజ్ జీవితం అంతా గుంటూరు లో వెలగపెట్టాను. ఆ రోజుల్లో దసరా సెలవులకి , వేసవి  సెలవులకి  విజయవాడ కి వెళ్లి అక్కడున్న ఫ్రెండ్ తో ఒకటో, రెండో రోజులు గడపడం అలవాటయ్యింది . అలా వేసంకాలంలో వెళ్ళినప్పుడు పాపం కృష్ణా నదిలో నీళ్లు బొత్తిగా ఉండేవి కావు .. బ్రిడ్జి కి ఇవతలి వేపు అనుకోండి!! అప్పుడు నేను నా ఫ్రెండ్ ఎంచక్కా కృష్ణలో ఈ చివరి నించి నడుచుకుంటూ  ఆ చివరికి వెళ్లి, కాళ్ళు  నొప్పెట్టి కూసింత సేపు రెస్ట్ తీసుకొని, సొల్లు కబుర్లు అన్నీ అయ్యాక (అంటే పెద్దయ్యాక ఏ ఉద్యోగం రాకపోతే వేసంకాలంలో అటు చివర పల్లీలు అమ్ముకుంటే మాలాగా ఇలా వాహ్యాళికి వచ్చే వాళ్లకి అమ్మి  బాగానే సంపాదించచ్చు లాంటి ఆలోచనలు అన్నమాట!)  మళ్లీ ఈ చివరికి నడుచుకుంటూ వఛ్చి ఒక పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం . నిజానికి అది ఘనకార్యమే! మీలో ఎంతమంది అలా ఏ నదిలోనైనా  అడ్డంగా నడిచారు ?! చాలా కొద్ధిమందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం అది.

పైన రాసింది పీఠిక (అంటే కరెక్ట్ అర్ధం తెలీదు కాని బహుశ నేను అనుకున్నఅర్ధమే  అయ్యుంటుందని ప్రగాఢ విశ్వాసం!)

ఇహ అసలు విషయంలోకి వస్తే

అలా నా కాలేజీ ప్రహశనం అయ్యిన వెంటనే రెండో వారానికి హైదరాబాద్ వచ్చాను. ఎందుకు? షరా మామూలే! కూటికోసం! కూలి కోసం!!

వచ్చిన కొత్తల్లో నాకు ఈ హుస్సేన్సాగర్ భలే గమ్మత్తుగా అనిపించేది. ఊరి మద్యని కొలనులా! ఆ రోజుల్లో ఈ నగరం పేరుకే నగరం కాని సాయంత్రం పూట కాసీపు తిరగడానికికాని, చూడ్డానికి కాని ఏమి ఉండేవి కావు. ఇదిగో ఈ సాగరం, దాని ఒడ్డు ట్యాంక్ బండ్ తప్ప!! ఆదివారాల్లో అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఈ ట్యాంక్ బండ్ మీద కాసీపు తిరిగి కాళ్ళు పీకాక కూర్చోడానికి బెంచ్ కోసం చూసేవాళ్ళం! పెద్ద బెంచ్ మీద కొత్తగా పెళ్ళైన జంటలు ఓ మూల కూర్చొని కిచకిచలాడుతూ   కనిపించేవాళ్ళు. ప్రేమికులు ఆ రోజుల్లో అంత బహిరంగంగా తిరిగే వాళ్ళు కాదు. ఏ చెట్టు చాటునో, పొదల మాటునో సెటిల్ అయిపోయేవాళ్ళు!  ఈ బెంచ్ మీదున్న జంటలు ఎప్పటికీ లేచిపోరే (ద్వందార్ధం  దురదృష్టం!) ఎంతసేపు మేమలా నిలువు జీతం. ఇహ లాభం లేదని బెంచ్ ఒక చివర ఒకళ్ళం కూర్చునేవాళ్ళం. మిగతా వాళ్ళం వాడికి ఎదురుగా ఆ రైలింగ్ ఆనుకొని తెగ కబుర్లు, జోకులు, నవ్వులు. కావాలని బాగా ఓవర్మా ఆక్షన్ చేసేవాళ్ళం. మా బాధ పడలేక, చూడలేక, భరించలేక ఆ కొత్త జంటలు అయిదు నిమిషాలు తిరక్కుండా లేచిపోయేవాళ్ళు!! అరబ్బీవాడు, ఒంటె కధ టైపులో మా Mission accomplished ;)

అలా సొల్లు వాగుతున్నప్పుడు ముందు ముందు జీవితం వెండితెర మీద  ఎలా ఉంటుందో , ఎవరికి ఏ  ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు పెళ్లిళ్లు  అయ్యి మేము కూడా ఇలా ఈ బెంచ్ మీద కూర్చుంటామో,  ఇలాంటి అంతులేని జవాబు తెలీని ప్రశ్నలు అన్నీ చర్చించేవాళ్ళం! మాకు పెళ్ళయ్యి ఇలా బెంచ్ మీద కూర్చున్నప్పుడు, మాలాంటి కుర్రకారు మా స్ట్రాటజీ ఉపయోగిస్తే మట్టుకు చస్తే లేవకూడదు అని కూడా ఒక సామూహిక నిర్ణయం తీసుకున్నాం!

ఇంతకీ అలా ఆ బెంచ్ మీద సెటిల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు  నాకు నా కాలేజ్ రోజుల అలవాటు గుర్తొచ్చి ఓ చిలిపి ఆలోచన వచ్ఛేది . ఈ హుస్సేన్సాగర్ లోతు ఎంత ఉంటుంది . నీళ్లన్నీ ఎండిపోతే కింద ఎలా ఉంటుంది . ఎప్పుడైనా అలా నీళ్లన్నీ ఎండిపోతే ఎంచక్కా ఈ చివరినించి ఆ చివరికి వాకింగ్ చేస్తే మజా వస్తుంది కదా అని ! కానీ అన్ని నీళ్లు ఎప్పుడు ఎండాలి ? నా చిన్ని కోరిక ఎప్పుడు తీరాలి ? సో ఆ కోరిక నా తీరని కోరికల లిస్టు లో అగ్రతాంబూలం పుచ్చుకుంది.

ఇప్పటిదాకా ఇది ఉపోద్ఘాతమే!!

ఇహ మరికొంచం ముందుకి అంటే ఓ రెండేళ్ల క్రితానికి వస్తే  కేసీర్ గారికి కూడా నాలాంటి కోరిక ఉన్నట్టుంది ! ఒక్కసారి సడెన్ గా హుస్సేన్సాగర్ నీళ్లు మొత్తం ఖాళీ చెయ్యిస్తానని ప్రకటించారు! ఆ రోజు చూడాలి నా మొహం! నా మొహంలో దాచినా దాగని ఆనందం!! మనమేదో అనుకుంటాం కానీ నిజంగా మనకి నిస్వార్ధ మైన చిన్ని చిన్ని కోరికలుంటే అవి ఎప్పటికైనా తీరుతాయి! ఆహా నా కల ఇన్నాళ్ళకి, ఎన్నేళ్ళకి తీరబోతోంది .  ఆ వార్త చదివిన వెంటనే ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఓ రెండు నిమిషాలు gangnam డాన్స్ కూడా చేసాను.  ఎంచక్కా ఆ నీళ్లన్నీ తోడేశాక హాయిగా పురప్రజలం అందరం సాయంత్రం పూట  అందులో అటూ, ఇటూ వాకింగ్ చేస్తూంటే రెండు కళ్ళూ చాలవు చూడ్డానికి .

నీళ్లన్నీ తీసాక అందులో ఇంకేమి నిధి నిక్షేపాలు బైట పడతాయో ? ఆస్తి పంజరాలు, మోటార్ సైకిళ్లు, కార్లు  వగైరా కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ;) 

ఆ వార్త చదివిన దగ్గర్నించీ ఇప్పటిదాకా ఒక ఏణ్ణర్ధం నించీ కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు  చూస్తున్నా! అబ్బే. ఆ  నీళ్లు ఖాళీ చేసే ప్రయత్నాలు అసలు మొదలెడితేగా ? ఓ వందమందిని పెట్టి బకెట్ లతో ఖాళీ చేయించినా ఈపాటికి సగం నీళ్ళు ఖాళీ అయ్యేవి. అసలు  ఖాళీ చెయ్యడం మాట పక్కన పెట్టి,  ఆ మురికి నీళ్లని క్లీన్ చెయ్యడం కోసం కొత్త మెషిన్ ఒకటి తెప్పించారు . నాకు అర్ధం కానిది ఒకటే. ఎలాగూ మొత్తం నీళ్లన్నీ  ఖాళీ చేస్తామన్నారు కదా మళ్లీ ఈ లోపల ఆ పారబోసే నీళ్ళని బోల్డు డబ్బులు ఖర్చు పెట్టి శుద్ధి చెయ్యడం ఎందుకో ?! అయినా సామాన్య ప్రజలకి ఇలాంటి క్లిష్టమైన విషయాలు ఎలా అర్ధం అవుతాయి? ఇందులో ఏదో మనం అర్ధం చేసుకోలేని మర్మం ఉండే ఉంటుంది. 

అయినా నాకిప్పుడు ఆ మాయ, మర్మం అవేమీ అఖ్ఖర లేదు. నేనెప్పుడో మర్చిపోయిన నా చిన్ని కల, కోరికని మళ్లీ రేకెత్తించారు!! నాలో లేనిపోని ఆశలు కల్పించారు.  అంతలోనే దానిమీద ఆ హుస్సైన్సాగర్ నీళ్ళు పోసి ఆర్పేశారు! ఐ హర్టెడ్ . 

నాక్కావలసిందల్లా మన హుస్సేన్సాగర్ ని ఎప్పుడు ఖాళీ చేస్తారు ? 

నేను అందులో ఆ చివరినించి ఈ చివరికి నడిచి, మధ్యలో బుద్ధుడి దగ్గర పిట్ స్టాప్ వేసి నా వెనకాల ఆయన కనిపించేట్టు సెల్ఫీ  ఎప్పుడు తీసుకుంటాను?    

లేదా ఈ నీళ్లు ఖాళీ చేసే పధకానికి నీళ్లు వదులుకోవాల్సిందేనా ?

నోట్! షరా మామూలే! ఈ బేతాళ ప్రశ్నలకి సమాధానం  తెలియకపోయినా, తెలిసి చెప్పకపోయినా, ఏమీ కాదు!

ఇలాంటి జవాబు లేని, తెలీని, ఎవర్నీ అడగలేని ప్రశ్నలు ప్రజల దగ్గర ఎన్నో? ఎన్నెన్నో?