Showing posts with label vegetables. Show all posts
Showing posts with label vegetables. Show all posts

Thursday, October 27, 2016

Breathless!

BREATHLESS!!

హైదరాబాద్ లో సూపర్ మర్కెట్ లో కూరలు ఏరుకొన్నాక అవి వెయ్యడానికి పక్కనే ఉన్నరోల్ లో ప్లాస్టిక్ కవర్ చించి దాన్ని అటు పక్కకి, ఇటు పక్కకి, పైకి, కిందకి, చివరిగా 360 డిగ్రీల్లోనూ విపరీతంగా నలిపి ఇక మనవళ్ళ కాదని ఒక డెసిషన్ కి వచ్చేసి దగ్గరలో ఎవరన్నా సేల్స్ గర్ల్ ఉందేమోనని అన్ని వేపులా వెదికేస్తూ, చేతులు ఖాళీగా ఉండడం ఎందుకని నలపడం కంటిన్యూ చేస్తున్నప్పుడు, చివరికి ఒక సేల్స్ గర్ల్ అల్లంత దూరంలో కనిపించగానే మనం మూగవాడిలాగా చేతుల్లో ఉన్న ఆ విసిగిస్తున్న కవర్ వాళ్ళ దృష్టిలో పడేట్టు చెయ్యగానే ఆ అమ్మాయి మాకివన్నీ మామూలే "చస్తున్నాం ఈ చేతకాని మగాళ్ళతో" అన్నట్టు మన వేపు కొంచం జాలిగానూ, వెటకారంగానూ చూస్తోందేమోనన్న అనుమానం మనల్ని కుళ్ళపొడిచేస్తూంటే, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఎందుకొచ్చామురా బాబూ ఈ షాపింగ్ కి అని మనల్ని మనమే తిట్టేసుకుంటూ ఉంటే, ఆ సదరు సేల్స్ గర్ల్ పెళ్లి కూతురు లాగా కాట్ వాక్ చేస్తూ మన దగ్గరకి వస్తూంటే ఆమెని మధ్యలో ఇంకో కస్టమర్ ఆపితే, వాళ్ళిద్దరినీ విడిగానూ, జమిలిగానూ తిట్టుకుంటూ, కవర్ నలపడం కంటిన్యూ చేస్తూంటే, అలా సేల్స్ గర్ల్ వేపే చూస్తూండడం బాగోదేమోనని కాస్త చూపు పక్కకి తిప్పగానే మనకి ఎదురుగా మనలాంటి ఇంకో మగజీవి అదే మనలాంటి అసహాయ వీరుడు, నిస్సహాయ శూరుడు మనలాంటి బాధే పడుతూ అదే టైం కి ఆతను కూడా మనల్ని చూసి, ఇద్దరం పరస్పరం ఓ వెర్రి నవ్వు నవ్వుతూంటే, వెంటనే మన కళ్ళ ముందు ఒక మెరుపు మెరవకుండానే, ఈ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చెయ్యలేకపోవడం అన్నది కేవలం మన ఒక్కళ్ళ పురుషత్వానికి మాత్రమే అగ్ని పరీక్ష కాదని, పెపంచికంలో ఉన్న యక్ష కిన్నర కింపురుష పుంగవులందరికీ పరిక్షని, కాబట్టి మనం మనల్ని కించ పరుచుకోనవసరం లేదని ఒక యూనివర్సల్ ట్రూత్ అర్ధం అయ్యి యురేకా అని కేకెట్టబోయి, అలా కేకెడితే తర్వాత రైలులో చైన్ లాగిన వాడిలాగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సోస్తుందని అరక్షణంలో తట్టి, ఆ కేకని గొంతులోనే నొక్కేసి, ఆ ఆనందం ఎలా బైట పెట్టాలో తెలీక బైటికి ఒక చిన్న చిరు మందహాసంగా వెలువడితే, ఈ లోపల ఇంకోపక్కనించి ఇంటావిడ ఇంకో నాలుగు కూరలు ఏరేసి, ఏమిటీ ఇంకా ఒక్క కవర్ కూడా ఓపెన్ చెయ్యలేదా? పెద్ద మగాడిలా పోజులు కొడతారు ఈ మాత్రం చెయ్యలేరా అన్న అర్ధం వచ్చేలా మన వేపు ఒక చూపు చూస్తే, తట్టుకోలేక, పబ్లిక్ గా తిట్టుకోలేక, మన అసహాయతకి మనల్ని మనమే తిట్టేసుకుంటూ, అసలు ఈ తొక్కలో ప్లాస్టిక్ రోల్ టెక్నాలజీ ఏ దిక్కుమాలిన వాడు కనిపెట్టాడు అని తెలీని, కనిపించని వాడిని విపరీతంగా తిట్టేసుకుంటూ, ఈ లోపల ఆ పెళ్లికూతురు అదేనండీ ఆ సేల్స్ గర్ల్ మనల్ని కరుణించి మనదగ్గరకొచ్చి ఆ కవర్ ఇటివ్వండి అన్నట్టు చెయ్యి చాపగానే, మనం అప్పటిదాకా నలిపిన కష్టానికి ప్రతిఫలంగా, చిల్లర దేవుడు కరుణించి ఆ కవర్ టక్కున ఓపెన్ అయితే రెస్ట్ తీసుకోకుండా ఎవరెస్ట్ ఎక్కినవాడిలా ఆహా ఎంత ఆనందం!!

ఈ మధ్య కొన్ని సినిమా పాటలు Breathless గా పాడడం అన్న ట్రెండ్ ని రాయడంలో చూపించడానికి నే చేసిన విచిత్ర ప్రక్రియ. మీరు కూడా ఆసాంతం ఊపిరి పీల్చకుండా, పీలిస్తే వదలకుండా చదవడానికి ప్రయత్నించండి!!

Tuesday, February 16, 2016

Newspaper boy!!

నాకు మూడ్ వచ్చినప్పుడు, ఈ మనుషుల మీద, సంఘం మీదా, నా జీవితం మీదా బాగా కోపం వచ్చినప్పుడు, అప్పుడప్పుడూ మా ఆవిడకి ఒకింత సాయం చేద్దామన్న కోరిక పుట్టినప్పుడు, వంట చేసి పారేస్తూంటాను! అంటే వండినదంతా పారేస్తానని అపార్ధం చేసుకోకండి!

ఇవాళ పొద్దున్నే అలా వంట చేద్దామని డిసైడ్ అయిపోయాను! ఎందుకో? అని మీరడిగినా చెప్పను... కాన్ఫిడెన్షియల్.. క్లాసిఫైడ్ కూడా.  మీ ఊహాగానాలు మీరు చేసేసుకోవచ్చు!!

ముందస్తుగా కొబ్బరి పచ్చడి, పచ్చడి పచ్చడిగా చేసేసా! ఆ తర్వాత దొండకాయలని కసా పిసా నరకడం ... క్షమించాలి ... తరగడం మొదలెట్టా! ఏ మాటకామాటే! ఎవరి మీదైనా బాగా కోపం వస్తే ఆ కోపం అంతా ఆ కూరలు మాంచి కసిగా తరగడంతో తగ్గిపోతుంది ;) (Cooking is therapeutic!! Anger management tip!!) సరే అలా కసి కసిగా, కసా, పిసాగా తరుగుతూంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు! మా ఆవిడ బిజీ గా ఉండడంతో నేనే సిరికిం చెప్పడు స్టైల్ లో వెళ్లి చూసాను. పేపర్ అబ్బాయి బిల్ కోసం వచ్చాడు.

ప్రతి నెల అతను పేపర్ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఎప్పుడూ నా కంప్లైంట్, అతను చెప్పే సమాధానం ఒకటే :( పేపర్ ఈ మధ్య బాగా అలీసంగా వేస్తున్నారు, అప్పుడప్పుడూ సప్లిమెంట్ వెయ్యటం లేదు అని. ఆ ముందు రోజే DC సప్లిమెంట్ వెయ్యలేదు. మెయిన్ పేపర్ వెయ్యకపోయినా క్షమిస్తాను కాని సప్లిమెంట్ వెయ్యకపోతే మట్టుకు క్షమించను. ఎందుకంటే నేను పేపర్ న్యూస్ హెడింగ్స్ చూసేసి, అడ్వర్టైజ్ మెంట్స్ కూసింత నిశితంగా పరిశీలించి వెంటనే సప్లిమెంట్ చివరి పేజీల్లోకి వెళ్ళిపోతా! అక్కడ ముందస్తుగా దినఫలం చదువుతా. ఒక్క రోజైనా బాగుంటుందని రాస్తాడేమోనని. అబ్బే ఆ అదృష్టం ఎప్పుడో కాని ఉండదు. అది చదివి డీలా పడిపోయి వెంటనే "మూడ్" లోకి రావడానికి పక్క పేజీలో డెన్నిస్ కార్టూన్ చూస్తా. వెంటనే మంచి మూడ్ లోకి వచ్చేస్తా. ఆ తర్వాత ఒక కాఫీ తాగుతూ రెండు సుడోకూ పజిల్స్ పూర్తి చేస్తా.

అసలే నిన్ననే సప్లిమెంట్ వెయ్యలేదేమో మాంచి కోపంగా కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకో అతని మొహంలో ఈ సారి ఒకింత భయం కనిపించింది! ఈ సారి ప్రతి సారి రొటీన్గా చెప్పే "రోజూ వచ్చే పిల్లగాడు రాలేదు సార్! కొత్తబ్బాయి"  అనే జవాబు చెప్పలేదు :( అసలు నోటమాట రావటం లేదు అతనికి. అదేదో హింది సినిమాలో షారుక్ లాగా "బిబిబిబి ... బిల్" అన్న మాటలు అతి కష్టం మీద అతని నోటినించి వచ్చాయి. ఎందుకలా అయిపోయాడో నాకర్ధం కాలేదు.

సరే ఎందుకైతే నాకెందుకు డబ్బిచ్చి పంపించేద్దామని హల్లోకొచ్చి బీరువాలో పర్స్ తియ్యబోతే ... అదిగో! అప్పుడర్ధం అయ్యింది..

కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీ, కృష్ణం రాజుతో "ఇదిగో ఇక్కడే! ఇక్కడేనండి పోయింది!" అంటే కృష్ణం రాజు "పోతే పోనీలే! కృష్ణా! మళ్ళీ కొనుక్కోవచ్చులే" అని ఎలా అపార్ధం చేసుకున్నాడో ఆ టైపులో నేను కూడా అపార్ధం చేసుకున్నా ఆ న్యూస్పేపర్ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించాడో!!

ఎందుకు!... 
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... . 
.... .
.... .
.... .
.... .
.... .
.... .

ఎందుకంటే పర్స్ తియ్యబోయిన నా కుడిచేతిలో అయిదంగుళాల కత్తి ఉంది!! దొండకాయ తరుగుతూ అలా .. "సిరికిం చెప్పడు" అని మీకు క్లూ ఇచ్చా!...  వచ్చానేమో చేతిలో పొడుగు కత్తి, కట్టిందేమో గళ్ళ లుంగీ!! అచ్చు "కత్తుల రత్తయ్య" టైపు లో కనిపించాను పేపరబ్బాయికి ;) మరి భయపడ్డాడంటే .. పడడా?!!