Thursday, November 11, 2021

వేరుశెనగ తొక్క

 సెలవుల్లో చేతిలో కెమెరా ఉంటే ఇదిగో ఇలాంటి కళాఖండాలు తీస్తాం!




ఇదేటి తొక్కలో ఫోటో అని తీసి పారేయకండి 


భావుకత, సృజనాత్మకత ఉండాలి కానీ కాదేది భార్యని ప్రసన్నం చేసుకోడానికనర్హం!


ఎలా అంటారా?


ముందస్తుగా ఈ ఫోటోని నాకు తగినంత పారితోషికం ఇచ్చి కొనుక్కోవాలి. తర్వాత దాన్ని ఎంత పెద్ద సైజు వీలయితే అంత పెద్ద ప్రింట్ తీసి అందమైన ఫ్రేమ్ కట్టించి మీ డ్రాయింగ్ రూమ్ లో మంచి నదరుగా ఉన్న మేకుకి వేళ్ళాడదియ్యాలి. 


అంతే! మీ ఆవిడకి మీమీదున్న ప్రేమని 2x పెంచచ్చు. 


హేమిటి సార్? మరీ అతి చేస్తున్నారు. వేరుశెనగ తొక్క ఫోటో పెడితే మా ఆవిడకి నా మీద ప్రేమ అమాంతం పెరిగిపోతుందా? నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నారు - అని తొందరపడి వాపోకండి. 


అలా ఫోటో ఫ్రేమ్ కట్టి వేళ్ళాడతీసాక ఏమవుతుందో 70 mm లో చూపిస్తా


మీ ఆవిడ మీకు కాఫీ ఇవ్వడానికి హాల్లోకి వచ్చినప్పుడు మీరు ఆ ఫోటో ఫ్రేమ్ ని అటునించి ఇటునించి దగ్గర్నించి, ఒకింత దూరం నుంచీ చూస్తూ కనిపించాలి మీ ఆవిడకి. లేకపోతే ఆ ఫోటో ఆవిడ కళ్ళల్లో పడకపోవచ్చు!


అప్పుడావిడ సహజంగానే ఇదేమిటండి ఎవరన్నా ఓ జలపాతమో, ఓ మౌంట్ ఎవరెస్ట్ ఫోటోనో పెడతారు హాళ్ళో. మీరేంటి ఆ తొక్కలో ఫోటో  పెట్టారు అని అడుగుతుంది 


అప్పుడు మీరు అక్కినేనిలా "హేంత మాటన్నావు ల్లతా (పేరులో మొదటక్షరానికి ఒత్తు పెట్టి పలకడం మర్చిపోకూడదు. అలా బరువుగా మాట్లాడితేనే అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడింకో విన్నపం. నేను రాశానని మీ ఆవిడ పేరు లత కాకపోయినా అలా ల్లతా అని పిలిచారనుకోండి. తర్వాతి యాదృచ్చిక సంఘటనలకు మానేజ్మెంట్ ఏ విధమైన బాధ్యత వహించదు. 


"అది మాములు తొక్కనుకున్నావా ల్లతా (ఇక్కడ  మీ ఆవిడ పేరుని ప్రతిక్షేపించడం మరవద్దని మరో మారు మనవి) దాని వెనకాల ఓ మధురానుభూతి ఉంది!"


అనగానే ఆవిడ ఏమిటా మధురానుభూతి అని అనుమానంగా అడుగుతుంది. 


ఇక్కడ మీకు  రెండు ఆప్షన్స్ ఉన్నాయి 


ఆప్షన్ నెంబర్ 1:  మన పెళ్ళికి ముందు మనం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్క్ (ఇక్కడ మీ ఇష్టమైన, గట్టిగా చెప్పాలంటే  మీరెళ్ళిన పార్క్  పేరు చెప్పండి. పెళ్ళికి ముందు  వెళ్లకపోతే హనీమూన్ లో మైసూర్ బృందావన గార్డెన్స్ కానీ ఊటీ టీ గార్డెన్స్ ఉదాహరించచ్చు) అప్పుడు  నేను నీకు నా పాకెట్ మనీ తో ఓ సోలెడు వేరు శెనక్కాయలు కొని పెడితే నువ్వు ఎంతో ఇష్టంగా తిన్నావు గుర్తుందా? నువ్వలా తిన్న మొట్టమొదటి వేరు శెనక్కాయ తొక్కని నీకు తెలీకుండా తీసి ఇన్నాళ్లు దాచాను. దాన్నెక్కడ ఎలక కొడుతుందోనని ఓ ఫోటో తీయించా. మన జాయింట్ మధురానుభూతి ఎప్పుడూ కళ్లముందుండాలని ఇలా ఫ్రేమ్ కట్టించా - అని చెప్పాలి 


ఆప్షన్ నెంబర్ 2: ఇది కొంచం నాలా ఓవర్ ఆక్షన్ చేసే వాళ్ళకి మాత్రమే. ఒకింత ప్రమాదం పాలయ్యే అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త 


ఒకప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు ఓ సుందరితో పార్క్ కి ( మీ ఇష్టమైన పార్క్ పేరు చెప్పండి) వెళ్ళినప్పుడు ఆమెకి కృష్ణుడికి కుచేలుడు ఇచ్చినట్టు వేరు శెనక్కాయలు ఇస్తే ఆమె ఎంతో ఆనందంగా, ప్రేమగా వాటిని తింటే ఆ మధురానుభూతి జ్ఞాపకాలు మిగిలిపోవాలని ఆ అతిలోక సుందరి తిన్న మొట్టమొదటి వేరు శెనక్కాయ తొక్కని ఇలా భద్రంగా ఇన్నాళ్లు దాచాను. దాని ఫోటోనే ఇది. 


ఇక్కడ మీ ఆవిడ దగ్గరనించి రెండు రకాల రియాక్షన్ రావచ్చు!


రియాక్షన్ నెంబర్ 1: మీ ఆవిడ వెంటనే ఎవరా సుందరి అనగానే మీరు  ఎటు తిరిగీ ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచం ఓవర్ అయ్యి సుందరి కాదు అతిలోక సుందరి అని కరెక్ట్ చెయ్యాలి! వెంటనే ఉత్తరక్షణంలో ఆమె ఎవరో నీకు తెలుసు. బాగా తెలుసు అని ఉడికించాలి. అప్పుడామె తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురి పేర్లు లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు తెలిస్తే ఏవో చెప్తుంది. ఇక్కడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీ ఫ్రెండ్స్ పేర్లయినా ఆమె ఫ్రెండ్స్ పేర్లయినా చెప్పినప్పుడు మీ మోహంలో ఏ విధమైన హావభావాలు మారకూడదు. ఏమాత్రం మీ ఎక్స్ప్రెషన్ మారినా ఖల్లాస్!


ఆమె నామావళి చెప్పడం పూర్తయ్యాక "హిదేనా నువ్వు నన్నర్ధం చేసుకున్నది. ఐ హార్టెడ్ - అని ఓ సారి గాఢంగా నిట్టూర్చి "ఆ అతిలోక సుందరి ఎవరనుకున్నావ్? నువ్వే!" అని క్లైమాక్స్ లో పీటముడి విప్పాలి. 

    

రియాక్షన్ నెంబర్ 2: మీరలా ఎవరో అతిలోక సుందరితో పార్కుల్లో షికార్లు చేశారనగానే ఆవిడ మీ వేపు రుసరుసమంటూ చూసి అక్కడినించి విసురుగా వంటింట్లోకెళ్ళి కాఫీ గిన్నెని దభాల్న సింకులో భారీ డాల్బీ డిజిటల్  సరౌండ్ సౌండ్ వచ్చేట్టు విసిరి పడేస్తుంది. ఆ లోపల మీరెళ్ళి ఆవిడని పైన చెప్పినట్టు నువ్వే ఆ అతిలోక సుందరని నమ్మించాలి. ఇక్కడ సినిమావాళ్ళ భాషలో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏమాత్రం తేడా వచ్చినా ఇంతే సంగతులు. చిత్తగించవలెను. 


కొంతమంది అంతా బానే ఉంది కానీ నేను మా ఆవిడని పెళ్ళికి ముందు తర్వాత కూడా ఏ పార్క్ కి తీసికెళ్ళిన పాపాన పోలేదు. వేరు శెనక్కాయలు కొని పెట్టలేదు అని వాపోవచ్చు. వాళ్లకి కూడా నా దగ్గరో ఉపాయం ఉంది. రేపెటు తిరిగీ వీకెండ్ కాబట్టి మీ ఆవిడని అర్జెంట్గా ఏదన్నా పార్కుకి తీసుకెళ్లి వేరు శెనక్కాయలు కొని పెట్టండి. ఒక వేళ అక్కడ అవి అమ్మకపోతే - దానికింకో ఉపాయం. మీరే ముందస్తుగా బోల్డు వేరు శెనక్కాయలు కొని మీ పంట్లాము జేబులో వేసుకెళ్లండి.. తెలివుండాలే కానీ మార్గాలుండవా?


తదుపరి ఓ వారం తర్వాత ఈ పోస్ట్ మొదట్లో చెప్పిన రెండు మార్గాల్లో మీకు నచ్చినది ఎంచుకొని డు ఫెస్టివల్!


గమనిక: ఈ ఫోటో రేట్ గురించి ప్రైవేట్ గా మెసేజ్ చేయగలరు.    


గమనిక 2: ఇది కేవలం భర్తలని ఉద్దేశించి రాసాను కాబట్టి నేనేదో పురుష పక్షపాతిని అని నిందారోపణ చేయకండి. వాళ్ళకి ఎందుకు రాసానంటే ఈ మగాళ్ళకి అన్నీ చెప్పాలి (కావాలంటే భార్యాలనడగండి!) కానీ ఈ ట్రిక్ భార్యలు కూడా నిక్షేపంగా వాడుకోవచ్చు. వాళ్ళకా మాట చెప్పనక్కరలేదు. వాళ్ళకి తడుతుంది కాబట్టి 


గమనిక 3: ఇలాంటివి వాడినప్పుడు ఆ భార్యానుగ్రహాన్ని వెంటనే కాష్ చేసుకోవాలి. అల్ప సంతోషులయితే ఏమోయ్ నువ్వు గుత్తి వంకాయ అద్భుతంగా చేస్తావు (వంకాయ బదులు మీకిష్టమైన వంటకం చేపల పులుసు వగైరా చెప్పుకోండి!) అనగానే రెండు నిమిషాలాగండీ అని అద్భుతంగా మీకు నచ్చిన వంటకాలు చేసేస్తుంది. నాలాంటి కొంచం అడ్వాంటేజ్ తీసుకునేవాళ్లయితే "ఇవాళ సాయంత్రం నా ఫ్రెండ్ ''చిన్న'' పార్టీ ఇస్తున్నాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందిట" అని నసిగితే చాలు. పర్మిషన్ గ్రాంటెడ్!


ఆడాళ్ళు ఏం అడగాలో నేను చెప్పాలా మీ పిచ్చికానీ? "మొన్న దీపావళికే కొనుక్కుందామనుకున్నా. సాయంత్రం కళానికేతన్ కి వెళ్లి ఓ పట్టు చీర కొనుక్కుందామండి" అనో లేదా మలబార్ గోల్డ్ కో టెండర్ పెట్టచ్చు!


అభీష్ట సిద్ధి రస్తు!  

Tuesday, July 27, 2021

నేనూ. గల్లీ క్రికెట్!

 చిప్న్నప్పుడు ఎండు కొమ్మలు స్టంప్స్ గా పెట్టి రబ్బర్ బంతితో గల్లీ క్రికెట్  ఆడుతున్నప్పుడు సునీల్ గవాస్కర్ లాగా ఫీల్ అయ్యిపోయి, ఇండియాకి గవాస్కర్ ఉన్నారు కాబట్టి నేను కాంపిటీషన్ వస్తే బాగోదని, ఆ రోజుల్లో టీవీలు, లైవ్ టెలీకాస్టులు లేకపోయినా సంవత్సరానికోసారి సినిమా హాళ్లలో రెండు గంటలు క్రికెట్ సిరీస్ చూసి జఫ్ బాయ్కాట్ ని గురువుగా భావించి, నా పేరుని దేశవాళీ పేరుగా జఫ్ జాయికాట్ గా పెట్టుకుని, ఫస్ట్ బాటింగ్ తీసుకుని మనం కళ్ళు మూసి తెరిచేలోగా ఆ గల్లీకే కాదు ఆ పరిసర ప్రాంతాల్లో కల్లా ఫాస్ట్ బౌలర్ వేసిన మొట్టమొదటి బంతి మనకి కనిపించక బంతి శబ్దాన్ని బట్టి  మన బ్యాట్ ని శబ్దభేదిలా ఊహించుకుని ఎటో బ్యాట్ ఊపితే బంతి దేనికో తగిలిన శబ్దం వినిపిస్తే మనం కొంపతీసి ఫోర్ కొట్టేసామేమిటని మనలో మనం బోల్డు సంభ్రమాహాశ్చర్యానందం పడిపోయి కానీ ఎటువైపు కొట్టామో తెలీక బుర్రని వీలైనంత 360 డిగ్రీలు తిప్పే ప్రయత్నం చేసేలోపే, చుట్టూ ఉన్న జనం చేస్తున్న హర్షధ్వానాలు మనం కొట్టిన షాట్ కే అని నిర్ధారించేసి కాలర్ ఎగరేసే లోపల రెండున్నర క్షణాల్లో ఆ వినిపించిన శబ్దం బంతి బ్యాట్ కి తగిలినందుకు కాదని, తగిలింది మన స్టంప్స్ కని, అసలే ఎండు కొమ్మలేమో ఆ ఫాస్ట్ బాల్ కి ఒక స్టంప్ విరిగి ఆ శబ్దం కూడా కలగలిపి ఇప్పటి భాషలో చెప్పాలంటే డాల్బీ డిజిటల్ స్టీరియో శబ్దం మనకి వినిపించిన సౌండని, ఆ హర్షధ్వానాలు మనం కొట్టామనుకున్న షాట్ కి కాదని, మనం  ఫస్ట్ బాల్ కే అవుట్ అయ్యినందుకు ప్రేక్షక, ప్రత్యర్థి ఆటగాళ్లు కొడుతున్న కేరింతలని తెలుసుకున్న ఉత్తరక్షణంలో అంతకు ముందు వచ్చిన శబ్దం కంటే ఎక్కువ ఎవ్వరికీ వినిపించని సౌండుతో మన గుండె బద్దలయ్యి, కాళ్ళ పారాణి ఆరకుండానే అవుట్ అయ్యిపోయామా అని హతాశులం అయిపోయి, తక్షణమే పగిలిన గుండె ముక్కలని రాయి  చేసుకుని ఈ మాత్రానికే ఇంత  ఇదయిపోతే ఎలా అని మనకి మనమే చెప్పేసుకుని ఇప్పుడేం చెయ్యాలి ఏం చెయ్యాలి అని రీసౌండ్ వచ్చేట్టు మన అంతరాత్మ మనకే వినిపించేట్టు ఓ గగ్గోలు పెడుతూంటే ఒక్క రవ్వ తడబడినా ఇంకో అరక్షణంలో తేరుకుని "ఆ ఇప్పుడంతా రియల్స్" అని డిక్లేర్ చేస్తే ఆ ఫాస్ట్ బౌలర్ గూండాగినంత పనయ్యి వాడు "నేనొప్పుకోను. నేనొప్పుకోను" అని ఓ కాకి గోల చేస్తూంటే వాడిని పట్టించుకోకుండా పెద్ద మనిషి తరహాలో "ట్రయల్ బాల్ వేయకుండా మ్యాచ్ ఏమిటి? కావాలంటే పెద్ద మ్యాచ్ చూడండి బౌలర్ మూడు నాలుగు సార్లు బాల్ వికెట్ కీపర్ కి బౌల్ చేస్తాడు. అవన్నీ రియల్స్ అంటారా? మీ పిచ్చి కాకపోతే? ఇప్పటినించి మ్యాచ్ స్టార్ట్. ఇహ వేసుకోండి బౌలింగ్" అని మనకి ఆట పెద్దగా రాకపోయినా పెద్ద గొంతుంది కాబట్టి నోరు పెట్టుకు బ్రతికేసి ఆరు నూరయినా నూరు ఆరయినా నేను అవుట్ అంటే ఒప్పుకోను అని మొండికేసి, మొరాయించి, అప్పుడప్పుడు పరిస్థితి చేయిజారిపోయి ఊరంతా ఒక్కటయ్యిపోయి నేను ఔటయ్యిపోయానని కోతిమూకలా నా చుట్టూ చేరి నానా రభస చేస్తూంటే ఇహ లాభం లేదని మొహం వీలైనంత కోపంగా పెట్టి బ్యాట్ నాది కాకపొతే వీర విసురుగా నేలకేసి కొట్టి వాకౌట్ చేస్తే నాతొ పాటు నా ఆంతరంగిక అనుచర క్రీడాకారులు  కూడా "మేమంతా నీ జట్టు! పడదాం వాళ్ళని ఓ పట్టు! అని నినాదాలిస్తూ  నాకు మద్దతుగా వస్తే అందరం దూరంగా వెళ్లి ఓ చెట్టుకింద కూలపడి బీడీలు కాల్చే వయసు కాదు కాబట్టి అటువంటి అసాంఘిక పనులు చేయకుండా శాంతియుతంగా మేము లేకుండా ఆట ఆడదానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరిని విడివిడిగానూ, జమిలీగానూ వచ్చీ రాని బూతులు తిడుతూ, కపిల్దేవ్ ప్రారంభించిన ఐసీల్ కాదని క్రికెట్ బోర్డు వాళ్ళు ఇంకో పోటీ ఐపీల్ పెట్టినట్టు,రేపటినించి మేము అనగా నేను, నా అనుచర బృందం వేరే పోటీ క్రికెట్ మ్యాచ్ పెట్టాలని పెద్ద నిర్ణయం తీసేసుకుని అందులోకి పక్క వీధి వాళ్ళని ఎవరిని తెచ్చుకోవాలి, ఏ గల్లీ టీం తో పోటీ మ్యాచ్ పెట్టాలి లాంటి అడ్వాన్స్ పాయింట్స్ కూడా కూలంకషంగా చర్చించి చీకటి పడ్డాక ఆట ఆడకుండానే రాజకీయాలతో అలిసిపోయి ఏదో ఘనకార్యం చేసిన బిల్డప్ ఇచ్చేసి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళగానే ఇంట్లో అందరి అమ్మలు "ఎంతసేపూ ఆ వెధవ క్రికెట్ ఆడడమేనా? అదేమన్నా  కూడు పెడుతుందా? గుడ్డ పెడుతుందా? అని మాలోని సచిన్ లని తొక్కేయబట్టి అందరం ఇలా జీవం లేని జీవచ్ఛవం లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ రోటి కపడా ఔర్  మకాన్ ఉంటే చాలని చిరుద్యోగాలు చేసుకుంటూ ప్రతి నెలా టీవిలో వచ్చే మన వాళ్ళ క్రికెట్ మ్యాచులు చూసుకుంటూ, వాళ్ళు ఫోరులు, సిక్సర్లు కొట్టినప్పుడూ, ప్రత్యర్థుల్ని అవుట్ చేసినప్పుడూ కుర్చీలోంచి ఎగిరినంత పని చేసి చప్పట్లు కొట్టి, కేకలు పెట్టి సామాన్య మానవుడిలా చప్పగా జీవితం లాగించేస్తున్నాం!   

పైన రాసిందంతా ఒకే వాక్యమని గమనించ ప్రార్థన😎

Tuesday, February 16, 2021

Kattula Rattaiah

 నాకు మూడ్ వచ్చినప్పుడు, ఈ మనుషుల మీద, సంఘం మీదా, నా జీవితం మీదా బాగా కోపం వచ్చినప్పుడు, అప్పుడప్పుడూ మా ఆవిడకి ఒకింత సాయం చేద్దామన్న కోరిక పుట్టినప్పుడు, వంట చేసి పారేస్తూంటాను! అంటే వండినదంతా పారేస్తానని అపార్ధం చేసుకోకండి 🙁

ఇవాళ పొద్దున్నే అలా వంట చేద్దామని డిసైడ్ అయిపోయాను! ఎందుకో? అని మీరడిగినా చెప్పను... కాన్ఫిడెన్షియల్.. క్లాసిఫైడ్ కూడా. మీ ఊహాగానాలు మీరు చేసేసుకోవచ్చు!!
ముందస్తుగా కొబ్బరి పచ్చడి, పచ్చడి పచ్చడిగా చేసేసా! ఆ తర్వాత దొండకాయలని కసా పిసా నరకడం ... క్షమించాలి ... తరగడం మొదలెట్టా! ఏ మాటకామాటే! ఎవరి మీదైనా బాగా కోపం వస్తే ఆ కోపం అంతా ఆ కూరలు మాంచి కసిగా తరగడంతో తగ్గిపోతుంది 😉 Cooking is therapeutic you know 😉 Anger management tip!!

సరే అలా కసి కసిగా, కసా, పిసాగా తరుగుతూంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు! మా ఆవిడ బిజీ గా ఉండడంతో నేనే "సిరికిం చెప్పడు" స్టైల్ లో వెళ్లి చూసాను. పేపర్ అబ్బాయి బిల్ కోసం వచ్చాడు.
ప్రతి నెల అతను పేపర్ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఎప్పుడూ, నా కంప్లైంట్, అతను చెప్పే సమాధానం ఒకటే!! పేపర్ ఈ మధ్య బాగా అలీసంగా వేస్తున్నారు, అప్పుడప్పుడూ సప్లిమెంట్ వెయ్యటం లేదు అని. ఆ ముందు రోజే DC సప్లిమెంట్ వెయ్యలేదు. మెయిన్ పేపర్ వెయ్యకపోయినా క్షమిస్తాను కాని సప్లిమెంట్ వెయ్యకపోతే మట్టుకు క్షమించను. ఎందుకంటే నేను పేపర్ న్యూస్ హెడింగ్స్ చూసేసి, advertisements కూసింత నిశితంగా పరిశీలించి వెంటనే సప్లిమెంట్ చివరి పేజీల్లోకి వెళ్ళిపోతా! అక్కడ ముందస్తుగా దినఫలం చదువుతా. ఒక్క రోజైనా బాగుంటుందని రాస్తాడేమోనని. అబ్బే ఆ అదృష్టం ఎప్పుడో కాని ఉండదు. అది చదివి డీలా పడిపోయి వెంటనే "మూడ్" లోకి రావడానికి పక్క పేజీలో డెన్నిస్ కార్టూన్ చూస్తా. వెంటనే మంచి మూడ్ లోకి వచ్చేస్తా. ఆ తర్వాత ఒక కాఫీ తాగుతూ రెండు సుడోకూ పజిల్స్ పూర్తి చేస్తా.
అసలే నిన్ననే సప్లిమెంట్ వెయ్యలేదు "నిన్నెందుకు సప్లిమెంట్ వెయ్యలేదు" అని అడిగాను. అనడం కంటే కోపంగా గద్దించాను అనడం ఒకింత కరెక్ట్ .

ఎందుకో అతని మొహంలో ఎప్పటిలా కాకుండా ఈ సారి ఒకింత భయం కనిపించింది! ప్రతి సారి రొటీన్గా చెప్పే "రోజూ వచ్చే పిల్లగాడు రాలేదు సార్! కొత్తబ్బాయి" అనే జవాబు చెప్పలేదు 🙁
అసలు నోటమాట రావటం లేదు అతనికి. అదేదో హింది సినిమాలో షారుక్ లాగా "బిబిబిబి ... బిల్" అన్న మాటలు అతి కష్టం మీద అతని నోటినించి వచ్చాయి. ఎందుకలా అయిపోయాడో నాకర్ధం కాలేదు.

సరే ఎందుకైతే నాకెందుకు డబ్బిచ్చి పంపించేద్దామని హల్లోకొచ్చి బీరువాలో పర్స్ తియ్యబోతే ... అదిగో! అప్పుడర్ధం అయ్యింది..

కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీ, కృష్ణం రాజుతో "ఇదిగో ఇక్కడే! ఇక్కడేనండి పోయింది!" అంటే కృష్ణం రాజు "పోతే పోనీలే! కృష్ణా! మళ్ళీ కొనుక్కోవచ్చులే" అని ఎలా అపార్ధం చేసుకున్నాడో ఆ టైపులో నేను కూడా అపార్ధం చేసుకున్నా ఆ న్యూస్పేపర్ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించాడో!!
ఎందుకు!...
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
ఎందుకంటే పర్స్ తియ్యబోయిన నా కుడిచేతిలో అయిదంగుళాల కత్తి ఉంది!! దొండకాయ తరుగుతూ అలా .. ("సిరికిం చెప్పడు" అని మీకు క్లూ ఇచ్చా!... ) వచ్చానేమో చేతిలో పొడుగు కత్తి, కట్టిందేమో గళ్ళ లుంగీ!! అచ్చు "కత్తుల రత్తయ్య" టైపు లో కనిపించాను పేపరబ్బాయికి 😉
మరి భయపడ్డాడంటే .. పడడా?!!

Thursday, January 28, 2021

పర్యావరణ రక్షణ, దేశ సేవ

 ఈ మధ్య గబుక్కున ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే నన్నెవరైనా హటాత్తుగా "ఈ దేశం నీకేమిచ్చిందన్నది కాదు పాయింట్! నువ్వు దేశానికి ఏమిచ్చావు అన్నదే ప్రశ్న" అని పదిమందిలో అడిగారనుకోండి. అప్పుడు నా గతేమిటి? ఎంత ఆలోచించినా ఈ దేశానికి ఏమిచ్చానో తట్టలేదు. ఆదాయపు పన్నంటారా? అది నేను మనస్పూర్తిగా ఇవ్వలేదు. సర్కారు వాళ్ళే బలవంతంగా తీసుకున్నారు 🙁

ఆ ఆలోచన వచ్చిన దగ్గరి నించి నిద్ర తగ్గిపోయింది. కాస్సేపు కునుకు తీసినా ఒకటే పీడకలలు! నేనొక పెద్ద కాలేజీ లోనో, లేక ఒక పెద్ద కంపెనీ లోనో భారీ స్పీచ్ ఇస్తూంటే ఒక కుర్రకారు అదిగో అదే ప్రశ్న ఆ మహా సభలో వేసినట్టు, అప్పుడు ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేక, కల్పించి (కలలో కూడా!) చెప్పలేక అలనాడు మయసభలో దుర్యోధనుడి లాగా భారీ అవమానం పాలయినట్టు కలలు! ఇలా లాభం లేదని ఈ దేశానికి ఏదో ఒకటి అర్జెంటు గా చేసెయ్యాలి అని నిర్ణయించాను. అంతమట్టుకు బాగుంది.

ఏది ఒకటి అంటే ఏమిటి?

అందరు రాజకీయ నాయకులనీ సరి సమానంగా బూతులు తిట్టి సామాజిక న్యాయం చేయలేను. ఎందుకంటే తిట్టించుకోవడానికి వాళ్ళు ఎవరెడీ అయినా బూతులు తిట్టడానికి xxx సబ్బుతో బట్టలుతుక్కుంటున్న నా సంస్కారం అడ్డొస్తోంది!

ఈ వయస్సులో సైన్యంలో చేరలేను. స్వచ్ఛ భారత్ అంటూ వీధులు తుడవలేను.
మరేం చెయ్యాలి? మరేం చెయ్యాలి? (సినిమాల్లో లాగా ఈ చివరి ప్రశ్న అలా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది).

అలా కొన్నాళ్ళు మధన పడగా పడగా ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. (ఈ ఐడియా నా జీవితాన్నే మార్చేస్తుందేమో?!)

అదేమిటంటే ఇటీవలి కాలంలో అందరూ వాతావరణం, పర్యావరణం లో భారీ మార్పులు వచ్చేస్తున్నాయి. మనందరం ఇప్పుడు పట్టించుకొని ఏదైనా చేయకపోతే ముందు తరాల వాళ్ళకి మట్టి, మశానమే అని లోకం కోడై కూస్తోంది. అందుకని అధమపక్షం అందరూ ముందస్తుగా చెట్లు పెంచండి అని ఘోషిస్తున్నారు కదా?

(పిడకలవేట: చెట్లు ఎలా పెంచాలో, పెంచుతారో తెలీదు నాకు! ఎవరైనా మొక్కలు పెంచుతారు. అవి పెద్దయితే చెట్లు అవుతాయి. ఇంకా భారీగా పెరిగితే చెట్టు అంటే బాగోదేమో అని వృక్షం అంటాం. కాని చెట్లు ఎలా పెంచుతాం?!)

సరే నా వంతు కృషిగా మొక్కలు పెంచుదామని నిర్ణయించాను. వెంటనే ఒక బుజ్జి కుండీలో ఒక అర డజను ధనియాలు మట్టిలో పాతిపెట్టి, రోజూ నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను. చిన్ని మొక్క రాగానే మహా ఆనందపడిపోయాను. దేశానికి నా సేవాంకురం అని!

రోజూ చాల ప్రేమగా ఇంకు ఫిల్లర్తో నీళ్ళు పోసాను. మగ్గుతోనో, చెంబుతోనో పోస్తే ఆ నీటి ధాటికి తట్టుకోలేక చచ్చిపోతాయేమోనని భయమేసి. ఒక్కోటి ఒక రెండు అంగుళాలు పెరిగాయి. 

హమ్మయ్య! నా వంతు దేశసేవకి అరంగేట్రం చేసేసాను.

ఇంకో రెండంగుళాలు పెరగ్గానే మొక్కలు పీకేసి పచ్చడి చేసుకు తినెయ్యడమే! అంటే కొంతమంది కోడికి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వగైరా పోషకాహారం బాగా తినిపించి అది ఏపుగా(!) పెరగ్గానే గుట్టు చప్పుడు కాకుండా దాన్ని బిర్యానీ చేసి లాగించేసినట్టు.

కాని ఇంతలో దినపత్రికల భాషలో చెప్పాలంటే నిన్న సాయంత్రం ప్రకృతి విలయతాండవం చేసింది. అంతే. అనుకోకుండా విచిత్రంగా వర్షాకాలంలో వాన పడ్డం మొదలెట్టింది!
నేనేమో బైటికి పని మీద వెళ్ల్లాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ వాన అలా చినికి చినికి భారీ వర్షంగా మారింది. నా కారుకి ఈత రాదు. అందుకని అదెక్కడా మునిగిపోకుండా అష్టకస్టాలు పడి మొత్తానికి ఎలాగైతేనేం ఒక రెండు గంటల తర్వాత ఇంటికొచ్చాను.

వచ్చి చూస్తె ఏముంది. చెప్పానుగా ప్రకృతి విలయతాండవం అని. నా కొత్తిమీర మొక్కలన్నీ నామ, రూపాలు లేకుండా పోయాయి. బుజ్జి కుండీ కూడా పగిలిపోయి ఆ ముక్కలన్నీ చెల్లాచెదురు అయ్యిపోయి కనిపించాయి. అంతే! నాకు దుఃఖం ఆగలేదు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న నా మొక్కలన్నీ సమూలంగా నాశనం అయ్యిపోయాయి.

అందుకే అంటారు కంటే ఖర్మం కాని పెంచుకుంటే ప్రారబ్ధం అని. నాలుగు రోజులు పెంచిన నాలుగు మొక్కలు చచ్చిపోతేనే నాకింత బాధగా ఉందే. మరి నాలుగు నెలలు పెంచి పోషించిన పంట నాశనం అయిపోతే రైతుల గుండెలు ఆగిపోయాయంటే ఆశ్చర్యం లేదు. అతిశయోక్తి కాదు.
చివరాఖరికి నా దేశసేవకి అలా మూడు మొక్కలు, ఆరు ఆకులతోనే నిండు నూరేళ్ళు నిండాయి 🙁

ఇంకెలా ఈ దేశానికి సేవ చెయ్యాలో అలా అలోచిస్తూనే ఉన్నా! మీకేమయినా ఐడియాలు తడితే చెప్పండి.

సదా మీ దేశ సేవలో

ఓ "అతి" దేశ భక్తుడు

సశేషం!!