Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Wednesday, July 19, 2023

వానాకాలం చదువులు!

 36 గంటల నుంచీ హైద్రాబాద్లో జోరుగా ఆగకుండా వాన పడుతోంది. 


నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఇలా వాన పడితే స్కూల్ సెలవు! సెలవిచ్ఛేవాళ్ళా లేక మనం డుమ్మా కొట్టేవాళ్లమా అన్నదానికి చరిత్ర పుటల్లో క్లారిటీ లేదు. 


అదే కాలేజీకి వచ్చాక నిక్కర్ల నించి పాంట్లకి ఎదిగాం కాబట్టి కాస్త పెద్ద మనుషులం అయ్యామని ఒకింత బాధ్యతతో ఎంత వాన పడుతున్నా పట్టించుకోకుండా హీరోచితంగా ఆయాసపడుతూ, వానలో అయినా చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. 


ఇప్పటి కుర్రాళ్ళలాగా పదో క్లాసు నుంచి ఆక్టీవా స్కూటర్లు, పాకెట్ మనీలు లేవు మాకు ఆ రోజుల్లో. కాస్త ఓ మాదిరి మిడిల్ క్లాస్ అయితే ఓ సైకిల్ కొనిచ్చేవాళ్ళు. 


సైకిల్ అయితే ఉంది కానీ సినిమా టికెట్ కి డబ్బులో. అబ్బో ఆ రోజుల్లో ఎంటీవోడు ఒక నెలంతా రాత్రిళ్ళు సైకిల్ తొక్కి లక్ష రూపాయలు సంపాదించే దానికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. ఓ అయిదు రూపాయల కోసం! 


అయిదు రూపాయలుంటే కుర్చీ టికెట్ 1-80 చొప్పున ఇద్దరికీ 3-60. ఇంటెర్వల్స్లో తలా రెండు బుజ్జి సమోసాలు, రెండు టీలు. రెండు సైకిళ్లకు సైకిల్ స్టాండ్ ఖర్చులు! అన్నీ కలిపి హాయిగా అయిదు రూపాయల్లో సినిమా చూసేసేవాళ్ళం. పది పైసలో పావలానో మిగిలేది కూడా! ఇప్పటి సంగతి చెప్పాలా? సినిమాకి వెళ్లాలంటే బ్యాంకు లోన్ తీసుకునే పరిస్థితి. 


కానీ ఆ అయిదు రూపాయలు "సంపాదించడం" బోల్డు కష్టం అయ్యేది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల లాగ కూరలు తెచ్చినప్పుడో అర్ధ రూపాయో, అదృష్టం బాగుంటే ఓ రూపాయో, నెలవారీ సరుకులు తెచ్చినప్పుడు మట్టుకు పదో పరకో నొక్కేసో , అప్పుడప్పుడూ పోపుల డబ్బా మీద దాడి చేసో, కిందా మీద పడి అయిదు రూపాయలు సంపాదించి సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడో ఇంట్లో మంచం మీద వెల్లకిలా పడుకుని మొబైల్లో, ఓపికుంటే హాల్లో సోఫాలో కూలబడి టీవీలోనో రోజుకో రెండు చెప్పున చూసేస్తున్నారు. నేను అనవసరంగా బోల్డు ముందు పుట్టేసానా అని బాధ పడిపోతూంటాను తీరిక వేళల్లో,  


ఇంతకీ అంత వానలో పొద్దున్నే కాలేజీకి ఎందుకు అంటే ఇక్కడో సీక్రెట్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పితే ఏం ప్రాబ్లెమ్ లేదు కాబట్టి సీక్రెట్ ఓపెన్గా చెప్పేస్తా. వారంలో కనీసం రెండు సినిమాలకి కాలేజీ ఎగ్గొట్టి మ్యాటినీకి చెక్కేసేవాడిని నా బెస్ట్ ఫ్రెండ్ తో! ఇలా వాన పడిందని ఇంట్లో కూర్చుంటే మధ్యాన్నం సినిమా టైంకి కాలేజీకి అని బయల్దేరితే ఇంట్లో ఒప్పుకోరుగా? పొద్దున్న ఏం ఉడతలు పట్టావు? అప్పుడు వెళ్ళనిది ఇప్పుడెందుకో? ఓవర్ ఆక్షన్ ఆపి ఇంట్లో పడుండు అని మన ప్లాన్ కి అడ్డం పడతారుగా?


అందుకే పొద్దున్నే కాలేజీకి దేవుడా అంటూ, ఊసురోమంటూ వెళ్లడం! నా చిన్నప్పుడు నే పడ్డ కస్టాలు పగవాడికి కూడా వద్దు!


అంత కస్టపడి కాలేజీకి వస్తే మెచ్చి మేక తోలు కప్పక పోయినా కనీసం మన ఆదర్శాన్ని గుర్తించచ్చుగా లెక్చరర్లు? అబ్బే! ఆ రోజుల్లో అంత గుర్తింపు ఉండేది కాదు మా బోటి సిన్సియర్ విద్యార్ధులకి. 


"ఏం బాబూ? గాలి ఇటు మళ్లింది! మార్నింగ్ షో కి టికెట్స్ దొరకలేదా? "అని సూటిపోటి మాటలతో నా హృదయం ముక్కలు చేసేవాళ్ళు. అప్పుడు నా హృదయానికి పడ్డ క్రాక్స్ మొన్నీ మధ్య కార్డియాలజిస్ట్ చూసి బోల్డు హాశ్చర్యపడిపోయాడు. ఇన్నేళ్లు అసలు ఎలా బ్రతికారు మీరని! ఆ లెక్చరర్ల మాటలకి క్రాక్స్ ఇచ్చినా గుండెని రాయి చేసుకుని గుండ్రాయిలా అయిపోయాం కదా? అందుకని గుండులా ఇన్నాళ్లు బ్రతికేసా అని ఆయనకి  తెలీదు! నేను చెప్పలేదు!


అలా హృదయం  క్రాక్ అయ్యిందని చెప్పి ఎవ్వరికీ ఇవ్వకుండా మన దగ్గరే ఉంచేసుకోము కదా? ఓ అమ్మాయితో అన్నా "నా క్రాకులు పడ్డ హృదయం నీకే అంకితం" అని. నువ్వో క్రాక్ గాడిలా ఉన్నావని సుతారంగా తిరస్కరించింది. 


ఇన్ని మాటలు లెక్చరర్ల దగ్గర పడాల్సిన ఖర్మ మనకేంటి అని వాళ్ళు అలా తిట్టగానే "మాకు అటెండన్స్ వేస్తె మా దారి మేం చూసుకుంటాం మీకు, మిగతా సిన్సియర్ విద్యార్ధులకి ఇబ్బంది లేకుండా. లేదంటే ఇక్కడే కూర్చొని కాకిగోల చేస్తాం అని అల్టిమేటం ఇచ్చేసేవాడిని లెక్చరరుకి. మన లాంటి వుడ్ బి రౌడీలతో ఎందుకని పొండిరా అటెండన్సేగా వేస్తాలే అనేవాళ్ళు. (కానీ దుర్మార్గులు మోసం చేసేవాళ్ళు. డిగ్రీ మూడేళ్లు అటెండన్స్ తక్కువయ్యి కాండోనేషన్ కట్టాను) వెంటనే లేచి విజయ గర్వంతో బైటికి వాక్ అవుట్ చేసి కాసేపు కాలేజీ కాంపౌండ్ లో తచ్చాలాడి, ప్రిన్సిపాల్ కంట్లో పడితే మేటర్  ఎస్కలేట్ అయ్యి ఇంట్లోవాళ్ళకి మన నిర్వాకం తెలిసిపోయి కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉందని బైటికి వెళ్లి అలా ఉమెన్స్ కాలేజీ చుట్టూ గానుగెద్దులా ఓ సారి సైకిల్ తొక్కుతూ,ఇంకోసారి దాన్ని నడిపించుకుంటూ  అమ్మాయిలు ఎంతైనా బుద్ధిమంతులు. కాలేజీ వదిలి బైట మనలా బేవార్స్ గా తిరగరు అని తెలిసినా సరే తిరిగి ఒక్కమ్మాయి కనిపించక ఇహ చేసేది లేక ఇంకో జంక్షన్ కి వెళ్లి ఓ టీ తాగి లంచ్ టైం కి ఇంటికెళ్లి ఆవురావురుమంటూ భోజనం లాగించి మళ్ళీ సైకిల్ వేసుకుని "కాలేజీకి" వెళ్ళేవాళ్ళం!


వేటగాడు సినిమాలో రాజబాబు చెప్పినట్టు "ఏంటో గురూ? ఆ రోజులే వేరు"?

Sunday, March 13, 2022

మెడికోలు! ర్యాగింగ్!

 1985.  తిధి, తేదీ, నెల గుర్తులేవు!


ఆ రోజుల్లో నేను సేల్స్ ఉద్యోగం చేసేవాడిని. సేల్స్ అంటే పొద్దున్న  పదింటికి రోడ్డెక్కితే సాయంత్రం 5 తర్వాతే డూటీ దిగడం. అప్పటిదాకా మనిషి రోడ్డున పడ్డాడు


అప్పట్లో ఇప్పట్లా మొబైల్ ఫోన్లు లేవు. అందుకని మనం పొద్దున్న పదింటికి మాయం  అయ్యిపోతే మర్నాడు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేదాకా మనం ఎక్కడికెళ్లాం, ఏం  చేసాం మూడో కంటి వాడికి మనకే తెలుసు. ఏమాటకామాటే. అప్పట్లో జీవితం  చాలా హాయిగా ఉండేది. ఇప్పుడో ఎక్కడున్నావ్ అని బాస్ ఫోన్. సర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గరున్నానంటే ఓసారి వాడికి ఫోనివ్వు అంటాడు బాస్. ఉత్తదే ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడ్డానికి కాదు. మనం నిజంగా వాడి దగ్గరే ఉన్నామా ఇంకెక్కడన్నానా అని ఓ పరీక్ష. 


సరే ఇంతకీ ఓ రోజు ఏమైందంటే?


నాకు నా బాస్ మీద బాగా కోపం వచ్చింది. కారణం  ఏదైతే ఏం లెండి? అందరికీ  ఎప్పుడో ఒకప్పుడు, ఈ మధ్య అయితే దాదాపు ప్రతి రోజూ బాస్ మీద కోపం వస్తుంది కదా? బాస్ మీద కోపం వస్తే ఆఫీస్ లో ఉన్నా పని  చేసినట్టు నటిస్తాం కానీ ఛస్తే పని  చెయ్యం. అలాంటిది బైట మార్కెట్లో తిరిగే నేనెందుకు పని చేస్తాను? చెయ్యను. అక్కడిదాకా బానే ఉంది. పని చెయ్యకపోతే ఇంకేం చెయ్యాలి. ఇంటికెళ్లి పడుండలేం కదా? ఆ రోజుల్లో ఒక్క దూరదర్శన్  తప్పితే ఇంకే  టీవీ ఛానల్ లేదు. అది కూడా మధ్యాన్నం అంతా యూజీసీ వాళ్ళ పాఠాలు చెప్పేవాళ్ళు. నేను బ్రహ్మచారిని. ఒక్కడినే ఉంటున్నా. అందుకని  ఇంటికెళ్లి ప్రసక్తి లేదు. 


కానీ  రోజంతా ఎలా గడపాలి? ఎలా? ఎలా? ఎలా? ఇరానీ హోటల్లో ఒక టీ, ఖారా బిస్కట్ తింటూ చాలా తీవ్రంగా ఆలోచించాను. అప్పుడు తట్టింది ఓ బ్రహ్మాండమైన ఐడియా! 


అదేమిటంటే ఏదో ఒక నూన్ షో కి చెక్కేయడం! హాయిగా 11 నించీ దాదాపు రెండింటిదాకా కాలక్షేపం. తర్వాత లంచ్ చేసేటప్పటికి రెండున్నర. మూడు. అటు పైన ఓ రెండు గంటలు పని చేసినట్టు నటిస్తే సరి. రోజు అయిపోతుంది. 


ఐడియా బానే  ఉంది కానీ  ఏ  సినిమాకి వెళ్ళాలి? ఈ ప్రశ్న కంటే ముఖ్యమైన ఇంకో ప్రశ్న వేసుకున్నా? ఏ సినిమా థియేటర్ కి వెళ్ళాలి అని. ఇదేమిటి ఏసీ థియేటర్ కావాలంటే చాలా ఉన్నాయిగా ఈ మహా నగరంలో అంటే అది కాదు ఇక్కడ సమస్య. 


మనం వెళ్తున్నది పని ఎగ్గొట్టి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆన్ డ్యూటీ! పొరపాటున సహోద్యోగులైవరైనా మనం  సినిమాకి వెళ్లడం చూస్తే! అసలే సేల్స్ వాళ్ళకి ఆఫీస్ అంతా శత్రువులే! ఎందుకంటే సేల్స్ వాళ్ళు మిగతా కొల్లీగ్స్ దగ్గర పోజులు కొడతారు. మేము ఓ తెగ కష్టపడి, ఎండనక, వాననక రోడ్లు మీద తెగ తిరిగి, చెమటలు కక్కి మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మబట్టి మీ అందరికీ జీతాలొస్తున్నాయి! మరంచేత మేము లేకపోతే సేల్స్ ఉండవు. డబ్బులు రావు. మీకు జీతాలు రావహో అని మొహం మీద అనకపోయినా అందరికీ అర్ధమయ్యేలా పోజులు కొడుతూంటాం. అందుకని అందరికీ  మా మీద పీకల దాకా ఉంటుంది. కసి. ఛాన్స్ దొరికితే  అధః పాతాళానికి తొక్కేయ్యడానికి దేశ సరిహద్దుల్లో సైనికుల్లా ఎవరెడీ. అందుకని కూసింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి!

  

అందుకని మా ఆఫీస్  వాళ్ళు ఎవ్వరూ చుట్టుపక్కల ఉండని, తిరగని ఏరియా చూసుకుని అక్కడున్న థియేటర్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూడాలి. 


అప్పుడు అలాంటి ఏరియా ఏముందబ్బా అని ఇంకో టీ తాగి ఆలోచిస్తే తట్టింది. మొజంజాహి మార్కెట్ లో ఒక  థియేటర్ ఉంది. అక్కడ అయితే  మా ఆఫీస్ వాళ్ళెవ్వరూ తిరిగరు. వెంటనే  బైక్ మీద  ఆఘమేఘాల మీద ఆ థియేటర్ కి వెళ్ళా. దాని పేరు సరిగ్గా గుర్తులేదు. విక్రాంతా? ఏమో?


ఆ థియేటర్లో ఓ చెత్త హిందీ సినిమా ఆడుతోంది. చెత్త  అని చూసాక తెలిసిందనుకోండి! చెత్త సినిమా, నూన్ షో కాబట్టి  టికెట్  దొరికింది. సీట్ ఏం  ఖర్మ  రో మొత్తం ఇమ్మన్నా ఇచ్చేట్టున్నాడు. సరే టికెట్ కొనుక్కుని  లోపలి వెళ్లి ఓ సీట్లో కూలపడ్డా


కాస్సేపయ్యాక సినిమా బోర్ కొట్టడం  మొదలయ్యింది. కానీ బైటికెళ్లి చేసేదేమి లేదు కాబట్టి వీలయ్యినంత సేపు భరిద్దామనుకున్నా


అప్పుడు మొదలయ్యింది!


ఏమిటా? 


ఇంకేమిటి? 


ఓ అమాయక బుగ్గ నొక్కితే పాలు కారే పసివాడి ర్యాగింగ్! ఎవడా పసివాడంటే ఎవడో అయితే నాకేంటి? నేనే?


మిమ్మల్ని ర్యాగింగ్ చేసిందెవరండీ అంటే వాళ్ళు ఆడ రాక్షషులు! 


ఎలా ర్యాగింగ్ మొదలెట్టారంటే నా మీద వీర డైలాగ్స్ వేయడం మొదలెట్టారు! ఎందుకంటే వాళ్ళక్కూడా సినిమా బోర్  కొట్టింది. నా మీద డైలాగ్స్ వేస్తున్నది ఎవర్రా బాబూ  అని ఓసారి ధైర్యం చేసి మీద అతి కొంచం వెనక్కి తిప్పి చూస్తే ఓ ముగ్గురో నాలుగురో మెడికోలు! మెడికోలు అని ఎలా తెలిసిందంటే అందరూ ఆ తెల్ల ఎప్రాన్ వేసుకున్నారు. 


అప్పుడు వెలిగింది నాకు అక్కడికి దగ్గర్లోనే మెడికల్ కాలేజీ ఉందని. నేనాఫీసు ఎగ్గొట్టి సినిమాకొస్తే వాళ్ళు కాలేజీ ఎగ్గొట్టి వచ్చారని. 


కానీ నా ఖర్మ కొద్దీ సినిమా ఎవ్వరినీ ఆకట్టుకోలేదు. ఇహ అందుకని నాతొ ఆడుకోవడం మొదలెట్టారు. బహుశా వాళ్ళ సీనియర్స్  వాళ్ళని ర్యాగింగ్ చేసిన రోజులు గుర్తుకు  తెచ్చుకుని ఆ కసంతా ఇక్కడ కక్కారు


అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజుల్లో నేను దాదాపు అందరు పెళ్లి కానీ అబ్బాయిల్లాగానే బాగా సన్నగా ఉండేవాడిని. 


ఇహ వాళ్ళ  డైలాగ్స్ ఇలా వాళ్ళ మెడికల్ భాషలో  సాగాయి 


"పాపం ఈ అబ్బాయేమిటే ఇంత బక్కగున్నాడు?" - సన్నగా ఉన్నాడనచ్చుగా?


"హిమోగ్లోబిన్ తక్కువయ్యిందేమోనే"


"థైరాయిడ్ ప్రాబ్లెమ్  ఏమో?"


"మరీ ఎనీమిక్ గా ఉన్నాడు గట్టిగా గాలేస్తే ఎగిరిపోతాడో ఏమిటో"


"బహుశా ఈ మధ్యే టీబీ వచ్చిందేమో"


"లేదే? టీబీ తిరగపెట్టిందేమో"


నాకేమో విపరీతమైన కోపం వచ్చేస్తోంది. కానీ  ఏం చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే నేను సింహంలా సింగిల్! కానీ కొంచం తిండి దొరకని సన్నటి సింహం! వాళ్లేమో నలుగురు ఆడ  తోడేళ్ళు! డైలాగ్స్ తో  నా ప్రాణం తోడేస్తున్నారు!


ఇంకా ఇలాంటివే నాకు తెలీని, ఇప్పుడు గుర్తులేని బోల్డు మెడికల్ మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపుకు  తిన్నారు. 


ఇహ వాళ్ళ బాధ పడలేక లేచి దూరంగా ఇంకో  సీట్లో కూర్చుందామని లేచాను. కానీ  షర్ట్ సీట్ కి అతుక్కుని కొంచం విసిగించింది. గట్టిగా లేచేటప్పటికి వచ్చింది. ఇంటికొచ్చాక అర్ధమయ్యింది. సీట్ కి చూయింగ్ గం  అతికించారని. వాళ్ళు చేసిన పనో అంతకుముందు షో లో కూర్చున్నవాళ్ళు చేసిందో తెలీదు


నేను లేవగానే  డైలాగ్స్ ఆగలేదు!


"పాపం మన మాటలకి ఫీల్ అయ్యినట్టున్నాడే"


"స్కెలిటన్స్ కి ఫీలింగ్స్ ఉంటాయంటే"


"ఉంటాయే! ఇప్పుడు చూస్తున్నాం కదా"


నేను లేచిన వాడిని వెళ్లి వాళ్ళకి దూరంగా ఆరు వరసల అవతల వాళ్ళ వెనక వరసలో కూర్చున్నా. సినిమా నించి వాక్ అవుట్ చేద్దామనుకున్నా కానీ రెండు కారణాలు. 


ఒకటి వెళ్లి ఏం  చెయ్యాలి. అస్సయ్యాంగా పని చెయ్యాలి. పనెగ్గొడదామని కదా సినిమాకొచ్చింది. పైగా ఇప్పుడు మూడ్ ఇంకా పాడయ్యిపోయింది. 


ఇంటర్వెల్ లో వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇహ  ఏ నిమిషంలో  అయినా ఇంటర్వెల్ ఇస్తాడని టైం చూసుకుని ఆ చీకట్లోనే బైటికి వెళ్ళిపోయా. ఎందుకంటే ఇంటర్వెల్ లో బైటికెళ్తే నా మొహం ఆ సుందరులు చూసేడుస్తారుగా? మళ్ళీ అదో అవమానం. రేప్పొద్దున్న బైటెక్కడన్నా కనిపిస్తే! 


ఇంకా విధి వెక్కిరిస్తే, వక్రిస్తే నేను మ్యారేజ్ లుకింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ సంబంధం వీళ్లల్లో ఎవరిదైనా అయితే? వామ్మో! ఇంకేమైనా ఉందా?


అందుకని వెంటనే ఓ గంట సినిమా అయ్యాక లేచి వెళ్తూ  వెళ్తూ వాళ్ళ వరస దగ్గరికొచ్చాక వాళ్ళకి వినిపించేట్టు "మీ అందరికీ మాయాస్థానియా గ్రేవీస్ ఉన్నట్టుంది" అనేసి తుర్రుమన్నా. 


ఈ Myasthenia gravis ఏంటండీ బాబూ అంటే - అప్పటికి రెండేళ్ళ ముందు 1983 లో కూలీ సినిమా షూటింగ్ లో అమితాబ్ కి దెబ్బ  తగిలి కొన్ని నెలలు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ లో ఉన్నారు. అప్పుడు చివరికి  డాక్టర్స్ ఆయనకీ వచ్చిన  జబ్బేమిటంటే Myasthenia gravis అన్నారు. అందుకని ఆ పేరు నాకు బాగా గుర్తున్న ఓ పెద్ద  జబ్బు పేరు. వాళ్ళు మెడికోలు కాబట్టి నన్ను మెడికల్ టర్మ్స్ తో నానా మాటలన్నారు కాబట్టి అలా ఓ 50 గ్రాముల కసి తీర్చుకున్నా వాళ్ళ మెడికల్ భాషలోనే ఓ పెద్ద  జబ్బు పేరుతొ! అంతకు మించి ఆ వ్యాధి  లక్షణాలు నాకు తెలీవు!


బైటికొచ్చాక మయసభలో దుర్యోధనుడి ఫీలింగ్స్! హేంత హవమానం! ఆ బాధ  తట్టుకోలేక ఏదైనా బార్ కి వెళ్లి ఓ బీర్ కొట్టేద్దామనుకున్నా!


కానీ కొట్టలేదు! మళ్ళీ  రెండు కారణాలు. ఈ ఏరియాలో  అయితే మా సహోద్యోగులు ఉండరు కానీ ఇక్కడ దరిదాపుల్లో బార్ లేదు. బార్లుండే ప్రదేశాల్లో ఉండే  అవకాశం ఎక్కువ! రెండో కారణం ఏంటంటే పనెగ్గొట్టి సినిమాకి వెళ్తే చిన్న తప్పు. ఏదో జరిమానాతో  పోతుంది. కానీ ఆన్  డ్యూటీ మందు కొడితే ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంది! అందుకని నేను కూడా దుర్యోధనుడిలా ఏమి  తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు


ఇవాళ నా  టైం  బాలేదు అని సరిపెట్టుకున్నా 


కానీ ఓ డెసిషన్ తీసుకున్నా. ఇహ ముందు ఇలా ఒంటరిగా సినిమాకెళ్తే మట్టుకు చుట్టుపక్కల ఉమెన్స్ కాలేజీలు, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఉండని ఏరియాలో ఉన్న థియేటర్ కే వెళ్లాలని!


కానీ తర్వాత మళ్ళీ 3 దశాబ్దాలు ఒక్కడినే సినిమాకి వెళ్ళలేదు!


కట్  చేసి ఓ ఆరేళ్ళు  వెనక్కెళ్తే ఆ మధ్య  మళ్ళీ నా మీద, నా వ్యాపారం మీద, ఈ సమాజంమీద బాగా కోపమొచ్చి మళ్ళీ ఆఫీస్ ఎగ్గొట్టి ఓ రోజు మధ్యాహ్నం ఒక్కడినే మ్యాటినీకి వెళ్ళాను. మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న టివోలికి. ఇంగ్లీష్  సినిమా! మార్స్  అనుకుంటా పేరు. ఒక ఆస్ట్రోనాట్ మార్స్ మీద ఉండిపోతాడు. మిగతా వాళ్ళు వాడొక్కడిని వదిలేసి వెళ్ళిపోతారు. హీరో పాపం మళ్ళీ నాసా వాళ్ళు ఇంకో రెస్క్యూ రాకెట్ పంపేదాకా అక్కడే మొక్కలు పెంచుకుని తింటూ కాలక్షేపం చేస్తూంటాడు. 


ఇప్పుడు మేటర్ ఆ సినిమా కధ కాదు


నేను సినిమా సీరియస్ గా చూస్తూంటే చుట్టూ డాల్బీ  డిజిటల్  సరౌండ్ సిస్టం టైపులో ఇకఇకలు. పకపకలు. ఏమిటని తేరిపారా చూస్తే అర్ధమయ్యింది. ఈ సిటీలో యువతరం మాటినీ షో కి సినిమా చూడ్డానికి రారు. సినిమా థియేటర్ లో సినిమా  వేషాలెయ్యడానికని! సినిమాకి సెన్సార్ ఉంటుంది కానీ వీళ్ళ సినిమా వేషాలకి ఉండదుగా 


థియేటర్ మొత్తం  యువ జంటలే! పెళ్లి కాని జంటలేనండోయ్! వాళ్లకి పెళ్లి  కాలేదని ఆ థియేటర్ చీకట్లో మీకెలా తెలిసిందంటారా? ఒక చిన్న లాజిక్ ఉంది. జో ఘర్ మీ కర్తా ఓ బాహర్ నహి కర్తా! జో బాహర్ కర్తా ఉస్కో ఘర్ నహి రెహ్తా (ఇలా వేషాలెయ్యడానికి!)! సినిమా మొదలవ్వగానే ఇంకేముంది థియేటర్ అంతా చీకటి. తెర మీద సినిమా. థియేటర్ అంత బోల్డు మినీ సినిమాలు! 


నేను అనే ఓ పెద్ద మనిషిని ఉన్నానన్న భయం, బెదురూ కూడా లేవు. 


ఇంకేముంది. షరా మామూలే! నేను ఇంటర్వెల్ లో వాకౌట్! 


సివరాకరికి నాకర్ధమయ్యింది ఏమిటంటే మన దేశానికి నిజ స్వాతంత్రం రాలేదని. ఎందుకంటే ఓ మహానుభావుడన్నాడు "ఎప్పుడైతే మన దేశంలో ఒక మగాడు ఒంటరిగా సినిమాకి వెళ్లగలిగిన నాదే నిజమైన స్వాతంత్రం వఛ్చినట్టు"


ముఖ్య గమనిక: ఈ రెండూ సంఘటనలూ నిజంగా జరిగినవే! కాకపొతే  సినిమాటిక్ లిబర్టీస్ అని రచయితలకి ఉంటాయి. కాబట్టి చిటికంత జరిగితే చిలవలు పలవలు చేసి టీవీ చానెల్స్ వాళ్ళల్లా గుప్పెడంత రాస్తా! 


ఇంకోటి నేనెప్పుడూ ఆడపిల్లలని ర్యాగింగ్ చెయ్యలేదు. ఏదో  1 to 1 సరదా కామెంట్స్ చాలాసార్లు చేసాను. గ్రూప్ లో ఉన్నప్పుడు అంటే నేను ముగ్గురు నలుగురు అబ్బాయిలతో  ఉన్నప్పుడు ఎవరైనా ఒంటరి ఆడపిల్లని ఎప్పుడూ  కామెంట్స్ చెయ్యలేదు. ఏడిపించలేదు.


ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ఇలా రాస్తున్నానని నేనేదో పెద్ద prude అని పొరపాటు పడకండి. ఇప్పుడు నేను యువకుడిగా ఉంటే ఈ యువతరం కంటే ఎక్కువగా, ఘోరంగా ప్రవర్తించేవాడిని. మా రోజుల్లో మాకిప్పుడున్న అవకాశాలు, సదుపాయాలు లేవు కాబట్టి అందరం పతివ్రతలమే అప్పుడు

Saturday, July 7, 2018

లైట్ లేలో! Lite Lelo!!

ముందస్తు మాట: ఈ నా "రచన" ఆంధ్రప్రభ నవంబర్, 1992 లో వేసారు. 

ముందు మాట: ఆ ఆంధ్రప్రభ లో పడిన రచన scanned పేజెస్ ఇక్కడ చాలాకాలం క్రితం పోస్ట్ చేసాను. కాని తర్వాత అర్థం అయ్యింది. ఈ మధ్య అందరూ పేస్బుక్ మొబైల్ లో చూస్తున్నారనీ, వాళ్లకి ఆ scanned పేజెస్ చదవడం ఇబ్బందనీ, అందుకని దాదాపుగా ఎవ్వరూ చదవలేదనీ కొంచం లేటుగా తెలుసుకున్నాను :(   అందుకని మీ అందరికోసం మళ్ళీ తెలుగులో టైపు చేసి పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో వానాకాలంలో పెద్ద వానలు పడలేదు నిన్నటిదాకా! టాపికల్ అని మరొక్క సారి  
; కథా ప్రారంభం!!

"లైట్ లేలో"

ఓ రోజు ఆఫీసులో తీరిగ్గా కూర్చున్నప్పుడు, అంటే రోజూ తీరికే - అది వేరే విషయం , మా శర్మ నా దగ్గరకొచ్చి "ఇహ నా వాళ్ళ కాదండీ!" అన్నాడు. 

ఇందులో కొత్తేమీ లేదు. వింత అంతకన్నా లేదు. కనీసం రెండు మూడు రోజులకోసారైనా శర్మ నోటినుంచి ఆ డైలాగ్ వినిపిస్తూంటుంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కో కారణం. 

ఇప్పుడేమయ్యిందో?!

అదే అడిగాను. 

"వానలగురించి ఆకాశంలోకి చూసి చూసి మెడ పట్టుకుపోతోందే తప్ప ఒక్క చినుకైనా రాలలేదు కదా?" అన్నాడు మెడ పట్టుకుని. 

అతనన్నదాంట్లో ఆవగింజంత అబద్ధం కానీ అతిశయోక్తి కాని లేవు. ఈ ఏడాది హైదరాబాద్ ప్రజానీకం వానలకు ఎంత మొహం వాచిపోయారంటే, ప్రతిరోజూ సాయంత్రం - పగలు పనులుంటాయి కదా - ఇంటిముందు కుర్చీ వేసుకుని ఆకాశంలోకి చూడటం ఒక అలవాటైపోయింది. 

ప్రజలంతా చకోరపక్షులైపోయారు కాని చుక్క వాన లెదు. 

"మా కాలనీలో నిన్న ఓ నిమిషం వాన పడిందోయ్!" అని అదేదో డబల్ మర్డర్ అయినంత సెన్సేషనల్ న్యూస్ లాగా జనం చెప్పుకోవడం చిన్న ఫాషన్ కూడా అయ్యింది. 

సరే, కథ మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మా శర్మ దగ్గరికి, ఆయన అరిగిపోయిన డైలాగ్ దగ్గరికి వద్దాం. మా శర్మకి ఏదో విధంగా ధైర్యం నూరిపోయకపోతే ఆయన ఇంకా నీరు కారిపోవడం, అతన్నలా చూసిన మిగతా వాళ్ళందరూ జావ కారిపోవడం వగైరా ప్రమాదం ఉంది. ఎంచేతంటే మా అందరిలోనూ శర్మ చాలా భారీ మనిషి. కొద్దో, గొప్పో చిన్న లీడర్ కూడా . మరంచేత అతన్ని కొంచం మూడ్ లోకి తెద్దామని "అయితే పదండి! "దేవి" లో మంచి సినిమా ఆడుతోంది దాన్నిండా వాన పాటలే!" అన్నాను 

ఈ డైలాగ్ మిగతా ఆంధ్రులకు కొంచం వింతగా అనిపించినా, మా హైదరా"బాధీ"యులకు మాత్రం ఏ మాత్రం వింత కాదు. ఇన్నాళ్ళూ మేము కూడా సినిమాలకి "చిరు"ని చూడ్డానికో, "విజైశాంతి" రెచ్చిపోయిందనో, అదీ, ఇదీ కాకపోతే పాటలు సూపర్ హిట్లనో వెళ్ళేవాళ్ళం. 

కాని ఇప్పుడో - సినిమాలో వాన ఉంటె చాలు రెచ్చిపోయి చూసేస్తున్నాం. లేకపోతే వానలు ఎలా ఉంటాయో మరిచిపోయే ప్రమాదం ఉంది కదా! 

ఈనాడన్ని సినిమాల్లోనూ ఓ వాన పాట మస్ట్. మన అదృష్టం బాగుంటే రెండు వాన పాటలు. ఇంక ఆ సినిమా మా ఊళ్ళోమట్టుకు వందరోజులు ఖాయం. "ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి పాటలు వగైరా సినిమాలో పెడుతున్నాం" అని నిర్మాతలు, దర్శకులు చెప్పడం ఎంత నిఝమ్!!

కాగా, పోగా ఇప్పుడు మేము "చిరు"కోసం కాకుండా చిరుజల్లు కోసం సినిమా చూస్తున్నాం!

అసలీ ఏడాది వానలెందుకు పడటంలేదు అని ఈ మధ్య టీవీలో వాతావరణ శాఖ డైరెక్టర్నిడైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసారు. 

"వానలు పడకపోవడం ఏమిటి?! శుభ్రంగా పడుతున్నాయి" అన్నాడాయన. 

ఆ ఇంటర్వ్యూ ని తిలకిస్తున్న ప్రజానీకం సగంమంది మూర్ఛపోయారు. ఇంటర్వ్యూ చేసే అమ్మాయి కూడా మూర్చిల్లింది. వెంటనే ఆ వాతావరణ డైరెక్టర్ పక్కనే ఉన్న గ్లాస్ లోని నీళ్ళు - కొంప తీసి అవే వాన నీళ్లంటాడేమో? - ఆ అమ్మాయి మొహం మీద చల్లాడు. ఆ ఉపశమనానికి ఆమె "లైట్"గా తేరుకొని వెర్రి చూపులు చూడటం ప్రారంభించింది. 

ఇంక ఆ డైరెక్టర్ గారు (వాతావరణ శాఖ) పరిస్థితి అర్థం చేసుకుని తనే ప్రశ్న వేసుకుని, తనే జవాబు చెప్పి ద్విపాత్రాభినయం చేసాడు. దాని సారాంశం ఏమిటంటే .. 

"హైదరాబాద్ లో వానలు చాలా భారీగానే పడుతున్నాయట. అయితే మబ్బుల్లోనుంచి కిందకి ప్రయాణం కట్టిన చినుకులు ఈ భూమ్మీద వేడికి మార్గమధ్యంలోనే ఆవిరైపోయి మళ్ళీ మబ్బులైపోతున్నాయిట. ఇదొక విషవలయంగా తయారయ్యిందిట. దీనికేమైనా ప్రత్యేకమైన చర్యలు సిఫారసు చెయ్యమని ప్రభుత్వం ఓ "మబ్బు కమిటీ"ని కూడా వేసిందిట. వాళ్ళ నివేదిక అందగానే తక్షణ చర్యలు తీసుకుంటారుట. అప్పటివరకు హైదరాబాద్ లో వానలు పడతాయి కాని భూమ్మీద పడవుట. అంటే "టెక్నికల్"గా వానలు పడుతున్నాయి కాని "ప్రాక్టికల్"గా కాదుట" వగైరా వగైరా - ఇలాగే సాగింది ఆయన ఇంటర్వ్యూ ప్రహసనం.

పాపం ఈ పడీపడని వానలకి మొన్న ఆదివారం మావాడు - అయిదేళ్ళ కుర్రకుంక బలైపోయాడు. అదెలాగంటే - ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకి బైట ఆడుకుంటున్న వాడు లోపలికి పరిగెత్తుకొచ్చాడు. 

"అమ్మా! అమ్మా! వాన ....వాన పడుతోంది" వాడి ఆవేశానికి, ఆనందానికి పట్టపగ్గాల్లేవు. 
 
కాని జీవితంలో అన్ని ఆనందాలు క్షణికమే అని వాడికి ఓ క్షణం ఆలస్యంగా తెలిసింది!

ముందు వాడు, వాడి వెనకాల వాళ్ళ అమ్మ, నేను బయటకు పరిగెత్తాం. "ఏరా, వెధవా! వేలెడంత లేవు! అప్పుడే అబద్ధాలు మొదలెట్టావా?" అని వాడిని బాదేసింది కన్నతల్లి. 
 
ఆవిడకు ప్రధమ కోపంలెండి!

పాపం! వీడికి మతిపోయింది. వాడు లోపలికి 100 కిలోమీటర్ల వేగాన పరిగెత్తాడే? అయిదు సెకన్ల క్రితం పడిన వాన ఏమైనట్టు? వాన పోయి దెబ్బలు మిగిలాయి. 

"వర్షాధార బతుకు"లంటే ఇవేనా?!

వాడు వాకిట్లో ఉన్నప్పుడు చినుకులు మొదలెట్టడం నిజం. కాని వాడు లోపలి వచ్చి, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పటికి ఆ పడిన నాలుగు చినుకులు ఆవిరైపోవడం, అది నాలుగు చినుకుల వానగానే ఆగిపోవడం, వాడి వీపు విమానం మోత మోగడం చాల దారుణంగా జరిగిపోయాయి. 

కేవలం "క్షణక్షణముల్ హైదరాబాద్ వానల్". 

ఈ మధ్య ఈ ఊళ్ళో పెళ్ళిళ్ళల్లో గుమ్మం దగ్గర పన్నీరు జల్లడం మానేశారు. ఎందుకా? అమ్మాయిలు పన్నీరు బుడ్డీతో తలమీద పన్నీరు చల్లగానే - ఇక ఈ జీవితంలో వానలు చూడవేమో అని బెంగపెట్టుకున్న ప్రజల నెత్తిమీద నిజంగా పన్నీరు జల్లులా అనిపించి ఎవ్వరూ అక్కడినుండి కదలడం మానేశారు. దాంతో పన్నీరంతా అయిపోయి, అమ్మాయిలు చేతులు నొప్పి పెట్టి, వాళ్ళు నీరు కారిపోయి, ఇక చల్లడానికేమీ మిగలక ఈ సంప్రదాయాన్ని మానేశారు. 

ఇంతకీ అసలు కథ - మొత్తానికి శర్మని దేవీలో సినిమాకి లాక్కుపోయాను. సినిమా అయ్యాక జీవుడు తెగ ఆనందపడిపోయాడు. నేను స్కూటర్ తీస్తున్నాను. 

"ఏమండోయ్! సినిమాలో వాన కొంపతీసి హాల్ల్లోగాని పడిందేవిటండీ?" అన్నాడు మహదానందంగా. 

కొంపతీసి ఈ చకోరపక్షిగాడికి చూడక చూడక రెండు వానలు చూడగానే పిచ్చెక్కలేదు కదా? పూర్ ఫెలో!

"ఎందుకొచ్చిందా సందేహం?" సందేహించాను. 

"మరేం లేదు. బట్టలన్నీ తడిసి ముద్దయిపోతేను!" అన్నాడు శర్మ 

అది వాన మహత్యం కాదని, ఆ హాల్ ఏ.సి. మహాత్యం అని చాల కష్టపడి నమ్మించాను. కాని తరువాత జాలేసింది. 

ఆ అమాయకుడిని ఆ వెర్రి నమ్మకంలోనే ఉంచేస్తే బాగుండేదేమో?!