Tuesday, July 12, 2016

నేనే రోజూ సంగీత కచేరీ చెయ్యడంలోఉన్నకిక్కే వేరప్పా

రోజూలాగే ఇవాళ పొద్దున్న కూడా నా పనులు చేసుకుంటూ, అంటే స్నానం, ధ్యానం, సంధ్యావందనం (అతిశయోక్తి!) వంటా వార్పూ, మధ్య మధ్యలో ఫేస్బుక్ అన్నమాట, సినిమాల్లో నేపధ్య సంగీతం ఉంటుంది కాని నిజ జీవితంలో ఆ సౌకర్యం ఉండదు కాబట్టి, నేనే ఏవో పాటలు పాడుకుంటూ ఉంటాను! శ్రోతలు కోరిన పాటలు కాదు. శ్రోతలు వద్దన్నా పాడే పాటలు!

మాములుగా అయితే భక్తి పాటలు. ముందు రోజు ఒక పెద్ద అమౌంట్ కి చెక్ వచ్చినా, లేక ఇవ్వాళ ఆఫీస్ లో బొత్తిగా పని లేదని గుర్తొచ్చినా ఒకింత "కెవ్వు కేక" టైపు పాటలు (చుట్టు పక్కల జనం కెవ్వు కేకలు పెట్టినా సరే!) ;)

ఇవాళ పై రెండు కండిషన్లు లేవు కాబట్టి కేవలం భక్తిపాటలే గొంతెత్తి పాడుకున్నా. "బంటు రీతి కొలువు ఈయవయ్య రామా" అని ఆర్ద్రత తో పాడుతూంటే అలా నాకు తెలీకుండానే "ఆనతినీయరా హరా" లోకి అలా, అలా వెళ్ళిపోయాను.

ఇలా ఒక పాటలోంచి ఇంకో పాటలోకి సునాయాసంగా, అపశ్రుతులు పలకకుండా వెళ్ళిపోయే చాకచక్యం, అలవాటు ఉన్నాయి నాకు. రెండు పాటలు రెండు రాగాలు అయినా సరే! జన్మతః గాయకుడికి రాగాలతో పనేమిటి? పోనీ రాగమాలిక అనుకోండి.

నేను బహుశా పూర్వజన్మలో సంగీతం ఎవరి మీదో కోపం వచ్చి (బహుశా నాకు సహనంతో సరిగ్గా నేర్పించని సంగీతం మాస్టరు మీదే అయ్యుంటుంది!) సగం నేర్చుకొని వదిలేసి ఉంటాను :( అందుకే ఇలా ఇప్పుడు పాటలు భావయుక్తంగా, అపశ్రుతులు దొర్లకుండా పాడడం వచ్చింది కాని రాగాల పేర్లు తెలీవు!! అయినా సంసారవాదులకి, సంగీతప్రియులకి పేర్లతో ఏం పని?

ఇలా ఒక పాటలోంచి ఇంకో పాటలోకి, మళ్ళీ అందులోంచి మొదటి పాటలోకి అటూ, ఇటూ తిరిగేస్తూ (ఇంట్లో కూడా!) పాడేస్తూంటే అదొక చెప్పలేని, చెప్పుకోలేని అలౌకిక ఆనందం. అనుభవిస్తే కాని తెలీదు అందులో మజా!

చిన్నప్పుడు ఓ ఏడాది పాటు మృదంగం నేర్చుకున్నా. జనాల్ని వాయించడానికి అది చాలనిపించి అక్కడితో ఆపేసా! ఇలా పొద్దున్న పాటలు పడుతున్నప్పుడు మరీ పారవశ్యం వచ్చేస్తే ఏ డైనింగ్ టేబుల్ మీదో, వంటింట్లో ఉంటే గిన్నెల మీదో నా పాటకి నేనే వెనకాల వాద్యసహకారం! ద్విపాత్రాపోషణ అన్నమాట. అప్పుడప్పుడూ గిన్నెల్లో నీళ్ళు పోసి జలతరంగిణి ఎఫ్ఫెక్ట్ కూడా ప్రదర్శిస్తాను ;) ఇన్ని కళలు ఒకే వ్యక్తిలో ఉండడం నా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం! అర్ధం చేసుకోరూ?!

ఇలా నేనే రోజూ సంగీత కచేరీ చెయ్యడంలోఉన్నకిక్కే వేరప్పా ;) 

1 comment:

  1. మహదానంద మయ్యింది మహానుభావా!మొత్తానికి డ్రమ్ములు, డ్రమ్ములు కొడతారన్నమాట! అందుకే " అగాధమౌ జలనిధి లోనా ఆణి ముత్యముంది" అన్నారు కవులు.

    ReplyDelete