Wednesday, August 29, 2018

Ladies fingers!

Ladies fingers లేదా ఈ ఆడోళ్ళున్నారే !!

"ఈ ఆడోల్లున్నారే"అన్న టైటిల్ పెట్టడంలో ఒక మార్కెటింగ్ రహస్యం ఉంది! ఇలా రాస్తే మగోళ్ళూ, ఆడోళ్ళు కూడా చదువుతారు 😎

ఇహ కధలోకొస్తే మా ఆవిడ మంచంమీదున్న (ఎప్పుడూ) వాళ్ళ అమ్మకి పొద్దున్నే చెయ్యాల్సిన సేవా కార్యక్రమంలో జర బిజీబిజీ గా ఉండడంతో మాది అన్యోన్య దాంపత్యం కదా అని మా ఆవిడ మా అత్తగారికి సేవ చేస్తూంటే నేను మా ఆవిడకి సాయం చేద్దామన్న సదుద్దేశంతో ఏం చెయ్యాలా అని ఓ నిమిషం కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ ఆలోచించాను. రెండో నిమిషం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. థాంక్స్ టు వాట్సాప్! 

అదెలాగంటే రోజూ వాట్సాప్లో బోలుడు సుభాషితాలు వస్తూంటాయి కదా? అవన్నీ గుర్తుండకపోయినా నాకొకటి ఇప్పుడు గుర్తొచ్చింది. అది ఎవరన్నారో గుర్తులేదు. రోజూ విపరీతంగా డజన్లకొద్దీ సుభాషితాలు చదివితే ఒకటే ఆ కొటేషన్ చెప్పిన గొప్పవాళ్ళ పేరు గుర్తుంటుంది. లేదా ఆ కొటేషన్ గుర్తుంటుంది. రెండూ గుర్తుండడం నాలాంటి వయసు మీద పడ్డ వాళ్లకి ఒకింత దుర్లభం. ఇంతకీ ఓ మహానుభావుడు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది (చెప్పాగా ఏదో ఒకటే గుర్తుంటుంది అని ... ఆయన పేరు గుర్తులేదు!) అదేమిటంటే "నేను ఒక చెట్టుని 8 గంటల్లో కొట్టాలంటే అందులో 6 గంటలు నేను గొడ్డలి పదును పెడతాను అని"

అంతే కార్యోన్ముఖుడినయ్యి రయ్యిమని వంటింట్లోకి దూసుకుపోయి మా ఆవిడ కూరలు తరిగే కత్తిని (దాన్ని కత్తి అంటారో చాకు అంటారో నాకు ఇదమిద్ధంగా తెలీదు!) రుబ్బురోలు పత్రం మీద ఓ ఇరవై నిమిషాలు సానపెట్టాను. ఎందుకంటే మా ఆవిడ ఓ అరగంటలో బెండకాయలు తరగడానికి  వస్తుంది. అందుకని ఆ పెద్దమనిషి చెప్పిన ఫార్ముల పాటించి దాదాపు 75% సమయం కత్తి సానపెట్టాను. ఆ తర్వాత నా ఆఫీస్ రూంలోకి వెళ్లి సగటు భారేతీయుడిలాగా పొద్దున్నే ఓ డజన్ గ్రూపుల్లో నాలుగు గుడ్ మార్నింగ్ ఫోటోలు, ఒక గ్రూప్ లో వచ్చిన వీడియోలు ఇంకో డజను గ్రూపులకి ఫార్వర్డ్ చేస్తూ నా వంతు సగటు భారతీయుడిని పొద్దున్నే సుభాషితాలతో మేల్కొల్పే భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తూండగా...

"కెవ్వు కేక"!!!

నాకు "కెవ్వుకేక" పాట పూర్తిగా రాకపోయినా ఆ ట్యూన్, పాడిన గాయని గొంతు బాగా తెలుసు. కాని ఈ "కెవ్వుకేక" ఆ గొంతులా, ఆ ట్యూన్ లో లేదు!! అదేమిట్రా ఇలాగుంది అని నేను ఓ క్షణం ఆలోచించే లోపల మళ్ళీ

"కెవ్వు కేక"!!!

ఈసారి ఆ గొంతు మా ఆవిడ గొంతులా ధ్వనించింది. మరిహంతే "సిరికిం చెప్పడు..." టైపులో నాలుగంగల్లో వంటింట్లోకి దూసుకుపోయాను. అంతే! అక్కడ చూసిన దృశ్యంతో నేను షాక్! మా ఆవిడ ఎడమ చేతినించి రక్తం పాడయ్యిపోయిన కొళాయిలోంచి కారే నీళ్ళలా అలా ధారాపాతంగా కారిపోతోంది! మా ఆవిడ అప్పుడు నన్ను చూసిన చూపుకి అర్ధం చెప్పడం నావల్ల కాదు! "కత్తి సానపట్టానని ఒక్క మాట చెప్పితే మీ సొమ్మేం పోతుంది" చూడండి బంగారంలాంటి నా వేలు ఎలా తెగిందో... అసలు ఎప్పటికి నేర్చుకుంటారు మీరు?" అంటూ అలా ఏదో అంటూనే ఉంది. ఇలాంటి సీనుల్లో అదే మగాడి వేలు తెగితే ఆడోళ్ళు వెంటనే చీర కొంగు చింపి (నిజ జీవితంలో అయితే అది పాత చీర అయితేనే!) వెంటనే ఆ వేలుకి కట్టు కట్టేస్తారు. కాని మగాళ్ళకి ఆ సదుపాయం లేదే! నేను కట్టుకున్న లుంగీ అలాగే చింపేస్తే ఒక్క రవ్వ అసయ్యంగా, అసభ్యంగా ఉంటుందని అలోచించి ఆ పని విరమించి "వేలు పంప్ నీళ్ళకింద పెట్టు" అని ఓ బోడి సలహా పడేసా!

అయినా నాకు తెలీక అడుగుతాను చేసిన పని చెప్పడం బోల్డు పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఫోటోలు, వీడియోలు తీసి ఫేస్బుక్ లోనూ, వాట్సాప్ లోనూ వెంటనే ఆలీసం చెయ్యకుండా పోస్ట్ చెయ్యడం నాలాంటి లోక కళ్యాణం కోసం పుట్టినవాళ్ళు చెయ్యని పని కదా? మరంచేత నేను మా ఆవిడకి చేసిన సాయం  వంశాచారం ప్రకారం అలా గుప్తంగానే ఉంచాను.చేసిన సాయానికి థాంక్స్ చెప్పడం పోయి అభియోగాలు. అందుకే అంటారు ఈ ఆడోళ్ళున్నారే అని!

అసలు నాకు తెలీక అడుగుతాను బెండకాయలు తరుగుతున్నప్పుడు అవి ఎంత లేడీస్ ఫింగర్స్ అయినా కత్తికింద సదరు లేడీస్ వాళ్ళ ఫింగర్ పెట్టి కట్చేస్తే అది మొండి కట్టి అయినా భారీగా తెగుతుంది కదా? మరి నన్నూ, నే సానపెట్టిన కత్తిని ఎందుకు ఆడిపోసుకోవడం?

ఊరికే అనరు!!  ఈ ఆడోళ్ళున్నారే