Showing posts with label sell. Show all posts
Showing posts with label sell. Show all posts

Thursday, February 18, 2016

అమ్మెయ్యండి బాస్! ఆ తర్వాత ...

బాగా ధనవంతుల సంగతేమో కాని మధ్య తరగతి వాళ్ళం సాధారణంగా పెళ్లి చేసుకొని సంసారం మొదలెట్టాక ఇంటికి కావాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఇంకోటి కొంటాం. 32" టీవీ, ఫ్రిడ్జ్, మోటార్ సైకిల్ లేదా బుజ్జి కారు మొదలైనవి.

ముందు అన్నీ ఇద్దరమే కాబట్టి, లేదా "హమ్ దో! హమారే దో!!" కాబట్టి అన్ని అప్పటికి సరిపోయేవి కొంటాం. అంటే 165 లీటర్ల ఫ్రిడ్జ్, ఓ బుజ్జి మారుతి కారు, ఒక డబుల్ కాట్ అలా అన్నమాట. కొన్నేళ్ళకి పిల్లలూ, మనమూ పెద్దవాళ్ళం అవ్వడంతో అవి సరిపోక పెద్ద సైజువి కొనాల్సిన పరిస్తితి వస్తుంది! లేదా కొన్నేళ్ళకి పాత వస్తువుల మీద మోజు తగ్గో, కొత్త వాటి మీద వ్యామోహం పెరిగో పాతవి అమ్మి, కొత్తవి కొంటాం!

ఈ మధ్య ఈ OLX వాళ్ళోకళ్ళు ! చీటికి మాటికి "అమ్మేయ్యండి బాస్" అని advertisements ఎటు చూసినా ఆదరగొట్టేస్తూంటారు!! సరే ఒకటమ్మి ఇంకోటి కొంటాం!

ఇక్కడే వస్తుంది ఒక ఇబ్బంది.

ఉదాహరణకి మన పాత చిన్న కారు అమ్మి కొత్తది పెద్ద కారు కొన్నాం అనుకోండి. మనం అలా కారు అమ్మి కొత్తది కొన్న కొన్నాళ్ళకి ఒక ఫ్రెండ్ ని కలుస్తాం! ఆ ఫ్రెండ్ ముందస్తుగా మన కొత్త కారు రేట్ అదీ కనుక్కొని అప్పుడు ఒక డైలాగ్ కొడతాడు ... సర్వసాధారణంగా!

అదేమిటంటే "నీ పాత కారు అమ్మే ముందు నాకొక్క మాట చెప్పక పోయావా గురూ?! నేను ఎప్పటి నించో ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు మా ఆవిడకి కొందామనుకుంటున్నాను . ఎంత పని చేశావు?!" అని దాదాపుగా అతనికి మనం అమ్మక ముందు చెప్పక పోవడం ఒక బ్రహ్మహత్యా పాతకం లాగా మన మీద కోర్టులు కూడా శిక్షించలేని, మనం భరించలేని నేరం మోపుతాడు :(

ఇహ అక్కడినించీ మనం ఆ సదరు ఫ్రెండ్ కి మనం ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యిపోయి ఏదో సంజాయిషీ ఇచ్చి "పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని" కుళ్ళి కుళ్ళి లోపల్లోపల కుమిలి పోతాం!!

మనం పాతది అమ్మిన ఆర్నెళ్ళదాకా మనల్ని ఇలా ఎవరో ఒకరు మన అదృష్టం బాగా లేకపోతే ఇద్దరు ముగ్గురు ఈ చెయ్యని, ఊహించని నేరం మోపుతారు! ఎలాగా అమ్మేసాం కదా ఇప్పుడు అడిగి ఏమి ప్రయోజనం అని ఊరుకోరు.

మీరు ఏది అమ్మండి. ఇదే పరిస్తితి.

దీనికి విరుగుడు ఒకటే! మనం ఏది అమ్ముదామనుకున్నా ముందస్తుగా మన బంధు, మిత్ర వర్గంలో అందరికీ ఒక SMS లేదా వాట్సాప్ మెసేజ్ పంపించడం. వీలైతే ఫేస్బుక్ లో కూడా పెట్టడం శ్రేయోదాయకం, శుభకరం, క్షేమం (ఈ చివరి మూడు మాటలు ఒక RTC బస్సు మీద రాసున్నాయి!!) ;)

మనల్ని ఇలా విసిగించే వాళ్లకి కూడా ఇంకో మార్గం ఉంది! అదేమిటంటే ఎవరు ఏ కొత్తది కొనుక్కున్నా (పాతవేవి అమ్మకుండా! అంటే 1st టైం అన్నమాట) ఉదాహరణకి మన ఫ్రెండ్ ఎవరైనా కొత్త కారు కొన్నారనుకోండి (అంతకు ముందు కారు లేకుండా, ఒక వేళ ఉంటే దాన్నమ్మకుండా!!) "గురూ! నువ్వు ఈ కారు ఎప్పుడైనా అమ్మితే నాకు ముందస్తుగా ఒక మాట చెప్పు" అని చెప్పాలి!

నేనిలా అన్నానని చెప్పి మిమ్మల్ని ఎవరైనా నూతన గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లి, ఇల్లంతా కలియ తిరిగి చూసి, వాస్తు కూడా వాకబు చేసి, శుభ్రంగా భోజనం చేసి వెళ్ళడానికి బయల్దేరినప్పుడు ఆ గృహస్తుతో "బాగుందోయ్ నీ కొత్త కొంప! సరిగ్గా ఇలాంటిదే, ఇదే ఏరియాలో చవగ్గా ఏమన్నా ఇల్లు దొరికితే కొందామనుకుంటున్నా! ఎప్పుడైనా అమ్మేద్దామనుకుంటే నాకు చెప్పు!" అని అనకండి!! మీకు వినిపించక పోయినా, Dolby డిజిటల్ సౌండ్ చేస్తూ ఆయన గుండె మూడు ముక్కలయ్యిపోతుంది :(

#Telugu