Wednesday, January 25, 2017

విసాపట్నం!!

నిన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే "యువత" ని ఇవాల్టికల్లా విసాపట్నం వచ్చెయ్యమన్నారుగా? నేను కూడా విసాపట్నం వెళ్తే పోలా?  నేను "యూత్" కిందే లెక్క కదా? అదేటది మొహం అలా పెట్టారు? అదేదో సినిమాలో ఎవరో సుందరి సునీల్ ని పట్టుకుని "నువ్వు యూత్ ఏంట్రా?" అని అడిగినట్టు ఎక్స్ప్రెషన్ !అయినా మీ పెద్దోల్లున్నారే?! మీకు యూత్ అంటే జెలసి!

అస్సలుకి మీకు "యూత్" అంటే ఎవరో తెలుసా? 40 నించి 60 సంవత్సరాల (మాంఛి) వయసులో ఉన్న కుర్రకారు! 20 నించి 40 మధ్య వయస్కులు టీన్ఏజ్ కుర్రకుంకలు! ఇవన్నీ రాజకీయకొలమానాలు. అన్ని పార్టీల యూత్ వింగ్  ప్రెసిడెంట్ల వయస్సులు ఓ పాలి గమనించ మనవి.

నేను ఒకింత బాలనెరుపుతో కొంత వయసుమీద పడ్డట్టు కనిపించినా అల్లా మజ్జెన అడక్కపోయినా కేజ్రివాల్ గారికి చూపించిన నా టెన్త్ క్లాసు సర్టిఫికేట్ లో ఉన్న వయస్సు ప్రకారం నేనింకా అరవయ్యో పడిలో పడలేదు కాబట్టి నేనింకా యూత్ కిందే లెక్క.

ఇహ అసలు మేటర్ కి వస్తే అలా అర్జెంటుగా విసాపట్నం వెళ్తే ఓ పనయ్యిపోతుంది కదా. "పవనం" అంటే అదే గాలి అటు వేపే కదా వీస్తోంది. ఎంచక్కా సముద్రం కూడా చూడచ్చు. చూసి చాలా రోజులయ్యింది. (ఈ మాట నిఝాంగా అబద్ధం!)

ఆలోచన రావడం ఆలీసం వెంటనే IRCTC సైట్ చూసా. ఒక్కటంటే ఒక్క టికెట్ లేదు. కనీసం నిక్కరేసుకొని అరటికెట్ కొనుక్కుందామంటే హాఫ్ సీట్ కూడా లేదు!

పోనీలే దేశం కోసం ఒకింత ఖర్చు పెడితే ఏం పోయిందని ఆదరాబాదరా హైదరాబాద్ నించి విసాపట్నం అన్ని ఫ్లైట్లు చెక్ చేశా. ఏముంది. అక్కడ కూడా నిరాశే. మన దేశం జనాభాలో 50% యూత్ అంటే ఏమిటో అనుకున్నా. నిఝంగా నిఝం!

బోల్డు సంవత్సరాలక్రితం అంటే నా టీన్ఏజ్ లో ఇలాగే ఎన్టీవోడు "తెలుగుదేశం పిలుస్తోంది! రా! కదలిరా!!" అని పిలవంగానే ఆయనమీదా, "తెలుగు దేశం" మీదా ఉన్న అభిమానంతో వెంటనే సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ తెగ తిరిగేసాం! అసలే సైకిల్ ఆయన గుర్తు కూడా. ఉభయ"తారకం"!

మరిప్పుడు హలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోవడానికి విసాపట్నం ఏమన్నా హైదరాబాద్ సబర్బ్ కాదే? బోల్డు దూరం.  పైపెచ్చు సైకిల్ తొక్కడం ఒకింత "టచ్" లో కూడా లేనాయే. బిజినెస్ సైకిల్, లైఫ్ సైకిల్ వీటితోనే టైం సరిపోతోంది. ఇహ నిఝం సైకిల్ తొక్కే టైం ఎక్కడ?

అయినా ఇలా లాస్ట్ మినిట్ నిర్ణయాలు తీసుకుంటే ఇదే ఇబ్బంది. కుంచం అయినా దేశ సేవ చేద్దామన్నా విధి సహకరించదు. నా యవ్వనం అంతా ఇలా అడవి కాచిన వెన్నెలలా వృధాయేనా? హతవిధీ