Showing posts with label జీవిత చరిత్ర. Show all posts
Showing posts with label జీవిత చరిత్ర. Show all posts

Friday, May 17, 2024

స్వీయ చరిత్ర - చివరి అవకాశం!

 ఈ మధ్య జీవితం ఆఫ్టర్ ఇంటర్వెల్ కి వచ్చింది కాబట్టి ఓ పాలి నా జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నా! ఖాళీ సమయం ఎక్కువుంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తాం. 


సింహావలోకనం అంటే అర్ధం (తెలీనివారికి మాత్రమే!): గతాన్ని అందులో తప్పొప్పులను నిలకడగా విశ్లేషించుకోవటం


గమ్మత్తేమిటంటే అలా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తప్పుల కంటే నా చుట్టూ ఉన్నవాళ్లు చేసిన తప్పులే ఎక్కువగా కనిపించాయి!


అలా మొత్తం జీవితం టీవీ సీరియల్ లాగా కొన్ని వేల ఎపిసోడ్స్ రూపంలో వాయిదా పద్దతిలో పునః సమీక్షించాక బోల్డు కోపం వచ్చేసింది అలా లోగడ తప్పులు చేసిన వాళ్ళ మీద. నాకు హాని చేసిన వాళ్ళ మీద! 


ఏమిటి సార్ దక్షిణ భారత గాంధీగారి టైపు మీరు! మీక్కూడా హాని చేసే శత్రువులు ఉన్నారా అంటే ఉండరా? గాంధీగారికి గాడ్సే ఉన్నట్టు నాక్కుడా ఉన్నారు కొంతమంది నేనంటే పడని వాళ్ళు! నేనేమన్నా నా మీద విరుచుకు పడిపోయేవాళ్లు. నా మీద పడి ఏడ్చేవాళ్ళు!


హింతకీ ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే గతంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించేసాను కానీ ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తూంటే కొంపతీసి అనవసరంగా క్షమించేసానా అనో పెద్ద అనుమానం పట్టుకు పీడిస్తోంది. అనుమానం పెనుభూతం. 


ఒహవేళ అనవసరంగా క్షమిస్తే ఇప్పుడేం చెయ్యాలి అని కొన్నాళ్ళు ఆలోచించా. చించాక ఓ నిర్ణయానికొచ్చా


లోగడ నన్ను రకరకాలుగా విసిగించినవాళ్ళని ఇప్పుడు ఏం చెయ్యలేను ఎందుకంటే కొంతమంది నా జీవితంలోంచి, ఇంకొంతమంది ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించారు. 


మరి నా పగ! ప్రతీకారం! కసి! ఎలా తీర్చుకోవాలి. హీరోల చిన్నప్పుడు వాళ్ళకి తీరని అన్యాయం చేసిన వాళ్ళమీద పెద్దయ్యాక పగ, ప్రతీకారం, కసి వాళ్ళని అడ్డంగా నరికేసి తీర్చుకోవడం బోల్డు తెలుగు సినిమాలు చూసి నేర్చేసుకున్ననాయే! సరే సుమోలు ఎగిరించడం, కత్తులు, కఠారులతో చీల్చి చెండాడడం ఆహింశావాదినైన నాకు తగని పని! 


మరి ఎలా? ఎలా? ఎలా?


హప్పుడు తట్టింది ఓ బ్రహ్మాండమైన ఐడియా! ఒక ఐడియా మీ(నా) జీవితాన్నే మార్చేస్తుంది!


అదేమిటంటే ఇప్పుడు నేను అర్జెంటుగా నా జీవిత చరిత్ర నేనే రాయదల్చుకున్నా! అందులో లోగడ నన్ను బాధ పెట్టినవాళ్లందరినీ పేరుపేరునా వాళ్ళు చేసిన దాన్ని చిలవలు, పలవలు చేసి మరీ రాసి పారేస్తా! ఎలా ఉంది ఐడియా!


కాకపొతే ప్రభుత్వంవారు చాలాసార్లు చాలామందికి "చివరి అవకాశం" అని ఓ సదుపాయం కలిగిస్తారు. ఉదాహరణకి ఇల్లు మునిసిపల్ కార్పొరేషన్ నిబంధలని అతిక్రమించి కట్టేసుకున్న వాళ్ళు, భూమిని ఆక్రమించేసిన వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు చలాన్లు సంవత్సరాల తరబడి కట్టనివాళ్ళు వగైరా వగైరా వాళ్లందరికీ కూసింత సొమ్ములు ప్రభుత్వానికి కడితే మీ తప్పులు అన్నీ మాఫ్ అని ఓ చివరి అవకాశం ఇస్తారు. దాని చివరి తేదీని అలా బోల్డు సార్లు పొడిగిస్తారు కూడా! ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సొమ్ములు! తప్పు చేసిన వారిని శిక్షించడం కాదుగా!


మరి అలాంటివాళ్లకే పాపం ప్రభుత్వం "ఒక్క ఛాన్స్" ఇస్తున్నప్పుడు నేను కూడా ఒకింత దయ, దాక్షిణ్యాలతో నా వెనకటి జీవితంలో నాకు హాని చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళకి కూడా ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించింది 


ఆ అవకాశం ఏమిటంటే సరే పోయిన వాళ్ళని వదిలేస్తా క్షమించి. బ్రతికున్న వాళ్లంతా ఇప్పటి నించి నేను స్వీయ చరిత్ర రాసి, ముద్రించే దాకా నన్ను బాగా చూసుకుంటే వాళ్ళ మీద రాసిన పేజీలు చింపేస్తా!


లేదంటారా? వాళ్లందరి మీద ఎడాపెడా, చెడామడా, అవాకులు, చెవాకులు రాసి పారేస్తా! తస్మాత్ జాగ్రత్త! 


ఆపైన వాళ్ళిష్టం. ఆనక బాధ పడి ప్రయోజనం లేదు. 


ఎందుకంటే పుస్తకం అయితే చింపేస్తే చెరిగిపోతుంది ముద్రించిన అన్ని పుస్తకాలు మనమే కొనేసి తగలెట్టేద్దాం అని కుళ్ళు ఐడియా వేస్తే పప్పులో కాలేసినట్టే. 


నేనో రెండాకులు ఎక్కువ చదివా. అందుకే ఈ-బుక్ ముద్రిస్తా! ఇంటర్నెట్లో అమ్మేస్తా! ఒక్కడు ఒక్క పుస్తకం కొన్నా చాలు. వాళ్ళు ఆ పుస్తకాన్ని విశృంఖలంగా వాట్సాప్ లో షేర్ చేసేస్తారుగా? ఇహ ప్రపంచంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది!


కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని ఓసారి లైట్ గా సింహావలోకనం చేసుకోండి. అందులో నన్నేమైనా బాధ పెట్టినా, నాకు హాని చేసినా ఈ సదవకాశాన్ని  సద్వినియోగం చేసుకోండి! ఆలసించిన ఆశాభంగం! 


నన్ను మంచిగా చూసుకోవడం అంటే ఆపిల్ పళ్ళట్టుకుని వచ్చి పలకరించడం కాదండోయ్! మరేం చెయ్యాలి అంటే అది ప్రస్తుతం నాకే తెలీదు! మీకేం ఉప్పందించను? భవిష్యత్తులో ఏమన్నా ఐడియాలు తడితే ఈ బ్లాగ్ తరువాయి భాగం ప్రచురించబడును!


అంతవరకు సెలవు!  

Friday, August 28, 2020

Corona side effect!

కొరోనా సైడ్ ఎఫెక్ట్: గత మూడు నాలుగు నెలలుగా ముందస్తుగా బైటికి వెళ్లడం బాగా తగ్గించి, ఇంకా తగ్గించి ఇప్పుడు గత నెల్లాళ్లుగా కనీసం ఇంటి గేట్ దాటి బైటికి ఒక్క అడుగు కూడా వెయ్యకుండా కాలం గడిపేస్తూంటే .....  ఏమయ్యిందో తెలియాలంటే చదవండి


మూడు రోజుల క్రితం కాళ్ళు నీరసంగా అనిపించాయి ! ఇదేటిది ఒక్కో శరీరంలో ఒక్కో భాగం నీరసంగా కూడా ఉంటుందా అంటే ఉంటుంది.  ఏం ఒక్కో భాగం నొప్పెట్టటం లేదా... తల నొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి! అలా ఒక్కో భాగం కూడా నీరసంగా ఉంటుంది. మీరు గ్రహిస్తే! నేను సూక్ష్మగ్రాహిని కాబట్టి ఇట్టే పసికట్టేసా. కేవలం కాళ్లే నీరసంగా ఉన్నాయని.

వెంటనే మనమందరం పెద్ద విశ్లేషకులం కదా? నా వంతు మానవ  ప్రయత్నంగా భారీ ఎనాలిసిస్ చేసేసా ఇలా ఒక్క కాళ్లే ఎందుకు నీరసంగా ఉన్నాయని. నా ఎనాలిసిస్లో బైట పడింది ఏమిటంటే నేను ప్రతి రోజూ ఓ గంట నడుస్తాను. ఒకప్పుడు ఆదివారం సెలవిచ్చేవాడిని. తరుచుగా వారం మధ్యలో ఇంకో రోజు కూడా ఏదో ఒక వంకతో! కానీ ఈ హౌస్ అరెస్ట్ తో ఏమి తోచక నెలలో అధమపక్షం 29 రోజులు విపరీతంగా నడిచేస్తున్నా.

ఇంకో కారణం: ఇంతముందు మూడ్ వచ్చినప్పుడు వంట చేసేవాడిని. ఈ అయిదు నెలలుగా  ఏమి తోచక దాదాపు నెలలో 28 రోజులు వంట చేసి పారేస్తున్నా. దానికి నీరసానికి ఏమిటి లింక్ అంటే వస్తున్నా ...

నేను అసలే భోజన ప్రియుడిని. మరిహ నాకు వచ్చినవి నచ్చినవి మొదట రెండు నెలలు అతిగా అమితంగా తిన్నా! తరువాత్తరువాత ఏమయ్యిందంటే వంట చేయడంలో ఉన్న ప్రేమ తినడంలో తగ్గడం మొదలయ్యింది. ఎందుకంటే రోజులో కనీసం రెండు మూడు గంటలు వంటింట్లో తిండి (తయారీ) మధ్య గడపడంతో తిండి మీద వ్యామోహం తగ్గింది. అందుకని ఒక రెండు నెలలుగా తిండి చాలా చాలా తగ్గించేసాను.

ఈ రెండు కారణాలుగా కాళ్ళకి నీరసం మొదలయ్యింది. మొదటిరోజు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం నీరసం ఇంకొన్ని భాగాలకు పాకింది! ఊహూ. అప్పుడూ పట్టించుకోలేదు. కానీ నిన్న మొత్తం ఒళ్ళంతా నీరసమే! రోజంతా! అయినా నడక, వంట వగైరా కార్యక్రమాలు మానలేదు. పైపెచ్చు అప్పుడప్పుడూ నాక్కూడా కుంచం బిజినెస్ పనులుంటాయి. నా దురదృష్టం నిన్న అవి చాలా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

కానీ నా ఎనాలిసిస్ అంతటితో ఆపలేదు. ఎందుకంటే నేను క్రిటికల్ థింకింగ్, డీప్ థింకింగ్ కి అలవాటు పడ్డవాడిని. ఆ రెండింటికీ తేడా అడక్కండి. అడిగితె నేనిప్పుడు చాలా డీప్ గా క్రిటికల్ గా థింకాలి!

సరే అలవాటు ప్రకారం ఒకింత ముందుకి అంటే ఒకింత లోతుగా ఆలోచించా. నాదసలే స్ట్రాంగ్ బాడీ కదా? ఇలా నడక, వంట, వ్యాపారాలకి నీరసపడిపోడానికి వీళ్ళేదే? ఎక్కడుంది లోపం? అని ఆలోచించగా, చించగా తట్టింది. స్ట్రాంగ్ బాడీనే కాదు స్ట్రాంగ్  మైండ్ కూడా కదా?

అదేమిటంటే ఈ గృహనిర్బంధానికి అస్సలు ఎండ కన్నెరగకుండా రాజకుమారిలా అంతఃపురానికే అంకితం అయిపోయా కాబట్టి సూర్యరశ్మి సోకక డి విటమిన్ భారీ ఎత్తున తగ్గిపోయింది జీవితంలో మొట్టమొదటిసారిగా!

ఇలా డి విటమిన్ లోపిస్తుంది ఇళ్లకే పరిమితమైతే కూసింత ఎండలో అమెరికా వాళ్ళలాగా రోజూ కాసేపు సన్ బాత్ చేయండని ఒక్కడంటే ఒక్కడు కనీసం ఆ ఆరోగ్య సంస్థ కూడా చెప్పలేదు. చెప్పినా నా చెవిన పడలేదు. ఇన్ని వాట్సాప్ ఫార్వార్డులు వచ్చినా!

మరంచేత ఇవాళ్టినించి రోజూ సాయంత్రం ఓ పది నిమిషాలు ఎండలో ఎండుదామని నిర్ణయించాను.

ఫుట్ నోట్: మీలో ఎవరికైనా కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా? అంటే ఇంట్లో ఉన్నా నీరసపడిపోవడం. ఉంటే చెప్పండి. ఎందుకడుగుతున్నానంటే మీకు తెలీనిదేముంది? మనింట్లో కరెంటు పోయిన వెంటనే పక్కింట్లో కూడా పోయిందో లేదో చూస్తాం కదా? వాళ్ళక్కూడా పోతే అదో (పైశాచిక) ఆనందం! తుత్తి! అందుకనన్న మాట!

ఫుట్ నోట్ 2: ఎండలో ఉండడానికి నిర్ణయించా కానీ నడక, వంట వగైరా మానలేదు. ఇప్పుడే అవన్నీ ముగించి ఎంత నీరసంగా ఉన్నా కూడా  ఇది రాస్తున్నా. ఎందుకు మాస్టారూ హాయిగా రెస్ట్ తీసుకోక అనకండి. ఎందుకంటే రెండు కారణాలు

అ: నేను పుట్టిందే లోకకల్యాణం కోసం. ఇలా నీరసంగా ఉందని విశ్రాంతి తీసుకుంటే బోల్డు కల్యాణాలు ఆగిపోతాయి పీటలమీదే!

ఆ: ఇంకో లోపాయికారీ విషయం. ఎప్పటికైనా ఎవరైనా నా జీవిత చరిత్ర రాసే అవకాశాలు భారీ ఎత్తున కనిపిస్తున్నాయి. ఒక వేళ అలా రాయని పక్షంలో నేనే రాసేసుకుంటా స్వీయ చరిత్ర! లేపోతే ఇంకోడెవడిదైనా కలం పేరు పెట్టేస్తా. జీవిత చరిత్రకి ఇప్పటి నీరసానికి ఏమిటి లింకని మీరడిగేలోపలే నేనే చెప్పేస్తా సమాధానం

ఇలా జీవిత చరిత్ర పుస్తకాల్లో ప్రతి అధ్యాయం చివర మిగిలిపోయిన ఖాళీలో, లేదా ఖాళీ చేసి ఓ బాక్స్ లో చిన్ని చిన్ని సంఘటనలు రాస్తూంటారు  కదా? అంటే అనిల్ కుంబ్లే కి దవడ ఫ్రాక్చర్ అయినా కట్టు కట్టుకుని టెస్ట్ మ్యాచ్ ఆడాడని, సచిన్ బోల్డు జ్వరంతో ఆడాడని. అలా. నేను కూడా భారీ నీరసంతో కూడా లోక కళ్యాణం కోసం రెస్ట్ తీసుకోకుండా భారీగా పనులు చేశానని అలా అధ్యాయాల చివర రాయడం కోసం బోల్డు సంఘటనలు సృష్టిస్తున్నా! ఇప్పటికే సృష్టించా కూడా! ఇహ అధ్యయాలు తయారవడమే బాకీ