Thursday, September 14, 2023

కుక్క స్వగతం!



 కుక్క స్వగతం! 

అమ్మా తల్లీ ఆ ఫోన్లో మాట్లాడ్డం ఆపి తొందరగా రావే తల్లీ . నీకు పుణ్యం ఉంటుంది. చస్తున్నా అరగంటనించి ఇలా ఇక్కడ నిలపడలేక. 


నీకేం హాయిగా ఒళ్ళు పై తెలీకుండా పొద్దున్నే పరగడుపునే నీ బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు ఎన్ని గంటలైనా చెప్తావు. 


ఇక్కడ నాకు రాట్స్ రన్నింగ్ ఇన్ టమ్మీ! 


నన్ను మార్నింగ్ వాక్ తీసుకెళ్లే సాకుతో ఇలా బైటికొచ్చి నన్ను నా మానాన్న గాలికొదిలేసి అలా ఫ్రెండ్ తో నాన్ స్టాప్ వాగుడు. నేనొచ్చిన పనయ్యిపోయి అరగంటయ్యింది. గంటయిన ఫీలింగ్. అలా నీ మొహం చూస్తూ కూర్చుంటే. నీ మమ్మీ, డాడీ నువ్వేదో నన్ను తెగ వాకింగ్ చేయిస్తున్నావని ఓ తెగ ఆనందపడిపోతున్నారు. నువ్వేమో వీధి చివర సెటిల్. నేను అటూ ఇటూ తిరిగింగ్! నీ పద్దతేమీ బాలేదమ్మీ!  


అసలే రాత్రంతా నైట్ డ్యూటీ చేసానా? ఎప్పటికైనా ఈ సుందరి వస్తే కొంపకెళ్లి పాలు తాగి బజ్జోవాలి. 


మనలో మన మాట. నైట్ డ్యూటీ అని పబ్లిసిటీ కోసం అన్నా కానీ వీళ్ళు పెట్టె ఆకులు, అలములకి నైట్ డ్యూటీ కూడానా? సంబడం!  మమ్మల్ని గడ్డివాము దగ్గర కుక్కలా అంటారు కానీ వీళ్ళని అనాలి ఆ మాట. వీళ్ళు నాన్ వెజ్ తినరు! నాకు పెట్టరు! అంచేత వాళ్ళు అలా పడుక్కోగానే మనం ఇలా సోఫా మీద సెటిల్! 


ఇగో అమ్మీ!  ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఇహ మళ్ళీ పిలవను. వస్తే రా! లేకపోతే నేనే పోతాను. కుక్కని ఆ మాత్రం ఇల్లు వాసన తెలీదా ఏంటి? అసలు నిన్నెందుకు పంపిస్తారో తెలీదు నాతొ పాటు. నన్నొక్కదాన్ని వదిలెస్తే హాయిగా పచ్చిగాలి పీల్చుకోని, కాస్త పక్కింటి కుక్కలతో, వీధి కుక్కలతో కాస్సేపు చెడు  తిరుగుళ్ళు తిరిగి, లోకాభిరామాయణం మాట్లాడి, ఎంచక్కా ఓ అరగంటలో ఇంటికొస్తా కదా? నువ్వెందుకు పానకంలో పుడకలాగా? పోనీ నన్ను పట్టించుకుంటావా అంటే అదేం లేదు.  


నువ్వింకో రెండు నిమిషాల్లో రాలేదనుకో నే ఒక్కదాన్నీ ఇంటికెళ్తా. అప్పుడు మీ మమ్మీ అయ్యో ఇదేంటిది? ఇదొక్కర్తీ వచ్చేసిందేటి? చిన్నది రాలేదేటి? అయ్యో అయ్యో. దానికేం కాలేదు కదా? ఇదేదో మనల్ని కాపాడుతుందని దీన్ని పెంచుతూంటే దీన్ని మనం కాపాడాల్సి వస్తోంది. అని ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ వీధిలోకొచ్చి నిన్ను చూసిందనుకో! అప్పుడుంది. తవరి పని. దబిడి. దబిడి. 


అయినా రెణ్ణెల్ల నించీ బాల్కనీలోంచి చూస్తున్నా. నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను రోజూ పక్కింటి దాకా మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి దింపడం. పోనీలే పాపం అని చూసీ చూడనట్టు పోతున్నా. నాకుగానీ కోపం వచ్చిందనుకో ఎప్పుడో ఇంట్లోంచి తప్పించుకొచ్చి నీ బాయ్ ఫ్రెండ్ పిక్క కరిచి పారేస్తా. తిక్క కుదురుతుంది. మీ ఇద్దరికీ. 


అసలు నీ గురించీ నీ బాయ్ ఫ్రెండ్ గురించి నీ మమ్మీకి చెప్పాలి. చెప్పాలేంటి? చెప్తూనే ఉన్నా! నా భాషలో. మీ మనుషులతో వచ్చిన చిక్కేంటో తెలుసా? కుక్కలు, పిల్లులు, ఏనుగులు అన్ని జంతువులూ మీ భాషలు నేర్చుకోవాలంటారు. మా ప్రాణం మీదకి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఒహటి. మేమేదో కస్టపడి నేర్చుకుంటాం. 


సిట్ అంటే కూర్చుంటాం. నై అంటే నోరు మూసుక్కూర్చుంటాము. వద్దని చెప్పానా అంటే పడుంటాం. 


మేం భౌ భౌ అన్నా, మ్యావు మ్యావు  అన్నా మీకు మట్టుకు ఒక్క ముక్క అర్ధమయ్యి చావదు. ఏమన్నా అంటే మేం ఇంటలిజెన్స్ స్పీసీస్ అని పోజులు. పబ్లిసిటీ! ఈ మధ్య ఆ తెలివికి తోడు అతి తెలివితేటలూ, కృత్రిమ తెలివితేటలూ కూడా!


చస్తున్నాం మీతో. ఏం చేస్తాం. కుక్క బ్రతుకంటే ఇదే మరి. 


Photo courtesy: Valeria Boltneva from www.pexels.com.