Wednesday, October 4, 2023

జీవితం ఒక విష వలయం!

 నాకు రెండు మూడేళ్ళ వయసున్నప్పుడు నా కాళ్ళ మీద నేనే నిలపడదామన్న కోరిక విపరీతంగా పుట్టి, ఎన్నాళ్ళు సిగ్గు లేకుండా అమ్మ చేత బట్టలు వేయించుకోవడం అని. నేనే నిక్కరేసుకోవాలని నిర్ణయించి, నిక్కరేసుకోవడానికి ఓ కాలు పైకెత్తితే బాలన్స్ తప్పి పడిపోవడంతో కొన్ని సార్లు విఫల ప్రయత్నం చేసి ఇహ లాభం లేదనుకుని, అమ్మ కాళ్ళు పట్టుకునో, లేక గోడని పట్టుకునో నిక్కరేసుకునేవాడిని. నా తమ్ముడు చాలాసార్లు "కదలని గోడలు ఎందుకు కట్టరు"? అని వాపోయేవాడు కూడా ఆ రోజుల్లో! ఎందుకంటే గోడ పట్టుకుని నిక్కరేసుకున్నా వాడు బాలన్స్ తప్పిపోయేవాడు. చివరి వాడేమో ఒకింత గారాబం బరువు ఎక్కువ వాడికి!


ఇప్పుడు వయసు మీద పడి, అరవయ్యో  పడిలో పడ్డాక, ఒకింత బరువు కూడా ఎక్కువయ్యి ప్యాంటు వేసుకునేటప్పుడు కాలెత్తితే చిన్నప్పటిలాగే (చిన్నప్పటి లాగు కాదు!) బాలన్స్ తప్పి ఈ వయసులో పడి ఏ తుంటి ఎముకో విరిగితే నా పని ఇహ అంతే సంగతులు అని గ్రహించి, సిగ్గొదిలేసి గోడని పట్టుకుని కొన్నాళ్ళు ప్యాంటు వేసుకున్నా. కానీ నా తమ్ముడు చిన్నప్పుడు అన్నట్టు "కదలని గోడలు ఎందుకు కట్టరో"? అని నాక్కూడా అనిపించి అంటే ఓ చేత్తో గోడ ఇంకో చేత్తో ప్యాంటు పట్టుకుంటే గోడో, నేనో ఊగుతున్న ఫీలింగ్! 


అలా కొన్నాళ్ళు క్షోభ పడి ఇప్పుడు సిగ్గు, లజ్జ రెండూ వదిలేసి శుభ్రంగా హాయిగా మంచం చివర కూర్చొని ప్యాంటు వేసుకుంటున్నా! టేకు మంచమేమో అది కూడా రెండో పక్క  గోడకి ఆనించి ఉండడంతో కదలకుండా పడుంది! 


జీవితం ఒక విష వలయం! ఎక్కడ మొదలెట్టామో అక్కడికే మళ్ళీ!