Tuesday, December 22, 2015

Bad looks - దిష్టి - Bura nazar !!!

హిందీ సినిమా పాత పాట ఒకటుంది(ట!) నాకు పెద్దగా హిందీ రాదు. దాని అర్థం ఏమిటంటే "పొరపాటుని కూడా నువ్వు అద్దంలో చూసుకోకు! నీ దిష్టి నీకే తగులుతుంది" అని!!

తెలుగు సినిమాలో ఒక పాట కూడా ఉంది! "కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం" అని!!

ఇంతకీ ఈ రెండు పాటలకి ఏమిటి లింక్ అంటారా? అదేనండి. మన దిష్టి మనకే తగలడం :(

పోయిన వారం ఒక ఖద్దర్ షర్టు వేసుకున్నా! అందులో విశేషం లేదు. అది కొత్త షర్టు కూడా కాదు! కాని వేసుకున్నవాడిని వేసుకున్నట్టు ఊరికే ఉండక (ఉండబట్టలేక!!) "ఆహా! ఎంత బాగుందీ షర్టు! ఇందులో నేనెంత బాగున్నానో?!!" అని ఒకటికి మూడు సార్లు అన్నా! అప్పటికీ పక్కనించి మా ఆవిడ అంటూనే ఉంది! " మరీ అంత పొగుడుకోకండి! మీ దిష్టి మీకే తగలగలదు" అని!

కాని నేను వింటేనా? ఎందుకు వినాలి? ఏం? వాళ్ళని మట్టుకు ఎన్నిసార్లు పొగిడినా ఇంకా ఇంకా అని సంతోషం  సినిమాలో "కోట" లాగా "ఇందాకల ఏమన్నారు? అని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పొడిగించి, పొగిడించుకుంటారుగా? ;) పెద్దమనిషిని నన్ను అలా డైరెక్ట్ గా పొగిడే ప్రజలు, అభిమానులు లేక, ఉన్నా వాళ్లకి అభిమానం తగ్గి, కొంచం అభిమానం అడ్డొచ్చి, నన్ను పొగడక పోతే నేనేమయ్యిపోవాలి? నాకేటి దారి? ఇదే! నన్ను నేనే కసి తీరా, మనసారా పొగుడుకోవడమే!! తప్పలేదు! తప్పేం కాదు. అయినా నాకు తెలీక అడుగుతాను. కిట్టని వాళ్ళు పొగడ్త అని చేసే దుష్ప్రచారం కాకపొతే, నిజం చెప్పితే అది పొగడ్త ఎలా అవుతుంది?

సరే అలా కాస్సేపు పోగిడేసుకున్నాక పనిమీద వెళ్ళిపోయాను. ఇక్కడిదాకా అంతా ఓకే!

సాయంత్రం ఇంటికొచ్చి "అబ్బాబ్బబ్బబ్బా!! ఏమి ట్రాఫిక్? ఎన్ని కార్లు? ఎంత జామ్? అసలు పెజలంతా రోడ్లమీదే ఎందుకుంటున్నారు? రోజూ ఇంతమందికి ఇంత తిరగాల్సిన పనులేమిటి ఉంటాయి? వగైరా హస్చార్యార్ధక ప్రశ్నలు జనాంతికంగా టీవీ సీరియల్స్ లో వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొనే టైపులో ప్రశ్నలు వేసి ఇంకా అలిసిపోయి, షర్టు విప్పి అలా తలుపుకి తగిలించబోతూ (ఇదో బాడ్ హాబిట్ లెండి!) ఒక్కసారి షాక్ అయిపోయాను. షర్టు ఏ మేకుకో తగిలినట్టుంది. ఒక అంగుళం మేర చిరుగు :(

నాకు ఏడుపొక్కటే తక్కువ!

నీతి: మనకి మనం ఎంత ముద్దొచ్చినా మనల్ని మనం పొగుడుకొనరాదు!!

No comments:

Post a Comment