Saturday, February 18, 2017

బొద్దింక - 2

మొన్న నేను విడుదల చేసిన టైటిల్ టీజర్ అసలు సినిమా ఇది!

మీ అందరిచేత ఆర్నెళ్ళకోసారి ఎందుకు సూటి పోటి మాటలు పడడం అని, కమిట్ అయ్యాక వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి "ఆలీసం ఏదైనా విషం" కాబట్టి పిచ్చర్ వెంటనే విడుదల! 79 రోజుల్లో శాతకర్ణి   తియ్యగా లేనిది (ఇక్కడ ద్వందార్ధం లేదు!) నేను రెండ్రోజుల్లో రాయలేనా? పట్టుదల!

ఇహ సినిమా ప్రారంభం!

మళ్ళీ మర్చిపోయిన మీ అందరికీ  (ఎంత అస్సయ్యం వేసినా సరే.. జీవితంలో కొన్ని కొన్ని భయంకర, భయానక, జుగుప్సాకరమైనవి చూడక, చదవక తప్పదు!) మరొక్కసారి ఈ పిచ్చర్ లో బొద్దింకే ప్రధాన పాత్రధారి అని మనవి. ఏం. ఈగ పాటి చెయ్యదా? ఏనుగులు, కుక్కలు, పాములు, కోతులు వగైరా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాయిగా? ఇప్పుడు బొద్దింక వంతు.

ఓపెనింగ్ షాట్: పొద్దున్నే అంటే మరీ తెల్లారకుండా కాదు. దాదాపు ఎనిమిదిన్నరకి. నేను రోజూ తిట్టుకుంటూ చేసే దినచర్య. అదే.. షేవింగ్! దేవుడు మగాళ్ళకి ఇచ్చిన శాపం ఈ షేవింగ్. పోనీ గెడ్డం పెంచుకోవచ్చుగా అంటే తవరికి తెలీదా ఏమిటి? గెడ్డం అందరికీ నప్పదని. అదో అలా గెడ్డం నప్పని వాళ్ళల్లో నేను ప్రధముడిని. మరంచేత పెజానీకం సౌకర్యార్ధం అంటే ఇన్ అదర్ వర్డ్స్ లోక కళ్యాణం కోసం రోజూ షేవింగ్ చేస్తూంటాను. నా గురించి అస్సలు కాదు. ఎందుకంటే రోజులో నేను నా మొహం కేవలం 3/4 సార్లు మాత్రమే అద్దంలో  చూసుకుంటాను. కాని అధమపక్షం రోజులో ఓ 14 గంటలు పెజానీకమే నా మొహం చూడాల్సింది. మరంచేత నేను గెడ్డం గీసినా, ఒకింత అందంగా కనిపించే ప్రయత్నం ... అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లు వగైరా బాగా పట్టించి , ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా సామెత గుర్తొచ్చినా ఖాతరు చెయ్యకుండా, పేస్ వాష్ లు గట్రా వాడుతున్నానంటే కేవలం పెజలకోసమేనని, కేవలం లోక కళ్యాణం కోసమేనని, ఇందులో స్వార్ధం అస్సలు లేదని మరొక్కసారి మనవి. అర్ధం చేసుకోరూ!

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పడి ఓపెనింగ్ షాట్ దగ్గరే ఆగిపోయా. సరే పొద్దున్నే షేవింగ్ చేద్దామని నా "మంగలిపొది"
అంటే నేను నా షేవింగ్ సామగ్రి దాచుకునే ప్లాస్టిక్ డబ్బా అన్నమాట.. మూత తెరవగానే షాక్!!

ఏమయ్యింది?! అక్కడ ఏం కనిపించింది!!

ఇదే హీరో ఇంట్రో షాట్!! ఆ ప్లాస్టిక్ బాక్స్ లో పెద్దగా కనిపిస్తున్న పిల్ల బొద్దింక!కాళ్ళ దగ్గర నించి స్లో గా మొహం మీదకి పానింగ్ క్లోజ్ అప్ షాట్! క్లోజ్ అప్ షాట్ లో పిల్ల బొద్దింక అయినా పెద్దగా కనిపించింది. అసలిక్కడ ట్రాలీ షాట్ పెడదామానుకున్నా కానీ, బొద్దింక ఎంత పెద్దగా చూపించినా డైనోసారస్ అంత పెద్దగా చూపిస్తే బాగోదని ఆ ఐడియా డ్రాప్ చేశా!

పిల్ల బొద్దింక అంటే టీన్ఏజ్ అన్నమాట. పిల్ల కాబట్టి పిల్ల చేష్టలు. చెడు తిరుగుళ్ళు. లేకపోతే అడిగేవాడు లేక కాని నా మంగలిపొదిలో ఏముంటుంది తినడానికి? బాడ్ అప్బ్రింగింగ్.

దానికి ఉన్నది... ఇప్పుడిప్పుడే వస్తున్నవి లింగు లిటుకూ మంటూ రెండు ఓ మోస్తరు మీసాల్లాంటి వెంట్రుకలు! అవి కాస్త అది నా మంగలిపోదిలో "రగులుతోంది మొగలిపొద" టైపు లో భరత, కూచిపూడి, కథక్ లు, ఒకింత మోడరన్ బొద్దింక అయితే పేరు పెట్టలేని, వర్ణించలేని అప్పుడప్పుడూ మనం కూడా వెయ్యలేని సినిమా పాటల స్టెప్పులు వేసిందంటే ఏ రేజర్ బ్లేడో తగిలి ఆ వస్తున్న మీసాలు తెగిపోయి, లేదా ఎలక్ట్రిక్ రేజర్ ఆన్ అయ్యి దాని రెక్కలు ముక్కలు ముక్కలు అయిపోయి,  దాని బ్రతుకు దుర్భరం అయిపోయే ప్రమాదం ఉందన్న విషయం దానికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు? ఎవరు?

ఆ విషయం కాసీపు పక్కన పెడితే నాకు వెంటనే వచ్చిన సందేహం మొన్న మిమ్మల్నందర్నీ అడిగినదే.

"బొద్దింక ఆహారం ఏమిటి?"

ఎందుకంటే ఈ విషయం ఒకింత లోతుగా చర్చించి, విస్తృతంగా శోదించి దాని తిండి వ్యవహారం లో నా షేవింగ్ సెట్ లో పదార్ధాలు ఏమన్నా ఉన్నాయంటే నేను అర్జెంటుగా మూత గట్టిగా పట్టే డబ్బా సంపాదించాలి. మార్గదర్శిలో చేరైనా!

ఈ లోపల బొద్దింక ని అంత క్లోజ్ అప్ లో చూడగానే వెంటనే ఫ్లాష్ బ్యాక్ !! అంటే నా టీన్ ఏజ్ రోజుల్లోకి అలా గిరగిరా తిరుగుతూ వెళ్ళిపోయా!! నా టీనేజ్ లో బొద్దింక ఒక చిన్ని పాత్ర వహించింది. పాత్ర చిన్నదే కాని ఎఫెక్ట్ పెద్దది!

టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవ్వాలి. అప్పటి తల్లితండ్రులకి ఇప్పటి వాళ్లకి ఏమి తేడా లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని ఇంజనీరింగ్ లో ఎలా బలవంతంగా ఇరికించేస్తున్నారో ఆ రోజుల్లో నా నాన్న కూడా నన్ను అదే కోవలో మెడిసిన్ చదివించేద్దామనే ఒక బలీయమైన కోరికతో నన్ను బలి చేసారు. అంతే అభం శుభం తెలీని నేను ఇంటర్ లో బైపిసి లో జాయిన్ అయ్యా...జాయిన్ చేసారు.

ఇహ చూస్కోండి. జువాలజీ ప్రాక్టికల్ కోసం ఒక రోజు వానపాము, ఇంకోరోజు ఓ పెద్ద బావురుకప్ప, ఈ రెండూ దొరక్క పోతే తేరగా దొరికిందని, దొరుకుతుందని బొద్దింక ఇలా రకరకాల జంతువులని మా చిన్ని చిన్ని చేతులతో, మా చిన్నారి మనసులు ఎంత అస్సయ్యమైన భయం, జుగుప్సలతో బాధపడుతున్నా ఖాతరు చెయ్యకుండా వాటిని డిసేక్ట్ చెయ్యించేవాళ్ళు. వాటిని వెల్లకిలా పడేసి ఓ చెక్క ముక్కకి మేకులతో బంధించి (చచ్చినవి ఎలా పారిపోతాయో కాని వాటిని బంధించడం మట్టుకు తప్పనిసరి!) ఆ తర్వాత వాటిని అడ్డంగా అదే నిలువునా చీల్చి చెండాడి లోపల  కనిపించి మన స్కాల్పెల్ కి కట్ అవ్వకుండా మిగిలిన వాటి అవయవాలు అన్నీ తీసి బైట పడేసి, అందులో బాగా నదరుగా ఉన్నదాన్ని అన్న వాహిక అని డిస్ప్లే చేసి పారేసేవాడిని.  ఈ సాహసచర్యలకి బోల్డు మార్కులు వస్తాయనుకున్నా కాని అందరు విద్యార్ధుల అంచనాల్లాగా నాది కూడా తారుమారు అయ్యి చివరాఖరికి అత్తెసరు మార్కులతో గట్టెక్కా. అంతా మన మంచికే అంటారు. ఇలా జంతువుల దేహాలతో ఆడుకున్నాక ఒక్క విషయం నాకు సందేహం లేకుండా క్లియర్ గా అర్ధం అయ్యింది. అదేమిటంటే నేను జీవితంలో మంచి పేషెంట్ అవ్వడం బెటర్ బాడ్ డాక్టర్ కంటే అని. అదే చేశా. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి డాక్టర్ అవ్వకుండా ఉండడానికి చాల కృషి చేసి మళ్ళీ లోక కల్యాణానికి చిన్న వాడిని, చితక వాడిని అయినా నా వంతు కృషి అంత నూనూగు మీసాల ప్రాయంలోనే చేశా. ఈ విషయం గురించి మరోసారి, వీలు చేసుకొని సవివరంగా వినిపిస్తా. అదే వివరిస్తా.

ఇక్కడ ఇంకో విషయం. ఇలా ఆ జంతువులలో (బొద్దింక క్రిమా?) ఉన్న పార్టులు అన్నీ పీకించే వాళ్ళు కాని అవి బ్రతికి ఉన్నప్పుడు ఏం తిండి తిని చస్తాయో చెప్పి చావలేదు! మరందుకే ఇప్పుడు నాకీ సందేహం. అప్పుడు అవుట్ అఫ్ సిలబస్ ఈ మేటర్!

ఇక్కడ కొంచం డైవర్ట్ అయ్యి ఇంకో మేటర్ డిస్కస్ చెయ్యాలి. సందర్భం వచ్చింది కాబట్టి. అదేమిటంటే మన హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా ఆ జంతువులని డిసేక్ట్ చేసిన పాపం మాలాంటి అమాయకులకి చుట్టుకుంటుందా? అఫ్ కోర్స్ వాటిని మేము చంపలేదు కానీ వాటిని ఇంకెవరో చంపడానికి మేమే కదా కారణం? ఎవరూ ఇలా బైపిసి గ్రూప్ లో చేరకపోతే పాపం ఆ వానపాములు, కప్పలు, బొద్దింకలు ఎంచక్కా బ్రతికే ఉండేవి కదా? ఎవరైనా కర్మ ఎక్స్పర్ట్ లు ఈ సందేహం తీర్చ ప్రార్ధన. ఒకవేళ అలాంటి చిరు పాపం చుట్టుకుంటే కంచిలో బంగారు బల్లిని పట్టుకుంటే పాప విముక్తి కలిగినట్టు ఈ సదరు జంతువులకి కూడా ఏమన్నా పా(శా)ప విమోచనాలు ఏమన్నా శాస్త్రాల్లో పేర్కొన్నారా?

మళ్ళీ కధలోకొస్తే ఇంతకీ ఆ బొద్దింక నా షేవింగ్ సెట్ రోజూ వాయిదా పద్ధతిలో తినేసే ప్రమాదం, ఆస్కారం ఉన్నాయా? ఉంటే, గింటే (గింటే అంటే అర్ధం ఏమిటో?!) నేను తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి ఇప్పుడు అర్జెంటు గా ఆలోచించాలి.

మరంచేత సశేషం!!!

కధ కంచికి. బల్లి హీరో కాకపోయినా!! 

Thursday, February 16, 2017

బొద్దింక!!!

"బొద్దింక ఆహారం ఏమిటి?!"

ఇదేటిది పొద్దున్నే ఈ పనికిమాలిన పరిజ్ఞానం కొశ్చన్ ఏటని కొశ్చన్ మార్క్ ఫీలింగ్ పేస్ లో చూపించొద్దు. నాకు పొద్దున్నే ఈ ధర్మ(?) సందేహం వచ్చింది. ఏదన్నా సందేహం వస్తే వెంటనే తీర్చుకునే ప్రయత్నం చెయ్యడం మానవుడిగా నా కర్తవ్యమ్ కాబట్టి మిమ్మల్ని అడిగాను.

నిజం చెప్పాలంటే ఇది నేను రాయబోయే "రచన"కి టీజర్ టైటిల్!! ఇల్లీమజ్జేన ప్రతిదానికి ఓ టీజర్ విడుదల చెయ్యడం ఫాషన్ అయ్యిపోయింది కదా! ఫస్ట్ లుక్ టీజర్. ఫస్ట్ ట్రైలర్ టీజర్. ఫస్ట్ షాట్ టీజర్. ఫస్ట్ పోస్టర్ టీజర్. ఆ కోవకి చెందినదే ఈ టైటిల్ టీజర్! ఏమిటో ? వెధవ ఐడియా లు అక్కరలేని సినిమా వాళ్లకి అనవసరంగా ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా నిస్వార్ధంగా ఇచ్చేస్తున్నా! విచ్చలవిడిగా వాడుకోండి నా ఈ టైటిల్ టీజర్ ఐడియా!

ఏ ఐడియా అయినా (బ్రహ్మాండమైనది అయినా కాకపోయినా) ఉత్తినే, ఊరికినే రాదు. ఆర్కిమెడిస్ కి నీళ్ళల్లో బాతు బొమ్మ చూస్తే వచ్చింది. న్యూటన్ కి నెత్తిమీద ఆపిల్ పడితే వచ్చింది. అలాగే నాక్కూడా పొద్దున్నీబొద్దింక ని చూడగానే వచ్చింది. "కాదేదీ ఐడియా కి అనర్హం" అని గమనించ మనవి.

ఇంతకీ ఇలా టైటిల్ బొద్దింక సహకారంతో పెట్టాను కాని ఈ టీజర్ గొడవేమిటా? దానికి కుంచం చరిత్ర ఉంది. అల్లామజ్జదాకా నేను విరివిగా, ఒకింత విచ్చలవిడిగా రోజూ ఏదో ఒకటి బరికి పారేసేవాడినని అభిమానులకి విదితమే! కానీ ఇటీవల నా జీవితంలో అనుకోని మార్పు అదేనండి టీవీ డైలీ సీరియల్ లో 3,962 ఎపిసోడ్ లో వస్తుందే అలాంటి పేద్ద మలుపు, వచ్చింది!

అలా మలుపు తిరగడంలో చాలా బిజీబిజీ అయిపోయి, సినిమా సంగతి దేవుడెరుగు, కనీసం సినిమా పోస్టర్ చూసే టైం కూడా లేకపోవడంతో ఇటీవల ఒకింత నేను రాయడం తగ్గించానన్న విషయం అభిమానులు గుర్తించినా ఒకింత అదే ఒక్క పిసరు అభిమానం తగ్గిందేమో, లేక అడగడానికి మొహమాట (భయ) పడ్డారో మొత్తానికి నన్ను ఎవరూ ఈ విషయం గురించి గుచ్చిగుచ్చిఅడగక పోయినా నేను కూడా సినిమా వాళ్ళ లాగ పెజానీకం మనసుల్లోకి దూరిపోయి అవన్నీ తెలుసుకుని ("ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కావాలంటున్నారు" అని సినిమాయగాళ్ళు ఎన్నోసార్లు చెప్పలేదా? అలాగే నేను కూడా!) వాళ్ళు అడగ(లే)ని కొశ్చన్ లకి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలా టైటిల్ టీజర్ పెట్టి "కమిట్" అయ్యాను. టైటిల్ పెట్టాక ఇవాళ కాకపోతే కనీసం ఓ ఆరునెలలకయినా వీలు చూసుకుని రచన పూర్తి చేస్తాను కదా. "ఒక్కసారి కమిట్ అయితే ..." తెలుసు కదా?

ఒహవేళ నా జీవితం 4371 ఎపిసోడ్ లో మరో మలుపు తిరిగి నేను మరీ బిజీ అయ్యిపోయి ఈ బొద్దింక ప్రహసనం రాయని పక్షంలో మీరందరూ అప్పుడప్పుడూ అంటే ఆరు నెలలకోసారి అన్న మాట "సార్! మీ బొద్దింక ఏమంటోంది" అని వ్యంగ్యంగా నాకు, నేను రాస్తానన్న ప్రతిజ్ఞ ఒకింత సున్నితంగా గుర్తుచేసి నా మీద పబ్లిక్ ప్రేషర్ బిల్డ్అప్ అయితేనన్నా రాస్తానేమోనని ఇలా ఈ

"బొద్దింక ఆహారం ఏమిటి"

అన్న టైటిల్ టీజర్ విడుదల చేయడమైనది.

నేను ఆ విషయం పరిశీలించి, పరీక్షించి రాసేలోపు మీరందరూ మీ మీ పరిజ్ఞానము కొలది ఆ టీజర్ కొశ్చన్ కి జవాబులు రాయచ్చు. గూగుల్ వాడుకున్నా తప్పులేదు కానీ వాడకండి!

Wednesday, January 25, 2017

విసాపట్నం!!

నిన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే "యువత" ని ఇవాల్టికల్లా విసాపట్నం వచ్చెయ్యమన్నారుగా? నేను కూడా విసాపట్నం వెళ్తే పోలా?  నేను "యూత్" కిందే లెక్క కదా? అదేటది మొహం అలా పెట్టారు? అదేదో సినిమాలో ఎవరో సుందరి సునీల్ ని పట్టుకుని "నువ్వు యూత్ ఏంట్రా?" అని అడిగినట్టు ఎక్స్ప్రెషన్ !అయినా మీ పెద్దోల్లున్నారే?! మీకు యూత్ అంటే జెలసి!

అస్సలుకి మీకు "యూత్" అంటే ఎవరో తెలుసా? 40 నించి 60 సంవత్సరాల (మాంఛి) వయసులో ఉన్న కుర్రకారు! 20 నించి 40 మధ్య వయస్కులు టీన్ఏజ్ కుర్రకుంకలు! ఇవన్నీ రాజకీయకొలమానాలు. అన్ని పార్టీల యూత్ వింగ్  ప్రెసిడెంట్ల వయస్సులు ఓ పాలి గమనించ మనవి.

నేను ఒకింత బాలనెరుపుతో కొంత వయసుమీద పడ్డట్టు కనిపించినా అల్లా మజ్జెన అడక్కపోయినా కేజ్రివాల్ గారికి చూపించిన నా టెన్త్ క్లాసు సర్టిఫికేట్ లో ఉన్న వయస్సు ప్రకారం నేనింకా అరవయ్యో పడిలో పడలేదు కాబట్టి నేనింకా యూత్ కిందే లెక్క.

ఇహ అసలు మేటర్ కి వస్తే అలా అర్జెంటుగా విసాపట్నం వెళ్తే ఓ పనయ్యిపోతుంది కదా. "పవనం" అంటే అదే గాలి అటు వేపే కదా వీస్తోంది. ఎంచక్కా సముద్రం కూడా చూడచ్చు. చూసి చాలా రోజులయ్యింది. (ఈ మాట నిఝాంగా అబద్ధం!)

ఆలోచన రావడం ఆలీసం వెంటనే IRCTC సైట్ చూసా. ఒక్కటంటే ఒక్క టికెట్ లేదు. కనీసం నిక్కరేసుకొని అరటికెట్ కొనుక్కుందామంటే హాఫ్ సీట్ కూడా లేదు!

పోనీలే దేశం కోసం ఒకింత ఖర్చు పెడితే ఏం పోయిందని ఆదరాబాదరా హైదరాబాద్ నించి విసాపట్నం అన్ని ఫ్లైట్లు చెక్ చేశా. ఏముంది. అక్కడ కూడా నిరాశే. మన దేశం జనాభాలో 50% యూత్ అంటే ఏమిటో అనుకున్నా. నిఝంగా నిఝం!

బోల్డు సంవత్సరాలక్రితం అంటే నా టీన్ఏజ్ లో ఇలాగే ఎన్టీవోడు "తెలుగుదేశం పిలుస్తోంది! రా! కదలిరా!!" అని పిలవంగానే ఆయనమీదా, "తెలుగు దేశం" మీదా ఉన్న అభిమానంతో వెంటనే సైకిల్ వేసుకొని తొక్కుకుంటూ తెగ తిరిగేసాం! అసలే సైకిల్ ఆయన గుర్తు కూడా. ఉభయ"తారకం"!

మరిప్పుడు హలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోవడానికి విసాపట్నం ఏమన్నా హైదరాబాద్ సబర్బ్ కాదే? బోల్డు దూరం.  పైపెచ్చు సైకిల్ తొక్కడం ఒకింత "టచ్" లో కూడా లేనాయే. బిజినెస్ సైకిల్, లైఫ్ సైకిల్ వీటితోనే టైం సరిపోతోంది. ఇహ నిఝం సైకిల్ తొక్కే టైం ఎక్కడ?

అయినా ఇలా లాస్ట్ మినిట్ నిర్ణయాలు తీసుకుంటే ఇదే ఇబ్బంది. కుంచం అయినా దేశ సేవ చేద్దామన్నా విధి సహకరించదు. నా యవ్వనం అంతా ఇలా అడవి కాచిన వెన్నెలలా వృధాయేనా? హతవిధీ

Tuesday, November 29, 2016

Missed Call

ట్రింగ్! ట్రింగ్!

నేను: హలో! హలో! హలో! హలో!

ఇది ప్రతిధ్వని కాదు. ఈ మధ్య మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండటం లేదు. రజనికి reverse! మనం పదిసార్లు చెప్తే అవతలి వాడికి ఒక్కసారి వినిపిస్తుంది :(

అటినించి: సార్! ఇందాకల నాకీ నెంబర్ నించి మిస్సుడ్ కాల్ వచ్చింది!

నేను: బాబూ! నీకు మిస్సుడ్ కాల్ రాలేదు! నేను కాల్ చేసాను. నువ్వు మిస్ అయ్యావు!! అంతే కాని మిస్సుడ్ కాల్ రావడం అన్న ప్రక్రియ లేదు.

NB: కోడిగుడ్డుకి జిల్లెట్ మాక్4 తో షేవింగ్ చెయ్యడంలో ఎక్స్పర్ట్స్ కి ఒక మనవి! మిస్సుడ్ కాల్ చేయడం/రావడం అన్న ప్రక్రియ ఉంది ముఖ్యంగా మన దేశంలో అని చెప్పద్దు. ఎందుకంటే అది ఇద్దరు ఒకళ్ళకిఒకళ్ళు తెలిసిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా కమ్యూనికేట్ చేసే ప్రక్రియ. (తెలీని వ్యక్తీ మిస్సుడ్ కాల్ చెయ్యడం అన్నది లేదు!) కాని దానికిిి ముందస్తుగానే చెప్తారు. ఉదాహరణకి "నేను మీ వీధిలోకి రాగానే మిస్సుడ్ కాల్ ఇస్తాను. నువ్వు వెంటనే బైటికి వచ్చి నిలపడు!" అని. అలా ముందు హెచ్చరించినా మనం ఒక్క రింగ్ కి డిస్కనెక్ట్ చేసే లోపల అవతలి వ్యక్తీ కొంచం తొందరపాటు మనిషైతే అర రింగులో ఫోన్ ఆన్సర్ చెయ్యడం. మనం "నీకు నేను ముందే చెప్పాను కదా! మిస్సుడ్ కాల్ ఇస్తాను అని! అయినా అంత ఆవేశంతో ఫోన్ ఎందుకు ఆన్సర్ చెయ్యడం. నాకో అర్ధరూపాయి నష్టం! నేనిప్పుడే మీ వీధి టర్నింగ్ తిరిగాను. బైటికి తగలడు!!" అని మనం వాపోవడం కూడా తరుచుగా పెజానీకానికి అనుభవమే!!


Monday, November 14, 2016

Demonetization!





"సార్! ఆ వెయ్యి, అయిదొందల నోట్ల విషయం తవరోపాలి ఆలోచిస్తే......"

"ఇగో! సెగట్రీ! నువ్వుండగా ఆలోచించాల్సిన ఖర్మ నాకేంటి? నిన్ను సెగట్రీగా పెట్టిందేందుకు? నువ్వే ఆలోచించు! ........ఆగు! అలాగే మజ్జాన్నం Manhunt Consultants వాళ్ళకో ఫోన్ కొట్టి రమ్మను! నీకంటే బాగా బుర్రెట్టి ఆలోచించే సెగట్రీ ని తీసుకొవాల! Manhunt వాళ్ళు మాంచి చాకులాంటి మనుషుల్ని ఇస్తారంట!!"

"చిత్తం..."

పైన రాసిన సగం స్క్రిప్ట్ నా గురువుగారు ముళ్ళపూడి వారి ఒక సినిమాలోది!! మిగతా సగం నా పైత్యం ;)


Tuesday, November 1, 2016

Don't buy Chinese products?!

Can someone answer few of my queries regarding the recent bombarding by people in social media urging us not to buy any Chinese products

1. I bought an Usha fan and after a couple of months accidentally noticed the label on it which read "Made in China"! Now did I buy an Indian brand Usha or did I buy a Chinese product? Please see the photo.


2. All of you are aware that iPhones as well as many other mobiles and electronic items of leading and even not so popular brands are manufactured in China! Now are we buying the Apple brand of USA or a Chinese product?

3. I bought a Xiaomi mobile phone which is a popular Chinese brand but here's the catch! Its manufactured in Sri City in Andhra Pradesh ;) Now did I buy a Chinese product or an Indian one?!

4. All those people who are shouting from the rooftops urging fellow Indians not to buy Chinese products are not so vocal in urging their fellow Indians not to sell Chinese products! Why?! If no one sells Chinese products in India none of us can buy them and end of the story!

5. Are these people aware that banning imports from a powerful country has political repercussions and consequences apart from the economic ones? Is it advisable (and can any country has the guts) to ban imports of ALL products from China and if so why not force the central government to pass an order to that effect?! Solves the problem at the root level. Right?!

6. Does banning Chinese products apply to goods manufactured in China by Indian companies and Chinese goods manufactured in India too?!

Over to you!

Thursday, October 27, 2016

Breathless!

BREATHLESS!!

హైదరాబాద్ లో సూపర్ మర్కెట్ లో కూరలు ఏరుకొన్నాక అవి వెయ్యడానికి పక్కనే ఉన్నరోల్ లో ప్లాస్టిక్ కవర్ చించి దాన్ని అటు పక్కకి, ఇటు పక్కకి, పైకి, కిందకి, చివరిగా 360 డిగ్రీల్లోనూ విపరీతంగా నలిపి ఇక మనవళ్ళ కాదని ఒక డెసిషన్ కి వచ్చేసి దగ్గరలో ఎవరన్నా సేల్స్ గర్ల్ ఉందేమోనని అన్ని వేపులా వెదికేస్తూ, చేతులు ఖాళీగా ఉండడం ఎందుకని నలపడం కంటిన్యూ చేస్తున్నప్పుడు, చివరికి ఒక సేల్స్ గర్ల్ అల్లంత దూరంలో కనిపించగానే మనం మూగవాడిలాగా చేతుల్లో ఉన్న ఆ విసిగిస్తున్న కవర్ వాళ్ళ దృష్టిలో పడేట్టు చెయ్యగానే ఆ అమ్మాయి మాకివన్నీ మామూలే "చస్తున్నాం ఈ చేతకాని మగాళ్ళతో" అన్నట్టు మన వేపు కొంచం జాలిగానూ, వెటకారంగానూ చూస్తోందేమోనన్న అనుమానం మనల్ని కుళ్ళపొడిచేస్తూంటే, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఎందుకొచ్చామురా బాబూ ఈ షాపింగ్ కి అని మనల్ని మనమే తిట్టేసుకుంటూ ఉంటే, ఆ సదరు సేల్స్ గర్ల్ పెళ్లి కూతురు లాగా కాట్ వాక్ చేస్తూ మన దగ్గరకి వస్తూంటే ఆమెని మధ్యలో ఇంకో కస్టమర్ ఆపితే, వాళ్ళిద్దరినీ విడిగానూ, జమిలిగానూ తిట్టుకుంటూ, కవర్ నలపడం కంటిన్యూ చేస్తూంటే, అలా సేల్స్ గర్ల్ వేపే చూస్తూండడం బాగోదేమోనని కాస్త చూపు పక్కకి తిప్పగానే మనకి ఎదురుగా మనలాంటి ఇంకో మగజీవి అదే మనలాంటి అసహాయ వీరుడు, నిస్సహాయ శూరుడు మనలాంటి బాధే పడుతూ అదే టైం కి ఆతను కూడా మనల్ని చూసి, ఇద్దరం పరస్పరం ఓ వెర్రి నవ్వు నవ్వుతూంటే, వెంటనే మన కళ్ళ ముందు ఒక మెరుపు మెరవకుండానే, ఈ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చెయ్యలేకపోవడం అన్నది కేవలం మన ఒక్కళ్ళ పురుషత్వానికి మాత్రమే అగ్ని పరీక్ష కాదని, పెపంచికంలో ఉన్న యక్ష కిన్నర కింపురుష పుంగవులందరికీ పరిక్షని, కాబట్టి మనం మనల్ని కించ పరుచుకోనవసరం లేదని ఒక యూనివర్సల్ ట్రూత్ అర్ధం అయ్యి యురేకా అని కేకెట్టబోయి, అలా కేకెడితే తర్వాత రైలులో చైన్ లాగిన వాడిలాగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సోస్తుందని అరక్షణంలో తట్టి, ఆ కేకని గొంతులోనే నొక్కేసి, ఆ ఆనందం ఎలా బైట పెట్టాలో తెలీక బైటికి ఒక చిన్న చిరు మందహాసంగా వెలువడితే, ఈ లోపల ఇంకోపక్కనించి ఇంటావిడ ఇంకో నాలుగు కూరలు ఏరేసి, ఏమిటీ ఇంకా ఒక్క కవర్ కూడా ఓపెన్ చెయ్యలేదా? పెద్ద మగాడిలా పోజులు కొడతారు ఈ మాత్రం చెయ్యలేరా అన్న అర్ధం వచ్చేలా మన వేపు ఒక చూపు చూస్తే, తట్టుకోలేక, పబ్లిక్ గా తిట్టుకోలేక, మన అసహాయతకి మనల్ని మనమే తిట్టేసుకుంటూ, అసలు ఈ తొక్కలో ప్లాస్టిక్ రోల్ టెక్నాలజీ ఏ దిక్కుమాలిన వాడు కనిపెట్టాడు అని తెలీని, కనిపించని వాడిని విపరీతంగా తిట్టేసుకుంటూ, ఈ లోపల ఆ పెళ్లికూతురు అదేనండీ ఆ సేల్స్ గర్ల్ మనల్ని కరుణించి మనదగ్గరకొచ్చి ఆ కవర్ ఇటివ్వండి అన్నట్టు చెయ్యి చాపగానే, మనం అప్పటిదాకా నలిపిన కష్టానికి ప్రతిఫలంగా, చిల్లర దేవుడు కరుణించి ఆ కవర్ టక్కున ఓపెన్ అయితే రెస్ట్ తీసుకోకుండా ఎవరెస్ట్ ఎక్కినవాడిలా ఆహా ఎంత ఆనందం!!

ఈ మధ్య కొన్ని సినిమా పాటలు Breathless గా పాడడం అన్న ట్రెండ్ ని రాయడంలో చూపించడానికి నే చేసిన విచిత్ర ప్రక్రియ. మీరు కూడా ఆసాంతం ఊపిరి పీల్చకుండా, పీలిస్తే వదలకుండా చదవడానికి ప్రయత్నించండి!!