Thursday, February 16, 2017

బొద్దింక!!!

"బొద్దింక ఆహారం ఏమిటి?!"

ఇదేటిది పొద్దున్నే ఈ పనికిమాలిన పరిజ్ఞానం కొశ్చన్ ఏటని కొశ్చన్ మార్క్ ఫీలింగ్ పేస్ లో చూపించొద్దు. నాకు పొద్దున్నే ఈ ధర్మ(?) సందేహం వచ్చింది. ఏదన్నా సందేహం వస్తే వెంటనే తీర్చుకునే ప్రయత్నం చెయ్యడం మానవుడిగా నా కర్తవ్యమ్ కాబట్టి మిమ్మల్ని అడిగాను.

నిజం చెప్పాలంటే ఇది నేను రాయబోయే "రచన"కి టీజర్ టైటిల్!! ఇల్లీమజ్జేన ప్రతిదానికి ఓ టీజర్ విడుదల చెయ్యడం ఫాషన్ అయ్యిపోయింది కదా! ఫస్ట్ లుక్ టీజర్. ఫస్ట్ ట్రైలర్ టీజర్. ఫస్ట్ షాట్ టీజర్. ఫస్ట్ పోస్టర్ టీజర్. ఆ కోవకి చెందినదే ఈ టైటిల్ టీజర్! ఏమిటో ? వెధవ ఐడియా లు అక్కరలేని సినిమా వాళ్లకి అనవసరంగా ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా నిస్వార్ధంగా ఇచ్చేస్తున్నా! విచ్చలవిడిగా వాడుకోండి నా ఈ టైటిల్ టీజర్ ఐడియా!

ఏ ఐడియా అయినా (బ్రహ్మాండమైనది అయినా కాకపోయినా) ఉత్తినే, ఊరికినే రాదు. ఆర్కిమెడిస్ కి నీళ్ళల్లో బాతు బొమ్మ చూస్తే వచ్చింది. న్యూటన్ కి నెత్తిమీద ఆపిల్ పడితే వచ్చింది. అలాగే నాక్కూడా పొద్దున్నీబొద్దింక ని చూడగానే వచ్చింది. "కాదేదీ ఐడియా కి అనర్హం" అని గమనించ మనవి.

ఇంతకీ ఇలా టైటిల్ బొద్దింక సహకారంతో పెట్టాను కాని ఈ టీజర్ గొడవేమిటా? దానికి కుంచం చరిత్ర ఉంది. అల్లామజ్జదాకా నేను విరివిగా, ఒకింత విచ్చలవిడిగా రోజూ ఏదో ఒకటి బరికి పారేసేవాడినని అభిమానులకి విదితమే! కానీ ఇటీవల నా జీవితంలో అనుకోని మార్పు అదేనండి టీవీ డైలీ సీరియల్ లో 3,962 ఎపిసోడ్ లో వస్తుందే అలాంటి పేద్ద మలుపు, వచ్చింది!

అలా మలుపు తిరగడంలో చాలా బిజీబిజీ అయిపోయి, సినిమా సంగతి దేవుడెరుగు, కనీసం సినిమా పోస్టర్ చూసే టైం కూడా లేకపోవడంతో ఇటీవల ఒకింత నేను రాయడం తగ్గించానన్న విషయం అభిమానులు గుర్తించినా ఒకింత అదే ఒక్క పిసరు అభిమానం తగ్గిందేమో, లేక అడగడానికి మొహమాట (భయ) పడ్డారో మొత్తానికి నన్ను ఎవరూ ఈ విషయం గురించి గుచ్చిగుచ్చిఅడగక పోయినా నేను కూడా సినిమా వాళ్ళ లాగ పెజానీకం మనసుల్లోకి దూరిపోయి అవన్నీ తెలుసుకుని ("ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కావాలంటున్నారు" అని సినిమాయగాళ్ళు ఎన్నోసార్లు చెప్పలేదా? అలాగే నేను కూడా!) వాళ్ళు అడగ(లే)ని కొశ్చన్ లకి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలా టైటిల్ టీజర్ పెట్టి "కమిట్" అయ్యాను. టైటిల్ పెట్టాక ఇవాళ కాకపోతే కనీసం ఓ ఆరునెలలకయినా వీలు చూసుకుని రచన పూర్తి చేస్తాను కదా. "ఒక్కసారి కమిట్ అయితే ..." తెలుసు కదా?

ఒహవేళ నా జీవితం 4371 ఎపిసోడ్ లో మరో మలుపు తిరిగి నేను మరీ బిజీ అయ్యిపోయి ఈ బొద్దింక ప్రహసనం రాయని పక్షంలో మీరందరూ అప్పుడప్పుడూ అంటే ఆరు నెలలకోసారి అన్న మాట "సార్! మీ బొద్దింక ఏమంటోంది" అని వ్యంగ్యంగా నాకు, నేను రాస్తానన్న ప్రతిజ్ఞ ఒకింత సున్నితంగా గుర్తుచేసి నా మీద పబ్లిక్ ప్రేషర్ బిల్డ్అప్ అయితేనన్నా రాస్తానేమోనని ఇలా ఈ

"బొద్దింక ఆహారం ఏమిటి"

అన్న టైటిల్ టీజర్ విడుదల చేయడమైనది.

నేను ఆ విషయం పరిశీలించి, పరీక్షించి రాసేలోపు మీరందరూ మీ మీ పరిజ్ఞానము కొలది ఆ టీజర్ కొశ్చన్ కి జవాబులు రాయచ్చు. గూగుల్ వాడుకున్నా తప్పులేదు కానీ వాడకండి!

No comments:

Post a Comment