Tuesday, July 21, 2020

Magallu! vantaa varpoo!

ఈ పోస్ట్ కేవలం పురుషులకి మాత్రమే!

అలా హెడ్డింగ్ చూడగానే ఆడోళ్ళందరూ ఈ పోస్ట్ ఆసాంతం చదివేస్తారని తెలుసు! బట్ ఐయామ్ హెల్ప్ లెస్ యు నో. వాళ్ళని ఎప్పుడాపగలం కనక!

ఇహ పోతే 

ఉరేయ్! వంటొచ్చిన, వంట చేస్తున్న మొగుళ్ళూ! ఇదేటిది ఉరేయ్ గిరేయ్ అనేస్తున్నాడు అని తెగ ఫీల్ అయిపోకండి. అది బుడుగు స్టైల్ అనుకరణ! వంట చేస్తున్న అంటే అచ్ఛంగా ఎప్పుడూ అని కాదు కనీసం ఈ కోవిడ్ సమయంలో అన్నమాట. 

ఇప్పుడు మనం అంటే వంట చేసే మగాళ్ళం, మొగుళ్ళం వంట చేస్తున్నప్పుడు చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి బోల్డు కిటుకులు, చిటుకులు, సులభ మార్గాలు వగైరా కనిపెడతాం కదా? ఆడోళ్లయితే వంట  ఓ పెద్ద పనిలాగా ఫీల్ అయిపోయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎలాగోలాగ గబగబా, కసాపిసా చేసి పారేసి వంటింట్లోంచి బైట పడదామా అని చూస్తారు. అలాగే చేస్తారు.  

మనం అలాక్కాదే. చాలా శ్రద్ధగా, ప్రేమతో వండుతాం. 

ఉదాహరణకి కూరలు తరగడం తీసుకోండి. ఈ పెళ్ళాలు ఎలా తరుగుతారు? మీకు తెలీనిదేముంది? పనిమనిషితోనో, పక్కింటావిడతోనో పిచ్చాపాటి మాట్లాడుతూ ఏదో  తరగాలి కాబట్టి తరిగి పడేస్తారు. 

కానీ మనం అలాక్కాదే ? ఉదాహరణకి బెండకాయలు ప్రతి ముక్క ఒకే సైజులో ఉండేట్టు  ఎంతో శ్రద్ధగా, ఓ గోడ అందంగా ఇటుకలు పేర్చి కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టూ ఎంతో ప్రేమతో వాటిని తిరుగుతాం. నేనైతే అప్పుడప్పుడూ 90 డిగ్రీల్లో కాకుండా 45 డిగ్రీస్ లో తరుగుతాను. లేదా సన్నగా ఒక్కరవ్వ పొడుగ్గా తరుగుతాను డిజైనర్ కట్  అన్నమాట! ఫోటో చూడుడి లోపాయికారీ మనలో మన మాట పనిమనిషులతో, పక్కింటి అంటీలతో ముచ్చట్లు చెప్పుకునే సదుపాయాలు మనకి లేవుగా!


నా మట్టుకు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్లుంటుంది కానీ చెప్పక తప్పటం లేదు. నేను చెప్పకపోతే మీ అందరికీ ఎలా తెలుస్తుంది. 

నేను ఏ పనయినా చాలా సైంటిఫిక్ గా చేస్తాను. ఉదాహరణకి కూరలో కారం ఒక స్పూన్ వెయ్యాలనుకోండి. ఆడోళ్లయితే మొత్తం చెంచాడు ఒకే చోట పడేస్తారు మూకుట్లో. ఆలా చేస్తే మొత్తం అన్ని కూర ముక్కలకీ దాదాపు సరిసమానంగా  ఆ కారం పట్టే అవకాశం తక్కువ. మరంచేత నేనేం చేస్తానంటే ముందు ఒక అర చెంచా కారం వేసి కూర ముక్కలని పైకి కిందకి ఒక్క సారి కలుపుతాను. అప్పుడు కిందనున్న ముక్కలు పైకొస్తాయి. అప్పుడు ఇంకో అర చెంచా కారం మూకుట్లో వలయాకారంలో చుట్టూ తిప్పుతూ వేసి మళ్ళీ బాగా కలుపుతాను. అలా చేస్తే కారం అన్నిటికీ బాగా పడుతుంది. 

ఇంకో ఉదాహరణ. కూరలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వగైరా వగైరా రెండు మూడు పొడులు వెయ్యాల్సి వస్తే ఈ ఆడోళ్లున్నారే,  లారీ లోంచి ఇసుక కిందకి ఒకే చోట పెద్ద కుప్పలా ఒంపినట్టు అన్ని పొడులూ కూరలో ఒకే చోట కుమ్మరిస్తారు. అప్పుడు కూడా పైన చెప్పినట్టు పెద్దగా కలవ్వు. 

నేను అలా రెండు మూడు పొడులు వేయాల్సి వస్తే అవన్నీ చిన్ని గిన్నెలో వేసి చెంచాతో బాగా కలిపి పైన చెప్పిన విధంగా నాలుగు దఫాలుగా వేసి కలుపుతా. అప్పుడు చూడండి నా సామిరంగా. కూర అదరః ! చూడుడు ఫోటో 


ఇహ కొత్త కొత్త ప్రయోగాలంటే మొన్న పోస్ట్ చేసినట్టు బెండకాయ ముచ్చికలు అచ్చిక బుచ్చిక లాడుతూ కూర చేస్తా! 

ఇంకో చిన్ని టిప్! అర చెంచా వాము, అరచెంచా మిరియాలు కలిపి పొడి చేసి చాలా కూరల్లో చివరిగా వేస్తా. జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్న మిరియాల  ఘాటు తగులుతుంది!. మా ఆవిడ అన్నిట్లో వేస్తారేంటి అంటుంది  ఏం అన్నిట్లో తను కారప్పొడి వేస్తె నేనెప్పుడన్నా పల్లెత్తు మాటన్నానా? మొగుడన్నాక ఆ మాత్రం స్వతంత్రం లేకపోతె ఏం సుఖం. అందుకని నేను అవన్నీ పట్టించుకోను. మనం కొన్ని కొన్ని విషయాల్లోనైనా అలా గట్టిగా , ఖచ్చితంగా లేకపోతె చాలా కష్టం బాబూ 

ఇంతకీ మీరిటువంటి చిటుకులు, కిటుకులు, చిట్కాలు  ఏమన్నా కనిపెట్టి ఉంటే మీతో(బో)టి మొగుళ్ళతో ఇక్కడ పంచుకోండి.  

Friday, July 17, 2020

Antaratma - kateef.

ఈ మధ్యన నాకు నా అంతరాత్మకి చిన్ని చిన్ని ఘర్షణలు తరుచుగా జరుగుతూండడంతో నాకు విసుగొచ్చి దానికి కటీఫ్ చెప్పేసా. అప్పటినించీ మా ఇద్దరికీ మధ్య మాటల్లేవు. ఇప్పుడు ప్రాణం హాయిగా, ప్రశాంతంగా ఉంది.

ఇంతకీ గొడవలెందుకంటారా? వస్తున్నా అక్కడికే.

అది తెలుసుకోవాలంటే అధమపక్షం ఓ మూడు, నాలుగు దశాబ్దాలు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోవాలి. పదండి మరిహ అలీసం దేనికి? అక్కడే ఉంచేస్తానని భయపడకండి. ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం. ఆబ్బె అది కాదు. అలా వెళ్లి ఇలా వచ్చేద్దాం.

అవి నేను బ్రహ్మచారిగా ఎంచక్కా చిన్ని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తున్న రోజులు. ఏంటో గురూ ఆ రోజులే వేరు. సరే రోజూ బైటికి వెళ్తున్నప్పుడు ఈ అంతరాత్మ నేను కూడా వస్తానని ఓ తెగ గొడవ చేసేది. సర్లే ఇంట్లో ఒక్కర్తికి భయమేమో నాక్కూడా కాస్త కంపెనీ ఇచ్చినట్టు ఉంటుందని దాన్ని వెనకేసుకుని అంటే సంకనెత్తుకుని ఊరంతా బలాదూర్ తిరిగేవాడిని. అప్పుడు మార్కెటింగ్ ఉద్యోగం వెలగపెట్టాను లెండి.

అలా తిరిగినప్పుడు ఇదిగో ఈ అంతరాత్మ ఉందే నా మానాన్న నన్ను ఉండనిచ్చేది కాదు.  రోజంతా ఒకటే  నస. చెవిలో జోరీగలా

"ఏమిటీ ఆ అమ్మాయివైపు అంత సేపు చూస్తున్నావు" - పెళ్లికాని ప్రసాదు అమ్మాయిల వేపు చూడక ఆంటీ లని చూస్తాడా దాని పిచ్చి కానీ. 

"ఈ మజ్జెన సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు" - చస్తున్నాను దీంతో. ఓ పక్కన సేల్స్ ఎందుకు అవ్వటం లేదని రోజూ బాస్ తలంటు పోస్తున్నాడు. ఎలా ఎక్కువ అమ్మాలో తెలీక, బాస్ చెప్పక, వాడికి సమాధానం చెప్పలేక, ఇంకో బోడి ఉజ్జోగం దొరక్క టెన్షన్ తో ఓ నాలుగు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే అర్ధం చేసుకోవడం పోయి ఈ ఇంటరాగేషన్ ఏమిటి?

"అసయ్యంగా ఆ బీడీలు కాల్చడం ఏమిటి" - దానికేం తెలుసు గొర్రెతోక బెత్తెడని చిరుద్యోగి జీతం ఇరవయ్యో తారీఖు కల్లా శివార్పణమ్ అని అప్పటిదాకా దర్జాగా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టేలు కాల్చినా చివరి వారంలో బీడీలతోనే సరిపెట్టుకోవాలని!


"నీకొచ్చే తొక్కలో జీతానికి నువ్వు ప్రతి ఆదివారం రెండు సినిమాలు చూడాలా?" -  మా జీతానికి మా బ్రతుక్కి మందా మాకా? కనీసం సినిమాలు చూసే కనీస అదృష్టం కూడా లేదన్న మాట ఈ ఎదవ జీవితానికి

ఇలా దానికి అక్కరలేని విషయం లేదు.  ప్రతి దాంట్లో వేలెట్టడమే... కాదు కాదు పుల్లలు పెట్టడమే.

అనకూడదు కానీ మనలో మన మాట పెళ్లయ్యాక నా బ్రతుకు ఎలా ఉంటుందో 70 mm సినిమాస్కోప్ లో నాకు ట్రైలర్ చూపించేసింది. ఇహ దీంతో ఇలా లాభం లేదని పెళ్లయ్యాక దాన్ని ఇంట్లోనే వదిలేసి బైటికి పోతున్నాను ఇన్ని సంవత్సరాలుగా

కానీ మీకు తెలీనిది ఏముంది సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి రాగానే మళ్ళీ ఇంటరాగేషన్ మొదలు. "ఏమిటి ఇంతాలీసం అయ్యిందివాళ" - అరే చిన్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నప్పుడు రోజూ కొత్తగా పెళ్లయిన వాడిలా ఏడింటికల్లా ఇంట్లో వాలాలంటే ఎలా - అవతల బోల్డు పనులు, కధలు, కమామీషులు.

"ఈ మజ్జెన ఆదివారం ఇంటి పట్టునుండకుండా ఆ వెధవాఫీసు  పట్టుకు వెళ్లాడకపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపచ్చుగా " - నేను ఇంటికంటే ఆఫీస్ పదిలం అని వెళ్తున్నానని ఎప్పటికి అర్ధం చేసుకుంటుందో ఏమిటో

"ఈ మధ్య పార్టీలు ఎక్కువయ్యాయి నీకు. ఛాన్స్ దొరికితే చాలు ఏదో వంకతో పార్టీ  అని జంప్ అయ్యిపోతావు" - అమ్మా తల్లీ నీకేం తెలుసు మగాళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఆఫీసన్నాకా బోల్డు మంది సహోద్యోగులుంటారా? నలభై ఏళ్లుగా హైదరాబాద్ లో పడుంటే బోల్డు మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారుగా?

మరి ఒకడికి కొత్త ఉద్యోగం వస్తుంది. పార్టీ.
ఇంకోడి కొడుక్కి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. పార్టీ.
ఇంకోడు ఇల్లు బుక్ చేసాడు. పార్టీ. దాని గృహప్రవేశం  అయ్యాక పార్టీ.
ఇంకోడి కూతురికి పెళ్లి కుదిరింది. పార్టీ. ఎంగేజ్మెంట్ పార్టీ. పెళ్లయ్యాక రిసెప్షన్ పార్టీ. నాలుగు రోజులయ్యాక ఆప్త మిత్రులందరికీ  సినిమా వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకున్నట్టు పార్టీ.
ఇంకోడు కొత్త కారు కొంటాడు. పార్టీ.
ఇంకోడి కొడుక్కి అమెరికా వీసా వచ్చింది. పార్టీ.
ఆఫీసులో ఒకడికి ప్రమోషన్. పార్టీ.

ఇలా పార్టీ పార్టీ పార్టీ. ఏది అటెండ్ అవ్వకపోతే వాడికే కోపం. అటెండ్ అయితే అంతరాత్మకి,  దాంతో పాటు ఆవిడ గారికి కోపం. మీరెన్ని చెప్పండి. మన దేశంలో మగాడి పరిస్థితి బహు అధ్వానం.

ఈ ఈతి బాధలు పోలీసోడి దెబ్బల్లాంటివి.  చెప్పుకోలేం. చూపించుకోలేం. పడ్డ వాడికే తెలుస్తుంది నొప్పి


ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ సమాప్తం


ఈ అంతరాత్మలు సామాన్య మానవుడినే కాదు సినిమాల్లో హీరోలని కూడా విసిగించేవి పాత సినిమాల్లో! పాపం హీరో ఏదో విషమ పరిస్థితుల్లో ప్రియురాలికి టాటా చెప్పేసి ఇంకో సుందరిని పెళ్లి చేసుకుందామనుకున్నాడనుకోండి. ఆ వదిలేసిన ప్రియురాలు "ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అని క్షమిస్తుందేమో కానీ ఈ అంతరాత్మ ఛస్తే క్షమించదు. వదలదు. పీక్కు తింటుంది వాడ్ని. ఇలా పీక్కు తినడాన్ని ఆ నాడు దర్శకులు చాలా బాగా చూపించేవాళ్ళు.

హీరో పెద్ద నిలువుటద్దం ముందు నిలపడి ఉంటాడు. అద్దంలో అంతరాత్మ. ఇద్దరికీ వేర్వేరు బట్టలేసేవాళ్ళు లేపోతే మనం కన్ఫ్యూషన్ అవుతామని. ఇహ చూస్కోండి వాళ్లిద్దరూ ఓ తెగ డిషుమ్! డిషుమ్! ! సివరాకరికి హీరోకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న ఓ పెద్ద ఫ్లవర్ వాజ్ ని ఆ అద్దం మీదకి మాంఛి కోపంతో విసిరేస్తాడు. దాంతో అద్దం  ముక్కలు ముక్కలు అయ్యి  గదినిండా పడిపోతుంది.

అక్కడితో అవ్వలేదండోయ్. ఆ ప్రతి అద్దం ముక్కలో ఈ అంతరాత్మ మొహం భీకరంగా పెట్టి వికటాట్టహాసం చేస్తూంటుంది. హీరో కి ఇంకేం చెయ్యాలో తెలీక అంటే ఆ ముక్కలని తన చెయ్యి కోసుకు పోకుండా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో  తెలీక, ఒహ వేళ తెలిసినా అలా చేస్తే ఇప్పుడు ఓ డజను ముక్కల్లో ఉన్న అంతరాత్మ ఇంకో రెండు డజను ముక్కల్లో కనిపిస్తుందన్న విషయం అర్ధమయ్యి ఆ గదిలోంచి విసురుగా బైటికి వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఇప్పడికి వస్తే ఎందుకు నాకు నా అంతరాత్మకీ గొడవలయ్యాయంటే ఇన్నాళ్లు ఉద్యోగం, సద్యోగం పుణ్యమా అని అధమ పక్షం వారంలో ఆరు రోజులు బైటికి పోయేవాడిని. ఈ కొరోనా పాపమా అని నేను మూడు నెలలుగా ఇంటిపట్టునే  పడుండడంతో వచ్చింది చిక్కంతా!

గత మూడు దశాబ్దాల పై చిలుకు నేను బైట, అంతరాత్మ లోపల (ఇక్కడో పన్ ఏడిసింది) ఉండేవాళ్ళం. ఇప్పుడో పొద్దున్న లేచిందగ్గరినించీ ఇద్దరం మొహామొహాలు చూసుకోవడం. అలవాటు లేని పనాయె. దాంతో ఇద్దరికీ చెప్పలేని చిరాకొచ్చి రోజూ చీటికీ మాటికీ కీచులాటలు. మాట మాట అనుకోవడం మొహం ముడుచుకోవడం .

మీరు కూడా అలా ఓ నదరుగా ఉన్న ఓ అద్దం పగలకొట్టేయచ్చుగా అంటారేమో. ఎంత కోపం వచ్చినా  కాస్త వెనకా ముందు చూసుకుని  రెచ్చిపోయే టైపు నేను., అలా అద్దం పగలకొడితే మళ్ళీ నాకే పడుతుంది దాని బడ్జెట్.

ఎవరి మీదన్నా కోపమొస్తే చేతిలో ఉంది కదా అని నలభై వేలు పోసి కొన్న వన్ ప్లస్ 7 విస్సిరి కొడతామా ఏమిటి? మహా అయితే దగ్గర్లో ఏదన్నా న్యూస్పేపర్ లేదా మ్యాగజైన్ ఉంటె దాన్ని విసురుతాం. ఎంతైనా బతక నేర్చిన బడ్జెట్ పద్మనాభాలం కదా

అయినా మనసు కవి ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు "మనసున్న మనసుకి సుఖము లేదంతే" అని. ఈ మనసు అంతరాత్మ వేర్వేరని నా అంతరాత్మ ఛీ ఛీ ఛీ నేను చెప్తున్నా.

సరే మళ్ళీ అసలు కధలోకొస్తే దాని బాధ ఇలా రోజూ పడడం నావల్ల కాక మొన్నా మధ్య కటీఫ్ చెప్పేశా. అప్పటినించీ ప్రాణం హాయిగా. జీవితం ప్రశాంతంగా. 

అదీ మా ఆవిడా చెవులు కొరుక్కుంటూంటారు నా గురించి.  నాకేం భయమా?

చూద్దాం ఎన్నాళ్ళు సాగుతుందో.  

Monday, July 13, 2020

Telegram - a flashback!

చాలా దశాబ్దాల క్రితం నాకు ఊహ తెలిసినప్పటినించి 60s , 70s లో గుమ్మం బైటినించి "టెలిగ్రామ్" అని అరుపు వినిపించిందంటే ఇంట్లోవాళ్ల గుండెలు కొన్ని సెకండ్లు కొట్టుకోవడం మానేసేవి. సదరు పిలుపు విన్న ఉత్తరక్షణంలో ఇంట్లో ఆడంగులు ఒకటే చీర కొంగుతో కళ్ళొత్తుకొనేసే వాళ్ళు. లేదా ఒకింత అతి చేసి ఏకంగా భారీ ఎత్తున ఏడుపు లంకించుకొనేవాళ్ళు!

ఎందుకంటే ఆ రోజుల్లో ఆ "టెలిగ్రామ్" అనేది సర్వసాధారణంగా దుర్వార్తలే మోసుకొచ్చేది. ఎవరన్నా చావు బ్రతుకుల్లో కొట్ట్టుకుంటున్నప్పుడు వెంటనే డాక్టర్ "మేం చేయగలిగింది చేసాం! ఈ రాత్రి గడిస్తే కానీ ఏ సంగతీ చెప్పలేం అనో" లేదా "ఇంకొన్ని గంటలే. దగ్గర వాళ్లకి కబురెట్టండి" అనో చెప్పినప్పుడు వెంటనే టెలిగ్రామ్ నా అనుకున్నవాళ్ళకి పంపేవాళ్లు. అందులో ఎప్పుడూ ఒకటే రాసేవాళ్ళు. అదేమిటంటే "ఫాదర్ / చిట్టి సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ ".

గమ్మతేమిటంటే ఎవరన్నా పోయినప్పుడు ఫలానా వ్యక్తి పోయాడని రాసేవాళ్ళు కాదు. అప్పుడు కూడా "సో అండ్ సో సీరియస్! స్టార్ట్ ఇమ్మీడియట్లీ " అనే రాసేవాళ్ళు.    ఎందుకో నాకిప్పటికీ అర్ధం కాదు. పోనీ ఆ టెలిగ్రామ్ అందుకున్న వాళ్లకి కొన్ని గంటలయినా ఆ అశుభవార్త తెలీకుండా ఉంటె బాగుంటుంది అననుకోవాలంటే అది తప్పు. ఎందుకంటే పైన మనవి చేసినట్టు టెలిగ్రామ్ అనగానే ఎవరో పోయినట్టే ఊహించేసుకొని శోక సముద్రంలో మునిగిపోయేవాళ్లు.

నాకు కొంచం వయసు వచ్చాక అంటే సుమారు పన్నెండేళ్ళు అనుకోండి. ఇలా టెలిగ్రామ్ అని వినగానే అందులో ఏముందో చూడకుండానే ఎందుకు ఏడుపు మొదలెట్టేవాళ్ళొ అర్ధమయ్యేది కాదు. అదే అడిగేవాడిని. ఎందుకీ అడ్వాన్స్ ఏడుపు. ఒక్క నిమిషం ఆగి ఆ విషయం ఏదో చదివాక ఏడుపు మొదలెట్టచ్చు కదా అని. "నీకేం తెలీదు పోరా" అనో "నీకు అర్ధం కాదు లేరా" అనో నన్ను తోసిరాజని ఏడుపు కార్యక్రమం మట్టుకు దిగ్విజయంగా సాగించేవాళ్ళు.


కొన్నిసార్లు టెలిగ్రాంలో ఇంకేదైనా శుభవార్త చదివాక అదే చీర కొంగుతో మరొక్కసారి కళ్ళొత్తుకొని వెళ్లి మొహం కడుక్కొచ్చి ఓ నవ్వు స్టిల్ ఇచ్చేవాళ్ళు.

అన్నట్టు నేను నా మొదటి ఉద్యోగం టెలిగ్రామ్ ద్వారానే  రాజీనామా చేసాను! ఒక కారణంవల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ నా బాస్ నెలలో దాదాపు 15 రోజులు టూర్ వెళ్ళేవాడు.  బాస్ టూర్ వెళ్ళినప్పుడు, ఒకసారి రాజీనామా చేద్దామని నిర్ణయించాక ఇహ ఒక్కరోజు కూడా  పని చేయలేక మా ఊరు వెళ్ళిపోయి అక్కడినించి బాస్ కి "రెజైనింగ్. లెటర్ ఫాలోస్" అని ఓ టెలిగ్రామ్ కొట్టా! వెంటనే మర్నాడు గోడక్కొట్టిన బంతిలా అయన దగ్గర నించి నాకో టెలిగ్రామ్ వచ్చింది "రిజిగ్నేషన్ నాట్ ఆక్సెప్టెడ్. జాయిన్ ఇమ్మీడియేట్లీ" అని. అయినా  నేను అతి మొండివాడిని కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వలేదనుకోండి! ఇంతకీ ఇదెందుకు చెప్పానంటే టెలిగ్రాంలో మాములు విషయాలు కూడా ఉంటాయి కేవలం అశుభాలు కాదు అని!

ఈ టెలిగ్రామ్ పంపడంలో అంటే మేటర్ రాయడంలో చాలా తెలివితేటలు ప్రదర్శించేవారు ప్రజలు! ఎందుకంటే దీని చార్జీ పదాల సంఖ్యా మీద ఆధారపడేది. ఎక్కువ మాటలయితే ఎక్కువ ఛార్జ్. అంచేత ఎంత తక్కువ మాటల్లో చెప్పగలరో అంత తక్కువ రాసేవాళ్ళు. ఈ టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ మీద చాలా జోకులు ప్రచారంలో ఉన్నాయి!

ఒక ఉద్యోగి తన హెడ్ ఆఫీస్ కి ఇలా టెలిగ్రామ్ పంపాడు "వాంట్ లీవ్. వైఫ్ గాన్ ఫర్ డెలివరీ. ప్లీజ్ సెండ్ రీప్లేస్మెంట్"! కవి హృదయం మీకర్ధమయ్యే ఉందనుకుంటా !

ఇలా తక్కువ మాటల్లో అనుకున్నది చెప్పే అనుభవం నాలాంటి వాళ్లకి  అనేది ట్విట్టర్ పెట్టిన చాలా సంవత్సరాల దాకా బాగా పనికొచ్చింది. ఎందుకంటే మొదట్లో ట్వీట్ కేవలం 140 అక్షరాలకే పరిమితం. ఇప్పుడు రెట్టింపు చేశారనుకోండి. సో ట్విట్టర్ కి తండ్రి ఈ టెలిగ్రామ్ !

రానురాను సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సమాచారం టెలిగ్రామ్ కంటే అతి వేగంగా ప్రపంచం నలుమూలలా వ్యాపించడం మొదలయ్యింది. ముఖ్యంగా గత దశాబ్దంలో. దాదాపుగా అందరి దగ్గర మొబైల్ ఫోన్లు కనీసం కుటుంబానికి ఒకటయినా ఉండడంతో SMS, వాట్సాప్ వగైరా బహుళ వాడకంలోకి రావడంతో టెలిగ్రామ్ కి ఆదరణ తగ్గి తగ్గి చివరికి ఒక్కరు కూడా దానిని వాడటం లేదని గుర్తించి, గమనించి గత్యంతరం లేక ప్రభుత్వం వారు ఈ "టెలిగ్రామ్" సేవలని 163 సంవత్సరాల సేవల అనంతరం 2013 సంవత్సరం రేపటి రోజున ఆపివేశారు. అంటే ఇవాళ చివరి రోజన్నమాట ఏడు సంవత్సరాల క్రితం

నన్నడిగితే, అడగరనుకోండి. చాలా ప్రభుత్వాలు చాలా  ఊళ్ళ పేర్లు గత రెండు దశాబ్దాలుగా మార్చేసారుగా! బొంబాయి ని ముంబై, మద్రాస్ ని చెన్నై, గుర్గాన్ ని గురుగ్రామ్, పూనా ని పూణే ఇలా ఎన్నో. అదే చేత్తో ఇంత అవిరళ సేవలందించిన ఈ టెలిగ్రామ్ గౌరవార్ధం ఏదైనా ఒక గ్రామాన్ని "టెలి గ్రామ్"గా మారిస్తే బాగుంటుంది!

ఒకటిన్నర శతాబ్దం గొప్ప ప్రజాదరణ పొంది విశేష సేవలందించిన ఆ టెలిగ్రామ్ ని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసే చిన్ని ప్రయత్నం!


Thursday, July 9, 2020

Broomstick with long handle

ఈ కొరోనా పుణ్యమా అని పనిమనిషిని మానిపించేసి ఇంటిపని వంటపని అన్నీ నేను మా ఆవిడా జమిలిగా చేసుకుంటున్నాం. కొన్ని పనులు ఇద్దరం మాట్లాడుకోకుండానే  విభజించేసుకున్నాం. రోజూ కూర చేయడం కొన్ని అంట్లు తోమడం నా వంతు. కుక్కర్ పడేయడం (కింద కాదండోయ్) గదులు ఊడ్చడం వగైరా (అంటే దాదాపు మిగిలిన అన్ని పనులు అన్నమాట!!) మా ఆవిడ వంతు.


ఇంతమటుకు బాగానే ఉంది. కానీ గత కొద్దీ వారాలుగా మా ఆవిడ పాపం నడుం వంచి రోజూ ఇల్లంతా (చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టుంటుంది కానీ కాస్త పెద్దిళ్లే మాది సైజులో) ఆ చిన్ని చీపురుతో ఊడ్చడం చూడలేక రోజూఅధమపక్షం ఓ రెండు మిల్లి లీటర్ల చొప్పున నా గుండె కరిగిపోతోంది.

ఒకింత రామాయణం వదిలి పిడకల వేట. ఏమండీ మీరు అన్నీ ఇలాగే రాస్తారు. గుండె ఏమన్నా ద్రవ పదార్ధమా మిల్లి లీటర్లలో కరగడానికి అని ఓ కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రశ్న కొంతమంది వేస్తారని ముందే ఊహించి దానికి సమాధానం కూడా మనవి చేసుకుంటా. గుండె ఘన (ద్వందార్ధము) పదార్థమే కానీ కరిగాక దాన్ని గ్రాముల్లో కొలవలేము కదా?

ఇహ మళ్ళీ తిరిగి బ్రేక్ కె బాద్ అసలు మాటర్లోకి వస్తే ఎవరన్నా తెలివున్న వ్యాపారవేత్త ఇప్పటి కాలమాన పరిస్థితులని పట్టి ఇలా ఇప్పటిదాకా నడుం వంచ(గ)ని గృహిణులకు కొత్త రకం చీపురు ఓ పెద్ద హేండిల్ తో చేస్తే (మాప్ లాగా ... దీన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. నేల తుడిచే బట్ట అనచ్చా ?) నేటి అలనాటి మహిళలకి ఈ పని బోల్డంత సులభతరం చేసిన పుణ్యం, బోల్డు లాభం దక్కుతాయి కదా?

అప్పుడు మహిళలంతా సినిమా హీరోయిన్ లాగా అలవోకగా సుతారంగా నడుం వంచకుండా అలా అలా గదులన్నీ చులాగ్గా తుడిచేయచ్చు. అలా తయారు చేసినవాడు ఏ కత్రినానో మోడల్ గా పెట్టి ఓ యాడ్ కూడా తీసి పారేయచ్చు. మనలో మన మాట ఆవిడ బాగా  పొడుగు కదా? సాధారణ గృహిణిలా ఎప్పుడైనా గదులు ఊడవాలంటే బాగా ఒంగాలి పాపం.

ఇప్పుడే అందిన వార్త: ఇలాంటి చీపుర్లు అమెజాన్ లో దొరుకుతున్నాయోచ్

గమనిక: చీపురు ఫోటో, మాప్ ఫోటో ...చీపురు పొట్టి, మాప్ పొడుగు హేండిల్ సూచించడం కోసం పోస్ట్ చేయడమైనది.  ఆ రెండూ కలిపితే ఎలా ఉంటుందో ఎవరికన్నా ఫోటోషాప్ వస్తే చేసి పోస్ట్ చేయండి.



Sunday, June 14, 2020

Ragulutondi mogali poda!


మీలో చాలామందికి ఖైదీ సినిమాలో "రగులుతోంది మొగలి పొద" పాట గుర్తుండే ఉంటుంది.

ఆ రోజుల్లో అది కెవ్వుకేక.

ఆ పాట స్టూడియోలో ఔట్డోర్ సెట్ వేసి మనల్ని మాయ చేసారు. అయినా వాళ్ల పిచ్చి కాకపోతే చిరు, మాడ్స్ (మాధవిని నేను ముద్దుగా అలా పిలిచేవాడిని) డాన్స్ అల్లాడిస్తూంటే వెనకాల ఉన్నది మొగలి పొదా, ముళ్ళ పొదా, ఈతచెట్టా, తాటిచెట్టా అని బాక్గ్రౌండ్ చూస్తామని వాళ్లనుకోవడం ఉందే పిచ్చికి పీక్స్.

అసలింతకీ మేటర్ ఏమిటంటే వానలు పడకపోయినా ఇది వానాకాలం కదా ఇవాళయినా ఒకింత "చిరు"జల్లు పడుతుందేమోనని మార్నింగ్వాక్ కి చిన్న బ్రేక్ ఇచ్చి ఆకాశం అంతా దుర్భిణీ పెట్టి చూసా. అబ్బే. చిన్న వాన పిల్ల మబ్బు కూడా లేదు. అంటే ఇవాళ కూడా వానలకి నీళ్లొదుకోవాల్సిందేనన్నమాట. వాన నీళ్లు కాదండోయ్ అసలే వానల్లేవు.

మళ్ళీ అసలు మ్యాటర్ ఏమిటంటే ...... అదేమిటి సార్ ఇందాకలే అసలు మ్యాటర్ ఏమిటంటే అన్నారు కదా మళ్ళీనా అంటే ఏదో మాటవరసకు సవాలక్ష అంటాం. అన్నీ పట్టుకొని కోడిగుడ్డుకి జిల్లెట్ మాక్ 4 రేజర్ తో షేవింగ్ చేస్తే నా వల్ల కాదంటే కాదు.

సరే అసలు మ్యాటర్ లోకొస్తే ఇందాక "చిరు" జల్లు అనగానే ఓ రెండు "చిరు" పాటలు వెంటనే గుర్తొచ్చాయి. మొదటిది మొదట్లోనే చెప్పాగా "రగులుతోంది మొగలి పొద". ఇహ రెండోది ఏమిటో మీరు చెప్పితే మాంచి బహుమతి ఏమన్నా ఇద్దామనుకుంటున్నా. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమివ్వాలి ఇంకా నిర్ణయించలేదు. బహుశా ఓ రెండు లక్షల ఎనభై ఏడువేల మూడొందల నలభై మూడు సెకండ్లలో నిర్ణయం తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మళ్ళీ అసలు మ్యాటర్లోకొస్తే ఆ "రగులుతోంది మొగలి పొద" పాము డాన్స్ కదా. పైగా ఔట్డోర్ సెట్టింగ్. ఇది వానాకాలం. "చిరు"జల్లు. ఇవన్నీ మిక్సీలో వేసి తిప్పితే నాకో చిన్ని సందేహం వచ్చింది.

అదేమిటంటే అలాంటి పాము డాన్స్ వానలో పెడితే దాన్ని వానపాము డాన్స్ అనచ్చా? తెలిసీ సమాధానం చెప్పకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.

మీ జవాబులు హైద్రాబాద్లో మళ్ళీ (అంటే నిన్నా మొన్నా పడిందని కాదు ఏదో మాట వరసకి) వాన పడేలోగా పోస్ట్ చేయండి. ఎందుకంటే వానపడితే నేను మడిసిని కాదు. సీమసందుల్లో సీమపందిలా, ఆ వానలో మట్టిలో వానపాములా దొర్లుకుంటూ, పొర్లుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతా. మళ్ళీ ఈ తుచ్ఛ ప్రపంచంలోకి రావాలంటే టైం పడుతుంది. ఆ పైన మీ ఇష్టం.

ఇంకో సప్లిమెంటరీ మేటర్! తేగలా ఉన్నావంటే తేగ తెమ్మన్నాట్ట ఎనకటికొకడు. ఇప్పుడలాగా వానపామంటే నాకు అర్జెంట్గా వానపాముని చూడాలనుంది. అంటే నిఝమ్ వానపాముని. కాబట్టి మీరు దాని ఫోటోలు డౌన్లోడ్ చేసి పోస్ట్ చేసే శ్రమ పడకండి. ఆమాత్రం మాకూ తెలుసు. వాన చూస్తే వచ్చే మజా వాన ఫోటో చూస్తే వస్తుందా? మందు కొడితే వచ్చే మజా మందు సీసా చూస్తే వస్తుందా? రాదు. రాదు. రాదు.

ఇంతకీ నేనెక్కడికో వెళ్లిపోయానని మీరు కూడా నాతొ పాటు వచ్చేసి అసలు విషయం మర్చిపోవద్దు. అసలు మ్యాటర్ (మళ్ళీ) వానలో పాము డాన్స్ ని వానపాము డాన్స్ అనచ్చా ?



Kotthaavakaya+nuvvula podi =

మొన్నీ మధ్య మన కోస్తా ఫుడ్స్ వాళ్ళ కొత్తావకాయ తెప్పించా. ఈ వయసులో తినడమే కానీ ఆవకాయ పెట్టె ఓపిక లేదు కదా .

చాలా రోజులనించీ అనుకుంటున్నా, నిన్న తీరిక దొరికి నా స్వహస్తాలతో నువ్వులపొడి చేశా.. మా విసాపట్నం వాళ్ళం నూలుగుండ/ నువ్వులగుండ అంటాం దీన్ని



ఇవాళ ఆదోరం కదా కాస్త తీరిగ్గా భోంచేస్తూ కొత్తావకాయ, నూలుగుండ రెండూ కలిపి అన్నంలో కలిపి ఒక్క రవ్వ (నిజం చెప్పాలంటే రెండు మూడు రవ్వలు ) ఆవు నెయ్యి తగిలించి తిన్నా. అయినా మీ పిచ్చి కానీ అలా ఆవకాయా, నూలుగుండా కలిపి తింటారా ఎవరైనా హవ్వ అని బుగ్గలు నొక్కుకోకండి. నా బోంట్లుండబట్టే మీ బోంట్లకి పెసరట్టుప్మా, పెరుగు వడా వగైరా వగైరా మహాద్భుతాలు తెలిసాయి. అయినా సిరివెన్నెలగారన్నారుగా "ఎవరో ఒకరు. ఎపుడో అపుడు. తినరా ముందుగా అదీ ఇదీ కలియగలిపి" అని. మీరసలు నాకు బోల్డు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్వర్గ రహస్యాలు మీకింత వీజీగా చెప్పేస్తునందుకు

నిజం చెప్పాలంటే గిసుంటి సీక్రెట్స్ నాకాన శానా ఉన్నాయ్ . అల్లం  పచ్చడి , గోంగూర పచ్చడి (అంగూర!), గోంగూర, చింతకాయల (గోచి!) చింతకాయ టమాటో (చిమాటో)... హిలా చాలా డెడ్లీ కాంబోస్. ఇంకా ఉన్నాయి కానీ నన్ను మంచి చేసుకుంటేనే చెప్తా

ఇంకేముంది అందరూ అంటూంటారే స్వర్గానికి బెత్తెడు దూరం అని.... బెత్తెడు లేదు. జాన లేదు. ఆ రెండూ కలిపి తింటే డైరెక్ట్ గా స్వర్గం తలుపుల దగ్గర తేలా. తేరిపార చూస్తే తలుపులు మూసేసున్నాయి. అటూ ఇటూ చూస్తే ఓ గుళ్లో గంటలాంటిది కనిపించింది. అది కాలింగ్ బెల్ అనుకుంటా! అనుకోవడం అలీసం మరిహనేం. గణగణమని వాయించి పారేసా. ఎలాగు ఇంతదూరం వచ్చాం కదా స్వర్గంలో ఓ రెండు గంటలు ఏమన్నా కండెక్టడ్ టూర్ ఉంటె ఓ లుక్కేసి పొతే ఓ పనయ్యిపోతుంది. ఇంతింత దూరం రోజూ రాలేం కదా?

ఓ రెణ్ణిమిషాలకి ఓ పొడుగాటి మడిసి తలుపు తీసి 1 టు 2 లంచవర్! ఓ గంటాగాలి అన్నాడు. వార్నీ. ఏదో పోన్లే పాపం ఇంత దూరం వచ్చా కదా అసలీ స్వర్గం అనేది మనం పోయాక వర్త్ గోయింగా అని సూద్దారంటే గంటాగమంటాడేటి? వాళ్లకయితే ఈ స్వర్గంలో బొత్తిగా పనులుండవు. మనకలాక్కాదే. బోల్డు యవ్వారాలాయె. సర్లే ఇంకోపాలి ఇటొచ్చినప్పుడు సూద్దారని ఎల్లిపొచ్చేసా

సో ఫైనలాఖరికి నే సెప్పేదేటంటే మీరు కూడా స్వర్గం చూడాలనుకుంటే కొత్తావకాయ+నూలుగుండ డెడ్లీ కాంబో తినండి. ముందస్తు వార్నింగ్. కాస్త ఎర్లీ గా భోంచేస్తే లంచ్ అవర్ కంటే ముందెళ్తే నాలాక్కాకుండా మీరు స్వర్గం ఫ్రీగా చూసొచ్చేయచ్చు. అక్కడి విశేషాలు ఇక్కడ పోస్ట్ చేయడం మర్చిపోకండి.

NB: ఆవకాయ ఫోటో కోస్తా ఫుడ్స్ వారి పేజీ నించి తస్కరించడమైనది. నువ్వులపొడి  నేను చేసిందే 

Sunday, May 24, 2020

ఉపవాసం! Fasting.

పొద్దున్నే మా ఆవిడ "ఏమండీ" అని పిలిచింది
అయిపోయా!
ఏ మగడినైనా భార్య ఒకింత ముద్దుగా "ఏమండీ" అని కానీ, లేపోతే "ఏమండేమండేమండీ" అని ఒకింత గారాబంగానూ పిలిస్తే ఆ మగడు ఖల్లాస్!
ఇప్పుడు నాకేం లాసో?
"ఏమిటోయ్" అన్నా ఒక్క రవ్వ నీరసంగా
"రెణ్ణెల్ల నుంచీ రోజంతా తినడం పడుక్కోవడమే కదా? అందుకని ఇవాళ ఒక్కరోజు ఉపవాసం చేయండి" అంది
చచ్చాం! అలవాటు లేని పనాయె. కానీ ఆవిడకి కాదని చెప్పడమే?
"సర్లే ఉపవాసమేగా? శుభ్రంగా చేస్తా. ఇంతకీ ఉపవాసం అంటే ఎలా చెయ్యాలో" అని కూపీ లాగా
"ఆబ్బే. పెద్ద కష్టం ఏమీ కాదండీ. కేవలం వండిన పదార్ధాలు తినకూడదు అంతే" అంది
ఈ ఆడాళ్ళెప్పుడూ ఇంతే. తుఫానులైనా ముందస్తు హెచ్చరికలు చేస్తాయి కానీ వీళ్ళు సునామీ టైపు. ఒక్కసారిగా మీద పడిపోడమే!
ఈ ఉపవాసం గురించి నిన్నే చెప్తే ఒకింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాడిని కదా. నిన్న రాత్రి భోజనం ఎక్కువ తినడం. ఉపవాసానికి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చుకోవడం వగైరా.
సరే ఇప్పుడు చేసేదేముంది. "ఓస్. అంతేనా. అయితే ఇవాళ ఉపవాసం. కంఫర్మ్" అని డిక్లేర్ చేసేసా
వెంటనే వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ వెదికి నాక్కావాల్సినవన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా. జీడిపప్పు, ఆ లయన్ బ్రాండ్ ఖర్జూరం, ఆల్మండ్, పచ్చి వేరుశెనగ పలుకులు, హార్లిక్స్ పౌడర్ కూడా చిన్న పోట్లాము కట్టా. ఇవన్నీ వండని పదార్ధాలేగా. మా అబ్బాయి లేచాకా ఓ రెండు సీసాలు కొబ్బరి నీళ్లు తెప్పిస్తా. మొన్న మా ఆవిడ "ఇంటినిండా వెధవ ఖాళీ సీసాలే" అని పారెయ్యబోతూంటే రెండు థమ్స్పాప్ ఒకటిన్నర లీటర్ సీసాలు "వేసంకాలం కదా ఫ్రిడ్జ్ లో నీళ్ళకి పనికొస్తాయి అని దాచడం మంచిదయ్యింది.
సరే తొమ్మిదింటికి పళ్ళబ్బాయి వస్తే ఓ మూడు కేజీలు బంగినపల్లీ (ఒక కేజీ ఫ్యామిలీకి ...అన్నీ నేనే తినేసేంత స్వార్ధపరుడిని కాదు) కొంటే ఎలాగోలా ఇవాళ్టి ఉపవాస కార్యక్రమం జయప్రదంగా ముగించచ్చు.
ఇవి సరిపోతాయా ఇంకేమన్నా నేను మర్చిపోయినవి ఉంటె అర్జెంట్గా చెప్పండి. ఎలానూ షాపులన్నీ తెరిచే ఉన్నాయి కాబట్టి మా అబ్బాయిని పంపించి తెప్పించుకుంటా.
మొత్తానికి ఈ "ముడి"సరుకంతా నా బెడ్ రూమ్ లోకి చేరేశా. అసలే ఎండలు మండిపోతున్నాయి. పైపెచ్చు ఉపవాసం. నీరసం మీద వడదెబ్బ తగిలితే బహు ప్రమాదం. మరంచేత ఇవాళంతా ఏసీ వేసుకుని మంచం దిక్కుండా సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తా. ఇవన్నీ అయిపోయి ఇంకా నీరసంగా ఉంటే సినిమాల్లో పేద హీరో టెక్నీక్ ఎలానూ ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి !
అన్నట్టు ఈ ఆడోళ్లన్నస్సలు నమ్మకూడదు. మొగుళ్ళ విషాయానికొచ్చేటప్పటికీ ఏ శాస్త్రాల్లోనూ లేని విషయాలు చెప్పి మనల్ని నిండా మోసం చేసేస్తారు. అంచేత నేనే శాస్త్రాలు ముందేసుకు కూర్చున్నా. ఏమన్నా శాపవిమోచనం టైపు ఉపాయాలు దొరుకుతాయేమోనని.
పదినిమిషాల్లోపే ఓ అద్భుతమైన ఉపాయం తట్టింది. పూర్వం యుధ్ధాలన్నీ, మహా సంగ్రామం కురుక్షేత్రంతో సహా, సూర్యోదయం నించీ సూర్యాస్తమయం దాకానేట! ఉపవాసం యుద్ధం కంటే గొప్పా ఏమిషి? అందుకని ఉపవాసం కూడా సూర్యాస్తమయం దాకానే! హమ్మయ్య. పెద్ద ప్రాణానికేం ఇబ్బంది లేదు.
మొన్న పచ్చడి చేద్దామని చిలకడదుంపలు కొన్నా. బద్దకించి పచ్చడి చేయకపోవడం మంచిదయ్యింది. సూర్యాస్తమయం ఇహ పది నిమిషాల్లో (రోజూ పేపర్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు ఎందుకిస్తారా అని ఇన్నాళ్లు ఓ తెగ ఆలోచించా. ఇప్పుడు తెలిసింది!) అవుతుందనగా బెల్లంతో ఉడకపెట్టి నా ఉపవాస దీక్ష విరమిస్తా.
రాత్రికి నాకిష్టమైన వంకాయ కూర చెయ్యమని చెప్తే ఆవిడ బోల్డు హాశ్చర్యపడిపోయింది. ఉత్త యాక్టింగ్ లెండి. అదేమిటి ఉపవాసం ఉంటానని మళ్ళీ రాత్రికి భోంచేయడం ఏమిటీ అని. నాకు తెలీదనుకోకు. నేనిప్పుడే శాస్త్రాలు తిరగేసా. శుభ్రంగా రాత్రి భోంచేయచ్చు. అని తెగేసి చెప్పా. మొహం అదోలా పెట్టుకుని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడవన్నీ పట్టించుకునే ఓపిక లేదు నాకు. అసలే ఉపవాసం.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నేనిక్కడ గంటగంటకీ మీ కామెంట్స్ కి జవ్వాబులివ్వడం లాంటి కార్యక్రమం చేస్తూంటా. ఓ గంటసేపు నా నించి ఏ విధమైన ఆక్టివిటీ లేకపోతె 108 కి ఫోన్ చేసి కబురందివ్వండి. అదేమిటి మాస్టారూ? మీ ఫామిలీ అంతా ఉన్నారుగా అని మీ అందరికీ ఓ గొప్ప అనుమాన సందేహం రావచ్చు. ఉన్నారు కానీ నన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఇందాకే చెప్పానుగా ఇవాళంతా బెడ్ మీదే అని. ఒహవేళ నాకు పోషకాహారం తగ్గి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతే వాళ్లొచ్చి చూసి నేను హాయిగా ఏసీ వేసుకొని బొబ్బున్నానని వెళ్ళిపోతారు. నేనసలే ఉపవాసం కాబట్టి మధ్యాహ్నం భోజనానికి కూడా పిలవరు. మరదీ మేటర్. అందుకని నేను స్పృహలో ఉన్నానో లేనో అన్న దానికి అగ్నిపరీక్ష ఇక్కడ నా ఆక్టివిటీ నే. నా ప్రాణాలు మీ అందరి చేతుల్లో పెడుతున్నా.
ఇప్పుడే అందిన వార్త! శాస్త్రాల్లో వెదక్కా వెదక్కా నాకు తెలిసిన రహస్యం ఏమిటంటే ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండటం. అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? దేవుడికి!
అంటే ఉపవాసం అంటే దేవుడిదగ్గర ఓ పీట, లేదా నాలాంటి భారీ కాయాలు నేలమీద కూర్చోలేం కాబట్టి, ఓ కుర్చీ వేసుకుని రోజంతా కూర్చొంటే అదే ఉపవాసం! ఇదే విషయం మా ఆవిడకి చెప్తే నమ్మదే? మీరన్నా చెప్పండి. ఓ మనుషోత్తముడి ప్రాణం నిలపెట్టిన పుణ్యం మూటకట్టుకోండి.