ఈ పోస్ట్ కేవలం పురుషులకి మాత్రమే!
అలా హెడ్డింగ్ చూడగానే ఆడోళ్ళందరూ ఈ పోస్ట్ ఆసాంతం చదివేస్తారని తెలుసు! బట్ ఐయామ్ హెల్ప్ లెస్ యు నో. వాళ్ళని ఎప్పుడాపగలం కనక!
ఇహ పోతే
ఉరేయ్! వంటొచ్చిన, వంట చేస్తున్న మొగుళ్ళూ! ఇదేటిది ఉరేయ్ గిరేయ్ అనేస్తున్నాడు అని తెగ ఫీల్ అయిపోకండి. అది బుడుగు స్టైల్ అనుకరణ! వంట చేస్తున్న అంటే అచ్ఛంగా ఎప్పుడూ అని కాదు కనీసం ఈ కోవిడ్ సమయంలో అన్నమాట.
ఇప్పుడు మనం అంటే వంట చేసే మగాళ్ళం, మొగుళ్ళం వంట చేస్తున్నప్పుడు చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసి బోల్డు కిటుకులు, చిటుకులు, సులభ మార్గాలు వగైరా కనిపెడతాం కదా? ఆడోళ్లయితే వంట ఓ పెద్ద పనిలాగా ఫీల్ అయిపోయి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎలాగోలాగ గబగబా, కసాపిసా చేసి పారేసి వంటింట్లోంచి బైట పడదామా అని చూస్తారు. అలాగే చేస్తారు.
మనం అలాక్కాదే. చాలా శ్రద్ధగా, ప్రేమతో వండుతాం.
ఉదాహరణకి కూరలు తరగడం తీసుకోండి. ఈ పెళ్ళాలు ఎలా తరుగుతారు? మీకు తెలీనిదేముంది? పనిమనిషితోనో, పక్కింటావిడతోనో పిచ్చాపాటి మాట్లాడుతూ ఏదో తరగాలి కాబట్టి తరిగి పడేస్తారు.
కానీ మనం అలాక్కాదే ? ఉదాహరణకి బెండకాయలు ప్రతి ముక్క ఒకే సైజులో ఉండేట్టు ఎంతో శ్రద్ధగా, ఓ గోడ అందంగా ఇటుకలు పేర్చి కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టూ ఎంతో ప్రేమతో వాటిని తిరుగుతాం. నేనైతే అప్పుడప్పుడూ 90 డిగ్రీల్లో కాకుండా 45 డిగ్రీస్ లో తరుగుతాను. లేదా సన్నగా ఒక్కరవ్వ పొడుగ్గా తరుగుతాను డిజైనర్ కట్ అన్నమాట! ఫోటో చూడుడి లోపాయికారీ మనలో మన మాట పనిమనిషులతో, పక్కింటి అంటీలతో ముచ్చట్లు చెప్పుకునే సదుపాయాలు మనకి లేవుగా!
నా మట్టుకు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్లుంటుంది కానీ చెప్పక తప్పటం లేదు. నేను చెప్పకపోతే మీ అందరికీ ఎలా తెలుస్తుంది.
నేను ఏ పనయినా చాలా సైంటిఫిక్ గా చేస్తాను. ఉదాహరణకి కూరలో కారం ఒక స్పూన్ వెయ్యాలనుకోండి. ఆడోళ్లయితే మొత్తం చెంచాడు ఒకే చోట పడేస్తారు మూకుట్లో. ఆలా చేస్తే మొత్తం అన్ని కూర ముక్కలకీ దాదాపు సరిసమానంగా ఆ కారం పట్టే అవకాశం తక్కువ. మరంచేత నేనేం చేస్తానంటే ముందు ఒక అర చెంచా కారం వేసి కూర ముక్కలని పైకి కిందకి ఒక్క సారి కలుపుతాను. అప్పుడు కిందనున్న ముక్కలు పైకొస్తాయి. అప్పుడు ఇంకో అర చెంచా కారం మూకుట్లో వలయాకారంలో చుట్టూ తిప్పుతూ వేసి మళ్ళీ బాగా కలుపుతాను. అలా చేస్తే కారం అన్నిటికీ బాగా పడుతుంది.
ఇంకో ఉదాహరణ. కూరలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వగైరా వగైరా రెండు మూడు పొడులు వెయ్యాల్సి వస్తే ఈ ఆడోళ్లున్నారే, లారీ లోంచి ఇసుక కిందకి ఒకే చోట పెద్ద కుప్పలా ఒంపినట్టు అన్ని పొడులూ కూరలో ఒకే చోట కుమ్మరిస్తారు. అప్పుడు కూడా పైన చెప్పినట్టు పెద్దగా కలవ్వు.
నేను అలా రెండు మూడు పొడులు వేయాల్సి వస్తే అవన్నీ చిన్ని గిన్నెలో వేసి చెంచాతో బాగా కలిపి పైన చెప్పిన విధంగా నాలుగు దఫాలుగా వేసి కలుపుతా. అప్పుడు చూడండి నా సామిరంగా. కూర అదరః ! చూడుడు ఫోటో
ఇహ కొత్త కొత్త ప్రయోగాలంటే మొన్న పోస్ట్ చేసినట్టు బెండకాయ ముచ్చికలు అచ్చిక బుచ్చిక లాడుతూ కూర చేస్తా!
ఇంకో చిన్ని టిప్! అర చెంచా వాము, అరచెంచా మిరియాలు కలిపి పొడి చేసి చాలా కూరల్లో చివరిగా వేస్తా. జీర్ణశక్తి పెరుగుతుంది. చిన్న మిరియాల ఘాటు తగులుతుంది!. మా ఆవిడ అన్నిట్లో వేస్తారేంటి అంటుంది ఏం అన్నిట్లో తను కారప్పొడి వేస్తె నేనెప్పుడన్నా పల్లెత్తు మాటన్నానా? మొగుడన్నాక ఆ మాత్రం స్వతంత్రం లేకపోతె ఏం సుఖం. అందుకని నేను అవన్నీ పట్టించుకోను. మనం కొన్ని కొన్ని విషయాల్లోనైనా అలా గట్టిగా , ఖచ్చితంగా లేకపోతె చాలా కష్టం బాబూ
ఇంతకీ మీరిటువంటి చిటుకులు, కిటుకులు, చిట్కాలు ఏమన్నా కనిపెట్టి ఉంటే మీతో(బో)టి మొగుళ్ళతో ఇక్కడ పంచుకోండి.
గుడ్...థాంక్యూ
ReplyDelete