Monday, July 13, 2020

Telegram - a flashback!

చాలా దశాబ్దాల క్రితం నాకు ఊహ తెలిసినప్పటినించి 60s , 70s లో గుమ్మం బైటినించి "టెలిగ్రామ్" అని అరుపు వినిపించిందంటే ఇంట్లోవాళ్ల గుండెలు కొన్ని సెకండ్లు కొట్టుకోవడం మానేసేవి. సదరు పిలుపు విన్న ఉత్తరక్షణంలో ఇంట్లో ఆడంగులు ఒకటే చీర కొంగుతో కళ్ళొత్తుకొనేసే వాళ్ళు. లేదా ఒకింత అతి చేసి ఏకంగా భారీ ఎత్తున ఏడుపు లంకించుకొనేవాళ్ళు!

ఎందుకంటే ఆ రోజుల్లో ఆ "టెలిగ్రామ్" అనేది సర్వసాధారణంగా దుర్వార్తలే మోసుకొచ్చేది. ఎవరన్నా చావు బ్రతుకుల్లో కొట్ట్టుకుంటున్నప్పుడు వెంటనే డాక్టర్ "మేం చేయగలిగింది చేసాం! ఈ రాత్రి గడిస్తే కానీ ఏ సంగతీ చెప్పలేం అనో" లేదా "ఇంకొన్ని గంటలే. దగ్గర వాళ్లకి కబురెట్టండి" అనో చెప్పినప్పుడు వెంటనే టెలిగ్రామ్ నా అనుకున్నవాళ్ళకి పంపేవాళ్లు. అందులో ఎప్పుడూ ఒకటే రాసేవాళ్ళు. అదేమిటంటే "ఫాదర్ / చిట్టి సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ ".

గమ్మతేమిటంటే ఎవరన్నా పోయినప్పుడు ఫలానా వ్యక్తి పోయాడని రాసేవాళ్ళు కాదు. అప్పుడు కూడా "సో అండ్ సో సీరియస్! స్టార్ట్ ఇమ్మీడియట్లీ " అనే రాసేవాళ్ళు.    ఎందుకో నాకిప్పటికీ అర్ధం కాదు. పోనీ ఆ టెలిగ్రామ్ అందుకున్న వాళ్లకి కొన్ని గంటలయినా ఆ అశుభవార్త తెలీకుండా ఉంటె బాగుంటుంది అననుకోవాలంటే అది తప్పు. ఎందుకంటే పైన మనవి చేసినట్టు టెలిగ్రామ్ అనగానే ఎవరో పోయినట్టే ఊహించేసుకొని శోక సముద్రంలో మునిగిపోయేవాళ్లు.

నాకు కొంచం వయసు వచ్చాక అంటే సుమారు పన్నెండేళ్ళు అనుకోండి. ఇలా టెలిగ్రామ్ అని వినగానే అందులో ఏముందో చూడకుండానే ఎందుకు ఏడుపు మొదలెట్టేవాళ్ళొ అర్ధమయ్యేది కాదు. అదే అడిగేవాడిని. ఎందుకీ అడ్వాన్స్ ఏడుపు. ఒక్క నిమిషం ఆగి ఆ విషయం ఏదో చదివాక ఏడుపు మొదలెట్టచ్చు కదా అని. "నీకేం తెలీదు పోరా" అనో "నీకు అర్ధం కాదు లేరా" అనో నన్ను తోసిరాజని ఏడుపు కార్యక్రమం మట్టుకు దిగ్విజయంగా సాగించేవాళ్ళు.


కొన్నిసార్లు టెలిగ్రాంలో ఇంకేదైనా శుభవార్త చదివాక అదే చీర కొంగుతో మరొక్కసారి కళ్ళొత్తుకొని వెళ్లి మొహం కడుక్కొచ్చి ఓ నవ్వు స్టిల్ ఇచ్చేవాళ్ళు.

అన్నట్టు నేను నా మొదటి ఉద్యోగం టెలిగ్రామ్ ద్వారానే  రాజీనామా చేసాను! ఒక కారణంవల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ నా బాస్ నెలలో దాదాపు 15 రోజులు టూర్ వెళ్ళేవాడు.  బాస్ టూర్ వెళ్ళినప్పుడు, ఒకసారి రాజీనామా చేద్దామని నిర్ణయించాక ఇహ ఒక్కరోజు కూడా  పని చేయలేక మా ఊరు వెళ్ళిపోయి అక్కడినించి బాస్ కి "రెజైనింగ్. లెటర్ ఫాలోస్" అని ఓ టెలిగ్రామ్ కొట్టా! వెంటనే మర్నాడు గోడక్కొట్టిన బంతిలా అయన దగ్గర నించి నాకో టెలిగ్రామ్ వచ్చింది "రిజిగ్నేషన్ నాట్ ఆక్సెప్టెడ్. జాయిన్ ఇమ్మీడియేట్లీ" అని. అయినా  నేను అతి మొండివాడిని కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వలేదనుకోండి! ఇంతకీ ఇదెందుకు చెప్పానంటే టెలిగ్రాంలో మాములు విషయాలు కూడా ఉంటాయి కేవలం అశుభాలు కాదు అని!

ఈ టెలిగ్రామ్ పంపడంలో అంటే మేటర్ రాయడంలో చాలా తెలివితేటలు ప్రదర్శించేవారు ప్రజలు! ఎందుకంటే దీని చార్జీ పదాల సంఖ్యా మీద ఆధారపడేది. ఎక్కువ మాటలయితే ఎక్కువ ఛార్జ్. అంచేత ఎంత తక్కువ మాటల్లో చెప్పగలరో అంత తక్కువ రాసేవాళ్ళు. ఈ టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ మీద చాలా జోకులు ప్రచారంలో ఉన్నాయి!

ఒక ఉద్యోగి తన హెడ్ ఆఫీస్ కి ఇలా టెలిగ్రామ్ పంపాడు "వాంట్ లీవ్. వైఫ్ గాన్ ఫర్ డెలివరీ. ప్లీజ్ సెండ్ రీప్లేస్మెంట్"! కవి హృదయం మీకర్ధమయ్యే ఉందనుకుంటా !

ఇలా తక్కువ మాటల్లో అనుకున్నది చెప్పే అనుభవం నాలాంటి వాళ్లకి  అనేది ట్విట్టర్ పెట్టిన చాలా సంవత్సరాల దాకా బాగా పనికొచ్చింది. ఎందుకంటే మొదట్లో ట్వీట్ కేవలం 140 అక్షరాలకే పరిమితం. ఇప్పుడు రెట్టింపు చేశారనుకోండి. సో ట్విట్టర్ కి తండ్రి ఈ టెలిగ్రామ్ !

రానురాను సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సమాచారం టెలిగ్రామ్ కంటే అతి వేగంగా ప్రపంచం నలుమూలలా వ్యాపించడం మొదలయ్యింది. ముఖ్యంగా గత దశాబ్దంలో. దాదాపుగా అందరి దగ్గర మొబైల్ ఫోన్లు కనీసం కుటుంబానికి ఒకటయినా ఉండడంతో SMS, వాట్సాప్ వగైరా బహుళ వాడకంలోకి రావడంతో టెలిగ్రామ్ కి ఆదరణ తగ్గి తగ్గి చివరికి ఒక్కరు కూడా దానిని వాడటం లేదని గుర్తించి, గమనించి గత్యంతరం లేక ప్రభుత్వం వారు ఈ "టెలిగ్రామ్" సేవలని 163 సంవత్సరాల సేవల అనంతరం 2013 సంవత్సరం రేపటి రోజున ఆపివేశారు. అంటే ఇవాళ చివరి రోజన్నమాట ఏడు సంవత్సరాల క్రితం

నన్నడిగితే, అడగరనుకోండి. చాలా ప్రభుత్వాలు చాలా  ఊళ్ళ పేర్లు గత రెండు దశాబ్దాలుగా మార్చేసారుగా! బొంబాయి ని ముంబై, మద్రాస్ ని చెన్నై, గుర్గాన్ ని గురుగ్రామ్, పూనా ని పూణే ఇలా ఎన్నో. అదే చేత్తో ఇంత అవిరళ సేవలందించిన ఈ టెలిగ్రామ్ గౌరవార్ధం ఏదైనా ఒక గ్రామాన్ని "టెలి గ్రామ్"గా మారిస్తే బాగుంటుంది!

ఒకటిన్నర శతాబ్దం గొప్ప ప్రజాదరణ పొంది విశేష సేవలందించిన ఆ టెలిగ్రామ్ ని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసే చిన్ని ప్రయత్నం!


No comments:

Post a Comment