కానీ ఇటీవల ఈ కోవిడ్ పుణ్యమా అని మరింత విశేష సేవలు చేసి మా ఆవిడ కష్టంలో భారీఎత్తున పాలు పంచుకోవడం మరీ ఎక్కువయ్యింది.
ఇన్నాళ్లు అంట్లు తోమడం, వంట చేయడం, కాఫీ కలపడం, పొద్దున్నే టిఫిన్ లోకి చట్నీలు చేయడం వగైరా నిరవధికంగా గత నాలుగు నెలలుగా చేస్తున్నాను.
ఇప్పుడు ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తే ఒకింత కొత్త పని వచ్చినట్టు ఇలా చేసిన పనే చేసి చేసి అందులో ఒక మోస్తరు ఎక్స్పర్ట్ ని అయిపోయానేమోనని అనుమానం వచ్చి, ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని, లేదా చేస్తున్న పనినే కొత్తగా ఇంకో రకంగా చేయడం అలవాటు కాబట్టి, మా ఆవిడ పాపం రోజూ గదులు అన్నీ ఊడుస్తూంటే నేనలా ఓ చేత్తో కప్ కాఫీ, ఇంకో చేత్తో న్యూస్పేపర్ పట్టుకొని కూర్చుంటే ఆవిడ ఎమన్నా ఫీల్ అవుతుందేమోనన్న అనుమానం కూడా వచ్చి, ఇలా లాభం లేదని ఇవాళ పొద్దున్నే కూరకన్నీ తరిగేసి స్టవ్ మీద పడేశాక ఆ "చీపురిటియ్యి. ఇవాళ నే ఊడుస్తా" అన్నా
అంతే ఢాంమని శబ్దం వినిపించింది. నేనన్న మాటలకి షాక్ తిని మా ఆవిడ కింద పడిపోయింది. ఆమెని లేపి శుశ్రూష చేసి "సరే ఎలాగూ ఇప్పుడు నువ్వు పాపం ఊడవలేవు. నన్నూడవనియ్యి
" అని నేనే స్టోర్ రూమ్ లో ఉన్న రెండు చీపుళ్లలో నదరుగా కనిపించింది తీసుకొని ముందు నా ఆఫీస్ గది ఊడ్చాను.
న్యూ బ్రూమ్స్ స్వీప్ వెల్ అని ఇంగ్లీష్ వాడన్నట్టు బీరువా వెనకాల ఉన్న బోల్డు బూజు బైటికి లాగి ఆ చెత్తంతా హాల్లోకి లాక్కెళ్లి అక్కడ సోఫాలు అన్నీ పైకెత్తి (ఓ చేత్తో. మనం స్ట్రాంగ్ కదా!) రెండో చేత్తో ఆ సోఫాల కిందున్న బూజంతా కూడా లాగి నా పనితనానికి నేనే విపరీతంగా పొంగిపోతూ కానీ బైటికి కనిపించనివ్వకుండా వీర ప్రయత్నం చేసి మా ఆవిడని పిలిచి ఆ బూజంతా చూపించాను. అలా చూపించడంలో చూసావా? ఏ పనన్నా చేస్తే ఇలా నా అంత శుభ్రంగా చేయాలి అన్న ఫీలింగ్ కూడా బాగా చూపించినట్టున్నా. కానీ మా ఆవిడ ఏ విధమైన రియాక్షన్ ఇవ్వలేదు. నాకు తెలుసులెండి ఎందుకో ? మేనమామ కబుర్లు పుట్టింటి దగ్గరా" అన్న టైపు అన్నమాట .
సరే ఇలా ఇంట్లో ఉన్నా గుప్త బూజులన్నీ కనుక్కున్న వీర ఉత్సాహంతో డైనింగ్ టేబుల్ దగ్గర ఊడుస్తూ ఆ టేబుల్ ని అలవాటు ప్రకారం ఓ చేత్తో పైకి లేపడానికి ప్రయత్నించా. ప్రయత్నించా అని ఎందుకంటున్నానంటే ఆ టేబుల్ కేవలం ఒక్క అంగుళం మాత్రమే పైకి లేచింది. ఇదేటిది ఇంత స్ట్రాంగ్ బాడీ ఆ మాత్రం డైనింగ్ టేబుల్ లేపలేకపోవడం ఏమిటి అని ఓ పది సెకన్లు వీర మధన పడిపోయా.
అప్పుడు ఎక్కడో కలుక్కుమన్నట్టు తట్టింది. తట్టడం ఏమిటి కలుక్కుమంది. వెంటనే చిన్ని మోతాదులో జ్ఞానోదయం కూడా అయ్యింది.
అదేమిటంటే లేవనిది డైనింగ్ టేబుల్ కాదని, నా నడుమని! అలవాటు లేని పనాయె. ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఉద్యోగం వెలగపెట్టే రోజుల్లో వంచిన నడుం లేపకుండా పని చేసినట్టు నటించాను కానీ అప్పుడూ ఆ పాతికేళ్లలో ఎప్పుడైనా నడుం వంచితే ఒట్టు. అందుకని ఆ పొట్టి చీపురుతో నాలాంటి ఆజానుబాహుడు గదులు ఊడవలంటే బాగా ఒంగాలి కాబట్టి రెండు గదులు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు టైపులో అతి ఉత్సాహంతో ఒంగి ఊడ్చాను. అలా పది నిమిషాలు ఒంచి ఉంచేటప్పటికీ అలవాటు లేదేమో ఆ నడుం అలా భూమికి 45 డిగ్రీల్లో స్టక్ అప్ అయిపోయి ఫ్రీజ్ అయిపొయింది.
అప్పుడు ఇంకో విషమ సమస్య ఎదురయ్యింది. ఎలాగూ నడుం లేవటం లేదు పైగా నడుం ప్రాంతంలో స్పర్శ జ్ఞానం కూడా పోయినట్టుంది. నొప్పి తెలీటం లేదు కాబట్టి ఆ మిగిలిన మూడు గదులు కూడా సక్సెస్ఫుల్ గా ఊడ్చి ఈ జన్మకి ఇహ ఇలా గదులూడ్చే బృహత్తర కార్యక్రమాలకి ఇలా ఆదిలోనే అంతం చేయడమా లేక ఎందుకొచ్చిన గొడవ. పెళ్ళాం దగ్గర కొత్తగా పోయే పరువేముంది అని తెల్ల జెండా ఊపి ఆ చీపురుని ఆవిడ చేతిలో భద్రంగా పెట్టేసి వెళ్లి అంతఃపురంలో విశ్రమించడమా?
అలా ఓ నిమిషం ఊడవడం ఆపి, నిటారుగా నిలపడలేక ఎలాగూ డైనింగ్ టేబుల్ దగ్గరున్నాను కాబట్టి ఆ పక్కనే ఓ కుర్చీలో అలా కూలపడ్డా. ఆపరేషన్ తర్వాత ఆ మత్తుమందు దిగాక నొప్పి తెలిసినట్టు అప్పుడు మొదలయ్యింది లైట్ గా నడుం నొప్పి. అమ్మా! అబ్బా! అని పైకి కేకలెట్టక పోయినా ఆ రేంజీలోనే వచ్చింది నొప్పి.
ఇహ నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏమి లేదు. నా చేతుల్లో ఉంటేగా ? ఒకటే ఆప్షన్ తెల్ల జెండా ఊపేసా. మా ఆవిడ కిసుక్కున నవ్వలేదు కానీ అలనాడు దుర్యోధనుడిని చూసి ద్రౌపది అలాగే నవ్వు మొహం పెట్టిందేమోనని మా చెడ్డ అనుమానం. కానీ దుర్యోధనుడికే తప్పలేదు. నేనెంత. అయినా ఇలాంటి సందర్భాల్లో నేనొక అభిప్రాయానికి వచ్చేసాను. మొగుడూ పెళ్లాల మధ్య అవమానం అహంకారం ఇలాంటివి ఉండకూడదని.
అంచేత నేనస్సలు ఏమి ఫీల్ అవ్వకుండా అలాగే సగం ఒంగి మా ఆవిడ ఇంకో బెడ్ రూమ్ ఊడుస్తూంటే నేను పోయి మా మంచం మీద కూలపడ్డా. పడ్డాను అన్నమాట అక్షర సత్యం.
ఇవాళ నేను తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నడుం వంచి పని చేయడం అన్నది అతి కష్టమని. అలాంటి ప్రయత్నాలు మన వయసు, బరువు వగైరా దృష్టిలో పెట్టుకొని చేయడం ఒకింత ఒంటికి మంచిదని.
ఇంట్లో, ఆఫీసుల్లో నడుం వంచి పని చేసే వాళ్లందరికీ పాదాభివందనం. ఎందుకంటే ఎలాగూ పడుకున్న పోజులోనే ఉన్నాగా...