Thursday, December 24, 2020
వీలునామా
Tuesday, November 10, 2020
రెండ్రోజులక్రితం నాకు జలుబు చేసిన సంగతి పాఠకులకి విదితమే!
ముక్కు మూసుకుపోయి ఊపిరాడకపోయినా ఎవరికీ తప్పినా నాకు తప్పదు కాబట్టి నిన్న దాదాపు ఓ అయిదు గంటలు బలాదూర్ ఊరంతా తిరిగాను. మాస్క్ పెట్టుకుని. అసలే భారీ జలుబు. దానికి తోడు ఈ మాస్కు. ప్రతి రెండు నిమిషాలకి ఎవరూ చూడకుండా ఆ మాస్కు ముక్కుకిందకి తోసి మనసారా గాలి పీల్చి మళ్ళీ మాస్కు పైకి తోయడం! ఇదే పని నిన్నంతా
పొద్దున్నే ఆరింటికి మా ఆవిడ మెడిటేషన్లో ఉంటుంది . అందుకని సాధారణంగా మా అమ్మకి మొదటి కాఫీ నేనే ఇస్తాను. ఇవాళ యధావిధిగా ఆరింటికి కాఫీ ఇచ్చి పక్కనే సోఫాలో నేను కూడా కూలపడ్డా. మాములుగా అయితే కాఫీ ఇచ్చి వెంటనే వంటింట్లోకి వెళ్లి ఏడున్నరకల్లా కూర వగైరా చేసి పడేస్తా! ఇవాళ జలుబు కారణంగా పొద్దున్న వాకింగ్ కూడా ఎగ్గొట్టా. అందుకని బద్దకంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నా
వెంటనే అమ్మ "జలుబు తగ్గిందా" అనడిగింది. ఊహూ అన్నా. ఏదన్నా మందేసుకో అంది. ఇదేమిటండీ విచిత్రం. జలుబుకు మందేమిటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. మందేసుకుంటే వారంలో, వేసుకోకపోతే ఏడు రోజుల్లో పోతుందిట జలుబు!
ఆ రెలెంట్ ఏదో టాబ్లెట్ వేసుకో అర్జెంటుగా! అంది. ఇదొకటి. ఆవిడే మందులు కూడా రాసిచ్చేస్తుంది. మా ఇంట్లో ఆవిడ RMP అంటే రెసిడెంట్ మెడికల్ ప్రొఫెషనల్! నా ఇద్దరు అక్కలు డాక్టర్లు అవడం కాదు కానీ కిడ్నీ స్టోన్స్ నించీ బ్రెయిన్ కాన్సర్ దాకా అన్ని మందులు తెలుసు మా అమ్మకి! అలాగేలే అన్నా. ఇంకేమైనా అననిస్తేగా
రాత్రి ఆవిడ అల్లిన స్వెట్టర్ వేసుకుని పడుకున్నా. అది చూసి "ఏమిటీ? స్వెట్టర్ లూజ్ అయినట్టుంది. నేను లూజ్ అల్లానా నువ్వు సన్నపడ్డవా అని మళ్ళీ ఇంటరాగేషన్! నేనే సన్నపడ్డా అని నిఝమ్ చెప్పేసా. "ఓహో. పోనీ చలి ఆపుతోందా " , "ఆపుతోంది"
"ఓ పని చేస్తా. నీకో మఫ్లర్ అల్లుతా"
"వామ్మో! వద్దు. నాకలవాటు లేదు"
"మా చిన్నప్పుడు జలుబు చేస్తే ఇప్పట్లా మందుల్లేవు. యూకలిప్టస్ ఆయిల్ అని అమ్మేవాళ్ళు. నీలగిరి తైలం అంటారు. అది వాడేవాళ్ళం. ఇప్పుడు దొరుకుతుందో లేదో? ఓ సారి అమెజాన్ లో చూడు"
చూసా. అమ్మకేం. అమ్మేస్తున్నాడు. అమెజాన్ వాడు. పిడకలు, బొగ్గులు అమ్మేవాళ్ళకి నీలగిరి తైలం ఒక లెక్కా?
"ఉంది అమెజాన్ లో! 250 అన్నా"
"బుక్ చెయ్యి వెంటనే" ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసింది
తప్పుతుందా. బుక్డ్!
"అదొచ్చాక చెప్పు. ఎలా వాడాలో చెప్తా"
"సరే"
"మళ్ళీ ఇవాళ ఊరికే బైటికి తిరగద్దు. ఇంట్లోనే ఉండు. "
"అలాగేలే"
అయ్యా ఇదీ సంగతి!
అప్పుడప్పుడూ నేను రాత్రి భోజనం మానేస్తా! మధ్యాన్నం ఎక్కువ తిన్నాననో, సాయంత్రం మా ఆవిడ బోల్డు బజ్జీలు చేసిందనో, లేక ఓ 50 గ్రాములు బరువు తగ్గుదామనో! అలా మానేస్తే వెంటనే మా ఆవిడని అడుగుతుంది మా అమ్మ "ఏంటీ అరుణ అన్నం తినలేదు" అని
మా ఆవిడ సమాధానంతో తృప్తి చెందక వెంటనే నన్ను పట్టుకు అడుగుతుంది "అన్నం తినలేదు. ఒంట్లో బాలేదా"?
"బాగానే ఉందమ్మా. తినాలని లేదు"
"నువ్వు అబధం చెప్తున్నావు"
"ఇంత చిన్నదానికి అబద్ధం చెప్తానా"
"అయితే వచ్చి కనీసం మజ్జిగా అన్నం అయినా తిను. అలా ఖాళీ కడుపుతో పడుక్కోకూడదు"
ఈ భారద్దేశం అమ్మలున్నారే! ఎవరితోనైనా పెట్టుకోండి కానీ. ఈ అమ్మలతో పెట్టుకోకండి. గెలవలేరు.
దీన్నే "కిల్లింగ్ విత్ కెయిన్డ్ నెస్" అనేవాళ్ళు మా నాన్న
Friday, November 6, 2020
Deepavali Deep Cleaning - Part 2! దీపావళి డీప్ క్లీనింగ్ పార్ట్ 2!
దీపావళి డీప్ క్లీనింగ్ పార్ట్ 2!
నిన్నటి నా పోస్టుకి తరువాయి భాగం
ఇవాళ పొద్దున్నే 7గంటల 45 నిమిషాలకి వృశ్చిక లగ్నంలో మా ఇంట్లో దీపావళి దీప్ క్లీనింగ్ కార్యక్రమం గొప్ప ప్రారంభం అయ్యిందని చెప్పడానికి అమితానందపడుతున్నాను
ముందస్తు మాట! ఇలా క్లీనింగ్ చేసినప్పుడు మనం "ఇది పోయిందనుకున్నానే! హమ్మయ్య పోన్లే ఇప్పుడు దొరికింది" , "అరే! ఇది పారేయకుండా ఇన్నాళ్ళుంచామా" అని హాశ్చర్యపడిపోయే వస్తువులు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి
ఇహ పొతే ఇలా సంవత్సరానికోసారి ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమంలో సాధారణంగా వినిపించే డైలాగ్స్ ఈ విధంగా ఉంటాయి ఎవరింట్లోనైనా! జస్ట్ నేమ్స్ చేంజ్ అంతే
- పద్దూ నీకిదే చెప్తున్నా! దేనినైనా పారెయ్యి కానీ నా చెక్క బీరువా జోలికి మాత్రం రావద్దు
- డాడీ! నువ్వు నీ చిన్నప్పుడు చదివావో లోదో తెలీదు కానీ ఓ రెండు కేజీలున్న ఆ పెద్ద బాలశిక్ష పుస్తకం నువ్వు కనీసం ముట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు గత ఇరవై ఏళ్లుగా! అది పారెయ్యకూడదు కానీ నా చిన్నప్పటి కామిక్ పుస్తకాలు మట్టుకు పారెయ్యాలి!
- చూడూ! నీ కామిక్ పుస్తకాలు నెట్టులో దొరుకుతాయి. చదివే ఓపిక లేకపోతె యూట్యూబ్ లో బోల్డు విడియోలున్నాయి.
- మీ అందరికీ ఒకేసారి చెప్తున్నా! ఏ గదిలోనైనా మీ ఇష్టం కానీ నా వంటింట్లోకి మట్టుకు అడుగెట్టద్దు.
- డాడీ! ఇంకా ఎన్ని సంవత్సరాలు దాస్తావు ఆ 32 ఇంచిల ప్యాంట్లు! నువ్వు ఆ సైజు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దాటేసావు. ఇప్పుడు నాకు పెళ్లీడు వచ్చింది. కానీ నువ్వు ఆ ప్యాంట్లు మట్టుకు పారేయనివ్వవు.
- చూడు తల్లీ ఆ సిక్స్ ప్యాక్ నించి ఈ ఫామిలీ ప్యాక్ కి రావదానికి నాకు పదేళ్లు పట్టింది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆ సైజు కి వెళ్లాలంటే కూడా అన్నేళ్లే పడుతుంది. ఊరికే తొందర పడితే లాభం లేదు. ఆ సైజు కి వెళ్ళాక ఇప్పుడున్న ప్యాంట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్విప్పుడు ఆ 32 సైజు ప్యాంట్లు పారేస్తే అప్పుడు మళ్ళీ బోల్డు డబ్బు పోసి కొనాలి. నా వాళ్ళ కాదు.
- మమ్మీ! ఇదేంటిది? భలే ఉంది. ఇంత బరువేమిటి?
- అదా తల్లీ. దాన్ని మరచెంబంటారు
- మరచెంబా? అంటే
- అంటే ఇప్పట్లా మా చిన్నప్పుడు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు లేవు. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు బైట ఇప్పట్లా మినరల్ వాటర్ అమ్మడం కూడా లేదు. అందుకని ఈ మరచెంబులో నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం
- ఓహో! కానీ ఇదేంటి మమ్మీ! ఇది ఖాళీ చెంబే ఓ రెండు కేజీల బరువుంది. సైజు చూస్తే ఓ లీటర్ నీళ్లు కూడా పట్టేట్టు లేవు
- అదంతేనమ్మా. అప్పట్లో అవే ఉండేవి మరి. మీలా మేధావి బుర్రలు కావు మావి. కొత్తవి కనిపెట్టడానికి. అందుకని నోరు మూసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళం. మీలా ప్రతిదానికి ఇదెందుకు ఇలా? అది అలానే ఎందుకుండాలి అని ప్రశ్నలు వేస్తె వీపు విమానం మోత మోగేది.
- ఇదేమిటీ అని పొరపాటున అడిగితే నువ్వెక్కడికో వెళ్ళిపోయి భూమి గుండ్రంగా ఉందని మా కుర్రోళ్ళ మీదకే తెస్తావు. మీ పెద్దోళ్లున్నారే
- నేను కాస్త ఆఫీస్ పని చేసుకోవాలి. నేను లేను కదాని మీ ఇష్టం వచ్చినట్టు కనిపించినవన్నీ పారెయ్యకండి. మీరంతా విడివిడిగానూ, జమిలీగానూ పారేద్దామనుకున్నవన్నీ ఓ చోట పెడితే నేను ఆడిటింగ్ చేసి పర్మిషన్ ఇస్తా. ఆ తర్వాతే పారేయడం
- ఇహ అయినట్టేనా తల్లీ! మీ నాన్నఅప్రూవ్ చేయాలంటే నా వంటింటి గిన్నెలు నీ కామిక్స్ మాత్రమే పారేయమంటారు. నావల్ల కాదు కానీ నే వెళ్లి వంట ఏర్పాట్లు చూస్తా. మీతో పాటు సర్దుతూ కూర్చుంటే వంటెవరు చేస్తారు. భోజనానికి ఒక్క అయిదు నిమిషాలు ఆగరు ఒక్కళ్ళు కూడా
- డాడీ ఆఫీస్ పని చేసుకుంటూ నువ్వు వంట చేసుకుంటే నేనొక్కర్తినేనా సర్దడం. నాకేం పట్టింది! నేనూ టీవీ చూసుకుంటా
అయ్యా అదీ సంగతి. మళ్ళీ వచ్చే దీపావళికి ఈ దీప్ క్లీనింగ్ కార్యక్రమం వాయిదా వేయడమైనది
ఇంటింటి రామాయణం
Thursday, November 5, 2020
Deepavali Deep Cleaning - దీపావళి క్లీనింగ్
చాలామంది "ఎందుకైనా పనికొస్తుంది" అని కొన్నిటినీ, సెంటిమెంటల్ వేల్యూ తో కొన్నిటిని, పారేయడానికి మనసొప్పక ఇంకొన్నిటినీ, ఎప్పటికైనా రిపేర్ చేయిద్దామని మరి కొన్నిటిని ఇలా ఇల్లంతా ఎటు చూసినా మనం వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని వస్తువులతో నింపేస్తారు! ముఖ్యంగా
సొంత ఇల్లుంటే మరీ! అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా అలాంటి చెత్తని వీలయ్యినంత వదిలించుకుంటూ ఉంటారు.
ఇలా ఇల్లంతా "చెత్త" ఉంటే అనారోగ్యం. చూడ్డానికి బాగోదని తీరి కూర్చొని ఇల్లు శుభ్రంగా ఉంచమంటే రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని వాయిదాలేస్తూ వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిపేస్తారని. డబ్బుతో లంకె పెడితేనైనా కనీసం సంవత్సరానికోసారైనా అలాంటి చెత్తని పారేస్తారని "దీపావళి నాడు ఇల్లు శుభ్రంగా ఉంటే కానీ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదు" అని ఒక సంప్రదాయం మొదలెట్టారు.
కాబట్టి దీపావళి ఇంకో వారమే ఉంది కనుక రేపు వారాంతం కాస్త ఓపిక చేసుకుని, కొంచం బద్దకం వదిలించుకుని కాస్త ఇంట్లో ఉన్న చెత్తా చెదారం పారేయండి! (చెదారం అంటే ఏమిటో ఖచ్చితంగా నాకు తెలీదు!)
ఇలా విభజించచ్చు ఆ పరిశుభ్రత కార్యక్రమాన్ని
1. ఖచ్చితంగా పారేయాల్సినవి - అంటే అయిదేళ్లక్రితం కొన్న టీవీ అట్టపెట్టె, రెండేళ్ల క్రితం కొన్న మొబైల్ డొక్కు , పదేళ్ల క్రితం కొన్న మొబైల్ సన్న పిన్ చార్జర్, గత దశాబ్దంలో మొబైల్తో పాటు వచ్చిన ఇయర్ ఫోన్లు వగైరా
2. రిపేర్ చేయించి వాడుకునేవి - కానీ నాకో సందేహం. అవి నిజంగా నిత్యం కాకపోయినా నెలకోసారైనా వాడే వస్తువైతే ఈ పాటికి రిపేర్ చేయించి ఉంటారు. అలా చేయించకపోతే దాని అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు అదే స్థితిలోనో, లేక రిపేర్ చేయించొ OLX లో ఎంతొస్తే అంతకి అమ్మేయండి!
3. పని చేస్తాయి కానీ గత రెండేళ్లుగా వాడని వస్తువులు - అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి మీరు హై స్కూల్లో కొన్న సైకిల్ (ఆ మెట్ల కింద తుప్పు పట్టిపోతూ ఉంటుంది! చూడండి!), మీకిప్పుడు నచ్చని, మీరు వాడని రిస్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్ ముందు కొన్న మామూలు మొబైల్, గుప్తుల కాలంనాటి మిక్సర్ ఇలాంటివి. వీటిని ఒకటే ఎవరికన్నా ఉచితంగా దానం చేసేయండి. (ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకొని కూడా దానం చేస్తారా అని అడక్కండి ఎందుకంటే నేను ఈ "ఉచిత దానం" అన్న పద ప్రయోగం చాలాసార్లు చదివాను!) కనీసం వాళ్ళ ఆశీస్సులు, ఒకింత పుణ్యం దక్కుతుంది. లేదూ OLX ఉందిగా?
4. సెంటిమెంటల్ వేల్యూ ఉన్నవి - ఇవి వేరే ఇంకెవ్వరికీ ఎందుకూ పనికిరావు. మనం కూడా ఎప్పుడో కానీ వాటిని చూడం కూడా! - ఉదాహరణకి కాలేజీ రోజుల్లో మీరు రాసి ఇవ్వని ప్రేమలేఖ!, మీ ప్రేయసి జడలోంచి పడి వాడిపోయి ముట్టుకుంటే పొడిపొడి అయిపోయే పువ్వు, మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ వగైరా! వీటిని కావాలంటే స్కాన్ చేసి ఒరిజినల్ పారెయ్యచేమో ఆలోచించండి. మీ ఇష్టం. అలా దాచుకున్నా అభ్యంతరం లేదు! కానీ నా అనుభవంలో ఇలాంటివి ఒక సంవత్సరం పారేయకపోయినా ఈ దీపావళి క్లీనింగ్ ప్రతి సంవత్సరం చేస్తూంటే అంతకు ముందు సంవత్సరం పారేయనివి రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలోనే పారేస్తాను నేనైతే. అంటే వాటిమీద మనసు విరిగిపోతుందన్నమాట. ఎందుకీ మమకారాలు, సెంటిమెంట్లు అని అనిపించినప్పుడు.
మీ ఇంటిని కనీసం ప్రతి దీపావళికి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తే అలా శుభ్రం అయిపోయాక దీపావళి నాడు ఇంటి ముఖద్వారం బార్లా తెరిచి (లక్ష్మీదేవి రావాలిగా లోపలికి!) హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని ఆమె రాకకోసం ఎదురు చూడ్డమే!
Thursday, September 24, 2020
"బుద్ధి కర్మానుసారిణి" Betal Prasna!
Friday, September 4, 2020
Eulogy for my Dad!
service in one position or other i.e., till his 66th year! He worked as Guest Faculty in Law at Lal Bahadur Sastry National Academy of Administration at Mussourie and later as full time faculty in AP Institute of Administration . During one of his visits there he visited Sahranpur in UP and learned Sahaj Marg meditation and meditated for 1 hour twice a day till his death. Being a teacher he passed away on Teacher’s Day.