Friday, November 6, 2020

Deepavali Deep Cleaning - Part 2! దీపావళి డీప్ క్లీనింగ్ పార్ట్ 2!

 దీపావళి డీప్ క్లీనింగ్ పార్ట్ 2!


నిన్నటి నా పోస్టుకి తరువాయి భాగం 


ఇవాళ పొద్దున్నే 7గంటల 45 నిమిషాలకి వృశ్చిక లగ్నంలో మా ఇంట్లో దీపావళి దీప్ క్లీనింగ్ కార్యక్రమం గొప్ప ప్రారంభం అయ్యిందని చెప్పడానికి అమితానందపడుతున్నాను 


ముందస్తు మాట! ఇలా క్లీనింగ్ చేసినప్పుడు మనం "ఇది పోయిందనుకున్నానే! హమ్మయ్య పోన్లే ఇప్పుడు దొరికింది" , "అరే! ఇది పారేయకుండా ఇన్నాళ్ళుంచామా" అని హాశ్చర్యపడిపోయే వస్తువులు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి


ఇహ పొతే ఇలా సంవత్సరానికోసారి ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమంలో సాధారణంగా వినిపించే డైలాగ్స్ ఈ విధంగా ఉంటాయి ఎవరింట్లోనైనా! జస్ట్ నేమ్స్ చేంజ్ అంతే 


- పద్దూ నీకిదే చెప్తున్నా! దేనినైనా పారెయ్యి కానీ నా చెక్క బీరువా జోలికి మాత్రం రావద్దు 


- డాడీ! నువ్వు నీ చిన్నప్పుడు చదివావో లోదో తెలీదు కానీ ఓ రెండు కేజీలున్న ఆ పెద్ద బాలశిక్ష పుస్తకం నువ్వు కనీసం ముట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు గత ఇరవై ఏళ్లుగా! అది పారెయ్యకూడదు  కానీ నా చిన్నప్పటి కామిక్ పుస్తకాలు మట్టుకు పారెయ్యాలి!


- చూడూ! నీ కామిక్ పుస్తకాలు నెట్టులో దొరుకుతాయి. చదివే ఓపిక లేకపోతె యూట్యూబ్ లో బోల్డు విడియోలున్నాయి. 


- మీ అందరికీ ఒకేసారి చెప్తున్నా! ఏ గదిలోనైనా మీ ఇష్టం కానీ నా వంటింట్లోకి మట్టుకు అడుగెట్టద్దు. 


- డాడీ! ఇంకా ఎన్ని సంవత్సరాలు దాస్తావు ఆ 32 ఇంచిల ప్యాంట్లు! నువ్వు ఆ సైజు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దాటేసావు. ఇప్పుడు నాకు  పెళ్లీడు వచ్చింది. కానీ నువ్వు ఆ ప్యాంట్లు మట్టుకు పారేయనివ్వవు. 


- చూడు తల్లీ ఆ సిక్స్ ప్యాక్ నించి ఈ ఫామిలీ ప్యాక్ కి రావదానికి నాకు పదేళ్లు పట్టింది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆ సైజు కి వెళ్లాలంటే కూడా అన్నేళ్లే పడుతుంది. ఊరికే తొందర పడితే లాభం లేదు. ఆ సైజు కి వెళ్ళాక ఇప్పుడున్న ప్యాంట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్విప్పుడు ఆ 32 సైజు ప్యాంట్లు పారేస్తే అప్పుడు మళ్ళీ బోల్డు డబ్బు పోసి కొనాలి. నా వాళ్ళ కాదు. 


- మమ్మీ! ఇదేంటిది? భలే ఉంది. ఇంత బరువేమిటి?


- అదా తల్లీ. దాన్ని మరచెంబంటారు 


- మరచెంబా? అంటే 


- అంటే ఇప్పట్లా మా చిన్నప్పుడు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు లేవు. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు బైట ఇప్పట్లా మినరల్ వాటర్ అమ్మడం కూడా లేదు. అందుకని ఈ మరచెంబులో నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం


- ఓహో! కానీ ఇదేంటి మమ్మీ! ఇది ఖాళీ చెంబే ఓ రెండు కేజీల బరువుంది. సైజు చూస్తే ఓ లీటర్ నీళ్లు కూడా పట్టేట్టు లేవు 


- అదంతేనమ్మా. అప్పట్లో అవే ఉండేవి మరి. మీలా మేధావి బుర్రలు కావు మావి. కొత్తవి కనిపెట్టడానికి. అందుకని నోరు మూసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళం. మీలా  ప్రతిదానికి ఇదెందుకు ఇలా? అది అలానే ఎందుకుండాలి అని ప్రశ్నలు వేస్తె వీపు విమానం మోత మోగేది. 


- ఇదేమిటీ అని పొరపాటున అడిగితే నువ్వెక్కడికో వెళ్ళిపోయి భూమి  గుండ్రంగా ఉందని మా కుర్రోళ్ళ మీదకే తెస్తావు. మీ పెద్దోళ్లున్నారే 


- నేను కాస్త ఆఫీస్ పని చేసుకోవాలి. నేను లేను కదాని మీ ఇష్టం వచ్చినట్టు కనిపించినవన్నీ పారెయ్యకండి. మీరంతా విడివిడిగానూ, జమిలీగానూ పారేద్దామనుకున్నవన్నీ ఓ చోట పెడితే నేను ఆడిటింగ్ చేసి పర్మిషన్ ఇస్తా. ఆ తర్వాతే పారేయడం 


- ఇహ అయినట్టేనా తల్లీ! మీ నాన్నఅప్రూవ్ చేయాలంటే నా వంటింటి గిన్నెలు నీ కామిక్స్ మాత్రమే పారేయమంటారు. నావల్ల కాదు కానీ నే వెళ్లి వంట ఏర్పాట్లు చూస్తా. మీతో పాటు సర్దుతూ కూర్చుంటే వంటెవరు చేస్తారు. భోజనానికి  ఒక్క అయిదు నిమిషాలు ఆగరు ఒక్కళ్ళు కూడా 


- డాడీ ఆఫీస్ పని చేసుకుంటూ నువ్వు వంట చేసుకుంటే నేనొక్కర్తినేనా సర్దడం. నాకేం పట్టింది! నేనూ టీవీ చూసుకుంటా 


అయ్యా అదీ సంగతి. మళ్ళీ వచ్చే దీపావళికి ఈ దీప్ క్లీనింగ్ కార్యక్రమం వాయిదా వేయడమైనది


ఇంటింటి రామాయణం 

No comments:

Post a Comment