చాలామంది "ఎందుకైనా పనికొస్తుంది" అని కొన్నిటినీ, సెంటిమెంటల్ వేల్యూ తో కొన్నిటిని, పారేయడానికి మనసొప్పక ఇంకొన్నిటినీ, ఎప్పటికైనా రిపేర్ చేయిద్దామని మరి కొన్నిటిని ఇలా ఇల్లంతా ఎటు చూసినా మనం వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని వస్తువులతో నింపేస్తారు! ముఖ్యంగా
సొంత ఇల్లుంటే మరీ! అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా అలాంటి చెత్తని వీలయ్యినంత వదిలించుకుంటూ ఉంటారు.
ఇలా ఇల్లంతా "చెత్త" ఉంటే అనారోగ్యం. చూడ్డానికి బాగోదని తీరి కూర్చొని ఇల్లు శుభ్రంగా ఉంచమంటే రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని వాయిదాలేస్తూ వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిపేస్తారని. డబ్బుతో లంకె పెడితేనైనా కనీసం సంవత్సరానికోసారైనా అలాంటి చెత్తని పారేస్తారని "దీపావళి నాడు ఇల్లు శుభ్రంగా ఉంటే కానీ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదు" అని ఒక సంప్రదాయం మొదలెట్టారు.
కాబట్టి దీపావళి ఇంకో వారమే ఉంది కనుక రేపు వారాంతం కాస్త ఓపిక చేసుకుని, కొంచం బద్దకం వదిలించుకుని కాస్త ఇంట్లో ఉన్న చెత్తా చెదారం పారేయండి! (చెదారం అంటే ఏమిటో ఖచ్చితంగా నాకు తెలీదు!)
ఇలా విభజించచ్చు ఆ పరిశుభ్రత కార్యక్రమాన్ని
1. ఖచ్చితంగా పారేయాల్సినవి - అంటే అయిదేళ్లక్రితం కొన్న టీవీ అట్టపెట్టె, రెండేళ్ల క్రితం కొన్న మొబైల్ డొక్కు , పదేళ్ల క్రితం కొన్న మొబైల్ సన్న పిన్ చార్జర్, గత దశాబ్దంలో మొబైల్తో పాటు వచ్చిన ఇయర్ ఫోన్లు వగైరా
2. రిపేర్ చేయించి వాడుకునేవి - కానీ నాకో సందేహం. అవి నిజంగా నిత్యం కాకపోయినా నెలకోసారైనా వాడే వస్తువైతే ఈ పాటికి రిపేర్ చేయించి ఉంటారు. అలా చేయించకపోతే దాని అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు అదే స్థితిలోనో, లేక రిపేర్ చేయించొ OLX లో ఎంతొస్తే అంతకి అమ్మేయండి!
3. పని చేస్తాయి కానీ గత రెండేళ్లుగా వాడని వస్తువులు - అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి మీరు హై స్కూల్లో కొన్న సైకిల్ (ఆ మెట్ల కింద తుప్పు పట్టిపోతూ ఉంటుంది! చూడండి!), మీకిప్పుడు నచ్చని, మీరు వాడని రిస్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్ ముందు కొన్న మామూలు మొబైల్, గుప్తుల కాలంనాటి మిక్సర్ ఇలాంటివి. వీటిని ఒకటే ఎవరికన్నా ఉచితంగా దానం చేసేయండి. (ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకొని కూడా దానం చేస్తారా అని అడక్కండి ఎందుకంటే నేను ఈ "ఉచిత దానం" అన్న పద ప్రయోగం చాలాసార్లు చదివాను!) కనీసం వాళ్ళ ఆశీస్సులు, ఒకింత పుణ్యం దక్కుతుంది. లేదూ OLX ఉందిగా?
4. సెంటిమెంటల్ వేల్యూ ఉన్నవి - ఇవి వేరే ఇంకెవ్వరికీ ఎందుకూ పనికిరావు. మనం కూడా ఎప్పుడో కానీ వాటిని చూడం కూడా! - ఉదాహరణకి కాలేజీ రోజుల్లో మీరు రాసి ఇవ్వని ప్రేమలేఖ!, మీ ప్రేయసి జడలోంచి పడి వాడిపోయి ముట్టుకుంటే పొడిపొడి అయిపోయే పువ్వు, మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ వగైరా! వీటిని కావాలంటే స్కాన్ చేసి ఒరిజినల్ పారెయ్యచేమో ఆలోచించండి. మీ ఇష్టం. అలా దాచుకున్నా అభ్యంతరం లేదు! కానీ నా అనుభవంలో ఇలాంటివి ఒక సంవత్సరం పారేయకపోయినా ఈ దీపావళి క్లీనింగ్ ప్రతి సంవత్సరం చేస్తూంటే అంతకు ముందు సంవత్సరం పారేయనివి రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలోనే పారేస్తాను నేనైతే. అంటే వాటిమీద మనసు విరిగిపోతుందన్నమాట. ఎందుకీ మమకారాలు, సెంటిమెంట్లు అని అనిపించినప్పుడు.
మీ ఇంటిని కనీసం ప్రతి దీపావళికి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తే అలా శుభ్రం అయిపోయాక దీపావళి నాడు ఇంటి ముఖద్వారం బార్లా తెరిచి (లక్ష్మీదేవి రావాలిగా లోపలికి!) హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని ఆమె రాకకోసం ఎదురు చూడ్డమే!
chedaram ante cheda pattina vastuvulu
ReplyDelete