Saturday, May 19, 2018

My college days!

నా యవ్వనం వృధా అవ్వడానికి , తదుపరి ఒకింత, ఒక్కరవ్వ నా జీవితం ఇలా ఉండడానికి కారణం నా నాన్న !

నమ్మలేని నిజం ! అసలేం జరిగిందంటే .... చెప్తా . వినండి ... అదేనండి ... సదవండ్రి

నాలుగు దశాబ్దాల పై చిలుకు సంఘటన! నేను యవ్వనంలోకి , కాలేజీ లోకి అడుగు పెట్టాను . ఈ యవ్వనంలోకి అడుగు పెట్టడం అన్నది ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రకృతి సహజంగా జరిగిందనుకోండి . కానీ ఈ కాలేజీ లోకి అడుగు పెట్టడం అన్న దగ్గరే ఆదిలోనే హంసపాదు.

మా ఊళ్ళో అంటే అప్పుడు గుంటూరులో బోల్డు కాలేజీలు ఉన్నాయి. కానీ నా నాన్న నన్ను హిందూ కాలేజీ లో తీసుకెళ్లి పడేసారు! కుర్రాణ్ణి కదా ఎదురు తిరగకుండా నోరు మూసుకొని జాయిన్ అయ్యాను. అయ్యాక తీరా చూస్తే ఏముంది? తీవ్ర నిరాశ.. ఎందుకంటే హిందూ కాలేజీ కేవలం అబ్బాయిలకే. యవ్వనంలోకి అడుగుపెట్టిన అబ్బాయికి ఇంతకంటే చిత్ర హింస ఏమన్నా ఉంటుందా చెప్పండి . ఆ కాలేజీ కి కేవలం అరకిలోమీటర్ దూరంలో AC కాలేజీ కో ఎడ్యుకేషన్. బోల్డు మంది అమ్మాయిలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది . నన్ను ఆ కాలేజీ లో జాయిన్ చేసి ఉంటె నా చదువు చట్టబండలు అయ్యేది కాదు, నా జీవితం కేవలం హై సెకండ్ క్లాస్ కి పరిమితం అయ్యేది కాదు .

ఇహ అలా బోల్డు రోజులు నిరాశ, నిస్పృహలతో బాధపడి, భారంగా నిట్టూర్చి, ముక్కు చీదేసి, కళ్ళు తుడిచేసుకుని తదుపరి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని అలోచించి, ఒక భారీ నిర్ణయం తీసుకున్నాను

అదేమిటంటే రోజూ మా కాలేజీకి వెళ్లి అటెండన్స్ పలికేసి ఫస్ట్ రెండు పీరియడ్స్ కి, వెంటనే నేను నా ఆప్త మిత్రుడు చెరో సైకిల్ మీద అలా తొక్కుకుంటూ, మా అవస్థని తిట్టుకుంటూ ఆ AC కాలేజీ పక్కనే మా కాలేజీ మగ విద్యార్థుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన కేవలం అమ్మాయి కాలేజీ చుట్టూ భూమి చుట్టూ శాట్లైట్ తిరిగినట్టు అలా స్లో మోషన్ లో సైకిల్ తొక్కుతూ, అప్పుడప్పుడూ తొక్కకుండా సైకిల్ ని స్టైల్ గా ఒక చేత్తో పట్టుకుని హుందాగా నడిపిస్తూ, నడుస్తూ ఆ కాలేజీ అమ్మాయిల వేపు దొంగ చూపులు చూస్తూ రోజులు వెళ్ళబుచ్చాలని!

ఇహ అప్పటినించీ అయిదు సంవత్సరాలు అదే పని. మరి హై సెకండ్ క్లాస్ వచ్చిందంటే రాదా? అదే అమ్మాయిలున్న కాలేజీ లో పడేస్తే క్లాస్ రూంలో బల్లల్లా ఎప్పుడూ అక్కడే పడుండేవాళ్ళం కదా? అలా పడున్నప్పుడు ఒకప్పుడు కాకపొతే ఒకప్పుడైనా టెక్స్ట్ పుస్తకాలు అలా క్రీగంట అయినా చూసే వాళ్ళం కదా? అలా రోజూ క్రీగంట చూస్తే సంవత్సరానికి బోల్డు గంటలు అలా పుస్తకాల వేపు చూసి చూసి కొంత అయినా మ్యాటర్  మన బుర్రలోకి ఎక్కి ఆ హై సెకండ్ క్లాస్ కాస్త జస్ట్ అత్తెసరు ఫస్ట్ క్లాస్ గా మారుండేది కదా. అప్పుడు లైఫ్ అంతా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నోయ్ అని చెప్పుకునే వాడిని కదా? ఇన్ని "కదా"లు కేవలం "కదా"లు గానే ఉండిపోయి నా కధ మారింది .

సరే ఎలాగూ నా యవ్వనం అడవి కాచిన వెన్నల అయిన వైనం తెలిసిపోయింది కాబట్టి ఆ "మధుర రోజులు" గురించి మరిన్ని విశేషాలు..

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. అమ్మాయిల చూట్టూ తిరగడం అన్నది కేవలం యవ్వనంలో ఉన్న అబ్బాయిల లక్షణమే కాదు, అమ్మాయిలకి కూడా అబ్బాయిలని "కసిగా" చూడాలని ఉండేది! కాకపొతే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నంత "స్వాతంత్రం" లేదు కాబట్టి వాళ్ళు కూడా అలా వాళ్ళ కాలేజీ చూట్టూ తిరిగే శాట్లైట్ అబ్బాయిలని దొంగ చూపులు చూసేవాళ్ళు. మేము వాళ్లలో మాకు తరుచుగా కనిపించే అమ్మాయిలకి బోల్డు పేర్లు పెట్టేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కో ముద్దు పేరు అన్నమాట. ఒకళ్ళని "తింగరి" అని, ఇంకోళ్ళని "మిస్ ఇన్నోసెన్స్" అని అలా. మరి వాళ్ళు మాకేం నిక్ నేమ్స్ పెట్టేవాళ్ళొ చరిత్రలో మరుగున పడిపోయిన నిజం.

ఓ సారి ఓ అమ్మాయి ఒంటరిగా చేతిలో బోల్డు బుక్స్ పట్టుకుని (ఆ రోజుల్లో అమ్మాయిలు ఎడం చెయ్యి సగానికి మడిచి పుస్తకాలు పట్టుకునేవాళ్ళు) అలా, అలా వీలయ్యినంత వయ్యారంగా నడుస్తూ వెళ్తూంటే మేము వెనకాల ఓ పదడుగుల దూరంలో (సేఫ్టీ ఫస్ట్ యు నో ) సైకిల్ నడిపించుకుంటూ వెళ్తూంటే నా ఫ్రెండ్ కి ఒకింత ధైర్యం వచ్ఛేసి, ఎందుకంటే రోడ్ అంతా ఖాళీ, చిన్నగా ఓ పాట వాడి కాకి గొంతుతో పాడడం మొదలెట్టాడు. నాకు కాళ్ళు వణకడం మొదలయ్యింది. వీడేటి ఇలా రెచ్చిపోతున్నాడని. ఆ పాట "నీ అందాల చేతులు కందేను పాపం.. ఎందుకు ఆ బెడద" అంతదాకా పాడాడో లేదో ఆ అమ్మాయి సర్రున చిరంజీవి వెనకాల వస్తున్న రౌడీలని కొట్టడానికి తిరిగినట్టు అంత ఫాస్ట్ గా తిరిగింది. నాకప్పుడు చేతులు కూడా వణకడం మొదలయ్యింది. వెనక్కి తిరిగి "ఏం మోస్తావా? రా"! అంది. ఖర్మ. మా వాడు పెట్టుకోక పెట్టుకోక  ఓ ఆడ రౌడీతో పెట్టుకున్నాడు. ఈ హఠాత్  సంఘటనకి ఇద్దరం ఓ రెండు సెకండ్లు షాక్ లోకి వెళ్లి, కోమాలోకి జారే లోపలే విపత్కర పరిస్థితుల్లో బుర్ర పాదరసంలా పని చేసి, వెంటనే చిరంజీవి కంటే స్పీడు గా సైకిల్ మధ్య రాడ్ ఒక చేత్తో పట్టుకొని సైకిల్ పైకెత్తి వెనక్కి తిప్పి, రెండో సెకండ్ లో మళ్ళీ చిరంజీవి గుర్రం మీదకి ఎగిరినట్టు సైకిల్ మీదకి ఎగిరి, మూడో సెకండ్ లో సైకిల్ తొక్కడం మొదలెట్టి నాలుగో సెకండ్లో ఆ వీధి చివరికి చేరి టర్నింగ్ కొట్టి ఓ రెండు కిలో మీటర్లు తొక్కి తొక్కి అప్పటికి గుండె కొట్టుకునే స్పీడ్, ఇహ తొక్కలేక మా సైకిల్ స్పీడ్ తగ్గాక ఆగి ఓ హోటల్ లోకి వెళ్లి కూలపడి ఓ వన్ బై టు స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసి అదొచ్చేలోపల నా ఫ్రెండ్ ని నాకు ఆ రోజుల్లో వఛ్చిన, విన్న అన్ని బండ బూతులు ఊపిరి పీల్చకుండా తిట్టి, తర్వాత ఆ కాఫీ తాగి మామూలు మనిషిని అయ్యాను. (చిరంజీవితో పోల్చాను కానీ ఆ రోజుల్లో చిరంజీవి కూడా అప్పుడే సినిమాల్లో అడుగు పెట్టారు!)

ఆ రోజుల్లో కుంచం ధైర్యం చేసి ఎవరన్నా అమ్మాయితో స్నేహం చేద్దామని ప్రయత్నిస్తే ఆ అమ్మాయి "ఛీ ఫో" అంటే లైట్ గా తీసుకొని, దులిపేసుకొని నువ్వే ఫో అని మనసులో అనుకోని, ఈ జగదేక సుందరి కాకపొతే ఇంకో అతిలోక సుందరి అనుకోని ఇంకో అమ్మాయి వెనకాల పడేవాళ్ళం. అంతే కానీ ఇప్పటి అబ్బాయిల్లాగా అలా ఒప్పుకొని అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, వాళ్ళని పబ్లిక్ లో చంపెయ్యడం గిసుంటి "పిదప కాలం, వెధవ బుధ్ధులు, చేష్టలు" చేసే వాళ్ళం కాదు. ఏం చేసినా కేవలం సరదాకే.

ఇంకోటండోయ్! ఆ రోజుల్లో కుర్రకారు అమ్మాయిలని "కలర్" అనేవాళ్ళు! దీనిఆరిజిన్ నాకు తెలీదు. కానీ మా ముందు తరాల అబ్బాయిలని గౌరవిస్తూ మేము కూడా అలా "కలర్" సాంప్రదాయాన్ని గౌరవించాం!

ఇంతకీ మోరల్ అఫ్ ది స్టోరీ ఏమిటంటే అప్పుడప్పుడూ తెలిసీ తెలియని పిల్లల యవ్వనం, భవిష్యత్తు వాళ్ళ తల్లితండ్రులు తెలీకుండా అనుకోకుండా పాడు చేస్తారు!

Friday, April 27, 2018

ATM లో కాష్ లేదు! PayTM లో ఎకౌంటు లేదు!!

ATM లో కాష్ లేదు! PayTM లో ఎకౌంటు లేదు!!

ఇల్లీమజ్జేనా మూడు, నాలుగు వారాలుగా నేను బోల్డు మందికి బోల్డు డబ్బు బాకీ పడిపోయాను. సొమ్ము లేక కాదు. రొఖ్ఖం లేక! మల్లెపూలమ్మికీ, మిరపకాయ బజ్జీలబ్బికి. వాళ్లింకా డెబిట్/ క్రెడిట్ కార్డులు, PayTM లు తీసుకునే స్థాయికి ఎదగలేదు. మరంచేత బ్యాంకులో సొమ్ములున్నా, బ్యాంకు వాళ్ళ దగ్గర సొమ్ములు లేకపోవడంతో మా చెడ్డ చావొచ్చింది. 

మా ఇంటికి కేవలం రెండు వందల గజాల్లో "మా బ్యాంకు......బ్యాంకు" దాంట్లో ఒక ATM ఉన్నాయి. నేను ఖాళీ దొరికినప్పుడూ, బాకీలు గుర్తొచ్చినప్పుడు అలా సరదాగా ATM దాకా రాంప్ మీద అందమైన మోడల్ నడిచే టైపులో వయ్యారంగా    నడుచుకుంటూ (ఎంత కాష్ అవసరం అయితే మట్టుకు పరిగెడతారా ఏంటి అసయ్యంగా!) వెళ్ళడం అలవాటు చేసుకున్నా. ఎటూ ఈ మజ్జెన వ్యాయామం గట్రా ఏమీ చెయ్యటం లేదు, మరీ భారీగా కనిపిస్తున్నానని, మా ఇంటావిడ భారీగా వాపోతోందని సరే వాక్ ది టాక్ లాగా వాక్ టు ది బ్యాంక్ ప్రోగ్రాం ఒకటి దాదాపు ప్రతి రెండురోజులకి ఒక సారి! 

సరే చదువరులందరికీ తెలిసిన విషయమే కదా ATM లలో కాష్ ఎండమావిలాంటిదని. ఈ వాక్ టు ది బ్యాంక్ కార్యక్రమం ఇలా మూడు వారాలు కొనసాగించాక నేను మాత్రం ఓ చటాక్ బరువు తగ్గానేమోనని అనుమానం పట్టుకుంది. ఎందుకంటే ప్యాంట్లు ఓ తెగ జారిపోవడం మొదలయ్యింది!** ఇదేదో బాగుంది. బోల్డు రోజులు ఈ ATM లలో కాష్ రాకుండా ఉంటె బాగుండును నేను బోల్డు బరువు తగ్గిపోవచ్చు అని ఇష్టదైవాన్ని అష్టోత్తరం చదివి నా మనోవాంఛ కేవలం దేవుడికే వినిపించేట్టు చెప్పే సమయంలో వెంటనే నా అంతరాత్మ ఓ జెల్ల కొట్టింది. 

ఇదేటిది. అపశకునం. నిష్టగా పూజ పూర్తిచేసే టైం కి ఇలా జెల్ల ఏమిటి. ఎందుకైనా మంచిదని ఒక్క క్షణం మూడోకన్ను మూసే ఆలోచించాను. అఫ్ కోర్స్ మూడో కన్ను (జ్ఞాననేత్రం!) ఎప్పుడూ మూసుకునే ఉంటుందనుకోండి. అప్పుడు తట్టింది ఆ జెల్ల నాకు వార్నింగ్ అని. అదేటంటే నేను పుట్టిందే లోక కల్యాణం కోసం ... ఇప్పటికే ఈ విషయం చాల సార్లు మనవి చేసాను.... మరి అసుంటప్పుడు ఇలా కేవలం నా బరువు తగ్గడం కోసం మొత్తం పెజానీకానికే నిరవధికంగా కాష్ లేకుండా చెయ్యడమా? నో! నెవర్! 

అంతే! ఆ ఆలోచన న్యూటన్ తలమీద ఆపిల్ పడినట్టు నా తలమీద జెల్ల తగలగానే నాక్కూడా జ్ఞానోదయం అయ్యి వెంటనే నా క్షుద్ర కోరికని తొక్కేసి అన్ని ATM లలో కాష్ పొంగి పొరలాలని నా వంతు ఉడతాభక్తితో పూజని కానిచ్చేశాను.

సూచన: నా జీవితచరిత్ర మున్ముందు ఎవరన్నా రాస్తే ఇల్లీ నా భారీ త్యాగాన్ని ఏదైనా అధ్యాయం చివర ఓ బాక్స్ లో ప్రచురించచ్చు.

సరే నా మిగతా కోరికలు పట్టించుకోనట్టే .. నా పూజానంతర కోరిక కేవలం నిస్వార్ధంతో, దేశ ప్రజల శ్రేయస్సు కోసం కోరినది అని కూడా గుర్తించకుండా ...దేవుడు ఈ కోరికని కూడా అస్సలు పట్టించుకోలేదు. ఇది నా భక్తికి ఒక అగ్నిపరీక్ష. ఈ పరీక్ష నేను సెప్టెంబర్ లో పాస్ అయ్యే అవకాశం ఉంది!

ఇంతకీ కధలోకి, మీకు కధలాగే ఉంటుంది లెండి... కానీ నా సామాన్య జీవితంలో ఇదొక అసామాన్య సంఘటన....నిన్న యధావిధిగా యదాలాపంగా కాళ్ళు ఈడ్చుకుంటూ (ఈ బరువు మోయడం అంత సులభమా?) ATM కి వెళ్లాను. 

ఈ మధ్య మా బ్యాంకు వాళ్ళు ఒకింత ఎగస్ట్రా సేవ చేస్తున్నారు వినియోగదారులకు! అదేమిటంటే వరదల్లో ఇరుక్కుపోయి పైనించి హెలికాప్టర్ లోంచి తిండి  పొట్లాలు విసిరితే వాటిమీద ఎగబడే ప్రజల్లాగా ఇలా ATM కనిపించగానే ప్రజలు స్కూటర్లు, కార్లు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసి యమా స్పీడు గా ATM లొకీ చొచ్చుకుపోయి ఆ పైన అది నోక్కమన్న ఆప్షన్స్ అన్నీ నొక్కీ ఆశగా చొంగకార్చుకుంటూ బైటికి నోట్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు లాగేద్దామా అని ఎదురు చూసి, ఆ ATM ఓ అరనిమిషం దాని కడుపులో ఏదో తిప్పుతున్నట్టు శబ్దాలు చేసి బైటకి నోట్లు బదులు ఓ చిన్ని స్లిప్ ఓ అర్ధం కాని కోడ్ ప్రింట్ చేసి బైటికి కక్కితే ఆ పెజలు విపరీతమైన డిప్రెషన్, డిసప్ప్పాయింట్మెంట్ కి లోనయ్యి పక్కనే బ్యాంకు ఉంటె అందులో వీరావేశంతో జొరబడి కనిపించిన ప్రతి బ్యాంకు ఉద్యోగిని వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని పట్టి ఒకింత బూతులు తిట్టడం అన్నది రివాజుగా మారడంతో ఇలా  ATM కి అటాచ్ బ్యాంకు బ్రాంచ్ ఉంటె మట్టుకు, ఆ  ATM లో కాష్ లేకపోతే అనగా ఇరువదినాలుగు గంటలు దాని షట్టర్ క్లోజ్ చేసి ఉంచుతున్నారు. అలా చేస్తే స్కూటర్, కార్లు వాళ్ళు షట్టర్ వేసేసిన  ATM చూసి పరిస్తితి "షరా మాములే! ATM లో కాష్ నిల్లె" అని అర్ధం చేసుకుని ఆగకుండా వెళ్ళిపోతున్నారు. బ్యాంకు వాళ్ళు యమా హ్యాపీ! 

కధలోకి మళ్ళీ వస్తే ....షరా మామూలే!  ATM కి షట్టర్ దించేసి ఉంది. నేను నడిచి (బోల్డు శ్రమతో) కేవలం కాష్ కోసమే వెళ్లాను కాబట్టి వెంటనే బ్యాంకు లోకి దూసుకుపోయాను. నేను అప్పుడప్పుడూ అలా లోపలి రావడం వాళ్ళకి అలవాటే. అప్పుడప్పుడూ వాళ్ళ మీద, బ్యాంకింగ్ వ్యవస్థ మీద, ఈ బ్యాంకులతో ప్రజలు పడుతున్న అవస్థ మీద కూసిన్ని కుళ్ళు జోకులు వేస్తె వాళ్ళు ఏడవలేక నవ్వడం అలవాటు చేసుకున్నారు. 

ఎదురుగా కాషియర్ ని పట్టుకొని "ఏం సార్! ఈ మధ్య మీ దగ్గర అస్సలు డబ్బులు ఉండటం లేదు. మీక్కావాలంటే చెప్పండి. నా దగ్గర కాష్ రిచ్ పార్టీలున్నారు. షార్ట్ టర్మ్ అప్పేమన్నా కావాలంటే సరసమైన వడ్డీకి ఏర్పాటు చేస్తా" అని ఓ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాను. 

ఆ కాషియర్ నవరసాలకి ఇంకో నాలుగు జోడించి పదమూడు రసాలు ఒక్కసారిగా మొహంలో చూపించాడు. నా దగ్గర స్పైకెమెరా లేదు కానీ లేకపోతే మీ అందరికీ కూడా ఆ తెరాస ...(ఇదో సంధి...తేరా=పదమూడు ప్లస్.రస=రసాలు).. మొహం పోస్ట్ చేసి చూపించేవాడిని. మీకా అదృష్టం లేదు... కేవలం ఊహించుకోండి.

ఈ  ATM లలో కాష్ ఎప్పుడు దొరుకుతుంది. నా అప్పులెప్పుడు తీరతాయి. ఏమిటో జీవితం. బ్యాంకు ఎకౌంటు లో డబ్బుండీ బ్యాంకు లో డబ్బు లేక ఇబ్బందులు ఇంకేన్నాళ్ళో?!

కథ కంచికి! నేను  ATM కి. 

** ఈ పాంట్లు ఇంత వేగిరం అంత బరువు తగ్గి ఇలా జారిపోవడం ఏమిటా అని ఓ చిన్ని FBI ఇన్వెస్టిగేషన్ చేసాక అర్ధం అయ్యింది., పాంట్లు జారడం బరువు తగ్గి కాదు, బొజ్జ పెరిగి పాంట్లు పైకెళ్ళలేక, గుండ్రంగా ఉన్న బొజ్జ మీద పట్టుదొరక్క కిందకి జారిపోతున్నాయి అని. హతవిధీ!!


Saturday, March 10, 2018

బేకరీలో బకరా! Bakra in Bakery!

ఓ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న బేకరీ లో ఒక్కడినీ ఒంటరిగా (ఈ రెండు మాటలు ఒకటే కదా అంటారా?! కాదేమోనని నాకనుమానం) కూర్చొని ఓ వెజ్ కర్రీ పఫ్ తింటూ, దాంతో పాటు ఓ బుల్లి థమ్సప్ తాగుతూ, నేనేమిటి, నా జీవితం ఏమిటి, దీనికి ఏమన్నా అర్ధం లేక పరమార్ధం అంటే ఒక పర్పస్ ఉందా, ఉంటె ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్నాక ఏం చెయ్యాలి అని ఇలా ఖాళీగా ఉన్నప్పుడు విపరీతంగా ఆలోచిస్తూంటాను. మధ్య మధ్యలో ఓ పక్క ఈ ఫేస్బుక్ తిరగేస్తూ!

ఈ బేకరీలో నేను వెళ్ళే టైం కి ఎవ్వరూ కస్టమర్స్ ఉండరు. అందుకని నేను అలా శూన్యంలోకి చూస్తూ, అప్పుడప్పుడూ ఏదో గొణుక్కుంటూ ఉంటే ఎవరైనా చూసి నన్ను ఇంకా సర్టిఫై చెయ్యని పిచ్చాడని ఓ తప్పుడు అభిప్రాయానికి వచ్చి ఒక సినిమాలో జగపతిబాబు అన్నట్టు "ఈ సిటీలో ఇంతమంది పిచ్చోళ్ళు ఇంత ఫ్రీ గా తిరిగేస్తున్నారా" అని హాస్చర్యపడే ప్రమాదం లేదు.

అసలు ఇలా ఒక్కళ్ళం కూర్చొని తీవ్రంగా ఆలోచించడాన్ని ఇంగ్లీష్ లో సాలిటరి కాంటెంప్లేషన్ అంటారు. అంటే వేదాంత ప్రక్రియ అన్నమాట. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారుగా "నువ్వు ఎవరు" అన్న ప్రశ్నకి జవాబు సంపాదిస్తే చాలు అని. ఇలా ఖాళీ దొరికినప్పుడు వృధా చెయ్యకుండా ఇలాంటి వేదాంత ప్రశ్నల గురించి తీవ్రంగా ఆలోచిస్తూంటాను. ఇప్పటిదాక కొత్త ప్రశ్నలు పుట్టాయి కాని ఒక్కదానికి కూడా నాకు నచ్చిన జవాబు దొరకలేదు. తప్పదు ఈ నిరంతర అన్వేషణ. జవాబులు దొరికేదాక నేనొక నిరంతర సంచారి. అన్వేషి.


ఇంతకీ ఇలా జవాబు దొరకని ప్రశ్నల గురించి ఆలోచిస్తూ మధ్యలో ఫేస్బుక్ లోకి , ట్విట్టర్ లోకి తొంగి చూస్తూ కర్రీ పఫ్ మీద కొంచం టమాటో సాస్ సీసాలోంచి ఒంపి తినడానికి నోట్లో పెట్టుకున్నాను. ఏదో తేడా గా అనిపించింది. అప్పుడే తయారు చేసిన కర్రీ పఫ్ ఎందుకో మరీ మెత్త మెత్తగా ఒకింత నీళ్ళు కారుతున్న ఫీలింగ్! రుచిలో కూడా బాగా తేడా! ఇదేటిది ఇలా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదే అని అలవాటుగా శూన్యంలోకి చూసి మళ్ళీ కర్రీ పఫ్ ని కొరికే లోపల ఉన్నట్టుండి నా ప్యాంటు తడితడిగా అనిపించింది. ఇదేమి ప్రారబ్ధం! కొంప తీసి....ఛా! వెధవ ఆలోచన. దాన్ని పక్కకి తోసి ఎవ్వరూ చూడకుండా కింద ప్యాంటు వేపు చూసేలోపు అర్ధం అయ్యింది అసలు ఏం జరిగిందో!

ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ కర్రీ పఫ్ మీద సాస్ బదులు థమ్సప్ సీసా వంపాను. అలా కారిన థమ్సప్ కర్రీ పఫ్ ని తడిపి కింద నా పాంట్ మీదకి జలజలా కారింది.

నేను ఏది జరిగినా పాజిటివ్ గానే తీసుకుంటాను. పాజిటివ్ ఏమన్నా ఉందా జరిగిన దాంట్లో అని తరిచి తరిచి చూస్తాను.

పాజిటివ్ ఏమిటంటే లైట్ కలర్ ప్యాంటు వేసుకోలేదు. గుడ్డిలో మెల్ల. ప్యాంటు ఆరేదాకా ఇక్కడే కూలబడనక్కరలేదు.

నీతి: మల్టీ టాస్కింగ్ వద్దంటే వినం కదా?!

NB: ఈ ఫోటోలో కుడి చేతి వేపు సాస్ సీసా ఉంది కదా మరి థమ్సప్ ఎలా ఒంపుకున్నారు? అని సందేహం వస్తుంది మీకు. ఎందుకంటే మీరు కూడా నాలాగ అన్నింటినీ సునిశితంగా పరిశీలిస్తారు కదా?

సందేహ నివృత్తి: కుడి చేత్తో కర్రీ పఫ్ తింటున్నప్పుడు ఆ చేత్తోనే థమ్సప్ బాటిల్ పట్టుకోలెం కదా? అందుకని ఎడమ వేపు పెట్టి ఆ సంగతి మర్చిపొతే వచ్చిన (కారిన ఉప) ద్రవం!!

Monday, February 26, 2018

My singing experience! నా గాత్రాభినయం!

ఈ మధ్య ఓ సాయంత్రం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నన్నో పాట పాడమన్నారు. నాకసలే మొహమాటం ఎక్కువ. ఎవ్వరికీ "No" చెప్పలేను. అదీ కాక నన్ను పాట ఆపమనేవాళ్ళే కాని పాడమనేవాళ్ళు ఒకింత తక్కువేనని చెప్పాలి. మరందుకని వచ్చిన అవకాశం మీన, మేషాలు లెక్కెడుతూ కూర్చుంటే శ్రోతలు మనసు మార్చుకునే ప్రమాదం ఉంది.
అందుకని వెంటనే గొంతు సవరించుకోకుండానే ఓ మనవి విన్నవించాను. అదేమిటంటే "నేను ఏ పాట పాడినా అది ఏ రాగంలో ఉన్నా నేను దాన్ని "రాగమాలిక" లాగ మార్చి పాడే అలవాటుంది నాకు. అందుకని అప్పుడప్పుడూ మూడు నాలుగు రాగాలు, కూనిరాగాలు, స్వరాలూ, అపస్వరాలు, గతులు, సంగతులు, గమకాలూ, చమక్కులు ఇవన్నీ మేళవించి, రంగరించి పాడుతా! తస్మాత్ జాగ్రత్త" అని మూడో ప్రమాద హెచ్చరిక జెండా ఎగరేసి ఓ పాలి గొంతు సవరించుకుని మరీ పాట మొదలెట్టా.
సరే. అందరూ కళ్ళు మూసుకొని వినడం మొదలెట్టారు. తన్మయత్వంతోనా, నా ముఖకవళికలు, మొహంలో కదలికలు చూడలేకా, లేక వాళ్ళ ముఖకవళికలు దాచడానికా అన్నది టీవీ9 వాడు పానెల్ డిస్కషన్ పెడితే కాని తేలని, తెలీని వ్యవహారం.
నేను కూడా మధ్ద్యమధ్యలో పెద్ద పెద్ద గాయకులు కూడా పాడుతున్నప్పుడు కళ్ళు, ఎడం చేతివేలుతో ఎడమ చెవి మూసుకుని పాడడం చూసిన సీన్ గుర్తు తెచ్చుకుని నేను మట్టుకు తన్మయత్వంతో, తాదాత్మంతో (ఈ మాటకి అర్ధం సరిగ్గా తెలీదు కాని ఇక్కడ ప్రాస బాగా కుదిరిందని వాడడం జరిగిందని పాఠకులకి విజ్ఞప్తి) వెరైటీ గా ఉంటుందని ఓ కన్ను ఓ చెవి మూసి పాడేసాను.
పాట అయ్యిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ ఓ నిమిషం పాటు తెగ చప్పట్లు కొట్టేసారు. వార్నీ. ఇంత బాగా మెచ్చుకుని ఇన్ని చప్పట్లు కొడతారని తెలిస్తే ఇంకుంచం బాగా పాడేవాడిని కదా అనుకుని అదే అన్నాను. అంతే అందరూ షాక్ అయిపోయారు. ఇదేటిది. నా మధురగానం రెండోసారి వినే భాగ్యం కల్లో కూడా ఊహించక ఆ మహద్భాగ్యం ఎదురొచ్చేటప్పటికి తట్టుకోలేక షాక్ లోకి వెళ్ళిపోయారా? ఈ లోపల అందరిలో ఒకింత భారీమనిషి తేరుకుని "మేము చప్పట్లు కొట్టింది నువ్వు బాగా పాడావని కాదు! హమ్మయ్య మొత్తానికి నీ పాట అయ్యిపోయిందని" అని నిర్మోహమాటంగా మొహం మీద నీళ్ళు కొట్టినట్టు అని నా చిన్నారి హృదయాన్ని బద్దలు చేసాడు. అది డాల్బీ డిజిటల్ సరౌండ్ సిస్టం శబ్దంతో వెయ్యినూటపదారు ముక్కలయ్యిపోయింది. ఫెవికాల్ కూడా చేతులెత్తేసే సీన్!
ఫ్రెండ్స్ కొంపలకి. కధ కంచికి (ట్రైన్ లో టికెట్లెస్ ట్రావెల్) నేను నా అలకగృహానికి! అలక తగ్గాక మీ అందరికీ నా పునర్దర్శన ప్రాప్తి రస్తు!

Sunday, June 11, 2017

ఇంకెన్నాళ్ళు నాకీ చకోర నిరీక్షణ?! నా వల్ల కాదంటే కాదంతే!

ఎవరన్నా కాస్త ఆ వాతావరణ శాఖ వాళ్లకి చెప్పండర్రా!

హైదరాబాద్ లో ఆదరా బాదరాగా రోజూ పడిపోతున్న ఘోర వానలు "ఋతుపవనాలని చెప్పమని"

ఎందుకా? ఎందుకంటే వేసంకాలంలో అందరిలాగే వేడికి తట్టుకోలేక నేను కూడా రోజూ ప్రార్ధించేవాడిని.. కానీ అందరిలాగా వానలకోసం కాదు. ఋతుపవనాల కోసం! ఎందుకంటే నాది ఒకింత విశాల హృదయం. వానలకోసం ప్రార్ధిస్తే ఒకటో రెండో చిన్ని వానలు పడి ఆగిపోయిే అవకాశం, ఆ దెబ్బతో ఎండలు మరీ వేడెక్కిపోయే ప్రమాదం కూడా ఉంది. మరందుకని కుంచం లాంగ్ టర్మ్ దృష్టితో ఋతుపవనాల గురించే ప్రార్ధించాను ఎప్పటి లాగే.

ఓ వారం నించి వానలు వాయించేస్తూంటే మీరందరూ సాటిస్ఫైడ్ ఏమో కాని నేనింకా అసంత్రుప్తుడినే ఎందుకంటే కలశంలో పోస్తే కాని తీర్ధం కాదు కదా? ఆ వాతా"వరుణ" శాఖ వాళ్ళు ఈ థండర్ స్టార్ములు ఇలా ఋతుపవనాలు వచ్చే ముందు, త్వరలో వచ్చే సినిమా టీజర్ లాంటివి, ఇవంతే షరా మాములే టైపులో పడుతూంటాయి కాని ఇవి చస్తే ఋతుపవనాలు కావు అంటున్నారు. ఏమిటో మామూలు వానలకి, ఋతుపవనాల వానలకి అంత సామాన్య పెజానీకానికి అర్ధం కాని తేడా?

(వరుణ) దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అంటే ఇదేనేమో?
ఏది ఏమైనా ఇంకెన్నాళ్ళు నాకీ చకోర నిరీక్షణ?! నా వల్ల కాదంటే కాదంతే

Saturday, February 18, 2017

బొద్దింక - 2

మొన్న నేను విడుదల చేసిన టైటిల్ టీజర్ అసలు సినిమా ఇది!

మీ అందరిచేత ఆర్నెళ్ళకోసారి ఎందుకు సూటి పోటి మాటలు పడడం అని, కమిట్ అయ్యాక వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి "ఆలీసం ఏదైనా విషం" కాబట్టి పిచ్చర్ వెంటనే విడుదల! 79 రోజుల్లో శాతకర్ణి   తియ్యగా లేనిది (ఇక్కడ ద్వందార్ధం లేదు!) నేను రెండ్రోజుల్లో రాయలేనా? పట్టుదల!

ఇహ సినిమా ప్రారంభం!

మళ్ళీ మర్చిపోయిన మీ అందరికీ  (ఎంత అస్సయ్యం వేసినా సరే.. జీవితంలో కొన్ని కొన్ని భయంకర, భయానక, జుగుప్సాకరమైనవి చూడక, చదవక తప్పదు!) మరొక్కసారి ఈ పిచ్చర్ లో బొద్దింకే ప్రధాన పాత్రధారి అని మనవి. ఏం. ఈగ పాటి చెయ్యదా? ఏనుగులు, కుక్కలు, పాములు, కోతులు వగైరా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాయిగా? ఇప్పుడు బొద్దింక వంతు.

ఓపెనింగ్ షాట్: పొద్దున్నే అంటే మరీ తెల్లారకుండా కాదు. దాదాపు ఎనిమిదిన్నరకి. నేను రోజూ తిట్టుకుంటూ చేసే దినచర్య. అదే.. షేవింగ్! దేవుడు మగాళ్ళకి ఇచ్చిన శాపం ఈ షేవింగ్. పోనీ గెడ్డం పెంచుకోవచ్చుగా అంటే తవరికి తెలీదా ఏమిటి? గెడ్డం అందరికీ నప్పదని. అదో అలా గెడ్డం నప్పని వాళ్ళల్లో నేను ప్రధముడిని. మరంచేత పెజానీకం సౌకర్యార్ధం అంటే ఇన్ అదర్ వర్డ్స్ లోక కళ్యాణం కోసం రోజూ షేవింగ్ చేస్తూంటాను. నా గురించి అస్సలు కాదు. ఎందుకంటే రోజులో నేను నా మొహం కేవలం 3/4 సార్లు మాత్రమే అద్దంలో  చూసుకుంటాను. కాని అధమపక్షం రోజులో ఓ 14 గంటలు పెజానీకమే నా మొహం చూడాల్సింది. మరంచేత నేను గెడ్డం గీసినా, ఒకింత అందంగా కనిపించే ప్రయత్నం ... అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లు వగైరా బాగా పట్టించి , ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా సామెత గుర్తొచ్చినా ఖాతరు చెయ్యకుండా, పేస్ వాష్ లు గట్రా వాడుతున్నానంటే కేవలం పెజలకోసమేనని, కేవలం లోక కళ్యాణం కోసమేనని, ఇందులో స్వార్ధం అస్సలు లేదని మరొక్కసారి మనవి. అర్ధం చేసుకోరూ!

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో పడి ఓపెనింగ్ షాట్ దగ్గరే ఆగిపోయా. సరే పొద్దున్నే షేవింగ్ చేద్దామని నా "మంగలిపొది"
అంటే నేను నా షేవింగ్ సామగ్రి దాచుకునే ప్లాస్టిక్ డబ్బా అన్నమాట.. మూత తెరవగానే షాక్!!

ఏమయ్యింది?! అక్కడ ఏం కనిపించింది!!

ఇదే హీరో ఇంట్రో షాట్!! ఆ ప్లాస్టిక్ బాక్స్ లో పెద్దగా కనిపిస్తున్న పిల్ల బొద్దింక!కాళ్ళ దగ్గర నించి స్లో గా మొహం మీదకి పానింగ్ క్లోజ్ అప్ షాట్! క్లోజ్ అప్ షాట్ లో పిల్ల బొద్దింక అయినా పెద్దగా కనిపించింది. అసలిక్కడ ట్రాలీ షాట్ పెడదామానుకున్నా కానీ, బొద్దింక ఎంత పెద్దగా చూపించినా డైనోసారస్ అంత పెద్దగా చూపిస్తే బాగోదని ఆ ఐడియా డ్రాప్ చేశా!

పిల్ల బొద్దింక అంటే టీన్ఏజ్ అన్నమాట. పిల్ల కాబట్టి పిల్ల చేష్టలు. చెడు తిరుగుళ్ళు. లేకపోతే అడిగేవాడు లేక కాని నా మంగలిపొదిలో ఏముంటుంది తినడానికి? బాడ్ అప్బ్రింగింగ్.

దానికి ఉన్నది... ఇప్పుడిప్పుడే వస్తున్నవి లింగు లిటుకూ మంటూ రెండు ఓ మోస్తరు మీసాల్లాంటి వెంట్రుకలు! అవి కాస్త అది నా మంగలిపోదిలో "రగులుతోంది మొగలిపొద" టైపు లో భరత, కూచిపూడి, కథక్ లు, ఒకింత మోడరన్ బొద్దింక అయితే పేరు పెట్టలేని, వర్ణించలేని అప్పుడప్పుడూ మనం కూడా వెయ్యలేని సినిమా పాటల స్టెప్పులు వేసిందంటే ఏ రేజర్ బ్లేడో తగిలి ఆ వస్తున్న మీసాలు తెగిపోయి, లేదా ఎలక్ట్రిక్ రేజర్ ఆన్ అయ్యి దాని రెక్కలు ముక్కలు ముక్కలు అయిపోయి,  దాని బ్రతుకు దుర్భరం అయిపోయే ప్రమాదం ఉందన్న విషయం దానికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు? ఎవరు?

ఆ విషయం కాసీపు పక్కన పెడితే నాకు వెంటనే వచ్చిన సందేహం మొన్న మిమ్మల్నందర్నీ అడిగినదే.

"బొద్దింక ఆహారం ఏమిటి?"

ఎందుకంటే ఈ విషయం ఒకింత లోతుగా చర్చించి, విస్తృతంగా శోదించి దాని తిండి వ్యవహారం లో నా షేవింగ్ సెట్ లో పదార్ధాలు ఏమన్నా ఉన్నాయంటే నేను అర్జెంటుగా మూత గట్టిగా పట్టే డబ్బా సంపాదించాలి. మార్గదర్శిలో చేరైనా!

ఈ లోపల బొద్దింక ని అంత క్లోజ్ అప్ లో చూడగానే వెంటనే ఫ్లాష్ బ్యాక్ !! అంటే నా టీన్ ఏజ్ రోజుల్లోకి అలా గిరగిరా తిరుగుతూ వెళ్ళిపోయా!! నా టీనేజ్ లో బొద్దింక ఒక చిన్ని పాత్ర వహించింది. పాత్ర చిన్నదే కాని ఎఫెక్ట్ పెద్దది!

టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవ్వాలి. అప్పటి తల్లితండ్రులకి ఇప్పటి వాళ్లకి ఏమి తేడా లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని ఇంజనీరింగ్ లో ఎలా బలవంతంగా ఇరికించేస్తున్నారో ఆ రోజుల్లో నా నాన్న కూడా నన్ను అదే కోవలో మెడిసిన్ చదివించేద్దామనే ఒక బలీయమైన కోరికతో నన్ను బలి చేసారు. అంతే అభం శుభం తెలీని నేను ఇంటర్ లో బైపిసి లో జాయిన్ అయ్యా...జాయిన్ చేసారు.

ఇహ చూస్కోండి. జువాలజీ ప్రాక్టికల్ కోసం ఒక రోజు వానపాము, ఇంకోరోజు ఓ పెద్ద బావురుకప్ప, ఈ రెండూ దొరక్క పోతే తేరగా దొరికిందని, దొరుకుతుందని బొద్దింక ఇలా రకరకాల జంతువులని మా చిన్ని చిన్ని చేతులతో, మా చిన్నారి మనసులు ఎంత అస్సయ్యమైన భయం, జుగుప్సలతో బాధపడుతున్నా ఖాతరు చెయ్యకుండా వాటిని డిసేక్ట్ చెయ్యించేవాళ్ళు. వాటిని వెల్లకిలా పడేసి ఓ చెక్క ముక్కకి మేకులతో బంధించి (చచ్చినవి ఎలా పారిపోతాయో కాని వాటిని బంధించడం మట్టుకు తప్పనిసరి!) ఆ తర్వాత వాటిని అడ్డంగా అదే నిలువునా చీల్చి చెండాడి లోపల  కనిపించి మన స్కాల్పెల్ కి కట్ అవ్వకుండా మిగిలిన వాటి అవయవాలు అన్నీ తీసి బైట పడేసి, అందులో బాగా నదరుగా ఉన్నదాన్ని అన్న వాహిక అని డిస్ప్లే చేసి పారేసేవాడిని.  ఈ సాహసచర్యలకి బోల్డు మార్కులు వస్తాయనుకున్నా కాని అందరు విద్యార్ధుల అంచనాల్లాగా నాది కూడా తారుమారు అయ్యి చివరాఖరికి అత్తెసరు మార్కులతో గట్టెక్కా. అంతా మన మంచికే అంటారు. ఇలా జంతువుల దేహాలతో ఆడుకున్నాక ఒక్క విషయం నాకు సందేహం లేకుండా క్లియర్ గా అర్ధం అయ్యింది. అదేమిటంటే నేను జీవితంలో మంచి పేషెంట్ అవ్వడం బెటర్ బాడ్ డాక్టర్ కంటే అని. అదే చేశా. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి డాక్టర్ అవ్వకుండా ఉండడానికి చాల కృషి చేసి మళ్ళీ లోక కల్యాణానికి చిన్న వాడిని, చితక వాడిని అయినా నా వంతు కృషి అంత నూనూగు మీసాల ప్రాయంలోనే చేశా. ఈ విషయం గురించి మరోసారి, వీలు చేసుకొని సవివరంగా వినిపిస్తా. అదే వివరిస్తా.

ఇక్కడ ఇంకో విషయం. ఇలా ఆ జంతువులలో (బొద్దింక క్రిమా?) ఉన్న పార్టులు అన్నీ పీకించే వాళ్ళు కాని అవి బ్రతికి ఉన్నప్పుడు ఏం తిండి తిని చస్తాయో చెప్పి చావలేదు! మరందుకే ఇప్పుడు నాకీ సందేహం. అప్పుడు అవుట్ అఫ్ సిలబస్ ఈ మేటర్!

ఇక్కడ కొంచం డైవర్ట్ అయ్యి ఇంకో మేటర్ డిస్కస్ చెయ్యాలి. సందర్భం వచ్చింది కాబట్టి. అదేమిటంటే మన హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా ఆ జంతువులని డిసేక్ట్ చేసిన పాపం మాలాంటి అమాయకులకి చుట్టుకుంటుందా? అఫ్ కోర్స్ వాటిని మేము చంపలేదు కానీ వాటిని ఇంకెవరో చంపడానికి మేమే కదా కారణం? ఎవరూ ఇలా బైపిసి గ్రూప్ లో చేరకపోతే పాపం ఆ వానపాములు, కప్పలు, బొద్దింకలు ఎంచక్కా బ్రతికే ఉండేవి కదా? ఎవరైనా కర్మ ఎక్స్పర్ట్ లు ఈ సందేహం తీర్చ ప్రార్ధన. ఒకవేళ అలాంటి చిరు పాపం చుట్టుకుంటే కంచిలో బంగారు బల్లిని పట్టుకుంటే పాప విముక్తి కలిగినట్టు ఈ సదరు జంతువులకి కూడా ఏమన్నా పా(శా)ప విమోచనాలు ఏమన్నా శాస్త్రాల్లో పేర్కొన్నారా?

మళ్ళీ కధలోకొస్తే ఇంతకీ ఆ బొద్దింక నా షేవింగ్ సెట్ రోజూ వాయిదా పద్ధతిలో తినేసే ప్రమాదం, ఆస్కారం ఉన్నాయా? ఉంటే, గింటే (గింటే అంటే అర్ధం ఏమిటో?!) నేను తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి ఇప్పుడు అర్జెంటు గా ఆలోచించాలి.

మరంచేత సశేషం!!!

కధ కంచికి. బల్లి హీరో కాకపోయినా!! 

Thursday, February 16, 2017

బొద్దింక!!!

"బొద్దింక ఆహారం ఏమిటి?!"

ఇదేటిది పొద్దున్నే ఈ పనికిమాలిన పరిజ్ఞానం కొశ్చన్ ఏటని కొశ్చన్ మార్క్ ఫీలింగ్ పేస్ లో చూపించొద్దు. నాకు పొద్దున్నే ఈ ధర్మ(?) సందేహం వచ్చింది. ఏదన్నా సందేహం వస్తే వెంటనే తీర్చుకునే ప్రయత్నం చెయ్యడం మానవుడిగా నా కర్తవ్యమ్ కాబట్టి మిమ్మల్ని అడిగాను.

నిజం చెప్పాలంటే ఇది నేను రాయబోయే "రచన"కి టీజర్ టైటిల్!! ఇల్లీమజ్జేన ప్రతిదానికి ఓ టీజర్ విడుదల చెయ్యడం ఫాషన్ అయ్యిపోయింది కదా! ఫస్ట్ లుక్ టీజర్. ఫస్ట్ ట్రైలర్ టీజర్. ఫస్ట్ షాట్ టీజర్. ఫస్ట్ పోస్టర్ టీజర్. ఆ కోవకి చెందినదే ఈ టైటిల్ టీజర్! ఏమిటో ? వెధవ ఐడియా లు అక్కరలేని సినిమా వాళ్లకి అనవసరంగా ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా నిస్వార్ధంగా ఇచ్చేస్తున్నా! విచ్చలవిడిగా వాడుకోండి నా ఈ టైటిల్ టీజర్ ఐడియా!

ఏ ఐడియా అయినా (బ్రహ్మాండమైనది అయినా కాకపోయినా) ఉత్తినే, ఊరికినే రాదు. ఆర్కిమెడిస్ కి నీళ్ళల్లో బాతు బొమ్మ చూస్తే వచ్చింది. న్యూటన్ కి నెత్తిమీద ఆపిల్ పడితే వచ్చింది. అలాగే నాక్కూడా పొద్దున్నీబొద్దింక ని చూడగానే వచ్చింది. "కాదేదీ ఐడియా కి అనర్హం" అని గమనించ మనవి.

ఇంతకీ ఇలా టైటిల్ బొద్దింక సహకారంతో పెట్టాను కాని ఈ టీజర్ గొడవేమిటా? దానికి కుంచం చరిత్ర ఉంది. అల్లామజ్జదాకా నేను విరివిగా, ఒకింత విచ్చలవిడిగా రోజూ ఏదో ఒకటి బరికి పారేసేవాడినని అభిమానులకి విదితమే! కానీ ఇటీవల నా జీవితంలో అనుకోని మార్పు అదేనండి టీవీ డైలీ సీరియల్ లో 3,962 ఎపిసోడ్ లో వస్తుందే అలాంటి పేద్ద మలుపు, వచ్చింది!

అలా మలుపు తిరగడంలో చాలా బిజీబిజీ అయిపోయి, సినిమా సంగతి దేవుడెరుగు, కనీసం సినిమా పోస్టర్ చూసే టైం కూడా లేకపోవడంతో ఇటీవల ఒకింత నేను రాయడం తగ్గించానన్న విషయం అభిమానులు గుర్తించినా ఒకింత అదే ఒక్క పిసరు అభిమానం తగ్గిందేమో, లేక అడగడానికి మొహమాట (భయ) పడ్డారో మొత్తానికి నన్ను ఎవరూ ఈ విషయం గురించి గుచ్చిగుచ్చిఅడగక పోయినా నేను కూడా సినిమా వాళ్ళ లాగ పెజానీకం మనసుల్లోకి దూరిపోయి అవన్నీ తెలుసుకుని ("ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కావాలంటున్నారు" అని సినిమాయగాళ్ళు ఎన్నోసార్లు చెప్పలేదా? అలాగే నేను కూడా!) వాళ్ళు అడగ(లే)ని కొశ్చన్ లకి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలా టైటిల్ టీజర్ పెట్టి "కమిట్" అయ్యాను. టైటిల్ పెట్టాక ఇవాళ కాకపోతే కనీసం ఓ ఆరునెలలకయినా వీలు చూసుకుని రచన పూర్తి చేస్తాను కదా. "ఒక్కసారి కమిట్ అయితే ..." తెలుసు కదా?

ఒహవేళ నా జీవితం 4371 ఎపిసోడ్ లో మరో మలుపు తిరిగి నేను మరీ బిజీ అయ్యిపోయి ఈ బొద్దింక ప్రహసనం రాయని పక్షంలో మీరందరూ అప్పుడప్పుడూ అంటే ఆరు నెలలకోసారి అన్న మాట "సార్! మీ బొద్దింక ఏమంటోంది" అని వ్యంగ్యంగా నాకు, నేను రాస్తానన్న ప్రతిజ్ఞ ఒకింత సున్నితంగా గుర్తుచేసి నా మీద పబ్లిక్ ప్రేషర్ బిల్డ్అప్ అయితేనన్నా రాస్తానేమోనని ఇలా ఈ

"బొద్దింక ఆహారం ఏమిటి"

అన్న టైటిల్ టీజర్ విడుదల చేయడమైనది.

నేను ఆ విషయం పరిశీలించి, పరీక్షించి రాసేలోపు మీరందరూ మీ మీ పరిజ్ఞానము కొలది ఆ టీజర్ కొశ్చన్ కి జవాబులు రాయచ్చు. గూగుల్ వాడుకున్నా తప్పులేదు కానీ వాడకండి!