Saturday, March 10, 2018

బేకరీలో బకరా! Bakra in Bakery!

ఓ రోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న బేకరీ లో ఒక్కడినీ ఒంటరిగా (ఈ రెండు మాటలు ఒకటే కదా అంటారా?! కాదేమోనని నాకనుమానం) కూర్చొని ఓ వెజ్ కర్రీ పఫ్ తింటూ, దాంతో పాటు ఓ బుల్లి థమ్సప్ తాగుతూ, నేనేమిటి, నా జీవితం ఏమిటి, దీనికి ఏమన్నా అర్ధం లేక పరమార్ధం అంటే ఒక పర్పస్ ఉందా, ఉంటె ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్నాక ఏం చెయ్యాలి అని ఇలా ఖాళీగా ఉన్నప్పుడు విపరీతంగా ఆలోచిస్తూంటాను. మధ్య మధ్యలో ఓ పక్క ఈ ఫేస్బుక్ తిరగేస్తూ!

ఈ బేకరీలో నేను వెళ్ళే టైం కి ఎవ్వరూ కస్టమర్స్ ఉండరు. అందుకని నేను అలా శూన్యంలోకి చూస్తూ, అప్పుడప్పుడూ ఏదో గొణుక్కుంటూ ఉంటే ఎవరైనా చూసి నన్ను ఇంకా సర్టిఫై చెయ్యని పిచ్చాడని ఓ తప్పుడు అభిప్రాయానికి వచ్చి ఒక సినిమాలో జగపతిబాబు అన్నట్టు "ఈ సిటీలో ఇంతమంది పిచ్చోళ్ళు ఇంత ఫ్రీ గా తిరిగేస్తున్నారా" అని హాస్చర్యపడే ప్రమాదం లేదు.

అసలు ఇలా ఒక్కళ్ళం కూర్చొని తీవ్రంగా ఆలోచించడాన్ని ఇంగ్లీష్ లో సాలిటరి కాంటెంప్లేషన్ అంటారు. అంటే వేదాంత ప్రక్రియ అన్నమాట. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారుగా "నువ్వు ఎవరు" అన్న ప్రశ్నకి జవాబు సంపాదిస్తే చాలు అని. ఇలా ఖాళీ దొరికినప్పుడు వృధా చెయ్యకుండా ఇలాంటి వేదాంత ప్రశ్నల గురించి తీవ్రంగా ఆలోచిస్తూంటాను. ఇప్పటిదాక కొత్త ప్రశ్నలు పుట్టాయి కాని ఒక్కదానికి కూడా నాకు నచ్చిన జవాబు దొరకలేదు. తప్పదు ఈ నిరంతర అన్వేషణ. జవాబులు దొరికేదాక నేనొక నిరంతర సంచారి. అన్వేషి.


ఇంతకీ ఇలా జవాబు దొరకని ప్రశ్నల గురించి ఆలోచిస్తూ మధ్యలో ఫేస్బుక్ లోకి , ట్విట్టర్ లోకి తొంగి చూస్తూ కర్రీ పఫ్ మీద కొంచం టమాటో సాస్ సీసాలోంచి ఒంపి తినడానికి నోట్లో పెట్టుకున్నాను. ఏదో తేడా గా అనిపించింది. అప్పుడే తయారు చేసిన కర్రీ పఫ్ ఎందుకో మరీ మెత్త మెత్తగా ఒకింత నీళ్ళు కారుతున్న ఫీలింగ్! రుచిలో కూడా బాగా తేడా! ఇదేటిది ఇలా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదే అని అలవాటుగా శూన్యంలోకి చూసి మళ్ళీ కర్రీ పఫ్ ని కొరికే లోపల ఉన్నట్టుండి నా ప్యాంటు తడితడిగా అనిపించింది. ఇదేమి ప్రారబ్ధం! కొంప తీసి....ఛా! వెధవ ఆలోచన. దాన్ని పక్కకి తోసి ఎవ్వరూ చూడకుండా కింద ప్యాంటు వేపు చూసేలోపు అర్ధం అయ్యింది అసలు ఏం జరిగిందో!

ఎటో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ కర్రీ పఫ్ మీద సాస్ బదులు థమ్సప్ సీసా వంపాను. అలా కారిన థమ్సప్ కర్రీ పఫ్ ని తడిపి కింద నా పాంట్ మీదకి జలజలా కారింది.

నేను ఏది జరిగినా పాజిటివ్ గానే తీసుకుంటాను. పాజిటివ్ ఏమన్నా ఉందా జరిగిన దాంట్లో అని తరిచి తరిచి చూస్తాను.

పాజిటివ్ ఏమిటంటే లైట్ కలర్ ప్యాంటు వేసుకోలేదు. గుడ్డిలో మెల్ల. ప్యాంటు ఆరేదాకా ఇక్కడే కూలబడనక్కరలేదు.

నీతి: మల్టీ టాస్కింగ్ వద్దంటే వినం కదా?!

NB: ఈ ఫోటోలో కుడి చేతి వేపు సాస్ సీసా ఉంది కదా మరి థమ్సప్ ఎలా ఒంపుకున్నారు? అని సందేహం వస్తుంది మీకు. ఎందుకంటే మీరు కూడా నాలాగ అన్నింటినీ సునిశితంగా పరిశీలిస్తారు కదా?

సందేహ నివృత్తి: కుడి చేత్తో కర్రీ పఫ్ తింటున్నప్పుడు ఆ చేత్తోనే థమ్సప్ బాటిల్ పట్టుకోలెం కదా? అందుకని ఎడమ వేపు పెట్టి ఆ సంగతి మర్చిపొతే వచ్చిన (కారిన ఉప) ద్రవం!!

No comments:

Post a Comment