Monday, May 22, 2023

శ్రీశైలం - మర్చిపోలేని అనుభవం

1979 నెల గుర్తు లేదు. నేనప్పుడు ఎంబీఏ చదువుతున్నాను. మా క్లాస్ లో మేము ఏడుగురం ఒక బ్యాచ్. మమ్మల్ని మేము మాగ్నిఫిసెంట్ సెవెన్ గా (ఆ ప్రఖ్యాత ఇంగ్లీష్ సినిమా చూసారా?!) పిలుచుకునేవాళ్ళం 

మాలో ఒకడు కోటీశ్వరుడు. వాడి దగ్గర ఓ ఫియట్  కారు ఉండేది. అందులో మేము ఏడుగురం చాలా రోడ్ ట్రిప్స్ వెళ్ళాం. ఏడుగురు చిన్న ఫియట్ లో ఎలా పట్టారు అని ఓ సందేహం రావచ్చు మీకు. ఆ రోజుల్లో అందరం సన్నగా వెదురు బొంగుల్లా, చీపురు పుల్లల్లా ఉండేవాళ్ళం లెండి!

ఓ సారి శ్రీశైలం వెళదామని నిర్ణయించుకుని లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు ఆ వచ్చే శనివారం శ్రీశైలం చేరుకున్నాం. ఓ సత్రంలో మకాం. పేరు గుర్తు లేదు. 

పొద్దున్నే టిఫిన్ తిన్నాక దైవ దర్శనానికి అందరం వెళ్ళాం. నేను మట్టుకు గుడి బైట ఉండిపోయా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను దేవుడి గురించి ఆలోచించేవాడిని కాదు. నమ్మకం ఉందా లేదా అంటే కూడా సమాధానం లేదు. అయన మట్టుకు ఆయన ఉంటాడు. నా మట్టుకు నేను అన్న సిద్ధాంతం. మిగిలినవాళ్లంతా వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. 

తర్వాత ఓ గంట భుక్తాయాసంతో సేద తీరి పాతాళ గంగ (అనే గుర్తు! లేక ఇంకేదైనా పేరేమో?) దగ్గరకి వెళ్ళాం. అప్పట్లో అది ఉన్న ప్రదేశం వేరు. డాం కి అవతల ఉండేది. ఇటీవల డాం కి కింద ఓ ప్రదేశాన్ని పాతాళ గంగ అంటున్నారు. 

అక్కడ చాలా పుట్టిలు ఉన్నాయి. వాటిల్లో ప్రజలని ఎక్కించుకుని ఓ రౌండ్ వేసి తీసుకొస్తారు. 


పుట్టి / దొన్నె అంటే ఎలా ఉంటుందో పై ఫొటోలో చూడండి 

సరే మేము ఒక అతనితో బేరం కుదుర్చుకున్నాం. మమ్మల్ని అక్కడినించి డాం దాకా తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి.  

ఆ రోజుల్లో శ్రీశైలం డాం ఇంకా సగం మాత్రమే కట్టారు. రెండు వేపులనించి 25% కట్టారు. అంటే మధ్యలో 50% ఖాళీ. ఈ కృష్ణ నది నీళ్లన్నీ ఆ 50% గ్యాప్ లోంచే ప్రవహిస్తాయి. 

మీకు సులభంగా అర్ధం అవ్వడానికి నేను వేసిన బొమ్మ! Not to scale!

మేము ఏడుగురం నెమ్మదిగా భయపడుతూ భయపడుతూ ఆ పుట్టి ఎక్కాం. చుట్టూ ఒక వలయంలా కూర్చున్నాం. పుట్టిలో మన కాళ్ళ దగ్గర కొంచం నీళ్లు లోపలి వస్తాయి. బైట చేతికి నీళ్లు అందుతాయి. నాకసలే ఈత రాదు. 

అందరినీ కదలకుండా కూర్చోమని ఆర్డర్ వేసాడు పుట్టిడ్రైవర్! ప్రవాహానికి ఎదురుగా కాకుండా డాం వేపు వెళ్తున్నాం కాబట్టి కొంచం వేగంగానే వెళ్తోంది పుట్టి. ఆ డ్రైవర్ చేతిలో ఓ పొడుగాటి వెదురు బొంగు ఉంది. దాంతో అతను పుట్టిని స్టీరింగ్ చేస్తున్నాడు. కొన్ని నిమిషాలు అయ్యాక మా అందరికీ ఓ విషయం అర్ధం అయ్యింది. 

అదేమిటంటే పుట్టి అతని కంట్రోల్ లో లేదు. అతను చేస్తున్నది కేవలం అది నది మధ్యకి వెళ్లకుండా ఆపడం!. అతని ప్రయాస మాకు బాగా తెలుస్తోంది. దాంతో భయం లోపల దాచుకోవడానికి అన్నట్టు అందరం కుళ్ళు జోకులు వేయడం మొదలెట్టాం. 

మీకెవరికైనా ఈత వచ్చా అనడిగా నేను 

నా పక్కనే ఉన్న ఫ్రెండ్ నాకు వచ్చు కానీ ఇంకొకడిని రక్షించలేను అన్నాడు. ముందరి కాళ్ళకి బంధం వేస్తూ !

నేను వదులుతానా? ఏం ఫర్వాలేదు. నూవ్వు ఈత  కొట్టు. నేను నీ నడుం ఉడుం పట్టు పట్టుకుని వదలను. అన్నా

నువ్వలా చేస్తే ఇద్దరం పోతాం అన్నాడు 

నేను రాజులాంటివాడిని. నేనంటూ పొతే నాతొ పాటు ఇంకొంతమంది పోవాల్సిందే అని ఇంకో కుళ్ళు జోకా! 

ఆ రోజుల్లో నా ఒక్కడి దగ్గరే కెమెరా ఉండేది. అన్ని టూర్స్ ఫోటోలు నేనే ఫోటోగ్రాఫర్. 

సరే అంత భయంలో అందరికీ ఫోటోలు  తీసా! నా ఎదురు వాడికి కెమెరా ఇచ్చి నా ఫోటో తీయించుకున్నా. కానీ గమ్మత్తు ఏమిటంటే యిప్పుడు ఎవరి దగ్గరా ఆ దొన్నెలో తీసుకున్న ఫోటోలు లేవు! 

ఒహవేళ మనందరం మునిగిపోయి పొతే ఈ కెమెరా ఎప్పుడైనా ఎవరికైనా దొరికితే మన ఫోటోలు  చూసి అయ్యో పాపం అంటారు అని దాదాపు ఏడుపు మొహంతో అన్నా! కెమెరా మునిగాక ఇంకా ఫొటోలేమిటి? అదంతే లెండి. చావు భయంలో బుర్ర అలాగే అద్భుతంగా పని చేస్తుంది కొంతమందికి!

అప్పటికి మా అందరికీ ఇంకో భయంకరమైన విషయం అర్ధం అయ్యింది. ఏమిటంటే డాం గుఅటూ ఇటూ కొంత కట్టి మధ్యలో వదిలేయడంతో కృష్ణా నది రెండు ఒడ్డుల దగ్గర కొంత మేర నీళ్లు కదలనట్టు కనిపిస్తాయి. కానీ మొత్తం నీరు డాం దగ్గర పడే కొద్దీ కేవలం మధ్యలో  50% గ్యాప్ లో వెళ్లడంతో ఒడ్డు వేపు ఉన్న నీళ్లు కూడా మధ్య ప్రవాహం వేపు అలా వెళ్లిపోతున్నాయి. 

పుట్టి డ్రైవర్ అలా మధ్య  ప్రవాహం  వేపు  వెళ్లకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మా పరిస్థితి త్రిశంకు స్వర్గం! నది మధ్యలో వేగంగా వెళ్తున్న ప్రవాహానికి ఒడ్డు వేపు నిదానంగా వెళ్తున్న ప్రవాహానికి మధ్యలో అటూ  ఇటూ ఊగిసలాడుతున్నాం!

నాకు అప్పుడు ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చింది గంట ముందు గుళ్ళో దర్శనానికి వెళ్లని వాడినైనా! ఓం నమశ్శివాయ అని గొణుక్కుంటూ వణుకుతూ ఉన్నా. 

బహుశా లోగడ ఇలా ఇలాంటి పుట్టిలో నాలా ఈత రాని వాళ్ళు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇలాంటి పుట్టి ఎక్కి నీళ్ళ మధ్యకి వెళ్ళగానే వాళ్ళకి ఈత రాదన్న విషయం గుర్తొచ్చి బ్రహ్మానందంలా "ఆపండిరోయ్" అని అరవబోయి నీళ్ళ మధ్యలో ఆపేస్తే ఇంకా భయంకరం అని తట్టి భయాన్ని, ఏడుపును మింగేసి ఇహ నీవు తప్ప ఇహ పరం బెరుగ అని హఠాత్తుగా కొంతమందిలో  భక్తి పుట్టుకు రావడంతో దీన్ని అప్పటినుంచి పుట్టి అని పిలవడం మొదలెట్టారు అని చరిత్రకారుల అనుమానం! అభిప్రాయం!అంతకు ముందు దీన్ని దొన్నే అనేవారు

ఇప్పుడు ఇదంతా రాస్తూంటేనే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అప్పటి  ఆ భయంకర దృశ్యం కళ్ళ ముందు మెదులుతూంటే!

దాదాపు డాం కి ఒక 150, 200 అడుగుల దూరం వచ్చేసాం. పుట్టి డ్రైవర్ కి చెమటలు పడుతున్నాయి. మా సంగతి అడగొద్దు. మా చెమటలకి కృష్ణా నదిలో వరదలు వచ్చాయా అన్నట్టు పడుతున్నాయి. 

కొంతమందిమి నిర్మొహమాటంగా సిగ్గు వదిలేసి వణకడం మొదలెట్టాం. చావబోతూ ఇంకా సిగ్గేటి? మాటలు బడతడుతున్నాయి. 

అప్పుడు వినిపించాయి కేకలు! యమ  భటుల కేకల్లా లేవే? అక్కడికి అవెలా ఉంటాయో మాకు తెలిసినట్టు!

మరెవరు పెడుతున్నారు ఆ కేకలు?

ఎవరంటే డాం దగ్గర పైన నిలబడి మమ్మల్ని చూసిన కన్స్ట్రక్షన్ ఇంజినీర్లు. పనివాళ్ళు. 

అప్పుడు ఒకరకంగా ఆనందం వేసింది. ఎందుకంటే మేము మునిగిపోతే ఆ విషయం ప్రపంచానికి చెప్పడానికి, తర్వాత  మా శరీరాలు (శవాలు అనడానికి మనసొప్పుకోవడం లేదు!) వెదకడానికి బోల్డు మంది సాక్షులు. హమ్మయ్య! అనాధ మరణం కాదు మాది. 

అప్పటికి డాం కి బాగా దగ్గరకొచ్చేసాం. మా పుట్టి డ్రైవర్ ఇహ వాడు నేర్చుకున్న విద్య అంతా గుర్తు తెచ్చుకుని ఎలా అయితేనేం మమ్మల్ని ఆ మధ్య ప్రవాహం లోకి వెళ్లనివ్వకుండా డాం దగ్గరకి తీసుకొచ్చాడు. 

అక్కడో తుప్పు పట్టిన పడుతున్న ఇనప నిచ్చెన ఉంది పైకి వెళ్ళడానికి. 

మా పుట్టి ఆ నిచ్చెన దగ్గరకి తీసుకొచ్చి ఆపాడు.. 

పైనించి అందరూ కేకలు పెడుతున్నారు "ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కండి. అందరూ ఒక్కసారి ఎక్కితే ఊడిపోతుంది. అని 

కానీ చచ్చి బ్రతికిన వాళ్ళం మేం వింటేనా? చచ్చి బ్రతికితే మరింత తొందరగా చావు ఉండదని ఓ నమ్మకం ఆయే! అందరం ఒక్కసారి నిలపడి ఆ నిచ్చెనని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకున్నాం. మీలో ఎవరన్నా Mad Mad Mad World  సినిమా చూసుంటే క్లైమాక్స్ సీన్ గుర్తు చేసుకోండి! అలా అన్నమాట.  పుట్టి దాదాపు తలకిందులు అయ్యే పరిస్థితి వచ్చింది. 

కానీ ఎవ్వరం నిచ్చెన మీద పట్టు వదల్లేదు. ఒహవేళ నిచ్చెన ఊడిపోతే మళ్ళీ అందరం నీళ్లలో పడ్డా సరే. ఆలా ఓ నిమిషమో,  గంటో సమయం తెలిసి ఛస్తే కదా ఆలా వేళ్లాడాక అందరికీ కాస్త బుర్ర పని చేయడం మొదలు పెట్టింది. దాంతో అందరికంటే ముందు ఎవరు ముందు నిచ్చెన ఎక్కగలరో వాడు ఎక్కి వీర వేగంగా పైకెళ్లిపోయాడు, వాడి తర్వాత ఇంకొకడు. తర్వాత నేను. అలా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పైకెళ్ళాం. అదృష్టం బాగా లేకపోతే ఇంకా పైకి వెళ్ళేవాళ్ళం. 





పై ఫోటోలు చూస్తే మీకు అర్ధం అవుతుంది. డాం దగ్గర పరిస్థితి ఎంత భయంకరంగా, వరద నీరు ఎంత భీభత్సంగా ప్రవహిస్తోందో ఉందొ!

అప్పుడు తిట్టారు చూడండి ఆ ఇంజినీర్లు. 

ముందు పుట్టి డ్రైవర్ ని "నీకు బుద్ధి ఉందా లేదా? కుర్రాళ్ళని వరదలో ఉన్న నదిలో వేసుకొస్తావా? మరీ అంత కక్కుర్థా? "

వార్నీ కృష్ణా నది వరదల్లో ఉందా? ఆ సంగతి తెలిస్తే ఈ సాహసం చేసేవాళ్ళం కాదుగా?

తర్వాత మమ్మల్ని తిట్టారు! "వాడికి బుద్ధి లేకపోతె మీ బుద్ధి ఏమయ్యింది. పైగా అందరూ చదువుకుంటున్న స్టూడెంట్స్. ఇలా ఏడుగురు ఒక పుట్టిలో అదీ వరదల్లో ఎక్కేస్తారా?" 

బ్రతికి బైట పడ్డాం కదా ఇహ వాళ్ళు ఎంత తిట్టుకుంటే మనకేం?

నేను ఉన్న వాడిని ఊరుకోకుండా "సార్ ఇక్కడ ఎంత లోతు ఉంటుంది" అని అడిగా?

800 అడుగులు అన్నారు! నా గుండె అప్పుడు ఆగిపోయింది!

ఓర్నాయనో! 800 అడుగులే? అయినా 4 నాలుగొడుగుల పైన ఎంతున్నా మనకొకటేగా? అయినా 800 అడుగులు టూ అండ్ హాఫ్ మచ్ యార్! (ఇది నా బ్లాగ్ పేరోచ్!)

మేము బ్రతికి బట్ట కట్టేటప్పటికీ టైం నాలుగయింది. వాళ్ళో గంట (ఆలా అనిపించింది లెండి) తిట్టారు. మాక్కూడా వణుకుతున్న కాళ్ళు చేతులు వెరసి మొత్తం ఒళ్ళు స్వాధీనం లోకి రావడానికో గంట పట్టింది. అప్పటికి అయిదయ్యింది. 

పుట్టి (పన్ ఆక్సిడెంటల్!) బుద్ధి ఎరిగాక ఇంత యమగండం నించి  తప్పించుకోవడం ఇది నాకు మూడోసారి!

ఇంత సాహసం చేసామేమో ఇహ చూడండి అప్పుడు  వేసింది ఆకలి. గజ ఆకలి! వీర ఆకలి!! భయంకరమైన ఆకలి! 

అందరం పొలోమని కాళ్ళు ఈడ్చుకుంటూ దగ్గరలో ఉన్న ఒక కాకా హోటల్ దగ్గర కూలబడ్డాం! ముందస్తుగా వాడి హోటల్లో ఉన్నవి, కనిపించినవి అన్నీ తినేసాం. ఏడుగురం కదా. వడలు, పుణుకులు టైపు గ్లాస్ షెల్ఫ్ లో పెట్టినవి అన్నీ లాగించేసాం. 

ఆకలి మీదున్న పులి నరమాంసం రుచి  మరిగితే దాని ఆకలి ఎలా పెరిగిపోతుందో అలా కొంచం తిండి కడుపులోకి వెళ్ళగానే ఆకలి ఇంకా ఎక్కువయ్యిపోయింది. 

అప్పుడు ఆర్డర్ ఇచ్చి దోశలు వేయించుకుని లాగించాం. వాడి దగ్గర ఉన్న పిండి అయ్యిపోయేదాకా. 

అప్పటికి శాంతించాం అందరం. అప్పుడు టైం ఆరున్నర!

ఇక్కడ బస్సు స్టాండ్ ఎక్కడ మేం మా సత్రానికి వెళ్ళాలి అని అడిగితే చివరి బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ రేప్పొద్దున్నే అని చెప్పారు. 

ఓరి దేవుడో! ఇదేటిది? సరే అయితే మాకు తోవ చెప్పండి. మేము నడుచుకుంటూ వెళ్తాము అన్నాం 

వెళ్ళండి వెళ్ళండి ఏ పులో, ఎలుగుబంటో ఎత్తుకుపోతుంది ఒకరిద్దరిని అని నవ్వారు

వార్నీ! మరిప్పుడేటి సేయడం. చేసేదేముంది. ఇక్కడే ఎక్కడో పడుకుని అదే పడుండి పొద్దున్నే ఫస్ట్ బస్సులో వెళ్లడమే 

ఇహ చేసేది  లేక ఆ కాకా హోటల్ వాడిని బ్రతిమాలి బైట రోడ్ మీద నులక మంచాలు బెంచీలు వేయించుకుని వాటిమీద హాయిగా బజ్జున్నాము. 

పొద్దున్న లేచి చూస్తే అందరి చెప్పులు మటుమాయం! హాం ఫట్!

నూకలుంటే ఎంతటి ప్రమాదంలోంచి అయినా బ్రతికి బట్ట కడతాం అన్నదానికి మేమే నిదర్శనం. 

కధ కంచికి. మేము శ్రీశైలం సత్రం మీదుగా మా ఇళ్ళకి. 






 

 


 

2 comments:

  1. 👌🙏
    అలాంటివి చేయాలంటే మహా సరదా, కొంతమందికి 🤣

    ReplyDelete