Tuesday, March 22, 2022

హృదయాన్ని కదిలించే!

నా ఫ్రెండ్ కార్డియాలజిస్ట్ ని ఈ మధ్య కలిసాను.

"ఏంటిలా వచ్చారు? ఏమన్నా ప్రొబ్లేమా?" డాట్రారి పలకరింపు
.
"ఏం లేదు డాట్రారూ! అరవై దాటాయి కదా ఓ పాలి నా గుండె చెక్ చేసుకుందారని"

"తప్పకుండా! మీలా అందరూ ఏ సమస్యా లేకపోయినా ఏడాదికోసారి ఇలా చెక్ చేసుకుంటే ఎంతో మంది చాలా కాలం బ్రతుకుతారు.... ఏమైనా గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందా"

(ఆశ. దోశ. అప్పడం. వడ. సమస్యలున్నప్పుడు వస్తేనే మీకు క్షణం తీరిక, డబ్బులు లెక్కెట్టడానికి టైం లేవు. ఇహ ఏమీ సమస్యలు లేనివాళ్ళు వేస్తే మీకు నిద్ర పోడానికి కూడా టైం దొరకదు. పైగా కరెన్సీ కౌంటింగ్ మెషీన్ కొనుక్కోవాలి. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం! అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చస్తే మీ దగ్గరకు రాం!)

"ఇబ్బందా? భలేవారే! అవసరమైన దానికంటే ఎక్కువ గాలి పీల్చేస్తున్నానేమోనని అనుమానంగా ఉంటేనూ? చూడండి కడుపెంత ఉబ్బిపోయిందో ఇదంతా గాలే" అని గాలి కబురు చెప్పి నా కుళ్ళు జోక్కి నేనే బోల్డు నవ్వేసా.

డాట్రారు కూడా నవ్వారు. ఒకింత ఇబ్బందిగా ఏమోనని చిన్న డౌట్.

సరే ముందస్తుగా చెస్ట్ x-ray తీద్దాం అని తీసేసాడు. మనది 56 ఇంచులు కాకపోయినా ఇంచుమించు అంతే మన చెస్ట్. పైగా x-ray తీస్తుంటే బ్రిటిష్ వాళ్ల ముందు ప్రకాశం పంతులుగారిలా రొమ్ము విరుచుకుని పోజు ఇచ్చా.

సరే ఆ నీళ్ళు కారుతున్న xray తెచ్చి గోడకున్న తెల్లటి ఫ్రేమ్ లో పెట్టి అందులో ఉన్న బుజ్జి ట్యూబ్ లైట్ వేసి ఆ xray మ్యూజియం లో ఉన్న మొనాలీసాలాగా నడుం మీద చెయ్యేసి కొంచం దగ్గరకి వెళ్లి వెనక్కు ఓ అడుగేసి తీక్షణంగా చూడ్డం మొదలెట్టాడు.

కొంపతీసి ఈయనకి చత్వారం కానీ వచ్చిందేవిటి? అలా ముందుకీ వెనక్కి కెమెరాలో జూమ్ లెన్స్ ఫోకస్ చేసినట్టు తిరుగుతున్నాడు.

ఇహ ఉండబట్టలేక అడిగేసా "ఏంటి డాట్రారూ! ఏమన్నా ప్రోబ్లేమా?" అని

లోపాయికారీ నాకో డౌట్. నేను అందరి దగ్గరా చాలా ఖచ్చితంగా ఒక్కరవ్వ కర్కశంగా ఉంటానని లోకాభిప్రాయం. ఈ డాట్రారు నా ఫ్రెండ్ అయినా ఆ లోకులో ఈయన కూడా ఉన్నారు కాబట్టి ఈయనకి కూడా అదే అభిప్రాయం ఉండి నేను హృదయం లేని మనిషిని అని ఇన్నాళ్లు నమ్మి ఇప్పుడు ఈ xray లో గుండ్రాయిలా ఉన్న నా గుండె చూసి బోల్డు షాక్ తిని నాకు ఏం చెప్పాలో తెలీక మీన మేషాలు లెక్కపెడుతున్నాడేమో?

ఓ నిమిషం ఆగి గుమ్మడి లాగా దగ్గక పోయినా అంత భారీ విషాద మొహం పెట్టి కళ్ళజోడు తుడిచి, కుర్చీలో కూలబడి, అదే కూర్చుని "మీ గుండె ఉండాల్సిన చోట లేకుండా ఒకింత పక్కకి కదిలిందేమిటి? నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి కేసు. ఇదే ఫస్ట్ టైం" అని ఆయన చెప్పిన దానికి నేనెంత భయపడి పోతానోనని ఆయన లోపల్లోపల భయపడిపోతూ అన్నాడు

గుండ్రాయి లాంటి మనిషిని, గుండె రాయి చేసుకున్న వాడిని నేనా భయపడ్డం? ఫార్టీ ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఇక్కడ! నేను "తగ్గేదెలే" టైపులో కూల్ గా ఓ చిరునవ్వు చిందించా.

డాట్రారికి టెన్షన్ ఎక్కువయింది.

ఆయన్ని కూల్ చేద్దామని "ఓస్. ఇంతేనా? అలా ఎందుకు జరిగిందో నాకు తెలుసు" అని టీజ్ చేసా. ఇక్కడ "జరిగింది" అన్నమాటకి రెండర్ధాలు ఉన్నాయి అన్నమాట. ఇలా ఒకే వాక్యంలో ఒకే మాటని(ఇక్కడ అన్నమాట) రెండుసార్లు వేర్వేరు అర్థాల్లో వాడడం అనే ప్రక్రియ నా గురువుగారు వేటూరి గారి నుంచి నేర్చుకున్నాను. ఉదా: చుక్కా నవ్వవే. నావకి చుక్కానవ్వవే. ఆబాలగోపాల మాబాలగోపాలుని. అచ్చెరువున అచ్చెరువున. అలా అలా అన్నమాట.

"అదెలా? మీకు ముందే తెలుసా మీ గుండె పక్కకి జరింగిందని" అని సంభ్రమాశ్చర్యపడిపోయాడు డాట్రారు!

"అబ్బే! ఆ విషయం నాకిప్పుడే తెలిసింది" అన్నా

"మరి?" మొహంలో ప్రశ్నార్థకం!

"అది జరిగింది  అని తెలీదు కానీ ఎందుకు జరిగిందో తెలుసు" అని మళ్లీ బ్రేక్ ఇచ్చా. 

(చూసారా? మళ్ళీ ఒకే మాటని రెండర్ధాలతో ఒకే వాక్యాల్లో ప్రయోగం!)

ఈ డాట్టర్లు పేషంట్స్ ని ఇలాగే సస్పెన్స్ లో పెడ్తారుగా? ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది.

"ఎందుకంటారు"

"ఎందుకంటే నా సిక్స్టీ యియర్స్ జీవితంలో ఎన్నో ఎన్నెన్నో హృదయాన్ని కదిలించే సంఘటనలు జరిగాయి! మరి ఆ మాత్రం కదిలిందంటే హాశ్చర్యం ఎంతమాత్రం లేదు నాకు" అని చిదంబర రహస్యం చెప్పా.

ఆయనకి కొంచం భరోసా ఇచ్చా కూడా "మరేం భయం లేదు. ఇంకొన్ని అలా గుండెని కదిలించే సంఘటనలు జరిగితే మళ్లీ అది యధాస్థానానికి వెళ్ళిపోతుంది లెండి. పూజయ్యాక వినాయకుడి విగ్రహం కదిలించి యధాస్థానంలో పెట్టినట్టు" అని ధైర్యం చెప్పా.

పాపం. డాట్రారు మొహంలో బోల్డు కదలికలు.

గమనిక: డాక్టర్ల మీద ఒకింత హాస్యోక్తులు రాసినా వారిని అగౌరవ పరచడం నా ఉద్దేశం కాదు.

డాక్టర్లు లేకపోతే రోగులు బ్రతకరు. రోగుల్లేకపోతే డాక్టర్ల వృత్తి ఉండదు. అంచేత డాక్టర్లు, రోగులు పరస్పర సహ(కార)జీవనం చెయ్యాల్సిందే. చేద్దాం. 

1 comment:

  1. // “ నేను అందరి దగ్గరా చాలా ఖచ్చితంగా ఒక్కరవ్వ కర్కశంగా ఉంటానని లోకాభిప్రాయం. ” //

    నా గురించి కూడా లోకాభిప్రాయం అదే సుమండీ.
    అకారణంగా అపార్థం చేసుకోబడేవాళ్ళల్లో ఉన్నాం మనిద్దరం 😞.
    🙂🙂

    ReplyDelete