Sunday, March 13, 2022

మెడికోలు! ర్యాగింగ్!

 1985.  తిధి, తేదీ, నెల గుర్తులేవు!


ఆ రోజుల్లో నేను సేల్స్ ఉద్యోగం చేసేవాడిని. సేల్స్ అంటే పొద్దున్న  పదింటికి రోడ్డెక్కితే సాయంత్రం 5 తర్వాతే డూటీ దిగడం. అప్పటిదాకా మనిషి రోడ్డున పడ్డాడు


అప్పట్లో ఇప్పట్లా మొబైల్ ఫోన్లు లేవు. అందుకని మనం పొద్దున్న పదింటికి మాయం  అయ్యిపోతే మర్నాడు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేదాకా మనం ఎక్కడికెళ్లాం, ఏం  చేసాం మూడో కంటి వాడికి మనకే తెలుసు. ఏమాటకామాటే. అప్పట్లో జీవితం  చాలా హాయిగా ఉండేది. ఇప్పుడో ఎక్కడున్నావ్ అని బాస్ ఫోన్. సర్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గరున్నానంటే ఓసారి వాడికి ఫోనివ్వు అంటాడు బాస్. ఉత్తదే ఆ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడ్డానికి కాదు. మనం నిజంగా వాడి దగ్గరే ఉన్నామా ఇంకెక్కడన్నానా అని ఓ పరీక్ష. 


సరే ఇంతకీ ఓ రోజు ఏమైందంటే?


నాకు నా బాస్ మీద బాగా కోపం వచ్చింది. కారణం  ఏదైతే ఏం లెండి? అందరికీ  ఎప్పుడో ఒకప్పుడు, ఈ మధ్య అయితే దాదాపు ప్రతి రోజూ బాస్ మీద కోపం వస్తుంది కదా? బాస్ మీద కోపం వస్తే ఆఫీస్ లో ఉన్నా పని  చేసినట్టు నటిస్తాం కానీ ఛస్తే పని  చెయ్యం. అలాంటిది బైట మార్కెట్లో తిరిగే నేనెందుకు పని చేస్తాను? చెయ్యను. అక్కడిదాకా బానే ఉంది. పని చెయ్యకపోతే ఇంకేం చెయ్యాలి. ఇంటికెళ్లి పడుండలేం కదా? ఆ రోజుల్లో ఒక్క దూరదర్శన్  తప్పితే ఇంకే  టీవీ ఛానల్ లేదు. అది కూడా మధ్యాన్నం అంతా యూజీసీ వాళ్ళ పాఠాలు చెప్పేవాళ్ళు. నేను బ్రహ్మచారిని. ఒక్కడినే ఉంటున్నా. అందుకని  ఇంటికెళ్లి ప్రసక్తి లేదు. 


కానీ  రోజంతా ఎలా గడపాలి? ఎలా? ఎలా? ఎలా? ఇరానీ హోటల్లో ఒక టీ, ఖారా బిస్కట్ తింటూ చాలా తీవ్రంగా ఆలోచించాను. అప్పుడు తట్టింది ఓ బ్రహ్మాండమైన ఐడియా! 


అదేమిటంటే ఏదో ఒక నూన్ షో కి చెక్కేయడం! హాయిగా 11 నించీ దాదాపు రెండింటిదాకా కాలక్షేపం. తర్వాత లంచ్ చేసేటప్పటికి రెండున్నర. మూడు. అటు పైన ఓ రెండు గంటలు పని చేసినట్టు నటిస్తే సరి. రోజు అయిపోతుంది. 


ఐడియా బానే  ఉంది కానీ  ఏ  సినిమాకి వెళ్ళాలి? ఈ ప్రశ్న కంటే ముఖ్యమైన ఇంకో ప్రశ్న వేసుకున్నా? ఏ సినిమా థియేటర్ కి వెళ్ళాలి అని. ఇదేమిటి ఏసీ థియేటర్ కావాలంటే చాలా ఉన్నాయిగా ఈ మహా నగరంలో అంటే అది కాదు ఇక్కడ సమస్య. 


మనం వెళ్తున్నది పని ఎగ్గొట్టి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆన్ డ్యూటీ! పొరపాటున సహోద్యోగులైవరైనా మనం  సినిమాకి వెళ్లడం చూస్తే! అసలే సేల్స్ వాళ్ళకి ఆఫీస్ అంతా శత్రువులే! ఎందుకంటే సేల్స్ వాళ్ళు మిగతా కొల్లీగ్స్ దగ్గర పోజులు కొడతారు. మేము ఓ తెగ కష్టపడి, ఎండనక, వాననక రోడ్లు మీద తెగ తిరిగి, చెమటలు కక్కి మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మబట్టి మీ అందరికీ జీతాలొస్తున్నాయి! మరంచేత మేము లేకపోతే సేల్స్ ఉండవు. డబ్బులు రావు. మీకు జీతాలు రావహో అని మొహం మీద అనకపోయినా అందరికీ అర్ధమయ్యేలా పోజులు కొడుతూంటాం. అందుకని అందరికీ  మా మీద పీకల దాకా ఉంటుంది. కసి. ఛాన్స్ దొరికితే  అధః పాతాళానికి తొక్కేయ్యడానికి దేశ సరిహద్దుల్లో సైనికుల్లా ఎవరెడీ. అందుకని కూసింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి!

  

అందుకని మా ఆఫీస్  వాళ్ళు ఎవ్వరూ చుట్టుపక్కల ఉండని, తిరగని ఏరియా చూసుకుని అక్కడున్న థియేటర్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమా చూడాలి. 


అప్పుడు అలాంటి ఏరియా ఏముందబ్బా అని ఇంకో టీ తాగి ఆలోచిస్తే తట్టింది. మొజంజాహి మార్కెట్ లో ఒక  థియేటర్ ఉంది. అక్కడ అయితే  మా ఆఫీస్ వాళ్ళెవ్వరూ తిరిగరు. వెంటనే  బైక్ మీద  ఆఘమేఘాల మీద ఆ థియేటర్ కి వెళ్ళా. దాని పేరు సరిగ్గా గుర్తులేదు. విక్రాంతా? ఏమో?


ఆ థియేటర్లో ఓ చెత్త హిందీ సినిమా ఆడుతోంది. చెత్త  అని చూసాక తెలిసిందనుకోండి! చెత్త సినిమా, నూన్ షో కాబట్టి  టికెట్  దొరికింది. సీట్ ఏం  ఖర్మ  రో మొత్తం ఇమ్మన్నా ఇచ్చేట్టున్నాడు. సరే టికెట్ కొనుక్కుని  లోపలి వెళ్లి ఓ సీట్లో కూలపడ్డా


కాస్సేపయ్యాక సినిమా బోర్ కొట్టడం  మొదలయ్యింది. కానీ బైటికెళ్లి చేసేదేమి లేదు కాబట్టి వీలయ్యినంత సేపు భరిద్దామనుకున్నా


అప్పుడు మొదలయ్యింది!


ఏమిటా? 


ఇంకేమిటి? 


ఓ అమాయక బుగ్గ నొక్కితే పాలు కారే పసివాడి ర్యాగింగ్! ఎవడా పసివాడంటే ఎవడో అయితే నాకేంటి? నేనే?


మిమ్మల్ని ర్యాగింగ్ చేసిందెవరండీ అంటే వాళ్ళు ఆడ రాక్షషులు! 


ఎలా ర్యాగింగ్ మొదలెట్టారంటే నా మీద వీర డైలాగ్స్ వేయడం మొదలెట్టారు! ఎందుకంటే వాళ్ళక్కూడా సినిమా బోర్  కొట్టింది. నా మీద డైలాగ్స్ వేస్తున్నది ఎవర్రా బాబూ  అని ఓసారి ధైర్యం చేసి మీద అతి కొంచం వెనక్కి తిప్పి చూస్తే ఓ ముగ్గురో నాలుగురో మెడికోలు! మెడికోలు అని ఎలా తెలిసిందంటే అందరూ ఆ తెల్ల ఎప్రాన్ వేసుకున్నారు. 


అప్పుడు వెలిగింది నాకు అక్కడికి దగ్గర్లోనే మెడికల్ కాలేజీ ఉందని. నేనాఫీసు ఎగ్గొట్టి సినిమాకొస్తే వాళ్ళు కాలేజీ ఎగ్గొట్టి వచ్చారని. 


కానీ నా ఖర్మ కొద్దీ సినిమా ఎవ్వరినీ ఆకట్టుకోలేదు. ఇహ అందుకని నాతొ ఆడుకోవడం మొదలెట్టారు. బహుశా వాళ్ళ సీనియర్స్  వాళ్ళని ర్యాగింగ్ చేసిన రోజులు గుర్తుకు  తెచ్చుకుని ఆ కసంతా ఇక్కడ కక్కారు


అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజుల్లో నేను దాదాపు అందరు పెళ్లి కానీ అబ్బాయిల్లాగానే బాగా సన్నగా ఉండేవాడిని. 


ఇహ వాళ్ళ  డైలాగ్స్ ఇలా వాళ్ళ మెడికల్ భాషలో  సాగాయి 


"పాపం ఈ అబ్బాయేమిటే ఇంత బక్కగున్నాడు?" - సన్నగా ఉన్నాడనచ్చుగా?


"హిమోగ్లోబిన్ తక్కువయ్యిందేమోనే"


"థైరాయిడ్ ప్రాబ్లెమ్  ఏమో?"


"మరీ ఎనీమిక్ గా ఉన్నాడు గట్టిగా గాలేస్తే ఎగిరిపోతాడో ఏమిటో"


"బహుశా ఈ మధ్యే టీబీ వచ్చిందేమో"


"లేదే? టీబీ తిరగపెట్టిందేమో"


నాకేమో విపరీతమైన కోపం వచ్చేస్తోంది. కానీ  ఏం చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే నేను సింహంలా సింగిల్! కానీ కొంచం తిండి దొరకని సన్నటి సింహం! వాళ్లేమో నలుగురు ఆడ  తోడేళ్ళు! డైలాగ్స్ తో  నా ప్రాణం తోడేస్తున్నారు!


ఇంకా ఇలాంటివే నాకు తెలీని, ఇప్పుడు గుర్తులేని బోల్డు మెడికల్ మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపుకు  తిన్నారు. 


ఇహ వాళ్ళ బాధ పడలేక లేచి దూరంగా ఇంకో  సీట్లో కూర్చుందామని లేచాను. కానీ  షర్ట్ సీట్ కి అతుక్కుని కొంచం విసిగించింది. గట్టిగా లేచేటప్పటికి వచ్చింది. ఇంటికొచ్చాక అర్ధమయ్యింది. సీట్ కి చూయింగ్ గం  అతికించారని. వాళ్ళు చేసిన పనో అంతకుముందు షో లో కూర్చున్నవాళ్ళు చేసిందో తెలీదు


నేను లేవగానే  డైలాగ్స్ ఆగలేదు!


"పాపం మన మాటలకి ఫీల్ అయ్యినట్టున్నాడే"


"స్కెలిటన్స్ కి ఫీలింగ్స్ ఉంటాయంటే"


"ఉంటాయే! ఇప్పుడు చూస్తున్నాం కదా"


నేను లేచిన వాడిని వెళ్లి వాళ్ళకి దూరంగా ఆరు వరసల అవతల వాళ్ళ వెనక వరసలో కూర్చున్నా. సినిమా నించి వాక్ అవుట్ చేద్దామనుకున్నా కానీ రెండు కారణాలు. 


ఒకటి వెళ్లి ఏం  చెయ్యాలి. అస్సయ్యాంగా పని చెయ్యాలి. పనెగ్గొడదామని కదా సినిమాకొచ్చింది. పైగా ఇప్పుడు మూడ్ ఇంకా పాడయ్యిపోయింది. 


ఇంటర్వెల్ లో వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇహ  ఏ నిమిషంలో  అయినా ఇంటర్వెల్ ఇస్తాడని టైం చూసుకుని ఆ చీకట్లోనే బైటికి వెళ్ళిపోయా. ఎందుకంటే ఇంటర్వెల్ లో బైటికెళ్తే నా మొహం ఆ సుందరులు చూసేడుస్తారుగా? మళ్ళీ అదో అవమానం. రేప్పొద్దున్న బైటెక్కడన్నా కనిపిస్తే! 


ఇంకా విధి వెక్కిరిస్తే, వక్రిస్తే నేను మ్యారేజ్ లుకింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ సంబంధం వీళ్లల్లో ఎవరిదైనా అయితే? వామ్మో! ఇంకేమైనా ఉందా?


అందుకని వెంటనే ఓ గంట సినిమా అయ్యాక లేచి వెళ్తూ  వెళ్తూ వాళ్ళ వరస దగ్గరికొచ్చాక వాళ్ళకి వినిపించేట్టు "మీ అందరికీ మాయాస్థానియా గ్రేవీస్ ఉన్నట్టుంది" అనేసి తుర్రుమన్నా. 


ఈ Myasthenia gravis ఏంటండీ బాబూ అంటే - అప్పటికి రెండేళ్ళ ముందు 1983 లో కూలీ సినిమా షూటింగ్ లో అమితాబ్ కి దెబ్బ  తగిలి కొన్ని నెలలు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్ లో ఉన్నారు. అప్పుడు చివరికి  డాక్టర్స్ ఆయనకీ వచ్చిన  జబ్బేమిటంటే Myasthenia gravis అన్నారు. అందుకని ఆ పేరు నాకు బాగా గుర్తున్న ఓ పెద్ద  జబ్బు పేరు. వాళ్ళు మెడికోలు కాబట్టి నన్ను మెడికల్ టర్మ్స్ తో నానా మాటలన్నారు కాబట్టి అలా ఓ 50 గ్రాముల కసి తీర్చుకున్నా వాళ్ళ మెడికల్ భాషలోనే ఓ పెద్ద  జబ్బు పేరుతొ! అంతకు మించి ఆ వ్యాధి  లక్షణాలు నాకు తెలీవు!


బైటికొచ్చాక మయసభలో దుర్యోధనుడి ఫీలింగ్స్! హేంత హవమానం! ఆ బాధ  తట్టుకోలేక ఏదైనా బార్ కి వెళ్లి ఓ బీర్ కొట్టేద్దామనుకున్నా!


కానీ కొట్టలేదు! మళ్ళీ  రెండు కారణాలు. ఈ ఏరియాలో  అయితే మా సహోద్యోగులు ఉండరు కానీ ఇక్కడ దరిదాపుల్లో బార్ లేదు. బార్లుండే ప్రదేశాల్లో ఉండే  అవకాశం ఎక్కువ! రెండో కారణం ఏంటంటే పనెగ్గొట్టి సినిమాకి వెళ్తే చిన్న తప్పు. ఏదో జరిమానాతో  పోతుంది. కానీ ఆన్  డ్యూటీ మందు కొడితే ఉద్యోగం ఊడే ప్రమాదం ఉంది! అందుకని నేను కూడా దుర్యోధనుడిలా ఏమి  తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు


ఇవాళ నా  టైం  బాలేదు అని సరిపెట్టుకున్నా 


కానీ ఓ డెసిషన్ తీసుకున్నా. ఇహ ముందు ఇలా ఒంటరిగా సినిమాకెళ్తే మట్టుకు చుట్టుపక్కల ఉమెన్స్ కాలేజీలు, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఉండని ఏరియాలో ఉన్న థియేటర్ కే వెళ్లాలని!


కానీ తర్వాత మళ్ళీ 3 దశాబ్దాలు ఒక్కడినే సినిమాకి వెళ్ళలేదు!


కట్  చేసి ఓ ఆరేళ్ళు  వెనక్కెళ్తే ఆ మధ్య  మళ్ళీ నా మీద, నా వ్యాపారం మీద, ఈ సమాజంమీద బాగా కోపమొచ్చి మళ్ళీ ఆఫీస్ ఎగ్గొట్టి ఓ రోజు మధ్యాహ్నం ఒక్కడినే మ్యాటినీకి వెళ్ళాను. మా ఇంటికి దగ్గర్లోనే ఉన్న టివోలికి. ఇంగ్లీష్  సినిమా! మార్స్  అనుకుంటా పేరు. ఒక ఆస్ట్రోనాట్ మార్స్ మీద ఉండిపోతాడు. మిగతా వాళ్ళు వాడొక్కడిని వదిలేసి వెళ్ళిపోతారు. హీరో పాపం మళ్ళీ నాసా వాళ్ళు ఇంకో రెస్క్యూ రాకెట్ పంపేదాకా అక్కడే మొక్కలు పెంచుకుని తింటూ కాలక్షేపం చేస్తూంటాడు. 


ఇప్పుడు మేటర్ ఆ సినిమా కధ కాదు


నేను సినిమా సీరియస్ గా చూస్తూంటే చుట్టూ డాల్బీ  డిజిటల్  సరౌండ్ సిస్టం టైపులో ఇకఇకలు. పకపకలు. ఏమిటని తేరిపారా చూస్తే అర్ధమయ్యింది. ఈ సిటీలో యువతరం మాటినీ షో కి సినిమా చూడ్డానికి రారు. సినిమా థియేటర్ లో సినిమా  వేషాలెయ్యడానికని! సినిమాకి సెన్సార్ ఉంటుంది కానీ వీళ్ళ సినిమా వేషాలకి ఉండదుగా 


థియేటర్ మొత్తం  యువ జంటలే! పెళ్లి కాని జంటలేనండోయ్! వాళ్లకి పెళ్లి  కాలేదని ఆ థియేటర్ చీకట్లో మీకెలా తెలిసిందంటారా? ఒక చిన్న లాజిక్ ఉంది. జో ఘర్ మీ కర్తా ఓ బాహర్ నహి కర్తా! జో బాహర్ కర్తా ఉస్కో ఘర్ నహి రెహ్తా (ఇలా వేషాలెయ్యడానికి!)! సినిమా మొదలవ్వగానే ఇంకేముంది థియేటర్ అంతా చీకటి. తెర మీద సినిమా. థియేటర్ అంత బోల్డు మినీ సినిమాలు! 


నేను అనే ఓ పెద్ద మనిషిని ఉన్నానన్న భయం, బెదురూ కూడా లేవు. 


ఇంకేముంది. షరా మామూలే! నేను ఇంటర్వెల్ లో వాకౌట్! 


సివరాకరికి నాకర్ధమయ్యింది ఏమిటంటే మన దేశానికి నిజ స్వాతంత్రం రాలేదని. ఎందుకంటే ఓ మహానుభావుడన్నాడు "ఎప్పుడైతే మన దేశంలో ఒక మగాడు ఒంటరిగా సినిమాకి వెళ్లగలిగిన నాదే నిజమైన స్వాతంత్రం వఛ్చినట్టు"


ముఖ్య గమనిక: ఈ రెండూ సంఘటనలూ నిజంగా జరిగినవే! కాకపొతే  సినిమాటిక్ లిబర్టీస్ అని రచయితలకి ఉంటాయి. కాబట్టి చిటికంత జరిగితే చిలవలు పలవలు చేసి టీవీ చానెల్స్ వాళ్ళల్లా గుప్పెడంత రాస్తా! 


ఇంకోటి నేనెప్పుడూ ఆడపిల్లలని ర్యాగింగ్ చెయ్యలేదు. ఏదో  1 to 1 సరదా కామెంట్స్ చాలాసార్లు చేసాను. గ్రూప్ లో ఉన్నప్పుడు అంటే నేను ముగ్గురు నలుగురు అబ్బాయిలతో  ఉన్నప్పుడు ఎవరైనా ఒంటరి ఆడపిల్లని ఎప్పుడూ  కామెంట్స్ చెయ్యలేదు. ఏడిపించలేదు.


ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ఇలా రాస్తున్నానని నేనేదో పెద్ద prude అని పొరపాటు పడకండి. ఇప్పుడు నేను యువకుడిగా ఉంటే ఈ యువతరం కంటే ఎక్కువగా, ఘోరంగా ప్రవర్తించేవాడిని. మా రోజుల్లో మాకిప్పుడున్న అవకాశాలు, సదుపాయాలు లేవు కాబట్టి అందరం పతివ్రతలమే అప్పుడు

2 comments:

  1. ఒక సంఘటనని జనరంజకం గా వ్రాసి చెప్పడం లో మీరు సూపర్ సార్..
    చాలా బాగుంది.. 👌👌🙏

    ReplyDelete