Friday, May 24, 2019

మార్చురీ మేధావులు!

మార్చురీ మేధావులు!

ఆపండ్రోయ్! సచ్చిపోతున్నాం ఊపిరాడక!

సస్తన్నాం ఎడతెరిపి లేకుండా మీరంతా మా మీదకి వదిలిన ఎన్నికల విశ్లేషణలు చదవలేక.

మీకు బాబుగారు అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారో తెలుసు!
జగన్ కి ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు ఎలా వచ్చాయో తెలుసు!
తెరాస కి లోక్ సభలో ఎందుకు వాళ్ళనుకున్నన్ని సీట్లు రాలేదో తెలుసు!
అన్నట్టు మర్సేపోయా. కళ్యాణ్ బాబు (మాలాంటి సామాన్యులు పవన్ అనో, PK  అనో, లేకపోతె మరీ గంభీరంగా పవన్ కళ్యాణ్ అనో అంటాము. మీరిలా కళ్యాణ్ బాబు అని పిలిస్తే మీరు ఇండస్ట్రీ ఇన్సైడర్ అని మేమంతా ఫీల్ అవ్వాలని మీ ఎదవ ఫీలింగ్!) అంత ఘోర పరాజయం పొందాడో మీకేగా తెలుసు!
దేశమంతా మోడీ వేవ్ ఎందుకు వచ్చిందో తెలుసు!

లోపాయికారీ మనలో మన మాట! ఇన్నీ మీకు ముందే తెలిస్తే ఫలితాలు రావడానికి ముందే చెప్పి మా అందరికీ చెప్పి జ్ఞానోదయం చేసి మీ మేధావిత్వం  విశ్వరూపం చూపించచ్చుగా?

అవునూ మీకు సర్వంబొచ్చు కదా? ఓ పని సెయ్యరాదూ? 2024 లో మీ మేధావి అపార విశ్లేషకులంతా కలిపి ఓ పార్టీ పెట్టి రాష్ట్రాలని, దేశాన్ని ఊడ్చిపారేస్తే  ( మీ భాషలో స్వీప్!) ఓ పనయ్యిపోతుందిగా? ఆ పని మీదుండరాదూ?

అసలు నాకు తెలీకడుగుతా .. హీనపక్షం మునిసిపాలిటీ ఎన్నికల్లో నిలపడరు. అధమపక్షం మీరుండే అపార్ట్మెంట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చెయ్యరు. కానీ 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్లకి తెలీని ఎన్నో విషయాలు మనకి కరతలామలకం.

పోనీ మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ లో ఎన్నికలకి పోటీ చెయ్యడం మాట అటుంచు. అందరూ నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం అంటే అమ్మో! బోల్డు పనులు చెయ్యాలి! నేనసలే చాలా బిజీ! నావల్ల కాదని పక్కకి తప్పుకుంటావే? మరి ఇక్కడ, టీవీ ఛానెళ్ల లోనూ  ఇంత సుదీర్ఘ, అనంత, విశేష, విపరీత భయంకర విశ్లేషణకి అంత టైం ఎక్కడి నించి వస్తుందో?

మీరంతా నిజానికి మార్చురీ మేధావులు! అంతా  అయిపోయాక ఊపుకుంటూ వచ్చి, ఓ ఊగిపోతూ మీ పోస్ట్ మోర్టమ్ విశ్లేషణలతో మమ్మల్ని విసిగిస్తారు.

ఏమిటో? ఎదవ నస.

No comments:

Post a Comment