Friday, May 3, 2019

"నిత్యం ఏకాంత క్షణమే అడిగా" ! నా వెర్షన్

నిన్న సాయంత్రం నా గురువుగారు వేటూరి గారు రచించిన !పాట విన్నాను . నేను వేటూరి గారికి ఏకలవ్య అభిమానిని! అదేమిటి ఏకలవ్య శిష్యుడు అనాలి కదా అని మీకు ఓ సందేహం వస్తుంది. వారికి శిష్యుడు అయ్యేంత జ్ఞానం కూడా లేదు కాబట్టి కేవలం అభిమానిగా మిగిలిపోయాను. ఇక మరి "ఏకలవ్య" అని ఎందుకు రాసావు అంటే వారికి నేను అభిమానిని అని వారికి తెలీదు కదా అందుకని!

ఇహ విషయం ఏమిటంటే నిన్న ఆ పాట ఇంటికొస్తున్నప్పుడు విని ఇంటికొచ్చి కాసేపయ్యాక నాకు విపరీతమైన మూడ్ వచ్చేసి నేను కూడా అలాంటి కాన్సెప్ట్ తో రాసెయ్యడానికి ప్రయత్నించాను.

మీకు ఒక సీక్రెట్ చెప్తాను. నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పటినించి సినిమా పాటలు రాయడం చాలా సులభం అన్న ఓ దురభిప్రాయంతో చాలాసార్లు నేను కూడా పాటలు రాయడానికి ప్రయత్నించాను. కానీ సక్సెఫుల్ గా ఫెయిల్ అయ్యిపోయాను. ఎందుకంటే పాటలు రాయడం పదాల, సమాసాల గారడీ అనుకుంటే అది ఓ పేరడీ అవుతుందేమో కానీ ఓ పాట అవ్వదు. కొన్నిసార్లు విఫలమయ్యాక అర్ధం అయ్యింది ఎందుకు ఫెయిల్ అవుతున్నానో. ఎందుకంటే పాట రాసేముందు ఒక కాన్సెప్ట్ / అవుట్ లైన్ ఉండాలి. అప్పుడు రాయడం ఒకింత సులభం అవుతుంది. లేదంటే ఒక్క మాట కూడా ముందుకు కదలదు!

అసలు సినిమా పాటలు ఎలా రాస్తారు అని నాకు తెలిసిన ఒకే ఒక సినీ గేయ రచయిత Chaitanya Prasad  గారిని అడుగుదామనుకుంటూనే అలా రోజులు గడిచిపోతున్నాయి. భయపడకండి. నేను సినిమా పాటలు రాయదలుచుకోలేదు. అది నా వల్ల కాని పని. నాకు చేతనైనది ఇలా పోసుకోలు కబుర్లు, ఊసుపోక ఊసులు రాయడం. చెప్పడం. ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు.

ఈ "నిత్యం ఏకాంత క్షణమే అడిగా" పాటలో బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ఉంది! అది ఏమిటి అంటే ఎవరికైనా ఉండే అభూత కోరికలు. అంటే ఎప్పటికి, ఎప్పుడో కానీ జరగనివి. నేను ఆ కాన్సెప్ట్ పట్టుకుని రాయడం మొదలెట్టా. అంతే బోల్డు వాక్యాలు 5 నిమిషాల్లో వచ్చాయి! కొన్ని "అతి" ఉన్నాయనుకోండి

పిడకలవేట: ఈ పాట ఆసాంతం వేటూరిగారి ఒరిజినల్ కాదు! తమిళంలో వైరముత్తు గారు రాసిన పాటకి స్వేఛ్చానువాదం. ఒకింత సొంత సాహిత్యం! యూట్యూబ్ భాషలో చెప్పాలంటే అవాక్కయ్యారా? అవ్వండి. ఆ సంబ్రమాశ్చర్యాల నించి తేరుకున్నాక తీరిగ్గా, తీరుబడిగా మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి. http://swaraalapallaki.blogspot.com/2017/05/20.html.

ఇహ నే రాసిన నాలుగు వాక్యాలు!

జీవితమంతా యవ్వనమడిగా
యవ్వనమంత జీవితమడిగా
చెలిమి చేసే చెలినే అడిగా
చెలియలాంటి ప్రియురాలిని అడిగా
మన్మధ బాణం ఇమ్మని అడిగా
ఎన్నడు పగలని హృదయం అడిగా
ఎప్పుడు అలియని శరీరమడిగా
దుమ్ము లేపే దమ్మే అడిగా
ఇంద్రధనుస్సుకి బాణాలడిగా
ముత్యాల్లాంటి పిల్లలనడిగా
ఆ పిల్లలలాంటి ఆణిముత్యాలడిగా
ఎండాకాలం వానలనడిగా
వానాకాలం ఎండా వానల నడిగా
నిఘంటువులో లేని పదాలనడిగా
ఆ పదాలకి పరమార్ధం అడిగా
ఎవ్వరు నడవని బాటే అడిగా
పెదవి దాటని మాటే అడిగా
అక్షయ పాత్రని అరువే అడిగా
పాశుపతాస్త్రం చూపించమనడిగా
పారిజాతం విత్తనమడిగా
కామధేనువు దూడని అడిగా

PS: పెద్దలు ఆ చివరి రెండు వాక్యాలు గురించి ఆగ్రహించి శపించకండి! ముందే చెప్పా! కొంచం "అతి" ఉందని

రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఇంకా పొడిగించి నేను సైతం ఓ 80 వాక్యాలు చెయ్యదలిచాను.

No comments:

Post a Comment