నా కాలేజ్ జీవితం అంతా గుంటూరు లో వెలగపెట్టాను. ఆ రోజుల్లో దసరా సెలవులకి , వేసవి సెలవులకి విజయవాడ కి వెళ్లి అక్కడున్న ఫ్రెండ్ తో ఒకటో, రెండో రోజులు గడపడం అలవాటయ్యింది . అలా వేసంకాలంలో వెళ్ళినప్పుడు పాపం కృష్ణా నదిలో నీళ్లు బొత్తిగా ఉండేవి కావు .. బ్రిడ్జి కి ఇవతలి వేపు అనుకోండి!! అప్పుడు నేను నా ఫ్రెండ్ ఎంచక్కా కృష్ణలో ఈ చివరి నించి నడుచుకుంటూ ఆ చివరికి వెళ్లి, కాళ్ళు నొప్పెట్టి కూసింత సేపు రెస్ట్ తీసుకొని, సొల్లు కబుర్లు అన్నీ అయ్యాక (అంటే పెద్దయ్యాక ఏ ఉద్యోగం రాకపోతే వేసంకాలంలో అటు చివర పల్లీలు అమ్ముకుంటే మాలాగా ఇలా వాహ్యాళికి వచ్చే వాళ్లకి అమ్మి బాగానే సంపాదించచ్చు లాంటి ఆలోచనలు అన్నమాట!) మళ్లీ ఈ చివరికి నడుచుకుంటూ వఛ్చి ఒక పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం . నిజానికి అది ఘనకార్యమే! మీలో ఎంతమంది అలా ఏ నదిలోనైనా అడ్డంగా నడిచారు ?! చాలా కొద్ధిమందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం అది.
పైన రాసింది పీఠిక (అంటే కరెక్ట్ అర్ధం తెలీదు కాని బహుశ నేను అనుకున్నఅర్ధమే అయ్యుంటుందని ప్రగాఢ విశ్వాసం!)
ఇహ అసలు విషయంలోకి వస్తే
అలా నా కాలేజీ ప్రహశనం అయ్యిన వెంటనే రెండో వారానికి హైదరాబాద్ వచ్చాను. ఎందుకు? షరా మామూలే! కూటికోసం! కూలి కోసం!!
వచ్చిన కొత్తల్లో నాకు ఈ హుస్సేన్సాగర్ భలే గమ్మత్తుగా అనిపించేది. ఊరి మద్యని కొలనులా! ఆ రోజుల్లో ఈ నగరం పేరుకే నగరం కాని సాయంత్రం పూట కాసీపు తిరగడానికికాని, చూడ్డానికి కాని ఏమి ఉండేవి కావు. ఇదిగో ఈ సాగరం, దాని ఒడ్డు ట్యాంక్ బండ్ తప్ప!! ఆదివారాల్లో అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఈ ట్యాంక్ బండ్ మీద కాసీపు తిరిగి కాళ్ళు పీకాక కూర్చోడానికి బెంచ్ కోసం చూసేవాళ్ళం! పెద్ద బెంచ్ మీద కొత్తగా పెళ్ళైన జంటలు ఓ మూల కూర్చొని కిచకిచలాడుతూ కనిపించేవాళ్ళు. ప్రేమికులు ఆ రోజుల్లో అంత బహిరంగంగా తిరిగే వాళ్ళు కాదు. ఏ చెట్టు చాటునో, పొదల మాటునో సెటిల్ అయిపోయేవాళ్ళు! ఈ బెంచ్ మీదున్న జంటలు ఎప్పటికీ లేచిపోరే (ద్వందార్ధం దురదృష్టం!) ఎంతసేపు మేమలా నిలువు జీతం. ఇహ లాభం లేదని బెంచ్ ఒక చివర ఒకళ్ళం కూర్చునేవాళ్ళం. మిగతా వాళ్ళం వాడికి ఎదురుగా ఆ రైలింగ్ ఆనుకొని తెగ కబుర్లు, జోకులు, నవ్వులు. కావాలని బాగా ఓవర్మా ఆక్షన్ చేసేవాళ్ళం. మా బాధ పడలేక, చూడలేక, భరించలేక ఆ కొత్త జంటలు అయిదు నిమిషాలు తిరక్కుండా లేచిపోయేవాళ్ళు!! అరబ్బీవాడు, ఒంటె కధ టైపులో మా Mission accomplished ;)
అలా సొల్లు వాగుతున్నప్పుడు ముందు ముందు జీవితం వెండితెర మీద ఎలా ఉంటుందో , ఎవరికి ఏ ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు పెళ్లిళ్లు అయ్యి మేము కూడా ఇలా ఈ బెంచ్ మీద కూర్చుంటామో, ఇలాంటి అంతులేని జవాబు తెలీని ప్రశ్నలు అన్నీ చర్చించేవాళ్ళం! మాకు పెళ్ళయ్యి ఇలా బెంచ్ మీద కూర్చున్నప్పుడు, మాలాంటి కుర్రకారు మా స్ట్రాటజీ ఉపయోగిస్తే మట్టుకు చస్తే లేవకూడదు అని కూడా ఒక సామూహిక నిర్ణయం తీసుకున్నాం!
ఇంతకీ అలా ఆ బెంచ్ మీద సెటిల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు నాకు నా కాలేజ్ రోజుల అలవాటు గుర్తొచ్చి ఓ చిలిపి ఆలోచన వచ్ఛేది . ఈ హుస్సేన్సాగర్ లోతు ఎంత ఉంటుంది . నీళ్లన్నీ ఎండిపోతే కింద ఎలా ఉంటుంది . ఎప్పుడైనా అలా నీళ్లన్నీ ఎండిపోతే ఎంచక్కా ఈ చివరినించి ఆ చివరికి వాకింగ్ చేస్తే మజా వస్తుంది కదా అని ! కానీ అన్ని నీళ్లు ఎప్పుడు ఎండాలి ? నా చిన్ని కోరిక ఎప్పుడు తీరాలి ? సో ఆ కోరిక నా తీరని కోరికల లిస్టు లో అగ్రతాంబూలం పుచ్చుకుంది.
ఇప్పటిదాకా ఇది ఉపోద్ఘాతమే!!
ఇహ మరికొంచం ముందుకి అంటే ఓ రెండేళ్ల క్రితానికి వస్తే కేసీర్ గారికి కూడా నాలాంటి కోరిక ఉన్నట్టుంది ! ఒక్కసారి సడెన్ గా హుస్సేన్సాగర్ నీళ్లు మొత్తం ఖాళీ చెయ్యిస్తానని ప్రకటించారు! ఆ రోజు చూడాలి నా మొహం! నా మొహంలో దాచినా దాగని ఆనందం!! మనమేదో అనుకుంటాం కానీ నిజంగా మనకి నిస్వార్ధ మైన చిన్ని చిన్ని కోరికలుంటే అవి ఎప్పటికైనా తీరుతాయి! ఆహా నా కల ఇన్నాళ్ళకి, ఎన్నేళ్ళకి తీరబోతోంది . ఆ వార్త చదివిన వెంటనే ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఓ రెండు నిమిషాలు gangnam డాన్స్ కూడా చేసాను. ఎంచక్కా ఆ నీళ్లన్నీ తోడేశాక హాయిగా పురప్రజలం అందరం సాయంత్రం పూట అందులో అటూ, ఇటూ వాకింగ్ చేస్తూంటే రెండు కళ్ళూ చాలవు చూడ్డానికి .
నీళ్లన్నీ తీసాక అందులో ఇంకేమి నిధి నిక్షేపాలు బైట పడతాయో ? ఆస్తి పంజరాలు, మోటార్ సైకిళ్లు, కార్లు వగైరా కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ;)
నీళ్లన్నీ తీసాక అందులో ఇంకేమి నిధి నిక్షేపాలు బైట పడతాయో ? ఆస్తి పంజరాలు, మోటార్ సైకిళ్లు, కార్లు వగైరా కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ;)
ఆ వార్త చదివిన దగ్గర్నించీ ఇప్పటిదాకా ఒక ఏణ్ణర్ధం నించీ కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తున్నా! అబ్బే. ఆ నీళ్లు ఖాళీ చేసే ప్రయత్నాలు అసలు మొదలెడితేగా ? ఓ వందమందిని పెట్టి బకెట్ లతో ఖాళీ చేయించినా ఈపాటికి సగం నీళ్ళు ఖాళీ అయ్యేవి. అసలు ఖాళీ చెయ్యడం మాట పక్కన పెట్టి, ఆ మురికి నీళ్లని క్లీన్ చెయ్యడం కోసం కొత్త మెషిన్ ఒకటి తెప్పించారు . నాకు అర్ధం కానిది ఒకటే. ఎలాగూ మొత్తం నీళ్లన్నీ ఖాళీ చేస్తామన్నారు కదా మళ్లీ ఈ లోపల ఆ పారబోసే నీళ్ళని బోల్డు డబ్బులు ఖర్చు పెట్టి శుద్ధి చెయ్యడం ఎందుకో ?! అయినా సామాన్య ప్రజలకి ఇలాంటి క్లిష్టమైన విషయాలు ఎలా అర్ధం అవుతాయి? ఇందులో ఏదో మనం అర్ధం చేసుకోలేని మర్మం ఉండే ఉంటుంది.
అయినా నాకిప్పుడు ఆ మాయ, మర్మం అవేమీ అఖ్ఖర లేదు. నేనెప్పుడో మర్చిపోయిన నా చిన్ని కల, కోరికని మళ్లీ రేకెత్తించారు!! నాలో లేనిపోని ఆశలు కల్పించారు. అంతలోనే దానిమీద ఆ హుస్సైన్సాగర్ నీళ్ళు పోసి ఆర్పేశారు! ఐ హర్టెడ్ .
నాక్కావలసిందల్లా మన హుస్సేన్సాగర్ ని ఎప్పుడు ఖాళీ చేస్తారు ?
నేను అందులో ఆ చివరినించి ఈ చివరికి నడిచి, మధ్యలో బుద్ధుడి దగ్గర పిట్ స్టాప్ వేసి నా వెనకాల ఆయన కనిపించేట్టు సెల్ఫీ ఎప్పుడు తీసుకుంటాను?
లేదా ఈ నీళ్లు ఖాళీ చేసే పధకానికి నీళ్లు వదులుకోవాల్సిందేనా ?
నోట్! షరా మామూలే! ఈ బేతాళ ప్రశ్నలకి సమాధానం తెలియకపోయినా, తెలిసి చెప్పకపోయినా, ఏమీ కాదు!
ఇలాంటి జవాబు లేని, తెలీని, ఎవర్నీ అడగలేని ప్రశ్నలు ప్రజల దగ్గర ఎన్నో? ఎన్నెన్నో?
ఇలాంటి జవాబు లేని, తెలీని, ఎవర్నీ అడగలేని ప్రశ్నలు ప్రజల దగ్గర ఎన్నో? ఎన్నెన్నో?
:)
ReplyDelete