తపోభంగం!!
సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న 2: ఇలా జింక చర్మం మీద కూర్చొని తపస్సు (ఈ రోజుల్లో మెడిటేషన్!) చెయ్యడం మన భారద్దేశంలో కనీసం ఒక 5 వేల సంవత్సరాల సాంప్రదాయం అని నాలాంటి వాడెవరైనా ఇప్పుడు ఒక చిన్న జింక చర్మం ఇంట్లో పెట్టుకున్నాననుకోండి నా మీద కూడా సల్మాన్ ఖాన్ మీదెట్టినట్టు కేసు పెడతారా ? ఇదెక్కడి అన్యాయం ?! నేను మన సనాతన , పురాతన సంస్కృతి ని ఎలా కాపాడాలి?! ఎలా? ఎలా? ఎలా?!!
నేనిలా మూడుసార్లు "ఎలా " అని అడిగానని మీరు మీ జవాబు మూడు సార్లు రాయనవసరం లేదు ;)
మొన్న
పొద్దున్నే 5 గంటలకి లేచాను. పొద్దున్నే లేస్తే ఏం చెయ్యాలో తోచక ఏదోఒక
వెధవ పని చెయ్యాలనిపిస్తుంది చాలామందికి. నేను కూడా ఆ మందిలో గోవిందా!
ఏం
చెయ్యాలో మాంఛి ఫిల్టర్ కాఫీ తాగితే తడుతుంది అని వెంటనే ఫిల్టర్
వేసేశాను. నేను పొద్దున్నే లేచానని పాల వాడు లేవడు కదా పాలు రాలేదు.
మనింట్లోనే ఆవుంటే ఈ కష్టాలుండవుకదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు
పితికేసుకోవచ్చు! దీన్నే ATM అంటారు అంటే Any Time Milk ;)
తాజా
పాలు, తాజా డికాక్షన్ అయితే కాఫీ ఉత్తమం! నిన్నటి పాలు, నిన్నటి
డికాక్షన్ అయితే మధ్యమం. కాని నేను తాగింది అధమం.
నిన్నటి పాలు, నేటి తాజా డికాక్షన్ తో ఒక రకమైన కాఫీ!! రుచి అడగద్దు. రెండు
రకాలుగా ఉంది. కాని పొద్దున్నే కాఫీ తాగకపోతే బండి స్టార్ట్ అవ్వదు కదా. ఈ
సమస్యకి ఒకటే పరిష్కారం. పాలొచ్చే దాకా లేవకపోవడమే!
మొత్తానికి
అదో టైపు కాఫీ తాగాక ఏం చెయ్యాలనే ఐడియా కోసం ఆలోచించడం మొదలెట్టా. అప్పుడో ఐడియా తట్టింది . ఏం చెయ్యాలని కాదు. ఏం చెయ్యాలన్న ఆలోచన ఏం చేస్తే సులభంగా వస్తుంది అన్న ఐడియా! బైట చిన్న తుంపర
పడుతోంది. బాల్కనీ చివర ఓ కుర్చీ వేసుకొని ఆ తుంపరలో మెడిటేషన్ చేస్తే ఎలా
ఉంటుంది? అని. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే వచ్చేవన్నీ ఆలోచనలే కదా :( పైగా పూర్వం మునులు ఆరుబైట చెట్లకింద అడవుల్లో తపస్సు
చేసుకొనేవాళ్ళు కదా. వాళ్ళు ఎండకి, వానకి చలించి తపోభంగం అయినట్టు ఏ
తాళపత్రగ్రంధం లోనూ రాసిన దాఖలాలు లేవు. లేకపోతె ఇటువంటివి మూడో కంటి
వాడికి తెలీకుండా తొక్కేసేరేమో?!
సరే
వానలో అదే తుంపరలో టెస్ట్ రన్ చేస్తే పోయిందేముంది. వాన పెద్దదైతే
పరిగెత్తి ఇంట్లోకి పారిపోవడమే. ఈ ఆలోచన రావడం ఆలీసం ఓ కుర్చీ తీసుకెళ్ళి మా రూఫ్ గార్డెన్ లో ఉన్న నాలుగు మొక్కల మధ్యన వేసుకొని కూర్చున్నా.
ఒక
పక్కనించి తులసి మొక్క కొమ్మలు తగులుతున్నాయి. ఇంకోపక్క మా ఆవిడ
పెంచుకుంటున్న నాకు పేరు తెలీని ఇంకో మొక్క కొమ్మలు గుచ్చుకుంటున్నాయి.
మూడో వేపు నించి సన్నటి చినుకులు. కాని తపస్సు చేసేటప్పుడు ఇలాంటి చిన్ని,
చిన్ని ఆటంకాలు పట్టించుకొకూడదుగా? వాటిని లక్ష్య పెట్టకుండా
కళ్ళుమూసుకొని మెడిటేషన్ మొదలెట్టా.
అలా
ఎంతసేపు మెడిటేషన్ చేసానో తెలీదు కాని ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది.
మెడిటేషన్ లో ఇలాంటివి మామూలే అనుకోండి. అదేమిటంటే మెడిటేషన్ చేస్తున్నా
చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తుంటాయిగా. పాలవాళ్ళ స్కూటర్ శబ్దాలు, పేపర్
వాళ్ళ సైకిల్ శబ్దాలు, పనిమనుషులు గేట్లు తీసిన కిర్రు శబ్దాలు,
ఉన్నట్టుండి వీధి కుక్కల అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు, కొండొకచో దూరం
నించి ఎమ్మెస్ గారి సుప్రభాతం, పార్క్ కి వాకింగ్ కి కారులో వెళ్ళే వాళ్ళ
కారు శబ్దాలు, వాటి రివర్స్ హార్న్ కర్ణ కఠోర శబ్దాలు వగైరా!
ఈ
శబ్దాలకి నా తపోభంగం కాదు. టీవీ చూస్తూంటే కింద స్క్రోలింగ్ లైన్స్ లాగా
అవి అలా వినిపిస్తూంటాయి. నా తపస్సు అలా సాగిపోతుంటుంది .
కాని
ఇంతలో వచ్చిన ఆ ఆలోచన ఏమిటంటే మాకు పేపర్ వేసేవాడు ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక
తెలుగు పేపర్ లుమ్మ చుట్టి ఒక మిస్సైల్ లాగా చేసి రోడ్ మీదనించి మా బాల్కనీ
లో పడేట్టు గురి చూసి మాంచి స్పీడ్ తో విసురుతాడు. ఎంత స్పీడ్ అంటే మా
వీధి తలుపు వేసి ఉంటే దానికి ఆ మిస్సైల్ తగిలి ఒక చిన్న సైజు బాంబు పేలిన
శబ్దం వస్తుంది. వాడి గురి సరిగ్గా ఉంటే, మా తలుపు తీసుంటే అది నేరుగా
ఇంట్లో హాళ్ళో పడి సర్రుని క్రికెట్ లో యార్కర్ లాగా నెల మీద ఒక పది
అడుగులు దూసుకు పోతుంది. ఆ పేపర్ బాయ్ ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. ఫాస్ట్
బౌలర్ ఏమో కూడా?! కాని టీవీ లో లైవ్ టెలికాస్ట్ చూసి వాడు కూడా కొన్ని
బౌలింగ్ మెలుకువలు నేర్చుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ అయినా అప్పుడప్పుడూ స్లో
బాల్ వేస్తాడు ;) అప్పుడు ఆ పేపర్ బాల్ ఇంట్లోకి రాకుండా మా మొక్కల మీద పడి
వాటి కొమ్మలు, అప్పుడప్పుడూ వాటి నడుము విరిచేస్తుంది.
ఇప్పుడిదంతా
మీకు రామాయణంలో పిడకలవేటలాగ అనిపించచ్చు. కాని అసలు మాటర్ ఇక్కడే ఉంది.
నేను ఇప్పుడు కుర్చీ వేసుకొని కూర్చున్నది ఆ మొక్కల మధ్యలో! అంటే వాడి
బౌలింగ్ పిచ్!! ఇప్పుడు నాకు వినిపిస్తున్న పేపర్ బాయ్ సైకిల్ శబ్దాల్లో మా
వాడి సైకిల్ కూడా ఉండి వాడు కనక పేపర్ మిస్సైల్ విసిరాడంటే అది డైరెక్ట్
గా నా తలకి తగిలి కపాలమోక్షమే! తపస్సు చేసుకుంటూ మోక్షం, అందునా కపాలమోక్షం
పొందిన మొదటి, బహుశా ఏకైక వ్యక్తిగా, (ఇంత రికార్డు స్థాపిస్తే వ్యక్తి
ఏమిటి ఏకంగా మహర్షి అనాలేమో!) చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం లీలామాత్రంగా
గోచరించింది. మీలాంటి వాళ్ళ సంగతేమో కాని నాకు మట్టుకు ఇప్పుడప్పుడే మోక్షం
పొందాలన్న కోరిక లేదు. ఎందుకంటే తీరని కోరికలు చాలా ఉన్నాయి. అవన్నీ తీరాక
మోక్షం వేపు ద్రుష్టి సారిస్తాను. ఇప్పుడేమీ తొందర లేదు. మరిప్పుడు ఏం
చెయ్యాలి. మెడిటేషన్ అపెయ్యడమా? కాదు.
అప్పుడు
నాకో సందేహం వచ్చింది. మునుపు తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళే వాళ్ళు
కదా. అడవిలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూంటే ఏ పులో, ఎలుగుబంటో వచ్చి,
వాళ్ళని "సిట్టింగ్ డక్" లాగ భావించి, వాటి తపస్సుకి మెచ్చుకొని దేవుడే
వాటికి ఇలా "ఫ్రీ మీల్స్" ఏర్పాటు చేసాడని ఆనందపడి, తదనంతరం ఆ తపస్సు
చేసుకొనే వాడి మీద పడి, ఆ రోజుల్లో ఫ్రిజ్ లేకపోయినా రోజంతా దాచి మూడు
పూటలా శుష్టుగా భోజనం చేస్తాయి కదా. మరి ఈ భయం ఆ తపస్సు చేసుకొనే
మునులకి రాదా? బోల్డు సంవత్సరాలు తపస్సు చేస్తే పోనీ కొన్ని శక్తులు వచ్చి
వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అప్పుడే తపస్సు
మొదలెట్టి "L" బోర్డు పెట్టుకున్న పిల్ల మునుల గతేమిటి? వాళ్ళు తపస్సు, నేను హారర్ సినిమా చూసినట్టు అంటే భయంకరమైన సీన్లు వచ్చినప్పుడు రెండు కళ్ళూ దాదాపుగా మూసి, ఆ సీన్ ఎప్పుడయిపోతుందా అని తెలుసుకోవడం కోసం అతి తక్కువ కళ్ళు విప్పి భయంభయంగా చూసినట్టు చేసేవాళ్ళా? అంటే ఈ కొత్తగా తపస్సు
మొదలెట్టిన మునులు అలా ఎక్కడ ఏ జంతువు వస్తుందో అని ఒక కన్ను మూసి, ఒకటి
తెరిచి, లేదా అర్ధ నిమీలిత నేత్రాలతో చేసేవాళ్ళా? ఇప్పుడు నేను కూడా అలాగే
చెయ్యాలా? అలా చేస్తే దాన్ని కొంగ / దొంగ జపం అంటారేమో?
(అయినా ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తూంటే ఈ అశాంతి ఆలోచన ఏమిటి? )
లేకపోతే ఇలా తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళేవాళ్లకి మనకి ఇప్పుడు "పూజా సామగ్రి" అమ్మే దుకాణాలు ఉన్నట్టు ఆ రోజుల్లో ప్రత్యేక "తపస్సామగ్రి " అమ్మే దుకాణాలు ఉండేవా ? అందులో జింక చర్మం, కమండలం, కౌపీనం, ముడి పిన్నులు, రుద్రాక్షమాల, దండం, వగైరా వగైరా అమ్మేవాళ్ళేమో? అక్కడే కుంచం పేరున్న మునీశ్వరుడి రికమండేషన్ తాళపత్రం మీద చూపిస్తే (మనమిప్పుడు మందుల షాపులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించినట్టు !) వాళ్లకి బహుశా "జంతు వికర్షణ యంత్రం" కూడా అమ్మేవారేమో? లేకపోతె ఇప్పుడు బొద్దింకలు గట్రా రాకుండా "లక్ష్మణరేఖ" టైపు విభూతి ఏమన్నా?! ఇలాంటివి లేకపోతే ఆ కొత్త మునుల తపస్సు నిరాటంకంగా ఎలా జరిగేది?
ఈ బేతాళ ప్రశ్నకి జవాబు ఏ తాళపత్రంలోనైనా ఉందా? మీకేమన్నాతెలుసా?!!
సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న జింక చర్మం మీద ఎందుకు తపస్సు చేస్తారు అందునా అహింసా వాదులు?!!
నేనిలా మూడుసార్లు "ఎలా " అని అడిగానని మీరు మీ జవాబు మూడు సార్లు రాయనవసరం లేదు ;)
No comments:
Post a Comment