Monday, January 4, 2016

అనిర్వచనాలు! Definitions in Telugu!!



అనిర్వచనాలు!

మూర్ఖుడు : తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనేవాడు

మూర్ఖుల్లో మేధావి : తా పట్టింది కుందేలు కాదు చెవులపిల్లి అనేవాడు

ప్రజలు : చూడుడు అమాయకులు

అమాయకులు : మూర్ఖుడుని, మూర్ఖుల్లో మేధావిని అలవాటుగా, ఆనవాయితీగా నమ్మేసేవాళ్ళు

వేదాంతి: పట్టింది ఎవడు? పట్టుబడింది ఎవడు? అంతా మిధ్య! భ్రమ! మాయ! అనేవాడు

వ్యాపారవేత్త: మూడు కాళ్ళున్న అరుదైన కుందేలని (ఒక కాలుతో దాన్ని పట్టుకొని!) ఎక్కువ రేట్ కి అమ్మేసి డబ్బు సంపాదించేవాడు! ఏమి అనడు

టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు: అసలు మనుషులు కుందేళ్ళని ఎందుకు పట్టుకుంటారు? పట్టుకుంటే దాని కాళ్ళ గురించి ఎందుకు చర్చించుకుంటారు? ఇదేమన్నా మానసిక వ్యాధా? ఉంటే దీనికేమైనా చికిత్స ఉందా? అని ఒకడు గంభీరంగా అంటున్నాననుకుంటూ భీకరంగా అరుస్తూ ఈ స్లైడ్స్ రోజంతా చూపించి, చివరికి సాయంత్రం ఒక ఎవరివో హక్కుల సంఘం అధ్యక్షు(రా)లిని, ఒక రాజకీయ నాయకుడిని, ఒక వాస్తు/ జ్యోతిష్య పండితుడిని పిలిచి వాళ్ళతో ఒక పానెల్ డిస్కషన్ పెట్టి విసిగించేవాళ్ళు

న్యూస్ ఛానల్ కాంపిటీటర్ ఛానల్ : అమాయకపు చెవుల పిల్లిని పట్టుకొని, దాని కాలు ఒకటి విరిచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకి అడ్డంగా దొరికిన ప్రముఖ నటుడు! కేవలం మా ఛానల్ లోనే తాజా ఫోటోలు అని ఫోటోలు చూపించకుండా కేవలం స్లైడ్స్ కనీసం 8 గంటలు నాన్ స్టాప్ చూపించేవాళ్ళు

యువత : ఇలా కుందేళ్ళని పట్టడం తరతరాలుగా ఉన్న, వస్తున్న అసాంఘిక, ఆటవిక, సామాజిక, ఇంకేవో "క" అని ఫేస్బుక్ లో వాపోయేవాళ్ళు

సీనియర్ సిటిజన్స్ : అన్నిటికీ "కలికాలం అండీ! కలికాలం!! ఇంతే! అంతే! మనం ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలో అని వాపోయి, వెంటనే వెళ్లి టీవిలో డైలీ సీరియల్ చూసి కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదేసుకొనేవాళ్ళు

సీనియర్ సీనియర్ సిటిజన్స్ : హవ్వ! హవ్వ! మా కాలంలో ఇలాంటి వేషాలు ఎరగం అమ్మా! కుందేలు పట్టుకోగానే దాని కాళ్ళు, కళ్ళు లెక్క పెట్టడం ఏమిటి? వెంటనే డిన్నర్ కి లాగించెయ్యక ? పిదప కాలం. పిదప బుద్ధులు! అని భారీగా నిట్టూర్చేవాళ్ళు

అధికార పార్టీ నాయకులు: హద్దిరబన్నా! ఇదేదో టైం (లీగా) కి దొరికింది! దీని మీద సభలో చర్చ ప్రవేశ పెడితే మన స్కామ్స్, స్కీమ్స్ గురించి డిస్కషన్ కి టైం ఉండదు అని వెంటనే ఆ పని మీద ఉండేవాళ్ళు

ప్రతిపక్షం నాయకులు: పెరగని ఆదాయాలు! పెరుగుతున్న బీపీలు!! వీటి మీద చర్చించకుండా సభా సమయం వృధా చెయ్యడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర! మేము వెంటనే ఈ సభనించి వాక్ అవుట్ చేస్తున్నాం అని బైటికెల్లి ఎంచక్కా శీతాకాలంలో ఎండలో కూర్చునేవాళ్ళు

ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షం లోనూ లేని రాజకీయ నాయకుడు: ఈ కుందేళ్ళు పట్టడం వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది! దానికి ప్రభుత్వం లో ఉన్న పార్టీ అండదండలున్నాయి! దీని మీద సిబిఐ విచారణ చేసి దీని వెనకాల ఉన్న అందరు నాయకులని బైట పెట్టాలి అని గొంతు చించుకొని అరిచేవాడు!

ట్వీపుల్ (అనగా ట్విట్టర్ లో పెజానీకం!) : ట్విట్టర్ లో యమ స్పీడ్ గా #సేవ్ కుందేలు #సేవ్ చెవులపిల్లి అని హాష్ ట్యాగ్ లు స్టార్ట్ చేసి నానా హడావిడి చేసి ఇంకో హాట్ సబ్జెక్టు దొరగ్గానే వెంటనే దాని మీదకి జంప్ అయ్యేవాళ్ళు.

ఒక రకం ట్వీపుల్ : ఏ హాష్ ట్యాగ్ పెట్టకపోతే ఏమవుతుందో అని అన్ని హాష్ ట్యాగ్ లు పెట్టి ఇక తను రాయడానికి అక్కడ అక్షరాలు మిగలలేదని ఏమి చెయ్యాలో పాలుపోక అసలా సబ్జెక్టు జోలికే పోనీ పెజలు

అవకాశవాది : అర్జెంటు గా "చెవులపిల్లి" "మూడుకాళ్ల కుందేలు" "కుందేలా! మజాకా" "అల్లుడు కుందేలు! మామ కుదేలు" వగైరా, వగైరా సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసేవాడు

"ఎవరివో" హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు/ రాలు : కుందేలుని ఎప్పుడూ చూడకపోయినా, దానికి ఎన్ని కాళ్ళో తెలీకపోయినా, అణు ఆయుధాలనించీ, ఆవకాయ పెట్టడం వరకూ ప్రతి పానెల్ డిస్కషన్ లో పాల్గొనే వ్యక్తి .

మేధావి వర్గం : ఆదివారం సాయంత్రం పిల్లా మేకతో "కుందేళ్ళని రక్షించండి" "కుందేళ్ళు మాకంటే అమాయక జీవులు" అని బానర్స్ పట్టుకొని కాండిల్ మార్చ్ చేసేవాళ్ళు

టీవీ న్యూస్ జర్నలిస్ట్ : రోడ్డు మీద పోతున్న జనాలని పట్టుకొని "దీనిమీద మీ స్పందన" అని మోహంలో మైక్ గుచ్చేవాళ్ళు! ఆ మైక్ నించీ, దాన్ని పట్టుకున్న వాడి నించీ తప్పించుకోవాలంటే వేరే మార్గం లేక కొంతమంది, ఇన్నాళ్ళకి టీవిలో కనిపించే అవకాశం వచ్చింది కదా అని ఆనంద పడిపోతూ ఇంకొంతమంది "ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే! దీనిమీద వెంటనే ఒక కమిటీ వేసి ప్రభుత్వమే స్పందించాలి" అని స్పందించేవాళ్ళు

మూఢ భక్తులు: ఆ కుందేలు నిస్సందేహంగా ఆ భగవంతుడి ప్రతీక అని నిర్ధారించి దానికి, ఎందుకైనా మంచిదని చెవులకి కూడా, కుంకుమ బొట్లు పెట్టి, నమస్కార ప్రదక్షిణాలు చేసేవాళ్ళు

దొంగ భక్తులు: ఇదే సందని ఆ కుందేలుకి గుడి కట్టిస్తామని డబ్బాలు పట్టుకోని భూ(భా)రి విరాళాలు సేకరించి ఉడాయించేవాళ్ళు

మెజీశియన్ : ఈ హడావిడి చూసి ఎందుకైనా మంచిదని తన టోపీలో కుందేలు ఉందొ లేదో ఒక సారి తడిమి చూసుకొనే వాడు

(అ)సామాన్యుడు : ఇవేవి మనకి తిండి పెట్ట్టవన్న నగ్న సత్యాన్ని ఆపోషణ పట్టి ఊసురో మంటూ స్టార్ట్ అవ్వని స్కూటర్ ని తోసుకుంటూ, లేదా అమ్ముకోడానికి అరటి పళ్ళ బండీని తోసుకుంటూ, బ్రతుకు బండీ కిందా మీదా పడి లాగేవాడు

Telugu



No comments:

Post a Comment