Monday, December 8, 2014

తెర తీయగ రాదా?! తీయరాదు!!

కాళ్ళ పారాణి ఆరకముందే నా "తెరంగేట్రం" కార్యక్రమానికి "తెర" పడింది:(

ఇక వివరాల్లోకి వెళ్తే

నేను 7th క్లాసులో స్కూల్ వార్షికోత్సవానికి ఒక చిన్ని నాటకంలో ఒక ప్రధాన పాత్ర వహించాను! అందులో నాది డాక్టర్ పాత్ర. విపరీతంగా నటించాను. అనుకున్నాను. ఇలాంటి బాల కళాకారుడిని సముచితంగా సత్కరించాలి అని భావించిన స్కూల్ యాజమాన్యం వాళ్ళు నాకు ఒక "సబ్బుపెట్టె" బహుమతిగా ఇచ్చారు! ఆ రోజుల్లో సబ్బు పెట్టెలు అప్పుడే అమ్మడం మొదలు పెట్టారు. ఇంక నా ఆనందానికి అవధుల్లేవు. రోజూ స్నానం చేస్తున్నపుడు, నా స్నానం మాట ఎలాగున్నా ఆ సబ్బుపెట్టెకి చాల రోజులు చాల శ్రద్ధగా స్నానం చేయించాను. చివరికి ఒక రోజు ముందు ఆ సబ్బుపెట్టె, వెంటనే నా చిన్ని గుండె డాల్బీ స్టీరియో సౌండ్ చేస్తూ పగిలిపోయాయి. అక్కడితో రంగస్థలవైరాగ్యం పుట్టి కొన్నాళ్ళు, కాదు కొన్నేళ్ళు నా నటనా కౌశల్యాన్ని నాలోనే దాచేసుకున్నాను.

అలా ఓ రెండు దశాబ్దాల తర్వాత ఒక ఫ్రెండ్ ఒక గంట టెలిఫిలిం తీస్తూ ఒక ఆదివారం మధ్యాన్నం నన్ను షూటింగ్ చూడ్డానికి రమ్మన్నాడు. సరే ఎంతైనా మరుగున పడిన నటుడిని కదా కనీసం తోటి నటులు నటిస్తూంటే చూసి ఆనందపడదామని వెళ్ళాను. అప్పుడు ఒక పాట కచ్చేరి షూట్ చేస్తున్నారు. నేను ముఖ్య అతిధిని కాబట్టి ముందు వరసలో కుర్చోపెట్టారు. ఈ కచ్చేరి షూట్ చేసినప్పుడు ప్రేక్షకులని కూడా అప్పుడప్పుడూ చూపిస్తారు కదా! అలా కెమెరా ప్రేక్షకులవేపు తిరిగినప్పుడల్లా నేను నా ప్రతిభ అంతా చూపించి, చేత్తో తాళం వేస్తూ, బుర్ర విపరీతంగా ఊపేస్తూ నా నటనా విశ్వరూపం చూపించాను. అక్కడున్న వాళ్ళెవరూ గమనించలేదు కాబట్టి నాకు నేనే శభాష్ అని కూడా అనుకున్నా, మనసులోనే!

కొన్నాళ్ళ తర్వాత ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇవాళ మధ్యాన్నం మూడు గంటలకి మన(!) టెలిఫిలిం దూరదర్శన్లో వస్తుంది. చూడండి అన్నాడు. ఇంకేముంది సుష్టిగా భోజనం చేసి మా ఆవిడ దగ్గర (లేనిపోని) ప్రగల్భాలు పలికాను. మధ్యాన్నం చూడు నా నటన. చప్పట్లు కొట్టడానికి ఇంకో రెండు చేతులు ఉంటే బాగుండేది అనుకుంటావు అని! మా ఆవిడ కూడా నా మాటలు నమ్మేసింది. సాధారణ భారత స్త్రీ కదా! నాతో చెప్పలేదు కాని బహుశా లోపల అనుకోని ఉంటుంది "ఏమో రేప్పొద్దున్న మా ఆయన మెగాస్టార్ కాకపోయినా ఒక చిన్ని మినీస్టార్ అయ్యిపోతారేమో! ఎన్నాళ్ళీ గొర్రె తోక బెత్తెడు జీతం జీవితం? మా అదృష్టం మారిపోయే రోజులు వచ్చేసాయి" అని!

సరే చూస్తూండగానే మూడయింది. నేను "అవకాశ భక్తుడిని" కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దేవుడి అవసరం వచ్చింది కాబట్టి కరెంటు పోకూడదని వెయ్యి ఇంటు పది దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఇంకెక్కడో నిజమైన భక్తులు కోరుకున్నట్టున్నారు కరెంటు పోలేదు.

అలా ఆ గంట ఒక యుగంలా గడిచాక చివర్లో నేను ముఖ్యపాత్ర వహించిన సన్నివేశం రానే వచ్చింది. రెప్పకూడా వెయ్యకుండా చూడ్డం మొదలెట్టా. ఒక నిమిషం, రెండు నిమిషాలు, చివరికి పాట అయ్యిపోయింది. మధ్యలో ప్రేక్షకులని చూపించారు కాని నేనున్నవేపు కాదు:(

అంతే ఒక్కసారి నిరుత్సాహపడ్డాను. కాని విధి వైపరీత్యం. అంతే అలా నా నటనా జీవితానికి పునాదిలోనే హంసపాదు!

ఆ రోజు శపథం చేసాను.

ఇకముందు జీవితంలో తెరముందు కనిపించకూడదు అని!

ఆ రోజునుంచీ అన్ని తెరచాటు పనులే ;)


 

No comments:

Post a Comment