Sunday, June 14, 2020

Ragulutondi mogali poda!


మీలో చాలామందికి ఖైదీ సినిమాలో "రగులుతోంది మొగలి పొద" పాట గుర్తుండే ఉంటుంది.

ఆ రోజుల్లో అది కెవ్వుకేక.

ఆ పాట స్టూడియోలో ఔట్డోర్ సెట్ వేసి మనల్ని మాయ చేసారు. అయినా వాళ్ల పిచ్చి కాకపోతే చిరు, మాడ్స్ (మాధవిని నేను ముద్దుగా అలా పిలిచేవాడిని) డాన్స్ అల్లాడిస్తూంటే వెనకాల ఉన్నది మొగలి పొదా, ముళ్ళ పొదా, ఈతచెట్టా, తాటిచెట్టా అని బాక్గ్రౌండ్ చూస్తామని వాళ్లనుకోవడం ఉందే పిచ్చికి పీక్స్.

అసలింతకీ మేటర్ ఏమిటంటే వానలు పడకపోయినా ఇది వానాకాలం కదా ఇవాళయినా ఒకింత "చిరు"జల్లు పడుతుందేమోనని మార్నింగ్వాక్ కి చిన్న బ్రేక్ ఇచ్చి ఆకాశం అంతా దుర్భిణీ పెట్టి చూసా. అబ్బే. చిన్న వాన పిల్ల మబ్బు కూడా లేదు. అంటే ఇవాళ కూడా వానలకి నీళ్లొదుకోవాల్సిందేనన్నమాట. వాన నీళ్లు కాదండోయ్ అసలే వానల్లేవు.

మళ్ళీ అసలు మ్యాటర్ ఏమిటంటే ...... అదేమిటి సార్ ఇందాకలే అసలు మ్యాటర్ ఏమిటంటే అన్నారు కదా మళ్ళీనా అంటే ఏదో మాటవరసకు సవాలక్ష అంటాం. అన్నీ పట్టుకొని కోడిగుడ్డుకి జిల్లెట్ మాక్ 4 రేజర్ తో షేవింగ్ చేస్తే నా వల్ల కాదంటే కాదు.

సరే అసలు మ్యాటర్ లోకొస్తే ఇందాక "చిరు" జల్లు అనగానే ఓ రెండు "చిరు" పాటలు వెంటనే గుర్తొచ్చాయి. మొదటిది మొదట్లోనే చెప్పాగా "రగులుతోంది మొగలి పొద". ఇహ రెండోది ఏమిటో మీరు చెప్పితే మాంచి బహుమతి ఏమన్నా ఇద్దామనుకుంటున్నా. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమివ్వాలి ఇంకా నిర్ణయించలేదు. బహుశా ఓ రెండు లక్షల ఎనభై ఏడువేల మూడొందల నలభై మూడు సెకండ్లలో నిర్ణయం తీసుకొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మళ్ళీ అసలు మ్యాటర్లోకొస్తే ఆ "రగులుతోంది మొగలి పొద" పాము డాన్స్ కదా. పైగా ఔట్డోర్ సెట్టింగ్. ఇది వానాకాలం. "చిరు"జల్లు. ఇవన్నీ మిక్సీలో వేసి తిప్పితే నాకో చిన్ని సందేహం వచ్చింది.

అదేమిటంటే అలాంటి పాము డాన్స్ వానలో పెడితే దాన్ని వానపాము డాన్స్ అనచ్చా? తెలిసీ సమాధానం చెప్పకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది.

మీ జవాబులు హైద్రాబాద్లో మళ్ళీ (అంటే నిన్నా మొన్నా పడిందని కాదు ఏదో మాట వరసకి) వాన పడేలోగా పోస్ట్ చేయండి. ఎందుకంటే వానపడితే నేను మడిసిని కాదు. సీమసందుల్లో సీమపందిలా, ఆ వానలో మట్టిలో వానపాములా దొర్లుకుంటూ, పొర్లుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతా. మళ్ళీ ఈ తుచ్ఛ ప్రపంచంలోకి రావాలంటే టైం పడుతుంది. ఆ పైన మీ ఇష్టం.

ఇంకో సప్లిమెంటరీ మేటర్! తేగలా ఉన్నావంటే తేగ తెమ్మన్నాట్ట ఎనకటికొకడు. ఇప్పుడలాగా వానపామంటే నాకు అర్జెంట్గా వానపాముని చూడాలనుంది. అంటే నిఝమ్ వానపాముని. కాబట్టి మీరు దాని ఫోటోలు డౌన్లోడ్ చేసి పోస్ట్ చేసే శ్రమ పడకండి. ఆమాత్రం మాకూ తెలుసు. వాన చూస్తే వచ్చే మజా వాన ఫోటో చూస్తే వస్తుందా? మందు కొడితే వచ్చే మజా మందు సీసా చూస్తే వస్తుందా? రాదు. రాదు. రాదు.

ఇంతకీ నేనెక్కడికో వెళ్లిపోయానని మీరు కూడా నాతొ పాటు వచ్చేసి అసలు విషయం మర్చిపోవద్దు. అసలు మ్యాటర్ (మళ్ళీ) వానలో పాము డాన్స్ ని వానపాము డాన్స్ అనచ్చా ?



Kotthaavakaya+nuvvula podi =

మొన్నీ మధ్య మన కోస్తా ఫుడ్స్ వాళ్ళ కొత్తావకాయ తెప్పించా. ఈ వయసులో తినడమే కానీ ఆవకాయ పెట్టె ఓపిక లేదు కదా .

చాలా రోజులనించీ అనుకుంటున్నా, నిన్న తీరిక దొరికి నా స్వహస్తాలతో నువ్వులపొడి చేశా.. మా విసాపట్నం వాళ్ళం నూలుగుండ/ నువ్వులగుండ అంటాం దీన్ని



ఇవాళ ఆదోరం కదా కాస్త తీరిగ్గా భోంచేస్తూ కొత్తావకాయ, నూలుగుండ రెండూ కలిపి అన్నంలో కలిపి ఒక్క రవ్వ (నిజం చెప్పాలంటే రెండు మూడు రవ్వలు ) ఆవు నెయ్యి తగిలించి తిన్నా. అయినా మీ పిచ్చి కానీ అలా ఆవకాయా, నూలుగుండా కలిపి తింటారా ఎవరైనా హవ్వ అని బుగ్గలు నొక్కుకోకండి. నా బోంట్లుండబట్టే మీ బోంట్లకి పెసరట్టుప్మా, పెరుగు వడా వగైరా వగైరా మహాద్భుతాలు తెలిసాయి. అయినా సిరివెన్నెలగారన్నారుగా "ఎవరో ఒకరు. ఎపుడో అపుడు. తినరా ముందుగా అదీ ఇదీ కలియగలిపి" అని. మీరసలు నాకు బోల్డు థాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్వర్గ రహస్యాలు మీకింత వీజీగా చెప్పేస్తునందుకు

నిజం చెప్పాలంటే గిసుంటి సీక్రెట్స్ నాకాన శానా ఉన్నాయ్ . అల్లం  పచ్చడి , గోంగూర పచ్చడి (అంగూర!), గోంగూర, చింతకాయల (గోచి!) చింతకాయ టమాటో (చిమాటో)... హిలా చాలా డెడ్లీ కాంబోస్. ఇంకా ఉన్నాయి కానీ నన్ను మంచి చేసుకుంటేనే చెప్తా

ఇంకేముంది అందరూ అంటూంటారే స్వర్గానికి బెత్తెడు దూరం అని.... బెత్తెడు లేదు. జాన లేదు. ఆ రెండూ కలిపి తింటే డైరెక్ట్ గా స్వర్గం తలుపుల దగ్గర తేలా. తేరిపార చూస్తే తలుపులు మూసేసున్నాయి. అటూ ఇటూ చూస్తే ఓ గుళ్లో గంటలాంటిది కనిపించింది. అది కాలింగ్ బెల్ అనుకుంటా! అనుకోవడం అలీసం మరిహనేం. గణగణమని వాయించి పారేసా. ఎలాగు ఇంతదూరం వచ్చాం కదా స్వర్గంలో ఓ రెండు గంటలు ఏమన్నా కండెక్టడ్ టూర్ ఉంటె ఓ లుక్కేసి పొతే ఓ పనయ్యిపోతుంది. ఇంతింత దూరం రోజూ రాలేం కదా?

ఓ రెణ్ణిమిషాలకి ఓ పొడుగాటి మడిసి తలుపు తీసి 1 టు 2 లంచవర్! ఓ గంటాగాలి అన్నాడు. వార్నీ. ఏదో పోన్లే పాపం ఇంత దూరం వచ్చా కదా అసలీ స్వర్గం అనేది మనం పోయాక వర్త్ గోయింగా అని సూద్దారంటే గంటాగమంటాడేటి? వాళ్లకయితే ఈ స్వర్గంలో బొత్తిగా పనులుండవు. మనకలాక్కాదే. బోల్డు యవ్వారాలాయె. సర్లే ఇంకోపాలి ఇటొచ్చినప్పుడు సూద్దారని ఎల్లిపొచ్చేసా

సో ఫైనలాఖరికి నే సెప్పేదేటంటే మీరు కూడా స్వర్గం చూడాలనుకుంటే కొత్తావకాయ+నూలుగుండ డెడ్లీ కాంబో తినండి. ముందస్తు వార్నింగ్. కాస్త ఎర్లీ గా భోంచేస్తే లంచ్ అవర్ కంటే ముందెళ్తే నాలాక్కాకుండా మీరు స్వర్గం ఫ్రీగా చూసొచ్చేయచ్చు. అక్కడి విశేషాలు ఇక్కడ పోస్ట్ చేయడం మర్చిపోకండి.

NB: ఆవకాయ ఫోటో కోస్తా ఫుడ్స్ వారి పేజీ నించి తస్కరించడమైనది. నువ్వులపొడి  నేను చేసిందే 

Sunday, May 24, 2020

ఉపవాసం! Fasting.

పొద్దున్నే మా ఆవిడ "ఏమండీ" అని పిలిచింది
అయిపోయా!
ఏ మగడినైనా భార్య ఒకింత ముద్దుగా "ఏమండీ" అని కానీ, లేపోతే "ఏమండేమండేమండీ" అని ఒకింత గారాబంగానూ పిలిస్తే ఆ మగడు ఖల్లాస్!
ఇప్పుడు నాకేం లాసో?
"ఏమిటోయ్" అన్నా ఒక్క రవ్వ నీరసంగా
"రెణ్ణెల్ల నుంచీ రోజంతా తినడం పడుక్కోవడమే కదా? అందుకని ఇవాళ ఒక్కరోజు ఉపవాసం చేయండి" అంది
చచ్చాం! అలవాటు లేని పనాయె. కానీ ఆవిడకి కాదని చెప్పడమే?
"సర్లే ఉపవాసమేగా? శుభ్రంగా చేస్తా. ఇంతకీ ఉపవాసం అంటే ఎలా చెయ్యాలో" అని కూపీ లాగా
"ఆబ్బే. పెద్ద కష్టం ఏమీ కాదండీ. కేవలం వండిన పదార్ధాలు తినకూడదు అంతే" అంది
ఈ ఆడాళ్ళెప్పుడూ ఇంతే. తుఫానులైనా ముందస్తు హెచ్చరికలు చేస్తాయి కానీ వీళ్ళు సునామీ టైపు. ఒక్కసారిగా మీద పడిపోడమే!
ఈ ఉపవాసం గురించి నిన్నే చెప్తే ఒకింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాడిని కదా. నిన్న రాత్రి భోజనం ఎక్కువ తినడం. ఉపవాసానికి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చుకోవడం వగైరా.
సరే ఇప్పుడు చేసేదేముంది. "ఓస్. అంతేనా. అయితే ఇవాళ ఉపవాసం. కంఫర్మ్" అని డిక్లేర్ చేసేసా
వెంటనే వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ వెదికి నాక్కావాల్సినవన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా. జీడిపప్పు, ఆ లయన్ బ్రాండ్ ఖర్జూరం, ఆల్మండ్, పచ్చి వేరుశెనగ పలుకులు, హార్లిక్స్ పౌడర్ కూడా చిన్న పోట్లాము కట్టా. ఇవన్నీ వండని పదార్ధాలేగా. మా అబ్బాయి లేచాకా ఓ రెండు సీసాలు కొబ్బరి నీళ్లు తెప్పిస్తా. మొన్న మా ఆవిడ "ఇంటినిండా వెధవ ఖాళీ సీసాలే" అని పారెయ్యబోతూంటే రెండు థమ్స్పాప్ ఒకటిన్నర లీటర్ సీసాలు "వేసంకాలం కదా ఫ్రిడ్జ్ లో నీళ్ళకి పనికొస్తాయి అని దాచడం మంచిదయ్యింది.
సరే తొమ్మిదింటికి పళ్ళబ్బాయి వస్తే ఓ మూడు కేజీలు బంగినపల్లీ (ఒక కేజీ ఫ్యామిలీకి ...అన్నీ నేనే తినేసేంత స్వార్ధపరుడిని కాదు) కొంటే ఎలాగోలా ఇవాళ్టి ఉపవాస కార్యక్రమం జయప్రదంగా ముగించచ్చు.
ఇవి సరిపోతాయా ఇంకేమన్నా నేను మర్చిపోయినవి ఉంటె అర్జెంట్గా చెప్పండి. ఎలానూ షాపులన్నీ తెరిచే ఉన్నాయి కాబట్టి మా అబ్బాయిని పంపించి తెప్పించుకుంటా.
మొత్తానికి ఈ "ముడి"సరుకంతా నా బెడ్ రూమ్ లోకి చేరేశా. అసలే ఎండలు మండిపోతున్నాయి. పైపెచ్చు ఉపవాసం. నీరసం మీద వడదెబ్బ తగిలితే బహు ప్రమాదం. మరంచేత ఇవాళంతా ఏసీ వేసుకుని మంచం దిక్కుండా సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తా. ఇవన్నీ అయిపోయి ఇంకా నీరసంగా ఉంటే సినిమాల్లో పేద హీరో టెక్నీక్ ఎలానూ ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి !
అన్నట్టు ఈ ఆడోళ్లన్నస్సలు నమ్మకూడదు. మొగుళ్ళ విషాయానికొచ్చేటప్పటికీ ఏ శాస్త్రాల్లోనూ లేని విషయాలు చెప్పి మనల్ని నిండా మోసం చేసేస్తారు. అంచేత నేనే శాస్త్రాలు ముందేసుకు కూర్చున్నా. ఏమన్నా శాపవిమోచనం టైపు ఉపాయాలు దొరుకుతాయేమోనని.
పదినిమిషాల్లోపే ఓ అద్భుతమైన ఉపాయం తట్టింది. పూర్వం యుధ్ధాలన్నీ, మహా సంగ్రామం కురుక్షేత్రంతో సహా, సూర్యోదయం నించీ సూర్యాస్తమయం దాకానేట! ఉపవాసం యుద్ధం కంటే గొప్పా ఏమిషి? అందుకని ఉపవాసం కూడా సూర్యాస్తమయం దాకానే! హమ్మయ్య. పెద్ద ప్రాణానికేం ఇబ్బంది లేదు.
మొన్న పచ్చడి చేద్దామని చిలకడదుంపలు కొన్నా. బద్దకించి పచ్చడి చేయకపోవడం మంచిదయ్యింది. సూర్యాస్తమయం ఇహ పది నిమిషాల్లో (రోజూ పేపర్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు ఎందుకిస్తారా అని ఇన్నాళ్లు ఓ తెగ ఆలోచించా. ఇప్పుడు తెలిసింది!) అవుతుందనగా బెల్లంతో ఉడకపెట్టి నా ఉపవాస దీక్ష విరమిస్తా.
రాత్రికి నాకిష్టమైన వంకాయ కూర చెయ్యమని చెప్తే ఆవిడ బోల్డు హాశ్చర్యపడిపోయింది. ఉత్త యాక్టింగ్ లెండి. అదేమిటి ఉపవాసం ఉంటానని మళ్ళీ రాత్రికి భోంచేయడం ఏమిటీ అని. నాకు తెలీదనుకోకు. నేనిప్పుడే శాస్త్రాలు తిరగేసా. శుభ్రంగా రాత్రి భోంచేయచ్చు. అని తెగేసి చెప్పా. మొహం అదోలా పెట్టుకుని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడవన్నీ పట్టించుకునే ఓపిక లేదు నాకు. అసలే ఉపవాసం.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నేనిక్కడ గంటగంటకీ మీ కామెంట్స్ కి జవ్వాబులివ్వడం లాంటి కార్యక్రమం చేస్తూంటా. ఓ గంటసేపు నా నించి ఏ విధమైన ఆక్టివిటీ లేకపోతె 108 కి ఫోన్ చేసి కబురందివ్వండి. అదేమిటి మాస్టారూ? మీ ఫామిలీ అంతా ఉన్నారుగా అని మీ అందరికీ ఓ గొప్ప అనుమాన సందేహం రావచ్చు. ఉన్నారు కానీ నన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఇందాకే చెప్పానుగా ఇవాళంతా బెడ్ మీదే అని. ఒహవేళ నాకు పోషకాహారం తగ్గి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతే వాళ్లొచ్చి చూసి నేను హాయిగా ఏసీ వేసుకొని బొబ్బున్నానని వెళ్ళిపోతారు. నేనసలే ఉపవాసం కాబట్టి మధ్యాహ్నం భోజనానికి కూడా పిలవరు. మరదీ మేటర్. అందుకని నేను స్పృహలో ఉన్నానో లేనో అన్న దానికి అగ్నిపరీక్ష ఇక్కడ నా ఆక్టివిటీ నే. నా ప్రాణాలు మీ అందరి చేతుల్లో పెడుతున్నా.
ఇప్పుడే అందిన వార్త! శాస్త్రాల్లో వెదక్కా వెదక్కా నాకు తెలిసిన రహస్యం ఏమిటంటే ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండటం. అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? దేవుడికి!
అంటే ఉపవాసం అంటే దేవుడిదగ్గర ఓ పీట, లేదా నాలాంటి భారీ కాయాలు నేలమీద కూర్చోలేం కాబట్టి, ఓ కుర్చీ వేసుకుని రోజంతా కూర్చొంటే అదే ఉపవాసం! ఇదే విషయం మా ఆవిడకి చెప్తే నమ్మదే? మీరన్నా చెప్పండి. ఓ మనుషోత్తముడి ప్రాణం నిలపెట్టిన పుణ్యం మూటకట్టుకోండి.

Monday, May 4, 2020

Gnanodayam. జ్ఞానోదయం

ఈ నా "రచన" మే 97 "రచన" మాసపత్రికలో ప్రచురించారు!


జ్ఞానోదయం!



ఓ సండే సాయంత్రం ఏం చెయ్యాలో తోచలేదు. డాబామీద అటూ ఇటూ పచార్లు చేస్తూంటే సడెన్గా ఓ విషయం అర్ధం అయ్యింది. అదేవిటంటే నేను బోల్డు కష్టాల్లో పడిపోయానని.


ఎవరన్నా బాత్రూములోనో, మెట్లమీదో పడ్డారంటే హాశ్చర్యపోవచ్చేమో కానీ కష్టాల్లో  పడ్డారంటే హాశ్చర్యపోనక్కరలేదు. ఎంచేతంటే ప్రతి మనిషికి "జాతస్యహి కష్టం ధృవం" అన్నారు పెద్దలు.


అయితే విచిత్రమేమిటంటే ఎవరన్నా అమ్మాయి కష్టాల్లో పడిందనుకోండి, అబ్బాయిలంతా ముందు హాశ్చర్యపడి తర్వాత జాలిపడి ఆ పైన ఆ అమ్మాయిమీద పడిపోతారు. దీన్నీ "డాంసెల్ ఇన్ డిస్ట్రెస్" ఫినామినా అంటాడు ఇంగ్లీషోడు.


అదీ నాబోటోడు కష్టాల్లో పడ్డాడనుకోండి.. ఈ జనాలు ఆశ్చర్యపడరు. జాలి పడరు. నా మీద విరుచుకు పడిపోతారు.


"వీడికీ మధ్య కళ్ళు నెత్తికెక్కాయి. కష్టాల్లో పడ్డాడంటే పడడా మరి? వీడికంతే కావాలి" అని బాడ్ ప్రాపగాండా ఒకటి. యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ లాగా.

అదే అమ్మాయిలైతే? ఓహ్!

అమ్మాయిలంటే అందరికీ సాఫ్ట్ కార్నరే

అమ్మాయికి అందం కలిస్తే? మరిహ అడక్కండి

అందమైన అమ్మాయంటే గుర్తొచ్చింది. మా ఆఫీసులో కూడా ఓ అందమైన అమ్మాయుంది. మా ఇద్దరి టేబుల్ కీ మధ్య ఒక పిట్టగోడ అడ్డు.

నిలపడితే పిట్ట, కూర్చుంటే గోడ కనిపిస్తే దాన్ని పిట్టగోడ అంటారు.

మునుపు ఈ పిట్టగోడలు ఇళ్ల మధ్య, డాబాల మీద మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా దర్శనమిస్తున్నాయి.

ఈ పిట్టా వసపిట్ట కాదు. నసపిట్ట కూడా కాదు.

అదేం పనో కానీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. కానీ మా ఆఫీసులో జీతాలే కానీ పనివ్వరనే అపభ్రంశ ఉందే?

మరీ అమ్మాయికేమిటో అంత పని. ఎప్పుడూ ఏదో రాసేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి కానీ రోజుల్లో నాకో అనుమానం ఉండేది.

కొంపతీసి ప్రేమలేఖలు రాస్తోందో ఏమో. లేపోతే ఈవిడొక్కర్తికీ అంత పనేమిటి? అయితే ఆవిడ ఎవరినీ ప్రేమించిన దాఖలాలు నా డిటెక్షన్ కి అందలేదు.

మరేవిటి ఆ రాతలు?

ప్రేమలేఖలు రాయడం ప్రాక్టీస్ చేస్తోందేమో? నాకు ప్రేమలేఖలు రాయడంలో పెద్ద అనుభవం లేదు కానీ చాలా సినిమాల్లో చూసాను.

ముందు ఓ పేపర్ మీద "ప్రియమైన" అని రాస్తారు.

నచ్చదు. చింపి పారేస్తారు.

"మై డార్లింగ్" అని రాస్తారు. చింపేస్తారు

"మై డియర్" డిట్టో

"మై లవ్" డిట్టో

ఇలా రాస్తూ పారేస్తూ ఉంటారు

ఈ అమ్మాయి ఆ టైపు అయితే రోజూ ఆమె చెత్తబుట్ట నిండిపోవాలి. కానీ అది ఖాళీగానే ఉంటోంది.

మరీ కాగితాలన్నీ ఈ అమ్మాయి ఏం చేస్తున్నట్టూ? కొంపతీసి ఫైల్ చేయటంలేదు కదా? అందులోనూ అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో పరమ స్టుపిడ్ గా ఉంటారు. ఎప్పుడేం చేస్తారో చెప్పలేం.

"ప్రేమలో క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అన్నారాయె. ముందు ఈ డిస్కార్డెడ్ లెటర్స్ అన్నీ పారేస్తారు. మళ్ళీ ఏమనుకుంటారో ఏమో వాటినన్నింటినీ ఫైల్ చేస్తారు. ఆ లవర్ గాడు కానీ వాడి ఖర్మ కాలి వీళ్ళకి కొంచం కోపం తెప్పిస్తే ఆ ఫైలంతా చింపేస్తారు. కోపం డిగ్రీ పెరిగితే వాటిని తగలపెడతారు.  కోపం పతాకస్థాయికి చేరితే ఆ బూడిదని కాఫీలో కలుపుకుని తాగేస్తారు దధీచి లాగా!

ఇదేనండీ అమ్మాయిలతో వచ్చిన పేచీ! కుఛ్ భీ హో సక్తా హై. మధ్యలో ఈ హిందీ ఏమిటని చిరాకు పడితే నాకు చిరాకు. అసలింతవరకూ హిందీ మాటలు రాకుండా రాయడానికి యమా పరేషాన్ అయ్యాను. హైద్రాబాద్లో ఉంటూ హిందీ సే బచ్ కె కోయి నహి జీ సక్తా! జరా హిందీ, కొంచం తెలుగు,  లిటిల్ ఇంగ్లీష్ - ఈ మూడూ ఒకే వాక్యంలో వినిపిస్తే ఆ సీన్ హైదరాబాద్డి అని ఢంకా బజాయించి చెప్పచ్చు.

ఇద్దరు తెలుగువాళ్లు హిందీలో మాట్లాడే అతి పవిత్ర జాగా ఈ హైదరాబాద్.

అమ్మాయిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను - ఈ అమ్మాయి హిందీలో ఒక్క మాట కూడా మాట్లాడడం నేను వినలేదు. పోనీ హిందీ రాదేమో అనడానికి వీల్లేదు. ఎంచేతంటే ఉత్తర భారతదేశంలో సాన్నాళ్ళుంది. అయినా ఏమిటో మేమంతా హిందీ వచ్చనే మాట్లాడుతున్నామా?

ఈ ఊరొచ్చిన కొత్తల్లో ఈ హిందీతో చాలా పరేషాన్ అయ్యేది. నా ఫ్రెండ్స్ లో కొందరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవాళ్లు. వాళ్లంతా  ధారాళంగా హిందీలో  మాట్లాడేస్తూంటే నాకు హిందీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేది. వాళ్ళు నవ్వితే మనం నవ్వడం. సీరియస్గా  ఉంటే డిట్టో.

హిందీ అంకెలతో మరీ చిక్కు. ఓసారి ఓ రిక్షావాడితో బేరవాడేను. వాడు దేడ్ రూప్యా అన్నాడు. నేను అదేం కుదర్దు. అడయ్ రూప్యా అన్నా. వాడు ఓ అయిదు నిమిషాలు దెబ్బలాడి ఒప్పుకున్నాడు. నేను విజయగర్వంతో నా ఫ్రెండ్స్ కి చెప్పాను "నాకు హిందీ వచ్చేసిందోచ్" అని. వాళ్ళు నా వేపు గజ్జి కుక్కపిల్ల వేపు చూసినట్టు జాలిగా చూసారు. తర్వాత జ్ఞానోదయం చేసారు. దేడ్ రూపయా అంటే రూపాయిన్నరని,  అడయ్ రూప్యా అంటే రెండున్నరని. అప్పటినించీ బేరాలు మాత్రం హిందీలో మానేసాను. ఆ రోజే నిశ్చయించుకున్నా ఎలాగైనా హిందీ నేర్చుకోవాలని.

ముఫై రోజుల్లో నేర్చుకునే హిందీ పుస్తకం కంటే హిందీ సినిమాలు ఎక్కువ ఉపయోగం అనిపించింది. అంతే కనిపించిన ప్రతి హిందీ సినిమా చూసాను. బోల్డు హిందీ మాటలొచ్చేసాయి

ఓ రోజు మా ఫ్రెండ్స్ అంత ట్యాంకుబండు మీద చతికిల పడ్డాం. వాళ్లంతా హిందీమే బాత్ ఛీత్. నా హిందీ నాలెడ్జి చూపించాలి. ఓ టీనేజ్ బ్యూటీ అలా వెళ్తోంది. నేను వెంటనే "క్యా ఖాన్డాన్ హై" అన్నా. ఫ్రెండ్స్ అంతా వెర్రి చూపులు చూడ్డం మొదలెట్టారు. వెధవలు. నా హిందీకి షాక్ అయ్యినట్టున్నారు. అంతే తెగ రెచ్చిపోయాను.

"క్యా ఉమర్ హై"

"క్యా దిల్ హై " వగైరా వగైరా

మా వాళ్ళ మొహాలన్నీ జరా సా రిన్ పెట్టి ఉతికినట్టు అయ్యిపోయాయి. అప్పుడడిగాను "కైసా హై హమారా హిందీ" అని. ఒకడు నాకర్ధం కానీ అవుట్  అఫ్ సిలబస్ హిందీ మాట వాడాడు. దాంతో నాక్కోపం వచ్చేసింది. వెంటనే హిందీ సినిమాల్లో తల్లినో, చెల్లినో దహనం చేస్తూ ఆ మంటల పక్కన హీరో అనే మాటలన్నీ అప్పచెప్పేసా "మై బద్లా లూన్గా", "తుమ్హారా ఖూన్ పీవూన్గా" etc

ఇంతకీ వేరార్ ఉయ్? అమ్మాయి దగ్గర కదూ. ఓ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది. నేనేం తక్కువ తినలేదుగా? ఆ ఫైన్ మార్నింగ్ కి ముందు రోజు ఈవెనింగ్ నేను కూడా పెళ్లి చేసేసుకున్నాను.

గమ్మత్తేవిటంటే పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయి ఆ రాత ఆపలేదు. ఆ మిస్టరీ ఏమిటో నాకు అంతుపట్టలేదు. ఆఖరికి ఆ మిస్టరీ సాల్వ్ చేయడం నా జీవితాశయం అయిపొయింది.

ఆవిడకి తెలీదు కానీ పాపం ఓ విషస్ సర్కిల్ లో పడిపోయింది. పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలని. పని చేసేవాళ్ళకే పని. మాలాంటి వాళ్లకి కేవలం పాలిటిక్సే! చేస్తోంది కదా అని అందరూ ఆమెకే పనిచ్చేవారు. ఇంకా చేసేది. ఇంకా ఇచ్చేవాళ్ళు. శిష్యా! ఇది అనంతం.

వేసంకాలంలో వానజల్లులాగా మాలాంటి వాళ్ళక్కూడా అప్పుడప్పుడూ కొంచం పనిస్తూ ఉంటారు. కానీ అలవాటు లేని ఔపోసన కదా. మరింక ఎలా వదుల్చుకోవాలి. దానికో సింపుల్ ఫార్ములా ఉంది.

చిన్న పనయితే మందాకా అనవసరమని కిందవాళ్ళకి తోసెయ్యడం. పెద్ద పనైతే మనవల్ల కాదని పైవాడికి నెట్టెయ్యడం. కానీ పాపం ఈ అమ్మాయికి ఈ కళకూడా లేదు. నీరు పల్లానికే వచ్చినట్టు అందరి పనీ ఈమెకే.

ఈ అమ్మాయిని చూస్తే "చిత్ర చిత్రముల్ అమ్మాయి చిత్తముల్" అనిపిస్తుంది. ఇదేమాట ఆమెతోనే అనేసాను. "ఇందులో చిత్రమేమిటుంది" అని కొట్టి పారేసింది. అమ్మాయిలతో ఇదే గొడవ. వాళ్ళు నిజం చెప్పారు. మనం చెప్తే ఒప్పుకోరు.

పేకాటలో ఒక్కరూ కూర్చుని ఆడుకునే  ఆట ఒకటుంది. ఆ ఆటలాంటిదేవైనా డెవలప్ చేస్తోందా కొంపతీసి. కానీ అదేం కుళ్ళు. నాలాంటి వాళ్లకి చెప్తే మేము కూడా ఆడతాం కదా . లేకపోతే దాన్ని ఒకరికంటే  ఎక్కువ మంది ఆడేటట్లు ఫర్దర్  డెవలప్ చేస్తోందా? ఎంతైనా ఆడోళ్లకి సీక్రెట్స్ ఎక్కువ. వాళ్ళ వల్లకాదు కానీ కుదిరితే పిల్లల్ని కూడా సీక్రెట్గా కనేస్తారు.

అన్నట్టు నాకొక్కడికే పిట్టగోడ.. మిగతా వాళ్లందరికీ ప్రహరీ గోడ! అంచేత నేనంటే అందరికీ జెలసి. నేనసలు గంగిగోవుని. నువ్వు ఆవు కాదు COW అంటారు మా వాళ్లంతా. వాళ్లకే ఇంగ్లీష్ వచ్చినట్టు.  తర్వాత్తెలిసింది  COW అంటే ఆవు కాదుట "క్యాట్ ఆన్ ద వాల్" ట

అసలు గోడమీద పిల్లి అంటే మా గోపిగాడు. ఓ రోజు వాడితో అన్నా "గోపీ అంటే ఏమిటో తెలుసా" అని. తెలీదన్నాడు. చెప్పాను "గోపీ అంటే గోడ మీద పిల్లి" అని. వాడికి ఏడుపొచ్చేసింది. అప్పుడు వాడింకా నిక్కర్లేసుకునేవాడు. అఫ్ కోర్స్ నేను కూడా. వాడు కాస్సేపేడ్చి నేను గోపీ కాదన్నాడు.

"మరెవరు వాడన్నవా" అన్నా

కాదన్నాడు

"వాడి తమ్ముడివా"

కాదన్నాడు

"వాడి భూతానివా"

భూతం అనగానే భయమేసి మళ్ళీ ఏడ్చేశాడు.

"నేను గోపీనే కానీ ఆ గోపీని కాదు" అన్నాడు

నాకు వెంటనే అనుమానం వచ్చింది. నాకు తెలీకుండా నాకివ్వకుండా వాడొక్కడే మందు కొట్టేస్తున్నాడేమోనని. లేకపోతే ఆ వాగుడేవిటి. గోపీయే కానీ ఆ గోపీ కాదుట. సరే ఈ గోపీ వేరే అని ఓదార్చాను

అప్పటినించీ వాడ్ని నేను గోపీ అని పిలవకూడదుట. "నేను పిలవను సరే అంతా అలాగే పిలుస్తారుగా మరెలా" అనడిగా. వాళ్లకి ఈ అర్ధం తెలీదుగా అన్నాడు. నేను కూడా ఈ అర్ధం తోనే పిలుస్తా అన్నా. చాలాసేపటి ఒప్పుకున్నాడు. కానీ వెధవకి ఇప్పటికీ అనుమానమే.

ఇంతా ఈ అమ్మాయి ఏమిటి రాస్తోంది అన్నది నేనిప్పటికీ కనిపెట్టలేదు

































Monday, April 13, 2020

బుడత భారతం

 బుడత భారతం - ఈ నా రచన 13th ఏప్రిల్ 1997 "ఆంధ్ర భూమి" డైలీ లో ప్రచురించడమైనది


ఈ రోజుల్లో పిల్లలతో వేగడం చాల కష్టం. ఆడ పిల్లలైతే మరీను! అఫ్ కోర్సు..పెద్ద వాళ్లతో వేగడం కూడా కష్టమే. వాళ్లతో వేగం. ఉడుకుతాం! అది వేరే కథ. మరో సారి మనవి చేస్తాను.

ఈ చిన్న పిల్లలకి కొంచెం కూడా మంచి మర్యాదలు లేకుండా పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బుడుగుని పిల్చి "బుడుగు బుడుగు నీ పేరేమిటమ్మా?" అనడిగేమనుకుందాం.

"నే చెప్ఫను ఫో" అంటాడు

మరీ ఓవర్ అయితే "నీకెందుకు చెప్పాలి" అని ఎదురు ప్రశ్న వేస్తాడు.

మా బుజ్జులుగాడు మరీను. నిండా నాలుగేళ్లయినా లేవు. అయితేనేం విపరీతమైన individuality డెవలప్ చేసాడు. బహుశా వాళ్ళమ్మ ట్రైనింగ్ ఏమో!

ఏమో ఏమిటి? ఆవిడ గారి కోచిన్గే. అనుమానం లేదు.

ఆవిడ గారేమో జిజియాబాయి లాగ వాడేమో జూనియర్ శివాజీ లాగ తెగ ఫీలయిపోయి వాడికి నాన్ స్టాప్ ఏదో ఒకటి నూరి పోస్తూనే ఉంటుంది. చరిత్రలో శివాజీ ఫాదర్కి ఎంత రోల్ ఉందొ మా కొంపలో నా పరిస్తితీ అంతే!

ఆవిడ గారి కోచింగ్ ఫలితమా అని వీడు మాత్రం తాను పట్టిందసలు కుందేలే కాదనే స్థితికి ఎదిగి పోయాడు.

ఓరోజు రాత్రి ....

మా వీర మాతాజీ మా బుజ్జులుగాడ్ని ఎంటర్టైన్ చేసే డ్యూటీ నాకు వేసి, ఆవిడ హాయిగా స్టార్ మూవీస్ పెట్టుకొని సెటిలయిపోయింది

మావాడి ఎంటర్తైన్మెంట్ ఛానెల్ అంటే స్టార్ ప్లస్ నేనేనన్నమాట

ఏం చేస్తాం ?

కట్టుకున్నాక, కన్నాక తప్పదు కదా! సరే ఎంటర్ టైన్ చెయ్యడం ప్రారంభించాను.

ఓ చిన్న రబ్బర్ ముక్కని చేతిలో పెట్టి గుప్పిట మూసి "ఇందులో ఏముందో చెప్పుకో చూద్దాం" అన్నాను.

"ఏనుగు" అన్నాడు ఠాకీమని

నాకు గుండాగినంత పనైంది, వాడితో వేలాకోలం కాదు. ఏనుగని ఊరుకుంటే ఫర్వాలేదు. కాని దాన్నిప్పుడు తెమ్మన్నా తెమ్మంటాడు. ఇలాంటి విషయాల్లో తాత్సారం పనికి రాదు.

"అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న చేతిలో ఎలా ఉంటుందిరా?" అన్నాను.

"అయితే సర్లే. ఏనుగు కాదు" అన్నాడు.

అమ్మయ్య. గండం గడిచింది.

నా అంచనా తప్పు. గండం గడవలేదు. మొదలయ్యింది.

"ఏనుగు కాదు. దాని పిల్లుంది" అని కంటిన్యూ చేసాడు.

చచ్చేం. కథ మళ్లీ మొదటికొచ్చింది. లాభం లేదు. ఈ ఆటని ఇంతటితో ఆపక పోతే పరిస్థితి డేంజెర్ గా మారే ప్రమాదముంది.

వెంటనే పిడికిలి విప్పేసి "చూడు ఏముందో" అన్నాను.

బుజ్జులు గాడు పిల్ల పోలీసు లెవెల్లో నన్ను వీర అనుమానంగా చూస్తూ "ఏనుగు పిల్లేది" అన్నాడు.

"వాళ్ళ మమ్మీ దగ్గరికేల్లిపోయిందోచ్" అన్నాను. మమ్మీ అని గుర్తు చేస్తే వాడి మమ్మీ దగ్గరికి వెళ్తాడు ఎమోనన్న ఆశతో. పిల్ల వెధవకి నమ్మకం కుదరలేదు. వీడెప్పుడూ ఇంతే. ఛస్తే నా మాట నమ్మడు. వాళ్ళమ్మ కోచింగు మరి.

నీ జేబులు చూపించమన్నాడు. నేను చూపించే వరకు ఆగకుండా వాడే వెదికేశాడు.

"నా ఏనుగు పిల్లని నాకిచ్చేయ్యి" అన్నాడు. అది "నీదేప్పుడయ్యింది" అని లా పాయింట్ లాగేను.
వీడేదో సొషలిస్ట్ లాగున్నాడు. దేశంలో వన్నీ వాడివే నని వాడికో గట్టి నమ్మకం.

"అది నాదే. నాకిచ్చేయ్. లేక పోతే ఏడుస్తా" నని బెదిరించాడు. మా వాడి దగ్గర ఇదో కన్వీనియన్సు ఉంది. టీవీ ప్రోగ్రామ్ముల్లా ముందు అనౌన్స్ చేసి ఏడుపు కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఓ సారి ప్రారంభిస్తే ఇకంతే. టీవీ కైనా ప్రసార సమాప్తి, అంతరాయాలు ఉంటాయి కాని మావాడికి ఉండవు.

"ఏనుగు పిల్ల వాళ్ళ మమ్మీ దగ్గరకి వెళ్లి బోజ్జుంది" అన్నాను.

"అయితే దాన్ని, దాని మమ్మీని కూడా తే" అన్నాడు. "అంతే కాదు. పిల్ల నాకు. మమ్మీ నీకు" అని వాటాలు కూడా పంచేశాడు.

"నాకు ఇల్లు తెలీదు కదా ఎలా తేను" అన్నాను. "నువ్వు అద్దబాలు చెప్తున్నావు" అని స్టేట్మెంట్ ఇచ్చేసి, చెంగున గెంతి వాళ్ళ మమ్మీ దగ్గరకెళ్ళి నా మీద "ఎఫ్ ఐ ఆర్" ఇచ్చేసాడు.

ఇంకంతే. ఆవిడగారు నాకో గంట లెక్చరు. "పగలంతా నేనే అడిస్తాను కదా. రాత్రి పూట కాస్సేపు ఆడించమంటే ఏడిపిస్తారా? అయినా వాడు నాకోక్కర్తికేనా కొడుకు. మీక్కాడా. భాధ్యతల్ని ఇద్దరూ షేర్ చేసుకోవాలి" స్త్రీ వాద ధోరణిలో సాగుతోందా లెక్చరు.

ఆవిడకి అర్ధం కాదుగాని నేను ఆఫీసు పని చేస్తే ఆవిడ ఇంటి పని చేస్తుంది. అదే షేరింగు. నేను వాడ్ని ఏడిపించానా  వాడు నన్ను  ఏడిపించాడా?

నా వల్ల కాదు. వీడితోనూ. వీడి మమ్మీతోనూ.కానియ్యండి. ఏం చేస్తాం? కట్టుకున్న ఖర్మం. కన్న ప్రారబ్ధం.

ఇంకో రోజు.... మంచం ఎక్కగానే ముసుగేసుకున్నాడు. చీకట్లో భయం వాడికి. అయితే అర్థ రాత్రి దాక పడుక్కోడు. నన్ను పడుక్కోనివ్వడు. అలా ముసుగులోంచే మాట్లాడుతూ ఉంటాడు.
అందుకే వాడ్ని ముసుగు వీరుడని పిలుస్తూంటాను. అలా ముసుగులోంచే ఓ డిక్లరేషన్ చేసాడు.

"నేనూ మమ్మీ పెళ్లి చేసుకుంటున్నాము" అని. తెల్లబోయాను.వీడికీ వయసులో ఇదేం బుద్ధి.?

"అదెలా కుదుర్తుంది. మమ్మీ నా పెళ్ళాం కదా?" అన్నాను. "అయితే ఏం. నేను కూడా చేసుకోవచ్చు" అన్నాడు.

"అదేం కుదరదు. ఒక పెళ్ళానికి ఒకడే మొగుడు కదా" అన్నాను లీగల్ పాయింటు లాగుతూ.

"కాదు. అయిదుగురు మొగుళ్ళు" ముసుగులోంచి ఆకాశవాణి సెలవిచ్చింది. నాకు మతి పోయింది.

వీడు చేసుకుంటే చేసుకున్నాడు. ఈ అయిదుగురి లేక్కేంటి? అదే అడిగాను. "మొన్న టీవీలో చేసుకుంది కదా" అన్నాడు. వీడి టీవీ పరిజ్ఞానం పాడుగాను.

"అదెప్పుడో. చాలా రోజుల కిందటి మాట. ఇప్పుడలా కుదర్డు. ఒక పెళ్ళానికి ఒకడే మొగుడు" అని గట్టిగా చెప్పాను.

"అదేం కుదర్డు. నేను మమ్మీని పెళ్లి చేసుకోవాల్సిందే" అన్నాడు నాకంటే గట్తిగా

స్టార్ మూవీస్ లో సినిమా అయ్యిపోయినట్టుంది. "పోన్లేరా కన్నా. అలాగే చేసుకుందువుగాని. మీ డాడీ మాటలు పట్టించుకోకు" అని వాళ్ళ మమ్మీ రంగప్రవేశం చేసింది.

ఇంకేం. ఆవిడ సపోర్టుతో వాడు రెచ్చిపోయాడు. వీళ్ళిద్దర్నీ ఇక ఆపకపోతే నా బతుకు మైనారిటీ పార్టీ గతే!

"ఇలా అయిదుగురు మొగుళ్ళు పూర్వం రాజుల కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. రాజులు లేరు" అన్నాను.

"మళ్లీ అద్దబాలు చెప్తున్నావు. మొన్న నీ ఫ్రెండ్ సుబ్బరాజు వచ్చాడుగా?" అన్నాడు.

వీడు పెద్దయ్యాక లాయర్ అయ్యేట్టున్నాడు. "ఆ రాజు వేరు. ఈ రాజు వేరు" అన్నానే కాని వాడు వింటేనా?

ఇంకా తెల్ల జెండా ఎగరేశాను. అక్కడితో ఆగలేదు. "నువ్వు నా పెళ్ళికి రావద్ద"న్నాడు.

ఎందుకంటే అదంతే అన్నాడు.

మళ్ళీ కాస్సేపయ్యాక "పోన్లే...రా" అన్నాడు. వీడిలా తయారవ్వడానికి కారణం వీడి మమ్మీనే.
వాడ్ని ఓ బాల ప్రహ్లాదుడిలాగ పెంచి వాడిలో బాగా భక్తి డెవెలప్ చేసింది. చేస్తే చేసింది కాని నన్ను మాత్రం హిరణ్యకశిపుడి లాగ ట్రీట్ చేస్తున్నాడు.

వీడెప్పుడు పెద్దవాదావుతాడో? నా కస్టాలు ఎప్పుడు తీరతాయో?



Tuesday, March 24, 2020

Ugadi. ఉగాది శుభాకాంక్షలు

ఓపిక, తీరిక లేనివాళ్ళందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఇదేటిదీ ఇలగంటున్నానేటి అని సంబ్రమాశ్చర్యపడకండి. నేను కోడికంటే ముందు లేస్తాను కాబట్టి నాకు బోల్డు సమయం ఉంది బోల్డు పెద్ద పోస్ట్ రాయడానికి సంకల్పించాను. మరది సదవాలంటే మీక్కూడా బోల్డు టైం ఉండాలిగా? అది లేనివాళ్ళకి ముందస్తుగా చెప్పేసాను.

ఇహ తీరిక ఉన్నవాళ్లు, తీరిక చేసుకున్నవాళ్ళు అమెరికావాడిలాగా ఓ పెద్ద జగ్గు సైజు మగ్గులో వేడి కాఫీ పోసుకొని, పడక్కుర్చీలో కాళ్ళు బార్ల చాపుకొని ఆ కాఫీ ఆస్వాదిస్తూ సదూకోండ్రి.

ఇవాళ ఉగాది అన్న విషయం తెలుగు పెజానీకానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పటి తరాలకి తెలీని విషయాలు ...

ఇవాళ తెల్లారగట్లే లేచి .... ఎందుకులెండి... యువతరం బాధపడతారు... పొద్దున్నే లేచి (పొద్దున్నే అంటే ఏ గొడవా ఉండదు... పదింటికి లేచినా పొద్దున్నే!)... కూసీపయ్యాక జుట్టుకు భారీ ఎత్తున నూనె, నువ్వుల నూనె అయితే భేష్, మర్దనా చేసి అంటే హెయిర్ కటింగ్ సెలూన్లో మంగలాడు తబలా వాయించినట్టు అన్నమాట, ఆపై వళ్ళంతా శుభ్రంగా నలుగుపెట్టుకుని ..ఇగో కుర్రాళ్లు నలుగు పెట్టడం అంటే ఏంటి ఇది మాకు అవుట్ అఫ్ సిలబస్ అని నన్ను సింపుల్గా దాన్ని వివరించమని అడక్కండి. ఆశ, దోస, అప్పడం, ఆవడ! ఛస్తే చెప్పను. నాకసలే బోల్డు పనులున్నాయి. కావాలంటే మీ ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళని అడగండి. లేకపోతె గూగుల్ చెయ్యండి.

నలుగు పెట్టుకుని ఓ చిన్ని తువ్వాలు చుట్టుకుని అంటే జ్యోతిర్లచ్మి సీరంత తువ్వాలు అన్నమాట! అలా ఓ గంటసేపు ఎండలో సంచరించండి. ఒళ్ళంతా చిమచిమలాడాక కుంకుడుకాయలతో అభ్యంగనస్నానం చెయ్యండి. ఈ కుంకుడుకాయలేంటి అంకుల్ అని విసిగించకండి. ఈ అంకుల్ అంటీ పిలుపులంటే నాకు మా సెడ్డ సిరాకు. కుంకుడుకాయలంటే కూరొండుకునే బెండకాయ, వంకాయ టైపు కాదు! అవెట్టి అంటే వాటిని ఓ గుండ్రాయితో పగలకొట్టి మీరు షాంపూ తో తలస్నానం చేసినట్టు చెయ్యడం! ఈ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయని మరింకో యక్షప్రశ్న వెయ్యద్దు. అమెజాన్ వాడు ఈపాటికి అమ్మడం మొదలెట్టే ఉంటాడు! కుంకుడు కాయల్ని ఇంగ్లీష్ లో ఏమంటారని మళ్ళీ నన్నడగద్దు. నేనేమీ గూగుల్ కాదు. అప్పుడప్పుడూ వాడిని కూడా  విసిగించండి. ఇంతకీ ఆ ఇంగ్లీష్ మాట తెలీగానే అమెజాన్ లో ఆర్డర్ సెయ్యండి. వచ్చే ఉగాదికయినా పనికొస్తాయి. ఎన్నేళ్లయినా పాడవ్వవు. అన్నట్టు కుంకుడుకాయలు బద్దలుకొట్టినప్పుడు లోపల నల్లటి గుండ్రంగా ఉన్న గింజలు ఉంటాయి. ఓ గింజనట్టుకుని గచ్చుమీద పదిసార్లు బాగా రుద్ది వెంటనే పక్కనోళ్ళ చేతిమీద పెట్టి చూడండి. మస్తుగుంటది! మనకి. వాళ్ళక్కాదు

అలా అభ్యంగనస్నానం ... ఓహో ఇది కూడా తెల్దుగా ... సింపుల్గా మీకర్ధమయ్యేట్టు చెప్పాలంటే తలంటు! ఈ కార్యక్రమం జయప్రదంగా ముగించాక ఇంకో పావుగంట ఓ మంచి కాలక్షేపం పనోటుంది. అదేటంటే ఆ కుంకుడుకాయ తొక్కలు, గింజ ముక్కలు మీ జుట్టులో ఇరుక్కుపోయిన వాటిని ఒకటొకటి పీకడం. బోల్డు టైం పాస్... ఓ పక్క ఈ ఫేస్బుక్ సూస్తూ.

లేకపోతే ఒక కోతి ఇంకో కోతికి తల్లో పేలు చూసినట్టు, మీరు ఇంకోళ్ళ జుత్తులో ఉన్నవి పీకి మీ జుత్తులోవి వాళ్ళని పీకమనండి. ఎవరు ఎక్కువ పీకితే వాళ్లకి రెండో వాళ్ళు ఓ నూట పదహార్లు సదివించుకోవాలని ఓ పందెం పోటీ కూడా సర్దాగా పెట్టుకోవచ్చూ.

ఆ పైన మీ ఇంట్లో ఉన్న దేవుడికి ఓ చిన్ని నమస్కారం పడేసి మీకు కంఠతా రాకపోతే గూగుల్ చేసి "శుక్లాంబరధరం ... " అని ఓ రెండు లైన్ల శ్లోకం సదివేసి... దానర్ధం తర్వాత తీరిగ్గా తెలుసుకుందారి ... అది తప్పులు పోకుండా సదివి... ఆ తర్వాత ఉగాదిపచ్చడి తిని, ఒకింత తాగితే ... అందులో ఉన్న షడ్రుచులు ... ఇదేటి మాస్టారూ ఆడపడుచులు అని విన్నాం కానీ ఈ షడ్రుచులు ఏటంటారా? కూసింత అప్పుడప్పుడూ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. షడ్రుచులు అంటే ఆరు రుచులు ... బహుశా ఆరు ఋతువులకి గుర్తుగానేమో . అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు! ఇవన్నీ ఆ ఉగాదిపచ్చడిలో ఉంటాయి. భారీఎత్తుని తినండి! తాగండి! ఇక్కడ ఓ నమ్మకం ఉందండోయ్! ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే మనకి ముందస్తుగా ఏ రుచి తగులుతుందో ఇహా ఈ సంవత్సరం అంతా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి అని! ఉదాహరణకి తీపి తగిలితే ఇంకేముంది హోల్ ఇయర్ హోల్ సేల్ గా తీపి గుర్తులే! ఇక్కడ వాస్తు మార్పులు చేసి మన అదృష్టాన్ని మనకిష్టం వఛ్చినట్టు మార్చేసినట్టు, మనకి ఏ అనుభవం కావాలనుకుంటే తత్సంబంధమైనది ఒకింత ఎక్కువ వేసి పచ్చడి చేస్తే సరి! ఉదా: బెల్లం ఎక్కువేస్తే ఇహ మరి తియ్యగానే కదా ఉండేది! మరింకేం రెచ్చిపోండి.

అన్నట్టు సెప్పడం మర్సేపోయా మీకు పండక్కి, పబ్బానికి (లోపాయికారీ మేటర్ ఏమిటంటే ఈ పబ్బానికి అన్న మాటకి అర్ధం నాకూడా తెలీదు!) కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం ఉంటే అవి వేసుకుని ఆ పైన దేవుడికి దండం, తర్వాత తొంగోడం1

అన్నట్టు మర్సేపోయా! తొంగోడానికంటే ముందు పంచాంగ శ్రవణం! అంటే ఇంట్లో పంచాంగం ఉందనో, లేక ఆన్లైన్ లో చూసో మీ రాశిఫలాలు చదివేసుకోవడం కాదు! శాస్త్రం ఒప్పుకోదు! ఇంకొకళ్ళు చదివితే వినడం! రాశిఫలాలే కాదు, దేశానికి ప్రపంచానికి కూడా వార్షిక ఫలితాలు చెప్తారు. ఏ కొరోనా ఎప్పుడు పోతుందో కూడా దుర్భిణీ వేసి చూసి సెప్తారు. 

ఆ తర్వాత పచ్చడి (మెతుకుల)తో కడుపు నిండదు కాబట్టి... పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇవ్వాళ కూడా పొద్దుగాల ఉప్మా చేసుకోకుండా ఇంకేదైనా వెరైటీ టిఫినీ చేసుకొని తినండి.

తర్వాతేముంది ...షరా మామూలే... వాట్సాప్ లో వచ్సిన ప్రతి మెసేజ్ ని ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చెయ్యడం, ఇక్కడ ఓ పోస్టు పడెయ్యడం. తర్వాత అబ్బా బాగా అలిసిపోయాం అని బోయనం టైం దాకా ఓ కునుకెయ్యడం. ఏ మాటకామాటే! నలుగెట్టుకొని, తలంటోసుకున్నాక నిద్రొస్తుంది చూడండి...

నిద్ర లేచాక, క్షమించాలి లేపాక... భారీగా ఆవలించి ఏమిటి పండగ స్పెషల్ అని మీ ఆవిడనో, ముమ్మీనో విసిగించి ఆవిడ పెట్టినవి తిని netflix లో, అమెజాన్ ప్రైమ్ లో ఓ అరా డజనుకు తక్కువ కాకుండా సినిమాలు సీరియళ్లు బింజ్ వాచింగ్!

మరిహ డిన్నరయ్యాక ఢాంమ్మని మంచం మీదకి గెంతి బొబ్బొడం!

ఇలా చేసిన వాళ్లందరికీ, వచ్చే ఏడాది చేద్దాంలే అనుకుని ఇవాళ ప్రతి రోజులాగే సాదా సీదాగా గడిపేసే వాళ్లందరికీ ... ఇవన్నీ ఎందుకు మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ముఖ్య గమనిక: ఇవాళ ఏం చేసినా, ఎలా చేసినా మీ ఇష్టం. కానీ మీ కొంప నాలుగు గోడల మధ్యే చేయండి. లేప్పోతే తర్వాత నవ్వలే"క రోనా" 

Friday, October 25, 2019

Feeling "bored" with routine life?!


Many of us feel frequently that our life has become very routine and very boring. We are unable to figure out how to put in some excitement and enthusiasm in our lives.

In fact if you care to  think about it almost everyone's life is a big routine! If we get a heart attack its a life changing event for us but for a cardiologist "its just another case"! For a cancer patient ditto. For police only the victims and criminals faces/names change but their life is one long routine of the same old crimes! These guys hardly see any "exciting" new case/crime!

For actors/actresses the story/co actors change but their job of acting is the same! The same old "crying" sentimental scenes, so called comedy, those routine dances....everything is same.

For lawyers ditto. For Sales guys ditto. For cab/auto drivers ditto. For you and me ditto! Ditto! Ditto!


Big changes don’t normally happen frequently in anyone’s life. So the best thing to do would be to bring in few small/tiny changes ourselves!

Here are few tips to again feel “alive”. Please note that any of these actions might not make you feel very excited but only act as “supplements” so to say.

Please also keep in mind not to overdo these things meaning don’t do too many things at once. Just implement one or at the most two in a week or fortnight otherwise you will run out of ideas and find life routine and boring again!

TIPS:

Change some routine in your day – Either stop something you are doing daily for just few days or change the order of your routine. For example if you are used to having tea in the morning start having coffee or vice versa.

Change your hairstyle.

Grow or remove your mustache.

If you normally wear only full hand shirts buy a couple of half sleeve shirts and wear them and vice versa.

Grow a beard.

Start tucking in your shirt if you aren’t doing it now.

Change the route to your office if you commute by bike/car.

Chuck your bike/car for few days and commute by public transport like city bus/ metro or auto/cab,

Change your sleep time. Most of you sleep past 11 PM! Start sleeping at 10 AM.

Get up one hour earlier than your normal time.

Cultivate a new hobby. Please understand that a hobby/ passion isn’t something you do in your spare time but it’s something for which you spare time. Spend at least a couple of hours per week or a half day per month on pursuing your hobby. No. You can’t say photography is your hobby if all you do is click endless selfies!

Change the cover / case of your mobile and NOT your mobile!

Put some funny sticker/s on your bike/car.

Just go window shopping in any big mall and DON’T buy anything!  Not buying anything is very important!

Watch a movie in a language you don’t understand – Indian or foreign.

Learn how your name is written in different languages and put that in your Facebook/ Twitter profile!

Change the home/lock screen photos in your mobile frequently and don’t put your own photos!

Delete ALL the Apps you haven’t used in the last 2 months. You can always download them later on when you need any of them. Try to limit the Apps to just 3 screens of your mobile.

Relocate/ remove all the icons on your desktop. Put them in a couple of folders. Make it clutter free and very simple.

Listen to songs of other languages – Indian and foreign. African music has got good beat!

Try to go to any nearby tourist spot on a Sunday – it doesn’t matter what it is. Go alone if you want to really enjoy the trip. Or take along a couple of friends. If you like driving, like me, drive down. It feels terrific. Try to go at least once in a couple of months.

Go for a long holiday of at least 4/5 days in a year. Alone or with friends or family. Don’t carry your laptop with you!

Get a pet dog if you like them. They will make your life very exciting! They simply get excited on seeing you! If only we learn from them how to get excited for small routine things!

Rearrange the furniture in your house. Relocate the wall hangings/ calendars from one wall to another.

These are only few I could think of right away. Hope you get the drift and you can come out with your own tips!

Now go and get EXCITED "routinely"!!!