Friday, September 18, 2015

Life's purpose or Jeevita Lakshyam !!

కొంతమంది జీవితాలు చూస్తే వాళ్ళు "కారణజన్ములు" ఏమో అనిపిస్తుంది. పుట్టీ పుట్టగానే పరిమళిస్తారు. వాళ్ళనుకున్నది తొందర తొందరగా సాధించేసి ఏదో పెద్ద అర్జెంటు పనున్నట్టు వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద, రామానుజన్. మాండొలిన్ శ్రీనివాస్ కూడా అదే కోవకి చెందినవాడు.

నాలాంటి "అకారణజన్ములకి" ఎందుకు పుట్టామా అన్నది తేల్చుకునేలోపలే జీవితం అయ్యిపోతుంది:(

అసలు ఆలోచిస్తూంటే దేవుడు మనుషులందరికీ చాల అన్యాయం చేసాడనిపిస్తోంది! ఎంచక్కా మనందరం పుట్టినప్పుడు మన కాలి బొటనవేలికో, మెడకో ఒక చిన్నట్యాగ్ మన జీవితంలో సాధించాల్సినది రాసిపెట్టి పంపించచ్చుగా? అప్పుడు మనకి యుక్త వయస్సు రాగానే, మన తల్లితండ్రులో, లేదా పెంచిన పెద్దవాల్లో మనల్ని పిలిచి "ఒరే అబ్బీ! ఇదిగోరా నీ జీవితలక్ష్యం అని ఇనప్పెట్టేలో అన్నాళ్ళు భద్రంగా దాచిన ఆ చీటీ మన చేతిలో పెడతారు. అప్పుడు మనం ఎంచక్కా, చేతనైతే చకచకా, చేతకాకపోతే ఒకింత నిమ్మదిగా మన జీవిత లక్ష్యం సాధించేసి హాయిగా కాళ్ళు చాపుకొని కుర్చోవచ్చు :)
 
ఈ ఫెసిలిటీ లేకపోవడంతో చూడండి ఎంత ఇబ్బందో? నా మట్టుకు నాకు దాదాపుగా రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతున్నా ఇప్పటిదాకా నేనెందుకు పుట్టానో తెలీకపోవడంతో, నేను దుష్ట రక్షణ చెయ్యాలో, శిష్ట రక్షణ చెయ్యాలో తెలీక అలా పడక్కుర్చీలో కాళ్ళూపుకుంటూ కాలయాపన చేసేస్తున్నాను. ఇదేమన్నా బాగుందా? నాకయితే బాలేదు.

మీరేమంటారు?!!

Antharvani and Akashavani

నా చిన్నప్పుడు అంటే 60's , 70's లో చాలా తెలుగు సినిమాల్లో అంతర్వాణి, ఆకాశవాణి చిన్న ప్రధాన పాత్రలు పోషించేవి!

ఇక అంతర్వాణి విషయానికొస్తే నిలువుటద్దాలే దాని ఇల్లు! హీరో కాని హీరోయిన్ కాని లేదా వాళ్ళ తండ్రి కాని ఏదైనా ఒక "వెధవ" పని చేయ్యపోతే ఇది వెంటనే రంగంప్రవేశం చేస్తుంది. వాళ్ళు అద్దం ముందుకి రాగానే అది వెంటనే "వాళ్ళ ప్రతిబింబం" లా కనిపించి, మంచి ఎఫెక్ట్ కోసం ఒక వికటాట్టహాసం చేస్తుంది. వెంటనే ఆ సదరు పాత్రని పట్టుకొని "తళతళ" తప్ప ఇంకేది మిగలకుండా ఉతికి ఆరేస్తుంది. "ఆయ్! ఏమిటి నువ్వు చేద్దామనుకుంటున్నది. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎందుకింత అన్యాయానికి ఒడిగట్టావు?" ఇట్లా ఆ కథని పట్టి కడిగేస్తుంది! అప్పుడప్పుడూ మంచి పని చేద్దామనుకున్న వాళ్ళని వెధవ పని చెయ్యమని ప్రేరేపించడం కూడా ఉందండోయ్!! అప్పుడు ఆ హీరో కాని హీరోయిన్ ఉడుక్కొని వెంటనే చేతిలో ఏదుంటే అది కోపంతో ఆ అద్దంమీదకి విసిరేస్తారు! అప్పుడు ఆ అంతర్వాణి ఆ పగిలిన అన్ని అద్దం ముక్కల్లోనూ కనిపిస్తూ, వికటాట్టహాసం రిసౌండ్ వచ్చేలా నవ్వుతూ అదృశ్యం అయ్యిపోయేది! అలాంటి సినిమా చూసి ఇంటికొచ్చాక రెండు రోజులదాక తల దువ్వుకోవడానికి కూడా అద్దం జోలికి పోయేవాడిని కాదు :(

అపుడప్పుడూ హీరో కాని, తరుచుగా హీరోయిన్ కాని భారీ కష్టాల్లో పడ్డప్పుడు "ఆకాశవాణి" ఒక విషాద గీతం ఎత్తుకునేది! అసలే ఆకాశంలో ఎత్తుగా ఉంటుందేమో ఆ పాటలు కూడా సాధారణంగా పై స్థాయిలోనే (High pitch!) ఉండేవి. ఈ ఆకాశవాణి పాటల్లో ప్రధాన వాద్యం వయోలిన్!! ఆ వాయులీనంలో ఈ ఆకాశవాణి పాట లీనమయ్యిపోయేది. ఆ పాట వస్తున్నంతసేపు హీరో లేదా హీరోయిన్ ఒకటే భారీ బరువులు మోస్తూండడం, లేదా భారీ వర్షంలో రోడ్ మీద రాత్రిపూట చీకట్లో, మెరుపుల వెలుగులో అలా నడుచుకుంటూ వెళ్లిపోవడమో చూపించేవాళ్ళు. లేదంటే ఎవరికైనా వర్షంలో ప్రసవం!!

ప్చ్! ఇప్పటి సినిమాల్లో అంతర్వాణి లేదు. ఆకాశవాణి లేదు.  రెండు వాణిలు అంతర్ధానం అయ్యిపోయాయి.  

Wednesday, September 16, 2015

Vinayaka Chavithi in 60's

నేను స్కూల్లో చదివేటప్పుడు, అంటే మూగమనసులు సినిమా ఫస్ట్ సీన్లో ముసలాయన అన్నట్టు "ఎప్పటి కథ బాబు?", 60's లో వినాయకచవితి ముందు రోజు మధ్యాన్నం స్కూల్ సెలవిచ్చేసేవాళ్ళు. అంతే వెంటనే అబ్బాయిలందరం ఊరి మీద పడి, కనిపించిన ప్రతి మొక్క, చెట్టు విచక్షణ లేకుండా పీకేసి, ఇంక మొయ్యలేము అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి, సంజీవిని పర్వతం పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడి లాగ (హనుమంతుల వారు ఖచ్చితంగా మా అంత పోజు పెట్టి ఉండక పోవచ్చు!) పెద్ద పోజు ఇచ్చేవాళ్ళం! ఆ రోజుల్లో ఇప్పటిలాగా విరివిగా కెమెరాలు లేవు కాబట్టి ఆ "సెల్ఫీ"లు అన్నీ నా హృదయంలోనే ఉండిపోయాయి. మన మనసులో ఉన్నది ప్రింట్ చేసే రోజు త్వరలోనే వస్తుందని నా ఊహ! ఆశ! అప్పుడు ఆ "సెల్ఫీ" ప్రింట్ తీసి పోస్ట్ చేస్తాను.;)

ఆ తర్వాత వినాయక చవితి రోజు, ఇద్దరు అక్కలు, నేను ఒక తమ్ముడు పాలవెల్లి కట్టడం, మా చేతనైనంత దాన్ని అలంకరించడం షరా మామూలే! పిల్లలం కదా? పూజకంటే ప్రసాదం మీదే ధ్యాస ఎక్కువ ఉండేది. కాని పిల్లల్ని దేవుడు ఇలాంటి విషయాల్లో తప్పు పట్టడు. ఇలాంటి విషయాలేంటి, ఎలాంటి విషయాల్లోనూ పిల్లల్ని దేవుడు అపార్థం చేసుకోడు. ఎందుకంటే "పిల్లలూ, దేవుడూ చల్లని వారే! కల్లాకపట మెరుగని కరుణామయులే" అన్న పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది!!

ఈ రోజుల్లో కరివేపాకు, కొత్తిమీర దగ్గర నించీ అన్నీ కొనుక్కోవడమే! ఇక వినాయకుడి పూజకి పత్రీ సంగతి చెప్పనఖ్ఖరలేదు. ఆ సరదాలు అన్నీ "హుష్ కాకి" :(
 
నాకందుకే అప్పుడప్పుడూ "ఏంటో గురూ? ఆ రోజులే వేరు" అని వేటగాడు సినిమాలో రాజబాబు లాగ ఒక పెద్ద నిట్టూర్పు వదలాలనిపిస్తూంటుంది:(

ఇంకా రాద్దామని ఉంది కాని ఇప్పుడు వెళ్లి రేపటి పూజకి పత్రీ కొనుక్కు రావాలి కదా? అందుకని ఇప్పటికి శెలవు!

Friday, September 11, 2015

Facebook in Telugu!!

కొంత మంది తెలుగు భాషా వీరాభిమానులు పేస్బుక్ ని ముఖపుస్తకం అని తరుచుగా రాయడం చూస్తున్నాను. అప్పుడప్పుడు సరదాకి రాస్తే బాగానే ఉంటుంది కాని ఎప్పుడూ అలాగే రాస్తేనే కొంచం ఇబ్బందిగా అనిపిస్తోంది నాకెందుకో అది సబబు కాదు అనిపిస్తుంది. ఫేస్బుక్ అనేది ఒక పేరు. కేవలం ఆ పేరు రెండు ఇంగ్లీష్ పదాలతో చెయ్య బడిన ఒక కొత్త పదం! దానికి అనువాదం ఉండదు ఎందుకంటే అదొక పేరు! పేర్లని నామవాచకం అంటారని లీలగా గుర్తు! నామవాచకాలని తర్జుమా చెయ్యకూడదనుకుంటా?!

రెండు ఇంగ్లీష్ పదాలు కనిపించినంత మాత్రాన దాన్ని అలా విడగొట్టి అనువాదం చెయ్యడం ఎబ్బెట్టుగా ఉంటుందేమో? ఇదే పద్ధతిని అవలంబించాలంటే ఎవరెస్ట్ పర్వతాన్ని eve rest అన్న రెండు పదాలు ఉన్నాయి అని చెప్పి "అమ్మాయి విశ్రాంతి" అంటున్నామా? లేదుగా? సింగపూర్ పదంలో sing a pore అన్న మూడు మాటలున్నాయని "పాడు ఒక సూక్ష్మరంధ్రము" అంటామా?

మీరేమంటారు?!!

Monday, August 31, 2015

Betalprasna!!

ఈనాటి #బేతాళప్రశ్న !! కంగారు పడకండి! "ఈనాటి" అంటే ప్రతిరోజు బేతాళప్రశ్నలు వేస్తానని కాదు! ఏదో అప్పుడప్పుడూ!!

నేను కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే హైదరాబాద్ లో సిగ్నల్స్ దగ్గర సర్వ సాధారణంగా ఒక బిచ్చగత్తె కిటికీ అద్దాన్ని, దాని ఇంటి తలుపు తట్టినట్టు, తట్టడం మొదలెడుతుంది! ఇది నాకు బాగా ఇర్రిటేట్ చేసే విషయం కాని ఏమి చెయ్యలేని పరిస్తితి. పొరపాటుని ఏమన్నా నోరు జారి అన్నామంటే "పోకిరి" సినిమాలో లాగా రేపటి నించీ నన్ను టార్గెట్ చేసి బాధపెడతారేమో అని, నోరుమూసుకొని వాళ్ళున్న వేపు చూడకుండా,  రెండో వేపో, ఎదురుగానో చూస్తూ ఉంటాను. వాళ్ళు అలా కిటికీ అద్దంమీద కొట్టీ, కొట్టీ, విసిగి వెళ్ళిపోతారు.

ఇంతకీ ఇలా అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నానని భావించే పాఠకులకి ఒక మనవి. ఇదే బేతాళ కథ చందమామలో వస్తే నాలుగు పేజీల తర్వాత బేతాళుడు రంగప్రవేశం చేస్తాడు కదా అందుకని నన్ను కనీసం నాలుగు లైనులు రాయనివ్వండి!

ఇక అసలు కథలోకి వస్తే ఒకరోజు నేను నాఫ్రెండ్ నా కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. నా ఫ్రెండ్ కిటికీని ఒక బిచ్చగత్తె మాములుగానే ఠపఠప కొట్టడం మొదలెట్టింది. నేను కూడా మామూలుగా రెండో వేపు చూస్తూ, నిమ్మకు నీరెత్తినట్టు, కూర్చున్నాను. ఇంతలో నా ఫ్రెండ్ కిటికీ అద్దం దించేసి, రెండు సీట్లకి మధ్యలో నేను అపురూపంగా దాచుకున్న చిల్లరలోంచి ఒక అయిదురూపాయల కాయిన్ మంచి స్టైల్ గా తీసి ఆమె చేతిలో వేసాడు, నేను ఆపేలోపల :(

నాకు బోల్డు కోపం వచ్చింది. కాని ఏం మాట్లాడకుండా, సీరియస్గా (ఏడుపు) మొహం పెట్టుకోని గ్రీన్ సిగ్నల్ రాగానే అక్కడినించి నిష్క్రమించాను. పక్కవాళ్ళదయితే అయిదు రూపాయలేం ఖర్మ, అగ్రహారాలే దానం ఇస్తాను నేనైతే!

ఇంతకీ బేతాళప్రశ్న ఏమిటంటే ఆ బిచ్చగత్తెకి డబ్బు వేసింది నా ఫ్రెండ్ కాబట్టి, ఆ 5 రూపాయల పుణ్యం నా ఫ్రెండ్ కి వస్తుందా? డబ్బు నాది కాబట్టి పుణ్యం నాకు వస్తుందా? లేక ఇద్దరికీ చేరి సగమా?

సమాధానం తెలిసీ చెప్పకపొతే ఏమవుతుందో నాక్కూడా తెలీదు :(

NB: అద్దిరబన్నా ఇన్నాళ్ళకి ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది కదా అని మొత్తం పుణ్యం నా ఫ్రెండ్ కే చెందుతుంది అని చెప్దామనుకునేవాళ్లకి ఒక చట్ట బద్ధమైన హెచ్చరిక. (ఎందుకంటే ఆ దానం నా అనుమతి లేకుండా చేసాడు కాబట్టి!) అలాంటి తీర్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకి నేను వచ్చి, వీధిలో వెళ్తున్న బిచ్చగాళ్ళకి మీఇంట్లోంచి తలా ఒక కేజీ ఉల్లిపాయలు దానం ఇచ్చే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత్త!!! 

Saturday, August 22, 2015

Un Fair & Not so Lovely!!

అన్ ఫెయిర్ & నాట్ సో లవ్లీ!!

ముందు మాట: ఈ రచనలో ఒక్క రవ్వ మనం ప్రతిరోజూ వినే ఒక రెండు slang పదాలు సందర్భానుసారం అంటే ఎమోషన్కి expression పండాలంటే (సినిమా వాళ్ళ భాషలో) ఆ మాత్రం మాండలీకం వాడాల్సిందే అని రాయడం జరిగింది! కొంతమందికి అసభ్యంగా అనిపిస్తే క్షంతవ్యుడిని.

ఇంకొంచం ముందు మాట: ఈ రచన కొంచం సత్యజిత్ రే సినిమాలా అనిపించచ్చు!! అంటే నేను ఆయన రేంజ్ అని కాదు. ఆయన సినిమాల్లో లాగా కొన్ని జీవిత నగ్న సత్యాలు చెప్తానన్నమాట! ఇక్కడ నాకో సందేహం అసలు ఈ "నగ్న సత్యం" అన్న మాట ఎందుకు పుట్టింది? అంటే కొన్ని నిజాలు బట్టలు వేసుకుని, లేదా ఎవ్వరికీ కనిపించకూడదని ముసుగులు వేసుకుని ఉంటాయా?

చివరి మాట: ఇదేమిటి ఈ విచిత్రం? చివరి మాట కూడా ముందస్తుగా చెప్పేస్తున్నారు అని హాస్చర్య పడిపోతున్నారా? ఇలా ఎందుకంటే కొంతమంది చివరి దాక చదవక పోయే ప్రమాదం ఉంది! అందుకని ముందు జాగ్రత్త చర్య అన్నమాట. ఇంతకీ విషయం ఏమిటంటే నేను మానసిక వైద్యుడిని కాదు! నేను రాసిన దానికి ఎక్కడా రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి లేవు. కేవలం నా సొంత తెలివి మాత్రమే! నేను రాసిన దాంట్లో ఒకింత లేదా బోల్డంత నిజం ఉందనిపిస్తే నమ్మండి.

ఇహ కథా ప్రారంభం!

సాధారణంగా ఇంట్లో కూతురైనా, కొడుకైనా నాన్న దగ్గరి నించి కొంచం భారిగా సొమ్ములు కావాలంటే, అంటే వాళ్లకి ఏ Samsung S 6 కాని iPhone 6 కాని కావాలనుకోండి. నాన్నని డైరెక్ట్ గా అడిగితే బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కదా. ముందు అమ్మని కాకా పడతారు రికమండేషన్ కోసం! అప్పుడేం చేస్తారు? అమ్మ వంటింట్లో వంట చేస్తున్నప్పుడు వెళ్లి పక్కని నిలబడి మెల్లిగా ఆ కబురు ఈ కబురు చెప్తారు. డైరెక్ట్ గా విషయంలోకి వస్తే బాగోదు కదా. మేనమామ కబుర్లు పుట్టింటిదగ్గరా అన్నట్టు వీళ్ళ సంగతి అమ్మలకి తెలీకనా. వాళ్ళు కూడా వీళ్ళ కబుర్ల ప్రహశనంలో పాల్గొంటారు. తర్వాత ఏమి అడుగుతారో అని లోపల్లోపల ఆలోచించేస్తూ!

(పిడకల వేట: ఇక్కడ ఇంకో సందేహం. Samsung వాళ్ళు, Apple వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి ఇలా నంబర్ల వారీగా ఫోనులు అమ్మేస్తూ ఉంటారా? ఇద్దరి లేటెస్ట్ ఫోనులు 6 దాక వచ్చి ఆగాయి. అసలు Apple కంపెనీ వాళ్ళు iPhone 2 మార్కెట్ లో వదిలినప్పుడే నేను వాపోయాను. నేను iPhone కొనే సొమ్ములు కూడపెట్టేటప్పటికి iPhone 8 వస్తుంది అని. నేనింకా ఒక మట్టిహుండీ కొనలేదు. కనీసం మార్గదర్శి లోనైనా చేరలేదు. వీళ్ళు అప్పుడే iPhone 6 దాక వచ్చేసారు!)

అప్పుడు కూతురో, కొడుకో అమ్మ తరుగుతున్న వంకాయలు నీళ్ళల్లో వెయ్యడం చూసి "అదేంటమ్మా? వంకాయ ముక్కలు నీళ్ళల్లో ఎందుకేస్తున్నావు? మొన్న బెండకాయలు తరిగాక వాటిని నీళ్ళల్లో వెయ్యలేదు కదా?" అంటారు. అప్పుడు ఆ అమ్మ ఏమంటుంది "వంకాయ నీళ్ళల్లో వెయ్యక పొతే ముక్కలు నల్లగా అయిపోతాయి" అంటుంది! దాంతో ఈ కుర్రాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. నలుపు చూడ్డానికి బాగుండదు. తెలుపు కాని ఇంకే రంగైనా బాగుంటుంది అనే కదా! అది వాళ్ళ మనసులో నాటుకు పోతుంది. అంతే అది అలా కొన్ని సంవత్సరాలకి బలపడి వాళ్ళు నల్లగా ఉంటే వీలయినంత తెల్లగా అవ్వడం కోసం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి వాడడం, పెళ్లి ఊసోచ్చేటప్పటికి అబ్బాయిలంతా (వాళ్ళు నల్లగా ఉన్నా సరే!) తెల్లగా ఉన్నఅమ్మాయే కావాలని పట్టు పట్టడం చాల సర్వ సాధారణం అయ్యిపోయింది. మరి ఈ discrimination కి పునాది వేసి దాన్ని పెంచి పెద్దది చేసి తొక్కలోది ఈ తెల్ల తొక్కకి అంత పెద్దపీట వేసి, చివరాఖరికి పిల్లలని తప్పుపట్టేది కేవలం పెద్దవాళ్ళే!

నాకు తెలీక అడుగుతాను వంకాయ కూరకాని, పచ్చడి కాని చేసాక అది నల్లగా ఉంటే ఏమయ్యిందిట? వంకాయగా ఉన్నప్పుడు మహా సుందరమైన రంగులో ఉన్నట్టు! కూర నల్లగా ఉంటే వచ్చే ఉపద్రవం ఎమన్నా ఉందా? లేదు.ఏ రంగులో ఉంటే ఏమిటి. అనవసరంగా పిల్లల మనస్సుల్లో నలుపు బాగుండదని ఒక ఆలోచన ఎందుకు పెట్టడం?

ఒక్కసారి ఆలోచించండి! నేనుచెప్పినదాంట్లో ఒకింత నిజం ఉందనిపిస్తే ఇవాల్టి నించి కనీసం వంకాయలని తరిగాక నీళ్ళలో వెయ్యడం మానేయ్యండి!

ఈ వర్ణ వ్యత్యాసానికి తెర దించెయ్యండి, ఇవాల్టి నుంచీ వర్ణరహిత సమాజం కోసం మీ వంతు తోడ్పడండి !!

Wednesday, July 1, 2015

Lite Lelo!!


ఇప్పుడే అందిన వార్త! BREAKING NEWS!!

హైదరాబాద్ లో ఎక్కడో నాలుగు చుక్కలు వాన పడిందిట!!! దాన్ని పురస్కరించుకొని నేనెప్పుడో రాసిన "రచన" చదవండి. దీన్ని "కథ" అనడానికి మనసు రావడంలేదు. ఎందుకంటే అందులో "కథ:" ఉంటె కదా?!!