Monday, August 31, 2015

Betalprasna!!

ఈనాటి #బేతాళప్రశ్న !! కంగారు పడకండి! "ఈనాటి" అంటే ప్రతిరోజు బేతాళప్రశ్నలు వేస్తానని కాదు! ఏదో అప్పుడప్పుడూ!!

నేను కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే హైదరాబాద్ లో సిగ్నల్స్ దగ్గర సర్వ సాధారణంగా ఒక బిచ్చగత్తె కిటికీ అద్దాన్ని, దాని ఇంటి తలుపు తట్టినట్టు, తట్టడం మొదలెడుతుంది! ఇది నాకు బాగా ఇర్రిటేట్ చేసే విషయం కాని ఏమి చెయ్యలేని పరిస్తితి. పొరపాటుని ఏమన్నా నోరు జారి అన్నామంటే "పోకిరి" సినిమాలో లాగా రేపటి నించీ నన్ను టార్గెట్ చేసి బాధపెడతారేమో అని, నోరుమూసుకొని వాళ్ళున్న వేపు చూడకుండా,  రెండో వేపో, ఎదురుగానో చూస్తూ ఉంటాను. వాళ్ళు అలా కిటికీ అద్దంమీద కొట్టీ, కొట్టీ, విసిగి వెళ్ళిపోతారు.

ఇంతకీ ఇలా అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నానని భావించే పాఠకులకి ఒక మనవి. ఇదే బేతాళ కథ చందమామలో వస్తే నాలుగు పేజీల తర్వాత బేతాళుడు రంగప్రవేశం చేస్తాడు కదా అందుకని నన్ను కనీసం నాలుగు లైనులు రాయనివ్వండి!

ఇక అసలు కథలోకి వస్తే ఒకరోజు నేను నాఫ్రెండ్ నా కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. నా ఫ్రెండ్ కిటికీని ఒక బిచ్చగత్తె మాములుగానే ఠపఠప కొట్టడం మొదలెట్టింది. నేను కూడా మామూలుగా రెండో వేపు చూస్తూ, నిమ్మకు నీరెత్తినట్టు, కూర్చున్నాను. ఇంతలో నా ఫ్రెండ్ కిటికీ అద్దం దించేసి, రెండు సీట్లకి మధ్యలో నేను అపురూపంగా దాచుకున్న చిల్లరలోంచి ఒక అయిదురూపాయల కాయిన్ మంచి స్టైల్ గా తీసి ఆమె చేతిలో వేసాడు, నేను ఆపేలోపల :(

నాకు బోల్డు కోపం వచ్చింది. కాని ఏం మాట్లాడకుండా, సీరియస్గా (ఏడుపు) మొహం పెట్టుకోని గ్రీన్ సిగ్నల్ రాగానే అక్కడినించి నిష్క్రమించాను. పక్కవాళ్ళదయితే అయిదు రూపాయలేం ఖర్మ, అగ్రహారాలే దానం ఇస్తాను నేనైతే!

ఇంతకీ బేతాళప్రశ్న ఏమిటంటే ఆ బిచ్చగత్తెకి డబ్బు వేసింది నా ఫ్రెండ్ కాబట్టి, ఆ 5 రూపాయల పుణ్యం నా ఫ్రెండ్ కి వస్తుందా? డబ్బు నాది కాబట్టి పుణ్యం నాకు వస్తుందా? లేక ఇద్దరికీ చేరి సగమా?

సమాధానం తెలిసీ చెప్పకపొతే ఏమవుతుందో నాక్కూడా తెలీదు :(

NB: అద్దిరబన్నా ఇన్నాళ్ళకి ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది కదా అని మొత్తం పుణ్యం నా ఫ్రెండ్ కే చెందుతుంది అని చెప్దామనుకునేవాళ్లకి ఒక చట్ట బద్ధమైన హెచ్చరిక. (ఎందుకంటే ఆ దానం నా అనుమతి లేకుండా చేసాడు కాబట్టి!) అలాంటి తీర్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకి నేను వచ్చి, వీధిలో వెళ్తున్న బిచ్చగాళ్ళకి మీఇంట్లోంచి తలా ఒక కేజీ ఉల్లిపాయలు దానం ఇచ్చే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత్త!!! 

No comments:

Post a Comment