రెండ్రోజులక్రితం నాకు జలుబు చేసిన సంగతి పాఠకులకి విదితమే!
ముక్కు మూసుకుపోయి ఊపిరాడకపోయినా ఎవరికీ తప్పినా నాకు తప్పదు కాబట్టి నిన్న దాదాపు ఓ అయిదు గంటలు బలాదూర్ ఊరంతా తిరిగాను. మాస్క్ పెట్టుకుని. అసలే భారీ జలుబు. దానికి తోడు ఈ మాస్కు. ప్రతి రెండు నిమిషాలకి ఎవరూ చూడకుండా ఆ మాస్కు ముక్కుకిందకి తోసి మనసారా గాలి పీల్చి మళ్ళీ మాస్కు పైకి తోయడం! ఇదే పని నిన్నంతా
పొద్దున్నే ఆరింటికి మా ఆవిడ మెడిటేషన్లో ఉంటుంది . అందుకని సాధారణంగా మా అమ్మకి మొదటి కాఫీ నేనే ఇస్తాను. ఇవాళ యధావిధిగా ఆరింటికి కాఫీ ఇచ్చి పక్కనే సోఫాలో నేను కూడా కూలపడ్డా. మాములుగా అయితే కాఫీ ఇచ్చి వెంటనే వంటింట్లోకి వెళ్లి ఏడున్నరకల్లా కూర వగైరా చేసి పడేస్తా! ఇవాళ జలుబు కారణంగా పొద్దున్న వాకింగ్ కూడా ఎగ్గొట్టా. అందుకని బద్దకంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నా
వెంటనే అమ్మ "జలుబు తగ్గిందా" అనడిగింది. ఊహూ అన్నా. ఏదన్నా మందేసుకో అంది. ఇదేమిటండీ విచిత్రం. జలుబుకు మందేమిటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. మందేసుకుంటే వారంలో, వేసుకోకపోతే ఏడు రోజుల్లో పోతుందిట జలుబు!
ఆ రెలెంట్ ఏదో టాబ్లెట్ వేసుకో అర్జెంటుగా! అంది. ఇదొకటి. ఆవిడే మందులు కూడా రాసిచ్చేస్తుంది. మా ఇంట్లో ఆవిడ RMP అంటే రెసిడెంట్ మెడికల్ ప్రొఫెషనల్! నా ఇద్దరు అక్కలు డాక్టర్లు అవడం కాదు కానీ కిడ్నీ స్టోన్స్ నించీ బ్రెయిన్ కాన్సర్ దాకా అన్ని మందులు తెలుసు మా అమ్మకి! అలాగేలే అన్నా. ఇంకేమైనా అననిస్తేగా
రాత్రి ఆవిడ అల్లిన స్వెట్టర్ వేసుకుని పడుకున్నా. అది చూసి "ఏమిటీ? స్వెట్టర్ లూజ్ అయినట్టుంది. నేను లూజ్ అల్లానా నువ్వు సన్నపడ్డవా అని మళ్ళీ ఇంటరాగేషన్! నేనే సన్నపడ్డా అని నిఝమ్ చెప్పేసా. "ఓహో. పోనీ చలి ఆపుతోందా " , "ఆపుతోంది"
"ఓ పని చేస్తా. నీకో మఫ్లర్ అల్లుతా"
"వామ్మో! వద్దు. నాకలవాటు లేదు"
"మా చిన్నప్పుడు జలుబు చేస్తే ఇప్పట్లా మందుల్లేవు. యూకలిప్టస్ ఆయిల్ అని అమ్మేవాళ్ళు. నీలగిరి తైలం అంటారు. అది వాడేవాళ్ళం. ఇప్పుడు దొరుకుతుందో లేదో? ఓ సారి అమెజాన్ లో చూడు"
చూసా. అమ్మకేం. అమ్మేస్తున్నాడు. అమెజాన్ వాడు. పిడకలు, బొగ్గులు అమ్మేవాళ్ళకి నీలగిరి తైలం ఒక లెక్కా?
"ఉంది అమెజాన్ లో! 250 అన్నా"
"బుక్ చెయ్యి వెంటనే" ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ చేసింది
తప్పుతుందా. బుక్డ్!
"అదొచ్చాక చెప్పు. ఎలా వాడాలో చెప్తా"
"సరే"
"మళ్ళీ ఇవాళ ఊరికే బైటికి తిరగద్దు. ఇంట్లోనే ఉండు. "
"అలాగేలే"
అయ్యా ఇదీ సంగతి!
అప్పుడప్పుడూ నేను రాత్రి భోజనం మానేస్తా! మధ్యాన్నం ఎక్కువ తిన్నాననో, సాయంత్రం మా ఆవిడ బోల్డు బజ్జీలు చేసిందనో, లేక ఓ 50 గ్రాములు బరువు తగ్గుదామనో! అలా మానేస్తే వెంటనే మా ఆవిడని అడుగుతుంది మా అమ్మ "ఏంటీ అరుణ అన్నం తినలేదు" అని
మా ఆవిడ సమాధానంతో తృప్తి చెందక వెంటనే నన్ను పట్టుకు అడుగుతుంది "అన్నం తినలేదు. ఒంట్లో బాలేదా"?
"బాగానే ఉందమ్మా. తినాలని లేదు"
"నువ్వు అబధం చెప్తున్నావు"
"ఇంత చిన్నదానికి అబద్ధం చెప్తానా"
"అయితే వచ్చి కనీసం మజ్జిగా అన్నం అయినా తిను. అలా ఖాళీ కడుపుతో పడుక్కోకూడదు"
ఈ భారద్దేశం అమ్మలున్నారే! ఎవరితోనైనా పెట్టుకోండి కానీ. ఈ అమ్మలతో పెట్టుకోకండి. గెలవలేరు.
దీన్నే "కిల్లింగ్ విత్ కెయిన్డ్ నెస్" అనేవాళ్ళు మా నాన్న