Saturday, June 25, 2016

హుస్సేన్ సాగర్!! Hussain Sagar!!



నా కాలేజ్ జీవితం అంతా గుంటూరు లో వెలగపెట్టాను. ఆ రోజుల్లో దసరా సెలవులకి , వేసవి  సెలవులకి  విజయవాడ కి వెళ్లి అక్కడున్న ఫ్రెండ్ తో ఒకటో, రెండో రోజులు గడపడం అలవాటయ్యింది . అలా వేసంకాలంలో వెళ్ళినప్పుడు పాపం కృష్ణా నదిలో నీళ్లు బొత్తిగా ఉండేవి కావు .. బ్రిడ్జి కి ఇవతలి వేపు అనుకోండి!! అప్పుడు నేను నా ఫ్రెండ్ ఎంచక్కా కృష్ణలో ఈ చివరి నించి నడుచుకుంటూ  ఆ చివరికి వెళ్లి, కాళ్ళు  నొప్పెట్టి కూసింత సేపు రెస్ట్ తీసుకొని, సొల్లు కబుర్లు అన్నీ అయ్యాక (అంటే పెద్దయ్యాక ఏ ఉద్యోగం రాకపోతే వేసంకాలంలో అటు చివర పల్లీలు అమ్ముకుంటే మాలాగా ఇలా వాహ్యాళికి వచ్చే వాళ్లకి అమ్మి  బాగానే సంపాదించచ్చు లాంటి ఆలోచనలు అన్నమాట!)  మళ్లీ ఈ చివరికి నడుచుకుంటూ వఛ్చి ఒక పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం . నిజానికి అది ఘనకార్యమే! మీలో ఎంతమంది అలా ఏ నదిలోనైనా  అడ్డంగా నడిచారు ?! చాలా కొద్ధిమందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం అది.

పైన రాసింది పీఠిక (అంటే కరెక్ట్ అర్ధం తెలీదు కాని బహుశ నేను అనుకున్నఅర్ధమే  అయ్యుంటుందని ప్రగాఢ విశ్వాసం!)

ఇహ అసలు విషయంలోకి వస్తే

అలా నా కాలేజీ ప్రహశనం అయ్యిన వెంటనే రెండో వారానికి హైదరాబాద్ వచ్చాను. ఎందుకు? షరా మామూలే! కూటికోసం! కూలి కోసం!!

వచ్చిన కొత్తల్లో నాకు ఈ హుస్సేన్సాగర్ భలే గమ్మత్తుగా అనిపించేది. ఊరి మద్యని కొలనులా! ఆ రోజుల్లో ఈ నగరం పేరుకే నగరం కాని సాయంత్రం పూట కాసీపు తిరగడానికికాని, చూడ్డానికి కాని ఏమి ఉండేవి కావు. ఇదిగో ఈ సాగరం, దాని ఒడ్డు ట్యాంక్ బండ్ తప్ప!! ఆదివారాల్లో అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఈ ట్యాంక్ బండ్ మీద కాసీపు తిరిగి కాళ్ళు పీకాక కూర్చోడానికి బెంచ్ కోసం చూసేవాళ్ళం! పెద్ద బెంచ్ మీద కొత్తగా పెళ్ళైన జంటలు ఓ మూల కూర్చొని కిచకిచలాడుతూ   కనిపించేవాళ్ళు. ప్రేమికులు ఆ రోజుల్లో అంత బహిరంగంగా తిరిగే వాళ్ళు కాదు. ఏ చెట్టు చాటునో, పొదల మాటునో సెటిల్ అయిపోయేవాళ్ళు!  ఈ బెంచ్ మీదున్న జంటలు ఎప్పటికీ లేచిపోరే (ద్వందార్ధం  దురదృష్టం!) ఎంతసేపు మేమలా నిలువు జీతం. ఇహ లాభం లేదని బెంచ్ ఒక చివర ఒకళ్ళం కూర్చునేవాళ్ళం. మిగతా వాళ్ళం వాడికి ఎదురుగా ఆ రైలింగ్ ఆనుకొని తెగ కబుర్లు, జోకులు, నవ్వులు. కావాలని బాగా ఓవర్మా ఆక్షన్ చేసేవాళ్ళం. మా బాధ పడలేక, చూడలేక, భరించలేక ఆ కొత్త జంటలు అయిదు నిమిషాలు తిరక్కుండా లేచిపోయేవాళ్ళు!! అరబ్బీవాడు, ఒంటె కధ టైపులో మా Mission accomplished ;)

అలా సొల్లు వాగుతున్నప్పుడు ముందు ముందు జీవితం వెండితెర మీద  ఎలా ఉంటుందో , ఎవరికి ఏ  ఉద్యోగం వస్తుందో, ఎప్పుడు పెళ్లిళ్లు  అయ్యి మేము కూడా ఇలా ఈ బెంచ్ మీద కూర్చుంటామో,  ఇలాంటి అంతులేని జవాబు తెలీని ప్రశ్నలు అన్నీ చర్చించేవాళ్ళం! మాకు పెళ్ళయ్యి ఇలా బెంచ్ మీద కూర్చున్నప్పుడు, మాలాంటి కుర్రకారు మా స్ట్రాటజీ ఉపయోగిస్తే మట్టుకు చస్తే లేవకూడదు అని కూడా ఒక సామూహిక నిర్ణయం తీసుకున్నాం!

ఇంతకీ అలా ఆ బెంచ్ మీద సెటిల్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు  నాకు నా కాలేజ్ రోజుల అలవాటు గుర్తొచ్చి ఓ చిలిపి ఆలోచన వచ్ఛేది . ఈ హుస్సేన్సాగర్ లోతు ఎంత ఉంటుంది . నీళ్లన్నీ ఎండిపోతే కింద ఎలా ఉంటుంది . ఎప్పుడైనా అలా నీళ్లన్నీ ఎండిపోతే ఎంచక్కా ఈ చివరినించి ఆ చివరికి వాకింగ్ చేస్తే మజా వస్తుంది కదా అని ! కానీ అన్ని నీళ్లు ఎప్పుడు ఎండాలి ? నా చిన్ని కోరిక ఎప్పుడు తీరాలి ? సో ఆ కోరిక నా తీరని కోరికల లిస్టు లో అగ్రతాంబూలం పుచ్చుకుంది.

ఇప్పటిదాకా ఇది ఉపోద్ఘాతమే!!

ఇహ మరికొంచం ముందుకి అంటే ఓ రెండేళ్ల క్రితానికి వస్తే  కేసీర్ గారికి కూడా నాలాంటి కోరిక ఉన్నట్టుంది ! ఒక్కసారి సడెన్ గా హుస్సేన్సాగర్ నీళ్లు మొత్తం ఖాళీ చెయ్యిస్తానని ప్రకటించారు! ఆ రోజు చూడాలి నా మొహం! నా మొహంలో దాచినా దాగని ఆనందం!! మనమేదో అనుకుంటాం కానీ నిజంగా మనకి నిస్వార్ధ మైన చిన్ని చిన్ని కోరికలుంటే అవి ఎప్పటికైనా తీరుతాయి! ఆహా నా కల ఇన్నాళ్ళకి, ఎన్నేళ్ళకి తీరబోతోంది .  ఆ వార్త చదివిన వెంటనే ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఓ రెండు నిమిషాలు gangnam డాన్స్ కూడా చేసాను.  ఎంచక్కా ఆ నీళ్లన్నీ తోడేశాక హాయిగా పురప్రజలం అందరం సాయంత్రం పూట  అందులో అటూ, ఇటూ వాకింగ్ చేస్తూంటే రెండు కళ్ళూ చాలవు చూడ్డానికి .

నీళ్లన్నీ తీసాక అందులో ఇంకేమి నిధి నిక్షేపాలు బైట పడతాయో ? ఆస్తి పంజరాలు, మోటార్ సైకిళ్లు, కార్లు  వగైరా కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ;) 

ఆ వార్త చదివిన దగ్గర్నించీ ఇప్పటిదాకా ఒక ఏణ్ణర్ధం నించీ కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు  చూస్తున్నా! అబ్బే. ఆ  నీళ్లు ఖాళీ చేసే ప్రయత్నాలు అసలు మొదలెడితేగా ? ఓ వందమందిని పెట్టి బకెట్ లతో ఖాళీ చేయించినా ఈపాటికి సగం నీళ్ళు ఖాళీ అయ్యేవి. అసలు  ఖాళీ చెయ్యడం మాట పక్కన పెట్టి,  ఆ మురికి నీళ్లని క్లీన్ చెయ్యడం కోసం కొత్త మెషిన్ ఒకటి తెప్పించారు . నాకు అర్ధం కానిది ఒకటే. ఎలాగూ మొత్తం నీళ్లన్నీ  ఖాళీ చేస్తామన్నారు కదా మళ్లీ ఈ లోపల ఆ పారబోసే నీళ్ళని బోల్డు డబ్బులు ఖర్చు పెట్టి శుద్ధి చెయ్యడం ఎందుకో ?! అయినా సామాన్య ప్రజలకి ఇలాంటి క్లిష్టమైన విషయాలు ఎలా అర్ధం అవుతాయి? ఇందులో ఏదో మనం అర్ధం చేసుకోలేని మర్మం ఉండే ఉంటుంది. 

అయినా నాకిప్పుడు ఆ మాయ, మర్మం అవేమీ అఖ్ఖర లేదు. నేనెప్పుడో మర్చిపోయిన నా చిన్ని కల, కోరికని మళ్లీ రేకెత్తించారు!! నాలో లేనిపోని ఆశలు కల్పించారు.  అంతలోనే దానిమీద ఆ హుస్సైన్సాగర్ నీళ్ళు పోసి ఆర్పేశారు! ఐ హర్టెడ్ . 

నాక్కావలసిందల్లా మన హుస్సేన్సాగర్ ని ఎప్పుడు ఖాళీ చేస్తారు ? 

నేను అందులో ఆ చివరినించి ఈ చివరికి నడిచి, మధ్యలో బుద్ధుడి దగ్గర పిట్ స్టాప్ వేసి నా వెనకాల ఆయన కనిపించేట్టు సెల్ఫీ  ఎప్పుడు తీసుకుంటాను?    

లేదా ఈ నీళ్లు ఖాళీ చేసే పధకానికి నీళ్లు వదులుకోవాల్సిందేనా ?

నోట్! షరా మామూలే! ఈ బేతాళ ప్రశ్నలకి సమాధానం  తెలియకపోయినా, తెలిసి చెప్పకపోయినా, ఏమీ కాదు!

ఇలాంటి జవాబు లేని, తెలీని, ఎవర్నీ అడగలేని ప్రశ్నలు ప్రజల దగ్గర ఎన్నో? ఎన్నెన్నో?



Friday, June 10, 2016

తపోభంగం!!

తపోభంగం!!

మొన్న పొద్దున్నే 5 గంటలకి లేచాను. పొద్దున్నే లేస్తే ఏం చెయ్యాలో తోచక ఏదోఒక వెధవ పని చెయ్యాలనిపిస్తుంది చాలామందికి. నేను కూడా ఆ మందిలో గోవిందా!

ఏం చెయ్యాలో మాంఛి ఫిల్టర్ కాఫీ తాగితే తడుతుంది అని వెంటనే ఫిల్టర్ వేసేశాను. నేను పొద్దున్నే లేచానని పాల వాడు లేవడు కదా పాలు రాలేదు. మనింట్లోనే ఆవుంటే ఈ కష్టాలుండవుకదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పితికేసుకోవచ్చు! దీన్నే ATM అంటారు అంటే Any Time Milk ;)

తాజా పాలు, తాజా డికాక్షన్ అయితే కాఫీ ఉత్తమం!  నిన్నటి పాలు, నిన్నటి డికాక్షన్  అయితే మధ్యమం. కాని నేను తాగింది అధమం. నిన్నటి పాలు, నేటి తాజా డికాక్షన్ తో ఒక రకమైన కాఫీ!! రుచి అడగద్దు. రెండు రకాలుగా ఉంది. కాని పొద్దున్నే కాఫీ తాగకపోతే బండి స్టార్ట్ అవ్వదు కదా. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. పాలొచ్చే దాకా లేవకపోవడమే!

మొత్తానికి అదో టైపు కాఫీ తాగాక ఏం చెయ్యాలనే  ఐడియా కోసం ఆలోచించడం మొదలెట్టా. అప్పుడో ఐడియా తట్టింది . ఏం  చెయ్యాలని కాదు. ఏం చెయ్యాలన్న ఆలోచన ఏం చేస్తే సులభంగా వస్తుంది అన్న ఐడియా!  బైట చిన్న తుంపర పడుతోంది. బాల్కనీ  చివర ఓ కుర్చీ వేసుకొని ఆ తుంపరలో మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది? అని.  ఎందుకంటే మెడిటేషన్ చేస్తే వచ్చేవన్నీ ఆలోచనలే కదా :(  పైగా  పూర్వం మునులు ఆరుబైట చెట్లకింద అడవుల్లో తపస్సు చేసుకొనేవాళ్ళు కదా. వాళ్ళు ఎండకి, వానకి చలించి తపోభంగం అయినట్టు ఏ తాళపత్రగ్రంధం లోనూ రాసిన దాఖలాలు లేవు. లేకపోతె ఇటువంటివి మూడో కంటి వాడికి తెలీకుండా తొక్కేసేరేమో?!

సరే వానలో అదే తుంపరలో టెస్ట్ రన్ చేస్తే పోయిందేముంది. వాన పెద్దదైతే పరిగెత్తి ఇంట్లోకి పారిపోవడమే. ఈ ఆలోచన రావడం ఆలీసం ఓ కుర్చీ తీసుకెళ్ళి మా రూఫ్  గార్డెన్ లో ఉన్న నాలుగు మొక్కల మధ్యన వేసుకొని కూర్చున్నా.

ఒక పక్కనించి తులసి మొక్క కొమ్మలు తగులుతున్నాయి. ఇంకోపక్క మా ఆవిడ పెంచుకుంటున్న నాకు పేరు తెలీని ఇంకో మొక్క కొమ్మలు గుచ్చుకుంటున్నాయి. మూడో వేపు నించి సన్నటి చినుకులు. కాని తపస్సు చేసేటప్పుడు ఇలాంటి చిన్ని, చిన్ని ఆటంకాలు పట్టించుకొకూడదుగా? వాటిని లక్ష్య పెట్టకుండా కళ్ళుమూసుకొని మెడిటేషన్ మొదలెట్టా.

అలా ఎంతసేపు మెడిటేషన్ చేసానో తెలీదు కాని ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. మెడిటేషన్ లో ఇలాంటివి మామూలే అనుకోండి. అదేమిటంటే మెడిటేషన్ చేస్తున్నా చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తుంటాయిగా. పాలవాళ్ళ స్కూటర్ శబ్దాలు, పేపర్ వాళ్ళ సైకిల్ శబ్దాలు, పనిమనుషులు గేట్లు తీసిన కిర్రు శబ్దాలు, ఉన్నట్టుండి వీధి కుక్కల అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు, కొండొకచో దూరం నించి ఎమ్మెస్ గారి సుప్రభాతం, పార్క్ కి వాకింగ్ కి కారులో వెళ్ళే వాళ్ళ కారు శబ్దాలు, వాటి రివర్స్ హార్న్ కర్ణ కఠోర శబ్దాలు వగైరా!

ఈ శబ్దాలకి నా తపోభంగం కాదు. టీవీ చూస్తూంటే కింద స్క్రోలింగ్ లైన్స్ లాగా అవి అలా వినిపిస్తూంటాయి. నా తపస్సు అలా సాగిపోతుంటుంది .

కాని ఇంతలో వచ్చిన ఆ ఆలోచన ఏమిటంటే మాకు పేపర్ వేసేవాడు ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు పేపర్ లుమ్మ చుట్టి ఒక మిస్సైల్ లాగా చేసి రోడ్ మీదనించి మా బాల్కనీ లో పడేట్టు గురి చూసి మాంచి స్పీడ్ తో విసురుతాడు. ఎంత స్పీడ్ అంటే మా వీధి తలుపు వేసి ఉంటే దానికి ఆ మిస్సైల్ తగిలి ఒక చిన్న సైజు బాంబు పేలిన శబ్దం వస్తుంది. వాడి గురి సరిగ్గా ఉంటే, మా తలుపు తీసుంటే అది నేరుగా ఇంట్లో హాళ్ళో పడి సర్రుని క్రికెట్ లో యార్కర్ లాగా నెల మీద ఒక పది అడుగులు దూసుకు పోతుంది. ఆ పేపర్ బాయ్ ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. ఫాస్ట్ బౌలర్ ఏమో కూడా?! కాని టీవీ లో లైవ్ టెలికాస్ట్ చూసి వాడు కూడా కొన్ని బౌలింగ్ మెలుకువలు నేర్చుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ అయినా అప్పుడప్పుడూ స్లో బాల్ వేస్తాడు ;) అప్పుడు ఆ పేపర్ బాల్ ఇంట్లోకి రాకుండా మా మొక్కల మీద పడి వాటి కొమ్మలు, అప్పుడప్పుడూ వాటి నడుము విరిచేస్తుంది.

ఇప్పుడిదంతా మీకు రామాయణంలో పిడకలవేటలాగ అనిపించచ్చు. కాని అసలు మాటర్ ఇక్కడే ఉంది. నేను ఇప్పుడు కుర్చీ వేసుకొని కూర్చున్నది ఆ మొక్కల మధ్యలో! అంటే వాడి బౌలింగ్ పిచ్!! ఇప్పుడు నాకు వినిపిస్తున్న పేపర్ బాయ్ సైకిల్ శబ్దాల్లో మా వాడి సైకిల్ కూడా ఉండి వాడు కనక పేపర్ మిస్సైల్ విసిరాడంటే అది డైరెక్ట్ గా నా తలకి తగిలి కపాలమోక్షమే! తపస్సు చేసుకుంటూ మోక్షం, అందునా కపాలమోక్షం పొందిన మొదటి, బహుశా ఏకైక వ్యక్తిగా, (ఇంత రికార్డు స్థాపిస్తే వ్యక్తి ఏమిటి ఏకంగా మహర్షి అనాలేమో!) చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం లీలామాత్రంగా గోచరించింది. మీలాంటి వాళ్ళ సంగతేమో కాని నాకు మట్టుకు ఇప్పుడప్పుడే మోక్షం పొందాలన్న కోరిక లేదు. ఎందుకంటే తీరని కోరికలు చాలా ఉన్నాయి. అవన్నీ తీరాక మోక్షం వేపు ద్రుష్టి సారిస్తాను. ఇప్పుడేమీ తొందర లేదు. మరిప్పుడు ఏం చెయ్యాలి. మెడిటేషన్ అపెయ్యడమా? కాదు.

అప్పుడు నాకో సందేహం వచ్చింది. మునుపు తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళే వాళ్ళు కదా. అడవిలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూంటే ఏ పులో, ఎలుగుబంటో వచ్చి, వాళ్ళని "సిట్టింగ్ డక్" లాగ భావించి, వాటి తపస్సుకి మెచ్చుకొని దేవుడే వాటికి ఇలా "ఫ్రీ మీల్స్" ఏర్పాటు చేసాడని ఆనందపడి, తదనంతరం ఆ తపస్సు చేసుకొనే వాడి మీద పడి, ఆ రోజుల్లో ఫ్రిజ్ లేకపోయినా రోజంతా దాచి మూడు పూటలా శుష్టుగా భోజనం చేస్తాయి కదా. మరి ఈ భయం ఆ తపస్సు చేసుకొనే మునులకి రాదా? బోల్డు సంవత్సరాలు తపస్సు చేస్తే పోనీ కొన్ని శక్తులు వచ్చి వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అప్పుడే తపస్సు మొదలెట్టి "L" బోర్డు పెట్టుకున్న పిల్ల మునుల గతేమిటి? వాళ్ళు తపస్సు, నేను హారర్ సినిమా చూసినట్టు అంటే భయంకరమైన సీన్లు వచ్చినప్పుడు రెండు కళ్ళూ దాదాపుగా మూసి, ఆ సీన్ ఎప్పుడయిపోతుందా అని తెలుసుకోవడం కోసం అతి తక్కువ కళ్ళు విప్పి భయంభయంగా చూసినట్టు చేసేవాళ్ళా? అంటే ఈ కొత్తగా తపస్సు మొదలెట్టిన మునులు అలా ఎక్కడ ఏ జంతువు వస్తుందో అని ఒక కన్ను మూసి, ఒకటి తెరిచి, లేదా అర్ధ నిమీలిత నేత్రాలతో చేసేవాళ్ళా? ఇప్పుడు నేను కూడా అలాగే చెయ్యాలా? అలా చేస్తే దాన్ని కొంగ / దొంగ జపం అంటారేమో?

(అయినా ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తూంటే ఈ అశాంతి ఆలోచన ఏమిటి? )

లేకపోతే  ఇలా తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళేవాళ్లకి మనకి ఇప్పుడు "పూజా సామగ్రి" అమ్మే దుకాణాలు ఉన్నట్టు  ఆ రోజుల్లో ప్రత్యేక  "తపస్సామగ్రి " అమ్మే దుకాణాలు ఉండేవా ? అందులో జింక చర్మం, కమండలం, కౌపీనం, ముడి పిన్నులు, రుద్రాక్షమాల,  దండం, వగైరా వగైరా అమ్మేవాళ్ళేమో? అక్కడే కుంచం పేరున్న మునీశ్వరుడి రికమండేషన్ తాళపత్రం మీద చూపిస్తే (మనమిప్పుడు మందుల షాపులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్  చూపించినట్టు !) వాళ్లకి బహుశా "జంతు వికర్షణ యంత్రం" కూడా అమ్మేవారేమో? లేకపోతె ఇప్పుడు బొద్దింకలు గట్రా రాకుండా "లక్ష్మణరేఖ" టైపు విభూతి ఏమన్నా?! ఇలాంటివి లేకపోతే ఆ కొత్త మునుల తపస్సు నిరాటంకంగా ఎలా  జరిగేది? 

ఈ బేతాళ ప్రశ్నకి జవాబు ఏ తాళపత్రంలోనైనా ఉందా? మీకేమన్నాతెలుసా?!! 

సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న జింక చర్మం మీద ఎందుకు తపస్సు చేస్తారు అందునా అహింసా వాదులు?!!

సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న 2: ఇలా జింక చర్మం మీద కూర్చొని తపస్సు (ఈ రోజుల్లో మెడిటేషన్!) చెయ్యడం మన భారద్దేశంలో కనీసం ఒక 5 వేల సంవత్సరాల సాంప్రదాయం అని నాలాంటి వాడెవరైనా ఇప్పుడు ఒక చిన్న జింక చర్మం ఇంట్లో పెట్టుకున్నాననుకోండి నా మీద కూడా సల్మాన్ ఖాన్ మీదెట్టినట్టు కేసు పెడతారా ? ఇదెక్కడి అన్యాయం ?! నేను మన సనాతన , పురాతన సంస్కృతి ని ఎలా కాపాడాలి?! ఎలా? ఎలా? ఎలా?!!

నేనిలా మూడుసార్లు "ఎలా " అని అడిగానని  మీరు మీ జవాబు మూడు సార్లు రాయనవసరం లేదు ;)