Saturday, February 6, 2016

Ambajipet Amudam !!

ఆదివారం - ఆముదం!!

నా చిన్నప్పుడు, చిన్న పిల్లాడినని జాలి కూడా లేకుండా, చిన్న పిల్లాడిని చేసి, చాల తరుచుగా, ఆరు నెలలకోసారి ఆముదం ఒక పురిశెడు బలవంతంగా తాగించేవాళ్ళు :( ఆరు నెలలకి అయితే "తరుచుగా" అని ఎందుకన్నావోయ్ మరీ అతిశయోక్తి కాకపొతే అని మీరు అడగచ్చు. తప్పు లేదు. ఆ ఆముదం తాగిన వాళ్ళకి తెలుస్తుంది. ఆరునెలలకి తాగినా "తరుచుగా" అనిపిస్తుందని !!

ఆముదం తాగించే కుటిల ప్రయత్నాలు ముమ్మరంగా ,పిల్లలకి తెలీకుండా కుట్ర, కుతంత్రాలు పెద్దవాళ్ళు చేస్తున్నారని పిల్లలకి కూడా తెలిసేది. మాక్కూడా వేగుల వాళ్ళుంటారుగా!! అంతే వెంటనే పెద్ద వాళ్ళకి దొరక్కుండా దాక్కునే వాళ్ళం! ఇక్కడ ఒక పెద్ద అడ్వాన్టేజ్ ఏమిటంటే మేము నలుగురు పిల్లలం! ఈ ఆముదం నలుగురికి ఒక్కసారి పడితే వచ్చే ఉపద్రవం విజ్ఞులైన మీ అందరికీ విదితమే!! అందుకని వంతుల వారీగా ఒక్కో ఆదివారం ఒకళ్ళకి పట్టేవాళ్ళు. అందుకని ఈ ఆదివారం ఎవరికి ఆ "శిక్ష" పడుతుందో పిల్లలమైనా మాక్కూడా ఇట్టే తెలిసిపోయేది. ఈమాత్రం దానికి వేగులవాళ్ళు పెద్దగా అవసరం లేదు ... ఒక్క మొదటి పిల్ల విషయంలో తప్పితే !

అలా ఈ ఆదివారం ఎవరిదో ముందుగా ఉప్పందితే వెంటనే ఆ సదరు పిల్ల(డు) "శని కంట పడకుండా ఒకాయన చెట్టు తొర్రలో దాక్కున్నట్టు" ఎక్కడో ఈ పెద్దమనుషులకి దొరక్కుండా దాక్కునే వాళ్ళం. కాని మన కొంపలేమీ మైసూరు పాలస్ అంత పెద్దవి కావు కదా, పెద్దవాళ్ళు "వేట" మొదలెట్టిన 10, 15 నిమిషాల్లో దొరికిపోయేవాళ్ళం :( ఎందుకంటే కొన్ని నెలలకి దాక్కునే స్థలాలు కొత్తవి ఏవీ ఉండేవి కావు. పెద్దవాళ్ళు ముందస్తుగా ఇంతకు ముందు మేము దాక్కున్న ప్రదేశాలే చూసేవాళ్ళు!! అటు పైన ఒక్కటే మార్గం ఇంటి బైటికి పోవడమే. కాని చిన్నపిల్లలం బైట ఎంతసేపు ఉంటాం? కాసేపటికే బోల్డు ఆకలి వేస్తుంది కదా? 

సరే. వెనకటికి భారతంలో చెప్పినట్టు "మాలో మేము కొట్టుకు చచ్చినా, బైటి శత్రువుకి సంబంధించినంత మట్టుకు మేము 105 మందిమి అని కౌరవులు, పాండవులు అన్నట్టుగా" మాలో మేము ఎంత కొట్టుకున్నా ఇలాంటి కామన్ ప్రమాదం విషయంలో పిల్లలందరం "ఐకమత్యమే మహా బలం" అన్న సిద్ధాంతం పాటించేవాళ్ళం!! పెద్దవాళ్ళ దృష్టి మనం దాక్కున్న ప్రదేశం నించి మళ్ళించే ప్రయత్నాలు చేసేవాళ్ళం 

ఇక్కడ ఇంకో లిటిగేషన్ ఉందండోయ్! ఈ పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఆముదం పట్టే విషయంలో, వాళ్ళల్లో వాళ్లకి ఎన్ని గొడవలున్నా, వాళ్ళు కూడా "ఐకమత్యమే మహా బలం" అన్న సిద్ధాంతం పాటించేవాళ్ళు! వాళ్ళ దెబ్బలాటలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఇలాంటి విషయాల్లో అందరూ ఒకటయ్యిపోయి "జాయింట్ మిలిటరీ ఆపరేషన్"  చేసేవాళ్ళు. పిల్ల, పెద్దా తేడా లేకుండా అందరూ ఒకే పుస్తకం (ఇక్కడ మహా భారతం!) చదివితే ఇదే చిక్కు :(

అప్పుడప్పుడూ సెలవులకి వచ్చిన మా మావయ్యల సాయం తీసుకొనే వాళ్ళు ఈ పెద్దవాళ్ళు! రిఇన్ఫోర్సుమెంట్ అన్న మాట. ఈ మావయ్యలు కూడా అప్పుడప్పుడూ డబల్ గేమ్ ఆడేవాళ్ళు. మా తరఫున ఉన్నట్టు నటిస్తూనే, మా యుద్ధ సమావేశాల్లో పాల్గొని,  మా రహస్య స్థావరాలన్నీతెలుసుకొని పెద్దవాళ్లకి ఉప్పందించేవాళ్ళు! విశ్వాస ఘాతుకులు :(  

మన పార్టీ, ఎగస్పార్టీ ఒకటే స్ట్రాటజీ అవలంబిస్తే ఏమవుతుంది? బలవంతుల పార్టీయే గెలుస్తుంది. అంటే పెద్దవాళ్ళ పార్టీ!

అందుకని పిల్లలం చాల తేలిగ్గా దోరికిపోయేవాళ్ళం :( దొరికిపోయాక ఇంకేముంది. అందరికీ తెలిసిన భాగోతమే!

అలా దొరికిపోయిన పిల్ల(డు) వేపు మిగిలిన ముగ్గురు పిల్లలు "పొద్దున్నే తెల్లారకుండా ఉరి తియ్యడం కోసం తీసుకెళ్ళే ఖైదీ వేపు, మిగతా ఖైదీలు చూసినట్టు" జాలిగా, నిస్సహాయంగా చూసేవాళ్ళు :(  లోపల్లోపల "వెధవ జీవితం ఒకరు ముందు ఒకరు తర్వాత అంతే కదా" అన్న నిర్వేదంతో,  వచ్చే వారం మన వంతేమో అన్న భయంతో కూడా !

ఈ దొరకడానికి ముందు ఏమన్నా "ఎస్కేప్ రూట్" ఉంటే పారిపోయేవాళ్ళం! ముందు మనం వెనకాల ఆముదం సీసాతో శత్రువర్గం, పరుగో, పరుగు! మనల్ని పట్టి, ఆముదం పట్టాక మనం ఒక్కళ్ళమే పరుగు(లు)..ఎక్కడికో చదువరులకి చెప్పనవసరం లేదు ;) 

అలా ఆముదం తాగిన, క్షమించాలి, బలవంతంగా తాగించిన తర్వాత ఒక గంటలో అరడజనుకి సార్లకి తక్కువ కాకుండా పరిగెత్తి, "రెండు రకాలుగా" అలిసిపోయి, నీరసానికి నిద్ర కుమ్మేసి రెండు, మూడు గంటలు బొజ్జునేవాళ్ళం. నిర్భయంగా! ఎందుకంటే మళ్ళీ మన వంతు ఇంకో ఆరేడు నెలలకి కాని రాదు కాబట్టి ;)

ఈ రోజుల్లో పిల్లలు అదృష్టవంతులు. ఈ అంతః శుద్ధి విషయంలో! ఆముదం అంటే ఏమిటో, దాని రుచి, రంగు, వాసన కూడా తెలీదు వాళ్లకి!

PS. ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, కాదు అడిగేది ఏమిటంటే, ఇలా "అంతః శుద్ది" చేసుకొని కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఇవాళ్టి రోజుల్లో ఆ ఆముదానికి తగిన ప్రత్యామ్న్యాయం ఏమయినా ఉందా? ఏమన్నా చిట్కాలు, టాబ్లెట్స్ వగైరా!!

PS2: అంబాజీపేట అముదానికి ఎందుకంత పేరొచ్చింది?!!

#Telugu

No comments:

Post a Comment