Sunday, February 21, 2016

No! Not for you!!

A guy walks into a bar and tells the bartender "Please give drinks for all on me including you"

So the bartender serves drink to everyone and then this guy says he got no money. The bartender slaps him and throws him out of the bar.

The next night again the same guy walks in and says the same "Please give drinks for all on me including you". Thinking that the guy must be having money now, the bartender serves drinks to all only to realize that the guy had no money even today.

He slaps him very hard and pushes him out of the bar.

The third night again the guy walks in and says ""Please give drinks for all on me except for you".

The bartender is curious and asks "Why not for me?"

The guy replies "No. Not for you! You get violent after a drink"

Start the week with a smile and you are bound to ‪#‎HaveAGreatWeek‬

Saturday, February 20, 2016

Safe place!!

NA : ఇన్నాళ్ళూ NB  అన్న దాని అసలు అర్ధం తెలుసుకొనే ప్రయత్నం కూడా చెయ్యకుండా, నేనే దాని సమయ సందర్భాల్ని పట్టి NB  అంటే Note Below అని డిసైడ్ అయిపోయా! ఎందుకంటే సర్వసాధారణంగా ఈ NB అనేది ఎప్పుడూ వ్యాసం, ఉత్తరం, రచనలలో చివరిలోనే చూసాను. వ్యాస ప్రారంభంలో కనీసం ఒక్కసారైనా చూసుంటే నేను అన్వయించుకున్న అర్ధం తప్పేమోనన్న అనుమానం వచ్చేది. కాని అలా ఎప్పుడూ వ్యాస, ఉత్తర, రచన ప్రారంభంలో చూడకపోవడం వళ్ళ NB ని నేనిలా అపార్ధం చేసుకొని దానికి వ్యతిరేకంగా NA కి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు చదువరులకి చూచాయగా NA అంటే ఏమిటో అర్ధం అయ్యిపోయి ఉంటుంది. అలా కాని పక్షంలో NA  అంటే Note Above అని తెలుసుకొన మనవి.

ఇంతకీ ఈ NA లో ఏం చెప్పదలుచుకున్నానో, NA అంటే ఏమిటో ఇంత రాసేటప్పటికి మరిచిపోయాను :(

ఒక గంట "బ్రేక్" తీసుకున్నాక గుర్తొచ్చింది! "బ్రేక్" అంటే మీ భాషలో విశ్రాంతి ఏమో .. నా భాషలో చేస్తున్న పని నించి "బ్రేక్" మాత్రమే... అంటే ఆ "బ్రేక్"లో వంటా, వార్పూ, స్నానం, ధ్యానం, సంధ్యావందనం (అతిశాయోక్తి!) కానిచ్చానని చెప్పకనే చెప్పడం ;)

ఇంతకీ అసలు NA ఏమిటి అంటే నా (ఈ కింది రచనలోనే కాకుండా) రచనల్లో "కోడిగుడ్డుకి జిల్లెట్ మాక్ 3 రేజర్ తో క్షవరం" చేసే పని చెయ్యద్దు!! అంటే "ఇదేంటి? ఇలాగ ఎక్కడన్నా అవుతుందా? మరీ ఇంత అన్నాచురల్ గానా?!!" అని అడగద్దు! సినిమాల్లో ఎంత అసందర్భం అయినా చూస్తున్నామా లేదా?! "ఎగిరేది సుమో! ఎగరగొట్టేది హీరో సుమా!!" అని ఆనందపడిపోతున్నామా లేదా? హీరో, హీరోయిన్ ప్రేమ పాటల్లో వాళ్ళిద్దరికీ సంబంధించిన అంతరంగిక ప్రేమని బహిర్గతంగా పాడి, స్టెప్పులు వేస్తూంటే వెనకాతల పంచె కట్టి పది మంది విదేశీ పురుషులు, అడ్డదిడ్డంగా చీర కట్టిన పదిమంది విదేశీ స్త్రీలు మన సంగీతానికి మన స్టెప్పులు వేస్తూంటే "ఆహా! విదేశీయుల చేత కూడా మన డాన్సులు చేయించామని ఆనందిస్తున్నామా లేదా? ఇ(అ)వన్నీ అసందర్భం కానప్పుడు, అతి సహజం అయినప్పుడు, నా రచనల్లో నేను రాసేవన్నీ కూడా సంభవాలే ;)

రచనా ప్రారంభం:

ఈ మధ్య ఒక స్టీల్ బీరువా కొన్నా. దాంతో పాటు చాలా సహజంగా ఒక జత తాళాలుసెట్ ఇచ్చాడు. ఒక తాళం తలుపుకి, ఇంకొకటి లోపల సేఫ్ కి, ఇంకోటి సేఫ్ లో పక్కకి "ఎవరికీ కనిపించకుండా" ఉన్న ఇంకో బుజ్జి సేఫ్ కి, నాలుగోది అన్ని అరలకిందా, ఇన్కమ్ టాక్స్ వాళ్లకి, దొంగలకి తెలీకుండా, కేవలం మనకి మాత్రమే తెలిసిన ఇంకో సీక్రెట్ సేఫ్ కి !! ఇలా నాలుగు తాళాలకి నాలుగు డూప్లికేట్ తాళాలు. ఇంతవరకూ బాగానే ఉంది.

ఒక తాళాల సెట్ రోజూ వాడతాం. సమస్య ఏమిటంటే రెండో సెట్ ఎక్కడ పెట్టాలి అని! ఇదేమంత పెద్ద సమస్యలాగ మీకనిపించకపోవచ్చు. నా దృష్టిలో ఇది చాలా జటిల సమస్య. మీరంతా బహుశా పోపుల డబ్బాలోనో, పరుపు కిందో, లేకపోతే హాల్లో పుస్తకాల వెనకో పెడతారేమో? మీరలా పెడితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దొంగోడికి పని సులువు చేసేస్తున్నారు ;) ఏ మనిషైనా, చివరికి దొంగైనా సరే, కష్టపడకుండా డబ్బు సంపాదిస్తే నాకు నచ్చదు. మనం, కిందా మీదా పడి,  బోల్డు కష్టపడి సంపాదిస్తే, మనం అలా బైటికో, ఊరికో వెళ్తే, దొంగ ఇలా వచ్చి ఇంట్లో సామాన్లు చిందర, వందర చేసి తాళాలు దొరగ్గానే ఎంచక్కా ఏమి కష్టపడకుండా మొత్తం దోచుకుపోతాడు. అందుకని మనం ఈ డూప్లికేట్ తాళాల సెట్ మూడో కంటివాడికి కూడా తెలీని సీక్రెట్ ప్లేస్ లో దాచెయ్యాలి! కాని అంత సీక్రెట్ ప్లేస్ ఎక్కడ? ఎక్కడ?

పిడకల వేట: అప్పుడప్పుడూ పేపర్లో ఎవరింట్లో అయినా దొంగలు పడ్డాక పోలీసులు వెళ్లి ఆ ఇంటిని, చిందర, వందరగా పడేసిన సామానులని సునిశితంగా పరిశీలిస్తున్న ఫోటో మీరంతా చూసే ఉంటారు. నాకు అలాంటి ఫోటో చూసినప్పుడల్లా ఈ దొంగలు ఎందుకు అలాగ సామానులన్నీ చిందర వందరగా పడేస్తారు అని అనుమానం వస్తుండేది. ఒకసారి ఒక దొంగగారిని అడిగాను ఇదే ప్రశ్న. ఇప్పుడు నన్ను ఈ దొంగ ఎవరు? అతనికీ మీకు ఏమిటి సంబంధం? మీరిద్దరూ తొడుదొంగలా? కాకపోతే మాకెవ్వరికీ తెలీని, దొరకని దొంగ మీకెలా ఎదురయ్యాడు? ఇలా లక్ష, యక్ష ప్రశ్నలు వెయ్యద్దనే NA లో వాపోయా. ఈ ప్రశ్నలన్నిటికీ, లోపాయకారీగా, నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రాసుకుంటూ పోతే, రామాయణంలో పిడకల వేట వోకే కాని, రామాయణం అంత పిడకల వేట నాట్ వోకే! అప్పటికి నా ఓపిక కూడా అయిపోయి, అసలు విషయం రాయకుండా ముగించెయ్యాల్సి వస్తుంది. ఆ పైన మీ ఇష్టం. దొంగలతోనే ఏం ఖర్మ? ఓ చిన్న హత్య చేసిన హంతకుడు కూడా నాకు పరిచయస్తుడే!! చిన్న హత్య అంటే చంపేద్దామనుకోకుండా చిన్న కత్తితో ఏదో అలా పొడిచెయ్యడం అన్న మాట! అదింకో కథ! ఇప్పుడవన్నీ ఎందుకు లెండి?!



మీకు అన్నీ తెలిసి కూడా తెలీనట్టు అడుగుతారు! కొన్నేళ్ళ క్రితం మూడు రాష్ట్రాల పోలీసులకి, స్పెషల్ టాస్క్ ఫోర్సు కి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియని "శాండల్ వుడ్ వీరప్పన్" ఇంటర్వ్యూ ఫోటో లతో సహా ఒక జర్నలిస్ట్ ప్రచురించాడా లేదా? ఇంకో విషయం కూడా "రవి కాంచని చోట కవి కాంచున్" అన్న నానుడి కూడా తవరికి విదితమే!

ఇంతకీ ఆ దొంగ ఏమి సమాధానం చెప్పాడంటే "అలా అన్నీ చిందరవందర చెయ్యడంలో ఉన్న కిక్కే వేరప్పా? ఎవరింట్లో సామాన్లు వాళ్లు అలా ఆ కిక్ కోసం పడెయ్యలేం కదా? నా ఇంట్లో  సామాన్లు చిందర వందర దాక ఎందుకు, తీసిన బీరువా తలుపు ముయ్యక పోయినా, లాగిన టేబుల్ డ్రా మళ్ళీ ముయ్యకపోయినా అయిపోయానే!! అలాంటిది మా ఇంట్లో సామాన్లు అలా పడేస్తే మా ఆవిడ ఒప్పుకుంటుందా? ఊరుకుంటుందా? తనే నన్ను పోలీసులకి అప్పగించేస్తుంది.  అందుకని ఇలా వృత్తి పని మీద ఇంకోళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఆ రాక్షస ఆనందం పొందుతాం.. అన్నీ కిందా పైనా పడేసి, అఫ్ కోర్స్, శబ్దం రాకుండానే!! పైగా ఇలా చెయ్యకపోతే ఈ దొంగ ఎవడో ఇంటి దొంగే అని లేదా ఇంటివాళ్ళకి తెలిసిన వ్యక్తి అని పోలీసులు విపరీతమైన తెలివితేటలు ఉపయోగించి ఆ కుటుంబ సభ్యులనీ, అపార్ట్ మెంట్ అయితే వాచ్మాన్ని, వాడి కుటుంబ సభ్యులనీ ఇలా అందరినీ అనుమానించి, అవమానించి విచారణ చేసి విసిగిస్తారు. అది దొంగలమే అయినా మాకు కూడా నచ్చదు! అందుకే పోలీసులకి  అసలు దొంగని పట్టుకోవడానికి "క్లూస్" ఇలా వదులుతాం! మాకు కూడా దొంగల నీతి, కోడ్ అఫ్ కండక్ట్ ఉంటాయి!" అని

పిడకల వేట సమాప్తం!

ఇంతకీ ఆ డూప్లికేట్ తాళాలు ఎక్కడ దాచాలి? ఎక్కడ?! ఎక్కడ?! ఎక్కడ?! వెంటనే ఆ మధ్య చూసిన ఒక తెలుగు సినిమా సీన్ ఒకటి గుర్తొచ్చింది. అందులో హీరోని పట్టుకోలేక విలన్, హీరో తల్లితండ్రులని పట్టుకు రమ్మంటాడు తన గ్యాంగ్ సభ్యులతో. అంతా "ఎస్ బాస్" అని నాలుగు దిక్కులకీ వెళ్ళిపోతారు. వాళ్ళెక్కడ ఉంటారో తెలీకపోయినా! అప్పుడు హీరోకి ఒక బ్రిలియంట్ ఆలోచన వస్తుంది. అదేమిటంటే తన తల్లితండ్రులని  విలన్ ఇంట్లోనే దాస్తాడు! వాట్ ఏ మాస్టర్ స్ట్రోక్!! విలన్ ప్రపంచం అంతా వెదుకుతాడు కాని తన ఇంట్లో వెదకడు కదా?

అంతే నేను కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోవదానికి డిసైడ్ అయ్యిపోయా! అంటే బీరువాలో సేఫ్ లో ఉన్న చిన్న సీక్రెట్ సేఫ్ లో ఆ డూప్లికేట్ తాళాలు దాచడం అన్న మాట ;) ఇది ఎంత కొండవీటి గజదొంగ అయినా ఊహిస్తాడా?! మనం బైటకి వెళ్ళినప్పుడు ఒక సెట్ తీసుకుపోతాం! రెండోది బీరువాలోనే ఉంటుంది! ఇంక ఆ దొంగ చచ్చినట్టు గాడిద కస్టాలు పడి బీరువా బద్దలు కొట్టాల్సిందే! అదేమంత వీజీ కాదు. బోల్డు శబ్దం వస్తుంది. బోల్డు పని ముట్లు తీసుకెళ్ళాలి. బోల్డు టైం పడుతుంది! ప్రొఫెషనల్ దొంగలు అంత రిస్క్ తీసుకోరు! మన సామాన్లు అన్నీ భద్రం!!

ఇలా బీరువా లోనే దాచడం లో ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1. మా ఇంట్లో తాళం చెవి ఉండి దానికి మాచింగ్ తాళం కప్ప లేని తాళాలు కొన్ని, కప్పలుండి చెవుల్లేని తాళాలు బోల్డు ఉన్నాయి! అవి పారేద్దాం అనుకుంటే పారేసాక వాటికి మాచింగ్ కప్పలు, చెవులు దొరుకుతాయేమో? అందుకని చాలా మంది ఇళ్ళల్లో తాళం కప్పలోనే తాళం చెవి కూడా ఉంటుంది. అలా బీరువాలోనే తాళాలు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు!

2. తల్లీ పిల్లని వేరు చేసినంత మహా పాపం ఇంకోటి లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి!  తాళం కప్పని, చెవిని వేరు చేసిన మహా పాపం కూడా అదే కోవకి చెందుతుంది! ఆ పాపం మనమెందుకు మూట కట్టుకోవడం? ఆలోచించండి.       

#Telugu       

Thursday, February 18, 2016

అమ్మెయ్యండి బాస్! ఆ తర్వాత ...

బాగా ధనవంతుల సంగతేమో కాని మధ్య తరగతి వాళ్ళం సాధారణంగా పెళ్లి చేసుకొని సంసారం మొదలెట్టాక ఇంటికి కావాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఇంకోటి కొంటాం. 32" టీవీ, ఫ్రిడ్జ్, మోటార్ సైకిల్ లేదా బుజ్జి కారు మొదలైనవి.

ముందు అన్నీ ఇద్దరమే కాబట్టి, లేదా "హమ్ దో! హమారే దో!!" కాబట్టి అన్ని అప్పటికి సరిపోయేవి కొంటాం. అంటే 165 లీటర్ల ఫ్రిడ్జ్, ఓ బుజ్జి మారుతి కారు, ఒక డబుల్ కాట్ అలా అన్నమాట. కొన్నేళ్ళకి పిల్లలూ, మనమూ పెద్దవాళ్ళం అవ్వడంతో అవి సరిపోక పెద్ద సైజువి కొనాల్సిన పరిస్తితి వస్తుంది! లేదా కొన్నేళ్ళకి పాత వస్తువుల మీద మోజు తగ్గో, కొత్త వాటి మీద వ్యామోహం పెరిగో పాతవి అమ్మి, కొత్తవి కొంటాం!

ఈ మధ్య ఈ OLX వాళ్ళోకళ్ళు ! చీటికి మాటికి "అమ్మేయ్యండి బాస్" అని advertisements ఎటు చూసినా ఆదరగొట్టేస్తూంటారు!! సరే ఒకటమ్మి ఇంకోటి కొంటాం!

ఇక్కడే వస్తుంది ఒక ఇబ్బంది.

ఉదాహరణకి మన పాత చిన్న కారు అమ్మి కొత్తది పెద్ద కారు కొన్నాం అనుకోండి. మనం అలా కారు అమ్మి కొత్తది కొన్న కొన్నాళ్ళకి ఒక ఫ్రెండ్ ని కలుస్తాం! ఆ ఫ్రెండ్ ముందస్తుగా మన కొత్త కారు రేట్ అదీ కనుక్కొని అప్పుడు ఒక డైలాగ్ కొడతాడు ... సర్వసాధారణంగా!

అదేమిటంటే "నీ పాత కారు అమ్మే ముందు నాకొక్క మాట చెప్పక పోయావా గురూ?! నేను ఎప్పటి నించో ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు మా ఆవిడకి కొందామనుకుంటున్నాను . ఎంత పని చేశావు?!" అని దాదాపుగా అతనికి మనం అమ్మక ముందు చెప్పక పోవడం ఒక బ్రహ్మహత్యా పాతకం లాగా మన మీద కోర్టులు కూడా శిక్షించలేని, మనం భరించలేని నేరం మోపుతాడు :(

ఇహ అక్కడినించీ మనం ఆ సదరు ఫ్రెండ్ కి మనం ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యిపోయి ఏదో సంజాయిషీ ఇచ్చి "పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని" కుళ్ళి కుళ్ళి లోపల్లోపల కుమిలి పోతాం!!

మనం పాతది అమ్మిన ఆర్నెళ్ళదాకా మనల్ని ఇలా ఎవరో ఒకరు మన అదృష్టం బాగా లేకపోతే ఇద్దరు ముగ్గురు ఈ చెయ్యని, ఊహించని నేరం మోపుతారు! ఎలాగా అమ్మేసాం కదా ఇప్పుడు అడిగి ఏమి ప్రయోజనం అని ఊరుకోరు.

మీరు ఏది అమ్మండి. ఇదే పరిస్తితి.

దీనికి విరుగుడు ఒకటే! మనం ఏది అమ్ముదామనుకున్నా ముందస్తుగా మన బంధు, మిత్ర వర్గంలో అందరికీ ఒక SMS లేదా వాట్సాప్ మెసేజ్ పంపించడం. వీలైతే ఫేస్బుక్ లో కూడా పెట్టడం శ్రేయోదాయకం, శుభకరం, క్షేమం (ఈ చివరి మూడు మాటలు ఒక RTC బస్సు మీద రాసున్నాయి!!) ;)

మనల్ని ఇలా విసిగించే వాళ్లకి కూడా ఇంకో మార్గం ఉంది! అదేమిటంటే ఎవరు ఏ కొత్తది కొనుక్కున్నా (పాతవేవి అమ్మకుండా! అంటే 1st టైం అన్నమాట) ఉదాహరణకి మన ఫ్రెండ్ ఎవరైనా కొత్త కారు కొన్నారనుకోండి (అంతకు ముందు కారు లేకుండా, ఒక వేళ ఉంటే దాన్నమ్మకుండా!!) "గురూ! నువ్వు ఈ కారు ఎప్పుడైనా అమ్మితే నాకు ముందస్తుగా ఒక మాట చెప్పు" అని చెప్పాలి!

నేనిలా అన్నానని చెప్పి మిమ్మల్ని ఎవరైనా నూతన గృహప్రవేశానికి పిలిస్తే వెళ్లి, ఇల్లంతా కలియ తిరిగి చూసి, వాస్తు కూడా వాకబు చేసి, శుభ్రంగా భోజనం చేసి వెళ్ళడానికి బయల్దేరినప్పుడు ఆ గృహస్తుతో "బాగుందోయ్ నీ కొత్త కొంప! సరిగ్గా ఇలాంటిదే, ఇదే ఏరియాలో చవగ్గా ఏమన్నా ఇల్లు దొరికితే కొందామనుకుంటున్నా! ఎప్పుడైనా అమ్మేద్దామనుకుంటే నాకు చెప్పు!" అని అనకండి!! మీకు వినిపించక పోయినా, Dolby డిజిటల్ సౌండ్ చేస్తూ ఆయన గుండె మూడు ముక్కలయ్యిపోతుంది :(

#Telugu

Tuesday, February 16, 2016

Newspaper boy!!

నాకు మూడ్ వచ్చినప్పుడు, ఈ మనుషుల మీద, సంఘం మీదా, నా జీవితం మీదా బాగా కోపం వచ్చినప్పుడు, అప్పుడప్పుడూ మా ఆవిడకి ఒకింత సాయం చేద్దామన్న కోరిక పుట్టినప్పుడు, వంట చేసి పారేస్తూంటాను! అంటే వండినదంతా పారేస్తానని అపార్ధం చేసుకోకండి!

ఇవాళ పొద్దున్నే అలా వంట చేద్దామని డిసైడ్ అయిపోయాను! ఎందుకో? అని మీరడిగినా చెప్పను... కాన్ఫిడెన్షియల్.. క్లాసిఫైడ్ కూడా.  మీ ఊహాగానాలు మీరు చేసేసుకోవచ్చు!!

ముందస్తుగా కొబ్బరి పచ్చడి, పచ్చడి పచ్చడిగా చేసేసా! ఆ తర్వాత దొండకాయలని కసా పిసా నరకడం ... క్షమించాలి ... తరగడం మొదలెట్టా! ఏ మాటకామాటే! ఎవరి మీదైనా బాగా కోపం వస్తే ఆ కోపం అంతా ఆ కూరలు మాంచి కసిగా తరగడంతో తగ్గిపోతుంది ;) (Cooking is therapeutic!! Anger management tip!!) సరే అలా కసి కసిగా, కసా, పిసాగా తరుగుతూంటే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు! మా ఆవిడ బిజీ గా ఉండడంతో నేనే సిరికిం చెప్పడు స్టైల్ లో వెళ్లి చూసాను. పేపర్ అబ్బాయి బిల్ కోసం వచ్చాడు.

ప్రతి నెల అతను పేపర్ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఎప్పుడూ నా కంప్లైంట్, అతను చెప్పే సమాధానం ఒకటే :( పేపర్ ఈ మధ్య బాగా అలీసంగా వేస్తున్నారు, అప్పుడప్పుడూ సప్లిమెంట్ వెయ్యటం లేదు అని. ఆ ముందు రోజే DC సప్లిమెంట్ వెయ్యలేదు. మెయిన్ పేపర్ వెయ్యకపోయినా క్షమిస్తాను కాని సప్లిమెంట్ వెయ్యకపోతే మట్టుకు క్షమించను. ఎందుకంటే నేను పేపర్ న్యూస్ హెడింగ్స్ చూసేసి, అడ్వర్టైజ్ మెంట్స్ కూసింత నిశితంగా పరిశీలించి వెంటనే సప్లిమెంట్ చివరి పేజీల్లోకి వెళ్ళిపోతా! అక్కడ ముందస్తుగా దినఫలం చదువుతా. ఒక్క రోజైనా బాగుంటుందని రాస్తాడేమోనని. అబ్బే ఆ అదృష్టం ఎప్పుడో కాని ఉండదు. అది చదివి డీలా పడిపోయి వెంటనే "మూడ్" లోకి రావడానికి పక్క పేజీలో డెన్నిస్ కార్టూన్ చూస్తా. వెంటనే మంచి మూడ్ లోకి వచ్చేస్తా. ఆ తర్వాత ఒక కాఫీ తాగుతూ రెండు సుడోకూ పజిల్స్ పూర్తి చేస్తా.

అసలే నిన్ననే సప్లిమెంట్ వెయ్యలేదేమో మాంచి కోపంగా కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకో అతని మొహంలో ఈ సారి ఒకింత భయం కనిపించింది! ఈ సారి ప్రతి సారి రొటీన్గా చెప్పే "రోజూ వచ్చే పిల్లగాడు రాలేదు సార్! కొత్తబ్బాయి"  అనే జవాబు చెప్పలేదు :( అసలు నోటమాట రావటం లేదు అతనికి. అదేదో హింది సినిమాలో షారుక్ లాగా "బిబిబిబి ... బిల్" అన్న మాటలు అతి కష్టం మీద అతని నోటినించి వచ్చాయి. ఎందుకలా అయిపోయాడో నాకర్ధం కాలేదు.

సరే ఎందుకైతే నాకెందుకు డబ్బిచ్చి పంపించేద్దామని హల్లోకొచ్చి బీరువాలో పర్స్ తియ్యబోతే ... అదిగో! అప్పుడర్ధం అయ్యింది..

కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీ, కృష్ణం రాజుతో "ఇదిగో ఇక్కడే! ఇక్కడేనండి పోయింది!" అంటే కృష్ణం రాజు "పోతే పోనీలే! కృష్ణా! మళ్ళీ కొనుక్కోవచ్చులే" అని ఎలా అపార్ధం చేసుకున్నాడో ఆ టైపులో నేను కూడా అపార్ధం చేసుకున్నా ఆ న్యూస్పేపర్ అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించాడో!!

ఎందుకు!... 
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... .
.... . 
.... .
.... .
.... .
.... .
.... .
.... .

ఎందుకంటే పర్స్ తియ్యబోయిన నా కుడిచేతిలో అయిదంగుళాల కత్తి ఉంది!! దొండకాయ తరుగుతూ అలా .. "సిరికిం చెప్పడు" అని మీకు క్లూ ఇచ్చా!...  వచ్చానేమో చేతిలో పొడుగు కత్తి, కట్టిందేమో గళ్ళ లుంగీ!! అచ్చు "కత్తుల రత్తయ్య" టైపు లో కనిపించాను పేపరబ్బాయికి ;) మరి భయపడ్డాడంటే .. పడడా?!!

Saturday, February 13, 2016

Spoof video - Telugu

ఒక కొత్త ప్రయోగం! ప్రయోగం కొత్త కాదు, నాకు కొత్త ;)

30 సెకండ్స్ లేక 60 సెకండ్స్ స్పూఫ్ విడియో ... స్క్రీన్ ప్లే తో సహా ...స్క్రీన్ ప్లే రాయడం నాకు కొత్త!

పాత్రలు : ఒక 65 సంవత్సరాల తండ్రి, 60 సంవత్సరాల తల్లి, నలుగురు పిల్లలు - ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు. జతకొక్క జత పిల్లలు ;)

ఓపెనింగ్ సీన్ : దీపావళి సాయంత్రం ... ముసలి దంపతులు తప్పితే మిగతా అందరూ కాకర పువ్వొత్తులు, చిచ్చు బుడ్లు మొదలైనవి కాలుస్తూ మిడ్ లాంగ్ షాట్! అది చూస్తున్న తల్లి తండ్రుల మొహాల్లో విపరీతమైన ఆనందం క్లోజ్ అప్ షాట్స్!!

నెక్స్ట్ సీన్ : దీపావళి మర్నాడు కార్తిక వనభోజనానికి అందరూ నాలుగు కార్లల్లో బయల్దేరుతారు. వన్ లాంగ్ షాట్!

నెక్స్ట్ సీన్: ఒక తోటలో అందరూ ఆడుతూ, పాడుతూ ( నో సౌండ్!!) ఒక సర్కులర్ షాట్!!

నెక్స్ట్ సీన్: అక్కడ గడ్డిలో జంబుఖానాలు వేసి అందరూ డబ్బాలు, గిన్నెలు ఓపెన్ చేసి, పేపర్ ప్లేట్లల్లో పులిహోర, జిలేబి, పూరి కూర వగైరా పెడతారు. ప్లేట్ క్లోజ్ అప్ :)

నెక్స్ట్ సీన్: తల్లి మొహం క్లోజ్ అప్ : ఆమె మోహంలో షాక్! ఆందోళన!!

నెక్స్ట్ సీన్: వెంటనే టకటకా ఇద్దరు కొడుకులు, కూతుళ్ళ మొహాల క్లోజ్ అప్ షాట్స్! వాళ్ళ మొహాల్లో కూడా ఆందోళన!

నెక్స్ట్ సీన్: నలుగురు (ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు) నాలుగు కార్ల దగ్గరకి పరిగెత్తుకెళ్ళి, కార్ డోర్స్ తెరుస్తారు! టకటకా నలుగురు కార్ డోర్స్ ఓపెన్ చేస్తున్న క్లోజ్ అప్ షాట్స్

నెక్స్ట్ సీన్: నలుగురు తల్లి దగ్గరకి వచ్చి చెయ్యి చాపుతారు!

నెక్స్ట్ సీన్: తల్లి మోహంలో ఆనందం... టైట్ క్లోజ్ అప్ షాట్!

నెక్స్ట్ సీన్: నలుగురి చేతుల్లో నాలుగు సీసాల మీద ఉన్న లేబిల్ క్లోజ్ అప్! ఆ లేబిల్ తెల్ల పేపర్ మీద ఎర్ర అక్షరాలతో "అమ్మ ఆవకాయ"! క్లోజ్ అప్!

నెక్స్ట్ సీన్: తల్లి కళ్ళల్లో ఆనంద భాస్పాలు క్లోజ్ అప్.

నెక్స్ట్ సీన్: పిల్లల మొహాల్లో ఆనందం! మిడ్ షాట్ !

వాయిస్ ఓవర్: "అమ్మని మర్చిపోలేము. (అమ్మ పెట్టిన) ఆవకాయని మర్చిపోలేము" ;)

PS: ఈ స్పూఫ్ విడియో ఎవరైనా తీస్తే తండ్రి పాత్రకి నేను సిద్ధం! .. నా వయసుకి మించిన పాత్ర అయినా ;) ఎందుకంటే ఒక డైలాగ్ లేదు. ఒక క్లోజ్ అప్ కూడా లేదు :(

PS 2: మూడు, నాలుగు సంభాషణలు కావాలంటే అదనపు రుసుముకి రాయబడును!

#Telugu

Saturday, February 6, 2016

Ambajipet Amudam !!

ఆదివారం - ఆముదం!!

నా చిన్నప్పుడు, చిన్న పిల్లాడినని జాలి కూడా లేకుండా, చిన్న పిల్లాడిని చేసి, చాల తరుచుగా, ఆరు నెలలకోసారి ఆముదం ఒక పురిశెడు బలవంతంగా తాగించేవాళ్ళు :( ఆరు నెలలకి అయితే "తరుచుగా" అని ఎందుకన్నావోయ్ మరీ అతిశయోక్తి కాకపొతే అని మీరు అడగచ్చు. తప్పు లేదు. ఆ ఆముదం తాగిన వాళ్ళకి తెలుస్తుంది. ఆరునెలలకి తాగినా "తరుచుగా" అనిపిస్తుందని !!

ఆముదం తాగించే కుటిల ప్రయత్నాలు ముమ్మరంగా ,పిల్లలకి తెలీకుండా కుట్ర, కుతంత్రాలు పెద్దవాళ్ళు చేస్తున్నారని పిల్లలకి కూడా తెలిసేది. మాక్కూడా వేగుల వాళ్ళుంటారుగా!! అంతే వెంటనే పెద్ద వాళ్ళకి దొరక్కుండా దాక్కునే వాళ్ళం! ఇక్కడ ఒక పెద్ద అడ్వాన్టేజ్ ఏమిటంటే మేము నలుగురు పిల్లలం! ఈ ఆముదం నలుగురికి ఒక్కసారి పడితే వచ్చే ఉపద్రవం విజ్ఞులైన మీ అందరికీ విదితమే!! అందుకని వంతుల వారీగా ఒక్కో ఆదివారం ఒకళ్ళకి పట్టేవాళ్ళు. అందుకని ఈ ఆదివారం ఎవరికి ఆ "శిక్ష" పడుతుందో పిల్లలమైనా మాక్కూడా ఇట్టే తెలిసిపోయేది. ఈమాత్రం దానికి వేగులవాళ్ళు పెద్దగా అవసరం లేదు ... ఒక్క మొదటి పిల్ల విషయంలో తప్పితే !

అలా ఈ ఆదివారం ఎవరిదో ముందుగా ఉప్పందితే వెంటనే ఆ సదరు పిల్ల(డు) "శని కంట పడకుండా ఒకాయన చెట్టు తొర్రలో దాక్కున్నట్టు" ఎక్కడో ఈ పెద్దమనుషులకి దొరక్కుండా దాక్కునే వాళ్ళం. కాని మన కొంపలేమీ మైసూరు పాలస్ అంత పెద్దవి కావు కదా, పెద్దవాళ్ళు "వేట" మొదలెట్టిన 10, 15 నిమిషాల్లో దొరికిపోయేవాళ్ళం :( ఎందుకంటే కొన్ని నెలలకి దాక్కునే స్థలాలు కొత్తవి ఏవీ ఉండేవి కావు. పెద్దవాళ్ళు ముందస్తుగా ఇంతకు ముందు మేము దాక్కున్న ప్రదేశాలే చూసేవాళ్ళు!! అటు పైన ఒక్కటే మార్గం ఇంటి బైటికి పోవడమే. కాని చిన్నపిల్లలం బైట ఎంతసేపు ఉంటాం? కాసేపటికే బోల్డు ఆకలి వేస్తుంది కదా? 

సరే. వెనకటికి భారతంలో చెప్పినట్టు "మాలో మేము కొట్టుకు చచ్చినా, బైటి శత్రువుకి సంబంధించినంత మట్టుకు మేము 105 మందిమి అని కౌరవులు, పాండవులు అన్నట్టుగా" మాలో మేము ఎంత కొట్టుకున్నా ఇలాంటి కామన్ ప్రమాదం విషయంలో పిల్లలందరం "ఐకమత్యమే మహా బలం" అన్న సిద్ధాంతం పాటించేవాళ్ళం!! పెద్దవాళ్ళ దృష్టి మనం దాక్కున్న ప్రదేశం నించి మళ్ళించే ప్రయత్నాలు చేసేవాళ్ళం 

ఇక్కడ ఇంకో లిటిగేషన్ ఉందండోయ్! ఈ పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఆముదం పట్టే విషయంలో, వాళ్ళల్లో వాళ్లకి ఎన్ని గొడవలున్నా, వాళ్ళు కూడా "ఐకమత్యమే మహా బలం" అన్న సిద్ధాంతం పాటించేవాళ్ళు! వాళ్ళ దెబ్బలాటలు, గొడవలు అన్నీ మర్చిపోయి ఇలాంటి విషయాల్లో అందరూ ఒకటయ్యిపోయి "జాయింట్ మిలిటరీ ఆపరేషన్"  చేసేవాళ్ళు. పిల్ల, పెద్దా తేడా లేకుండా అందరూ ఒకే పుస్తకం (ఇక్కడ మహా భారతం!) చదివితే ఇదే చిక్కు :(

అప్పుడప్పుడూ సెలవులకి వచ్చిన మా మావయ్యల సాయం తీసుకొనే వాళ్ళు ఈ పెద్దవాళ్ళు! రిఇన్ఫోర్సుమెంట్ అన్న మాట. ఈ మావయ్యలు కూడా అప్పుడప్పుడూ డబల్ గేమ్ ఆడేవాళ్ళు. మా తరఫున ఉన్నట్టు నటిస్తూనే, మా యుద్ధ సమావేశాల్లో పాల్గొని,  మా రహస్య స్థావరాలన్నీతెలుసుకొని పెద్దవాళ్లకి ఉప్పందించేవాళ్ళు! విశ్వాస ఘాతుకులు :(  

మన పార్టీ, ఎగస్పార్టీ ఒకటే స్ట్రాటజీ అవలంబిస్తే ఏమవుతుంది? బలవంతుల పార్టీయే గెలుస్తుంది. అంటే పెద్దవాళ్ళ పార్టీ!

అందుకని పిల్లలం చాల తేలిగ్గా దోరికిపోయేవాళ్ళం :( దొరికిపోయాక ఇంకేముంది. అందరికీ తెలిసిన భాగోతమే!

అలా దొరికిపోయిన పిల్ల(డు) వేపు మిగిలిన ముగ్గురు పిల్లలు "పొద్దున్నే తెల్లారకుండా ఉరి తియ్యడం కోసం తీసుకెళ్ళే ఖైదీ వేపు, మిగతా ఖైదీలు చూసినట్టు" జాలిగా, నిస్సహాయంగా చూసేవాళ్ళు :(  లోపల్లోపల "వెధవ జీవితం ఒకరు ముందు ఒకరు తర్వాత అంతే కదా" అన్న నిర్వేదంతో,  వచ్చే వారం మన వంతేమో అన్న భయంతో కూడా !

ఈ దొరకడానికి ముందు ఏమన్నా "ఎస్కేప్ రూట్" ఉంటే పారిపోయేవాళ్ళం! ముందు మనం వెనకాల ఆముదం సీసాతో శత్రువర్గం, పరుగో, పరుగు! మనల్ని పట్టి, ఆముదం పట్టాక మనం ఒక్కళ్ళమే పరుగు(లు)..ఎక్కడికో చదువరులకి చెప్పనవసరం లేదు ;) 

అలా ఆముదం తాగిన, క్షమించాలి, బలవంతంగా తాగించిన తర్వాత ఒక గంటలో అరడజనుకి సార్లకి తక్కువ కాకుండా పరిగెత్తి, "రెండు రకాలుగా" అలిసిపోయి, నీరసానికి నిద్ర కుమ్మేసి రెండు, మూడు గంటలు బొజ్జునేవాళ్ళం. నిర్భయంగా! ఎందుకంటే మళ్ళీ మన వంతు ఇంకో ఆరేడు నెలలకి కాని రాదు కాబట్టి ;)

ఈ రోజుల్లో పిల్లలు అదృష్టవంతులు. ఈ అంతః శుద్ధి విషయంలో! ఆముదం అంటే ఏమిటో, దాని రుచి, రంగు, వాసన కూడా తెలీదు వాళ్లకి!

PS. ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, కాదు అడిగేది ఏమిటంటే, ఇలా "అంతః శుద్ది" చేసుకొని కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఇవాళ్టి రోజుల్లో ఆ ఆముదానికి తగిన ప్రత్యామ్న్యాయం ఏమయినా ఉందా? ఏమన్నా చిట్కాలు, టాబ్లెట్స్ వగైరా!!

PS2: అంబాజీపేట అముదానికి ఎందుకంత పేరొచ్చింది?!!

#Telugu

Wednesday, February 3, 2016

(Heart) Breaking News!!

 

నాకు అప్పుడప్పుడూ ఒక చిలిపి ఆలోచన వస్తూంటుంది. అదేమిటంటే

మనం ఎప్పుడైనా సాయంత్రం న్యూస్ సమయానికి ఏదో ఒక టీవీ న్యూస్ ఛానల్ పెట్టామనుకోండి. అప్పుడు ఆ న్యూస్ చదివే అమ్మాయో, అబ్బాయో ఇలా అంటే, మనం వింటే ఎలా ఉంటుంది?!

"ఇవ్వాళ ఏ రాజకీయవేత్త ఇంకో రాజకీయవేత్తని కొట్టలేదు. కనీసం బూతులు తిట్టలేదు.

రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా హత్య, కనీసం హత్యా ప్రయంతం కూడా కాలేదు.

కనీసం ఒక చిన్నో, పెద్దో రోడ్ ప్రమాదం అవ్వలేదు.

ఏ పెద్ద నటుడి సినిమా, ప్రారంభోత్సవం, ఫస్ట్ లుక్, టీజర్ వీడియో, ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ ఆఖరికి పోస్టర్ రిలీజ్ అయినా కాలేదు.

మా కులాన్ని కించపరిచేలా ఫలానా సినిమాలో పాత్ర, సంభాషణలు ఉన్నాయని ఆ సినిమాని బాన్ చెయ్యాలని ఏ కులసంఘాలు ఆందోళన చెయ్యలేదు

ఏ సంస్థ సభ్యులూ "ఛలో సెక్రటేరియట్, ఛలో కొంపలకి" అనో ప్రకటించలేదు.

ఏ నటుడి అభిమానులు ఇంకో నటుడి సినిమా పోస్టర్లు చింపలేదు.

ఎవ్వరు సమ్మె చెయ్యటంలేదు. చేస్తామని ప్రకటించలేదు.

ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. కనీసం ప్రయత్నించలేదు.

పెట్రోల్, డీజిల్ ధరలు 32 పైసలు పెంచనూ లేదు. తగ్గించనూ లేదు.

ఏ రైలు పట్టాలు తప్పలేదు.ఏ రైలుని తగలెట్టలేదు 

ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఒక 500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏ అవినీతి జలగా మా స్టింగ్ ఆపరేషన్ లో దొరకలేదు.

నిన్న రాత్రి జూబిలీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర తాగి కారు నడుపుతూ, "కనీసం ఒక్కరైనా "పదిమంది గుర్తుపట్టగల" పెద్ద మనుషులు" ఎవ్వరూ దొరకలేదు.

అధమపక్షం హైదరాబాద్ మెట్రో పిల్లర్లమీద, వీధి దీపాల స్తంభాల మీదా ఏ రాజకీయవేత్తకి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ, వార్డ్ మెంబర్లు, ఓడిపోయిన ఎమెల్యే లు, ఎన్నికలలో పోటీ చెయ్యని నాయకులూ 40 అడుగుల పోస్టర్స్ అతికించలేదు.
మరందుకని ఇప్పటితో ఈ వార్తా ప్రసారం ఆపి ఒక అర డజను "కెవ్వు కేక. సూపర్ మచ్చి" లాంటి జబర్దస్త్ ఐటమ్ పాటలు వేస్తాం. చూసి ఆనందించండి. ఈ లోపల ఏమన్నా చెప్పుకోదగ్గ విశేషాలు జరిగితే మళ్ళీ వార్తలు కార్యక్రమం వేస్తాం.

ఇదంతా తెర మీద. ఇక తెర వెనకాల ఏం జరుగుతుందంటే!

ఈ కింద రాసిందంతా ఎవరు చెప్తున్నారు అని యక్ష ప్రశ్న వెయ్యకండి. ఎందుకంటే నాకూ తెలీదు. సినిమాల్లో ఒక వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ తను లేని సన్నివేశాలన్నీ కూడా మనందరికీ కళ్ళకి కట్టినట్టు ఎలా చెప్తారో ఇదీ అంతే ;)

మొత్తం మీద రోజూ చెప్తున్న, చెప్పుకోదగిన సంఘటనలు, దుర్ఘటనలు అస్సలు జరగలేదు కాబట్టి, ఇలా ఎందుకు అయ్యిందని చర్చించడానికి ఒక నలుగురు పెద్దమనుషులని పానెల్ డిస్కషన్ కి రమ్మన్నాం. మాకిది మాములేగా? ప్రతిదానికి ఇలా డిస్కషన్ పెట్టడం.

ఇద్దరు ఎగస్పార్టీ రాజకీయనాయకులని పిలిచాం. కాని వాళ్ళిద్దరూ కూడా కూడబలుక్కున్నట్టు మేం రామంటే రామ్ అన్నారు. రామ్ రామ్ స్టైల్ లో! అదేంటి సార్, ఎప్పుడు పిలుస్తామా అని ఎదురు చూసే మీరు రానండం ఏమిటంటే "మీరు భలేవారే? బైట ప్రపంచంలో ఎవరైనా కొట్టుకున్నా, తిట్టుకున్నా, వాళ్ళని తీవ్రంగా విమర్శించి, ఆపైన గర్హించడానికి అయితే వస్తాం. ఇలా ఏమి కాకపొతే ఎవరిని తిట్టాలి? ఎవరిని గర్హించాలి? మేము రాం" అన్నారు.

సరే అని ఒక వాస్తు పండితుడిని పిలిచాం. రాష్టాలు విడిపోయాక ఏమన్నా వాస్తు దోషాలు తలెత్తాయి ఏమో కాస్త సవరిస్తారని. అదే సవివరంగా వివరిస్తారని. ఆయనేమో ముందు మీ ఆఫీసు వాస్తు బాగాలేదు. దాన్ని నా సలహాల ప్రకారం మారుస్తానంటేనే వస్తానన్నారు."అయ్యా మాది అద్దె ఆఫీసు. దీన్ని మార్చగలం కాని దీన్ని మారుస్తానంటే ఓనర్ బాబు ఒప్పుకోడు" అని ఎంత చెప్పినా ఆయన కూడా డిస్కషన్ కి రావడానికి ఒప్పుకోలేదు.

సరే ఒక సంఖ్యా శాస్త్ర నిపుడిని ఆహ్వానించాం. ఆయనేమో "మీ ఛానల్ పేరు "టీవీ 808080" ఇప్పుడు నడుస్తున్నది ఎనిమిదో నెల. ఇవాళ ఎనిమిదో తేది. మీ డిస్కషన్ రాత్రి 8 గంటలకి. 8 కి శని అధిపతి. నాకసలే ఏల్నాటి శని నడుస్తోంది. నేను రాను గాక రాను" అన్నారు.

సరే అని ఒక పేరొందిన మహిళా సంఘం అద్యక్షురాలని పిలిచాం. ఎవరైనా పురుషాహంకారులని, పురుషాధిక్యం చూపించే మగ పురుషు(గు)ల్ని ఉతికి ఆరేయ్యడానికి అయితేనే వస్తామన్నారు.

ఇప్పుడు మా పరిస్థితి ఉన్నది పాయె అన్నట్టు తయారయ్యింది. వార్తలు లేవాయే. పానెల్ డిస్కషన్ చెయ్యలేక పోయే. ఇలా ఇంకో రెండు రోజులు కొనసాగితే ఇంతే సంగతులు. ముందు మా ఉద్యోగాలకి. తర్వాత మా ఛానల్ కి!
ఈ లోపల న్యూస్ ఎడిటర్ గారు హడావిడిగా తన శాఖ ఉద్యోగులందరితో ఒక సమావేశం పెట్టి ఇలా అంటాడు "ఇప్పుడు ఆ అమ్మడు చదివిన న్యూస్ ఎటు తిరిగీ రికార్డు చేసాం కాబట్టి దాన్ని లూప్ లో పెట్టి ప్రతి అరగంటకి వేసేస్తూ ఉండండి. చెప్పిందే చెప్పడం, చూపించిందే చూపించడం మనకి, విన్నదే వినడం, చూసిందే నోరెళ్ళ బెట్టుకొని చూడడం ప్రేక్షకులకి మాములేగా! ఇదిగో న్యూస్ రీడర్స్. ఇక్కడ ఉండి చేసేదేం లేదు కాబట్టి మీరంతా ఎంచక్కా ఇంటికో, సినేమాలకో చెక్కెయ్యండి. నేను ఒక రెండు మూడు గంటల్లో మిగతా వార్తా చానల్స్ ఎడిటర్స్ అందరినీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఇంత ప్రశాంతంగా ఉంటే మనమేం చెయ్యాలి అని డిస్కస్ చేస్తాం. మీ అవసరం పడితే వాట్సప్ మెసేజ్ ఇస్తాం. అప్పటిదాకా కొంపల్లో పడుండండి" అని అంటాడు. అప్పుడు న్యూస్ రీడర్స్ అంతా ఈలలు, ఈలపాటలు.

కాని ఇంతలో ఒక యువ న్యూస్ రీడర్కి ఒక గొప్ప సందేహం వస్తుంది "సార్! మీరు మమ్మల్ని సినిమాకి పొమ్మన్నారు. బ్రహ్మాండమైన ఐడియా. ఆఫీసు వేళలో సినిమాకి వెళ్తే ఆ కిక్కే వేరు. కాని ఇక్కడేమో నేనిందాక చెప్పిన న్యూస్ రికార్డింగ్ లూప్ లో పెడతామన్నారు. మరి బైట ఎవరైనా నన్ను ఈ న్యూస్ టైం కి సినిమా హాల్ల్లో చూస్తే ఇంకేమన్నా ఉందా? మన కొంప కొల్లెరవ్వదూ?" అంటాడు. అప్పుడా చీఫ్ ఎడిటర్ "మరదే! 30 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ  అయినా ఇంకా న్యూస్ రీడర్ గా ఉన్నావు. నేనేమో చీఫ్ ఎడిటర్ అయ్యాను. నిన్ను సినిమాహాల్ల్లో చూసిన వాళ్ళు ఆ టైం కి టీవీ ఎలా చూస్తారయ్యా? బాబు. ఇంట్లో టీవీ చూసే వాడు నిన్ను సినిమా హాల్లో ఎలా చూస్తాడు? బొర్ర పెంచడం కాదు. కాస్త బుర్ర వాడండయ్యా!"

ఇలా అయ్యిందనుకోండి! ఎలా ఉంటుందంటారు?!

 నా మట్టుకు #కెవ్వుకేక లా అనిపిస్తుంది ;)