2011 లో నాకు జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసిన స్వీయ రచన!
ఆ
మధ్య ఒక "గొప్ప"
ఆలోచన వచ్చింది.
అదేమిటంటే
ముందు ముందు నేను గొప్పవాడిని
అయితే ఎవరో ఒకరు నా జీవిత
చరిత్ర రాయడానికి పూనుకుంటారు
కదా? ఎవరూ
ముందుకు రాకపోతే అధమపక్షం
నేనే స్వయంగా స్వీయచరిత్ర
రాసే అవకాశం కూడా లేకపోలేదు.
కాని అపుడు
ఒక "గొప్ప"
చిక్కొస్తుంది.
అదేమిటంటే
గొప్పవాళ్ళ జీవితంలో గొప్ప
గొప్ప సంఘటనలు,
సన్నివేశాలు
ఉండాలి కదా! కాని
నా జీవితంలో ఇప్పటిదాకా అలాంటి
"గొప్ప"
సంఘటనలు ఏవి
జరగలేదే? మరేమిటి
దారి? అని
ఆలోచించగా, చించగా
ఒక "గొప్ప"
ఆలోచన వచ్చింది.
ఎవరైనా
గొప్పవాళ్ల్లయ్యాక గొప్ప
పనులు చెయ్యడం పెద్ద గొప్ప
కాదు. గొప్పవాళ్ళు
కాకముందే చెయ్యాలి.
(పిడకల వేట : ఉదాహరణకి ఎవరైనా బాగా ఆస్థిపరుడు,
సంఘంలో పేరున్న
వ్యక్తి సిటీ బస్సు ఎక్కారనుకోండి.
సాధారణంగా
అది ముందస్తుగా టీవీ న్యూస్
చానల్స్ వాళ్లకి ఉప్పందించి
చేస్తారనుకోండి.
అప్పుడు అంతా
ఆహా! ఓహో!
ఏమి సింప్లిసిటీ,
ఏమి హుంబుల్నెస్
అంటూ ఆకాశానికి ఎత్తుతారు.
అదే నాలాంటి
వాడు ఎక్కితే "చూసారా?
అంత డబ్బులుండీ
కూడా సిటీ బస్సు ఎక్కాడు.
కక్కుర్తికి
పరాకాష్ట కాకపొతే ఇంకేమిటి"
అని దుమ్మెత్తిపోస్తారు!
లోకంపోకడ అంతే
లెండి.)
సరే
ఇప్పుడు నేను అర్జెంటుగా
చెయ్యగలిగిన "గొప్ప"
పనులు ఏమున్నాయి
అని మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాను.
ఏమిటో జీవితం
అంతా ఆలోచనలతోనే సరిపోతోంది.
అప్పుడు
చరిత్రలో జరిగిన ఒక "సాధారణ"
సంఘటన ప్రపంచ
చరిత్రలో "గొప్ప"
మార్పులు
తెచ్చిన సంఘటన గుర్తొచ్చింది.
మీ అందరికీ
కూడ తెలిసినదే. ఒక మహాత్ముడిని రైల్లోంచి తోసేస్తే ఆయన మన దేశ చరిత్రనే మార్చేసారు! అది
నాకు గొప్ప ప్రేరణ లాగ పనిచేసింది.
కనీసం నన్ను
బస్సులోంచైనా ఎవరైనా తోసేస్తే
నేను కూడా ఒక గొప్ప ఉద్యమం
ఏదైనా మొదలెట్టేసి గొప్ప
వాడిని అయ్యిపోవచ్చు కదా ఎవరైనా నన్ను బస్సులోంచి తోయ్యలంటే
నేను ముందు బస్సు ఎక్కాలి
కదా.
అంతే
వెంటనే ఒక మంచి రోజు చూసుకుని
ముందస్తుగా గడ్డం పెంచడం
మొదలెట్టాను. మధ్యలో
అడ్డంగా ఈ గడ్డం గొడవేమిటి
అంటారా? వస్తున్నా,
వస్తున్నా.
అక్కడికే
వస్తున్నా. మీరు
చిన్నప్పుడు పూర్వం రాజుల
కథలు చదివారుకదా.
వాటిల్లో
కొన్ని కొన్ని కథల్లో రాజుగారు
ఏం చేసేవారు. మారు
వేషం వేసుకుని తన రాజ్య ప్రజలు
ఎలా బ్రతుకుతున్నారో స్వయంగా
చూద్దామని దేశం అంతా కాకపోయినా
కాళ్ళు నొప్పెట్టేదాక
తిరిగేవాళ్ళు
(లోపాయికారీ
కారణం ఏమిటంటే తన గురించి
ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని,
వేగుల వాళ్ళ
మీద నమ్మకం లేక!)
కాని ఇక్కడ
నాకొక్క విషయం అర్థం అయ్యేది
కాదు. అలా
మారువేషం వేసుకున్న రాజు
గారెప్పుడూ రాత్రుళ్ళు మాత్రమే
రాజ్యంలో తిరిగేవాళ్ళు.
పగలు,
పగటి వేషగాడిలాగా
కనిపిస్తారేమోనని భయంతోనా?
ఇంతకీ ఆ రాజుల
అర్థరాత్రి తిరుగుళ్ళకి నా
గడ్డానికి సంబంధంఏమిటంటారా.
నేను కూడా ఆ
రాజుల్లాగా సిటీ బస్సు ఎక్కి
నా దేశ సామాన్య ప్రజలు ఎలా
జీవితున్నారో ప్రత్యక్షంగా
చూస్తాను కదా!
కాబట్టి నేను
కూడా నన్నెవరూ గుర్తుపట్టకుండా
గడ్డం పెంచాను. మీ
పిచ్చికాని ఒక్క గడ్డం పెంచేస్తే
మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరా
మరీ చోద్యం కాకపొతే అని కొంతమంది
లోపల్లోపల అనుకోవచ్చు.
వాళ్ళందరికీ
ఒకటే సమాధానం. 60, 70
దశాబ్దాలలో
తీసిన తెలుగు సినిమాలు చూడండి.
అప్పుడు
మాట్లాడండి. ఆ
సినిమాల్లో హీరో విలన్ డెన్
కి "ధైర్యంగా"
వెళ్ళినప్పుడు
తననెవరూ గుర్తుపట్టకూడదని,
ఒక కూలింగ్
గ్లాస్, ఒక
పిల్లిగడ్డం పెట్టుకునేవాళ్ళు.
అప్పుడు వాళ్ళని
ఒక్కడు కూడా,
అప్పుడప్పుడూ
హీరోయిన్ కూడా గుర్తుపట్టేది
కాదు. అదే
నా గడ్డానికి ప్రేరణ.
(సినిమాల
ప్రభావం ప్రజల మీద భారీగా
ఉంటుంది అనడానికి ఇదొక మచ్చు
తునక!)
సరే
ఇలా ఒక పదిహేను రోజులు గడ్డం
పెంచాను. ఇక్కడ
ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను.
ఈ వయస్సులో
భారీ తెల్ల గడ్డాన్ని చూసి
నా ఆఫీసు లో ఆడంగులు తట్టుకోలేరని
వాళ్ళతో నేను ఒక రెండు,
మూడు నెలలు
సబ్బాటికల్ (sabbatical
అన్న ఇంగ్లీష్
మాటకి తెలుగు పదం లేదు! ఉంటే నాకు తెలీదు!!)
తీసుకుంటున్నానని
ఒక నిజమైన అబద్ధం చెప్పాను.
వాళ్ళకి పాపం
ఏమీ అర్థం కాలేదు,
ఇప్పటి దాక
బాగానే ఉన్నారు కదా అప్పుడే
ఏమయ్యింది. అని
(బాస్ ని పట్టుకుని అడగలేరు
కదా!) వాళ్ళలో
వాళ్ళు చెవులు కొరుక్కొని
ఉంటారు.
అలా
ఒక పదిహేను రోజులు గడ్డం
పెంచాక ఒక మధ్యాన్నం భోజనం
అయ్యాక ఒక చిన్న కునుకు తీసి
(ఆఫీసు
మానేసాక ఇదో కొత్త అలవాటు!)
నా దేశపర్యాటనకి
బయల్దేరాను
కారులో. ఇదేమిటి బస్సు
ఎక్కుతానని ఇప్పుడు ఈ కారులో
బయల్దేరడం ఏమిటి? అంతా తొండి! మేమొప్పుకోం! అని తొందరపడి నానా యాగీ చెయ్యకండి.
సిటీ బస్సు
మన ఇంటి దగ్గరకి రాదు కదా.
అందుకని ముందు
కారులో సికింద్రాబాద్ రైల్వే
స్టేషన్ కి వెళ్లాను.
అక్కడి నించే
కదా బస్సులు బయల్దేరేది.
ఎంచక్కా
కూర్చోడానికి సీట్ కూడా
దొరుకుతుంది స్టార్టింగ్
స్టాప్ లో ఎక్కితే.
ఇక్కడ ఇంకో
గిమ్మిక్ చేసాను.
కారు మూడు,
నాలుగు గంటలు
స్టేషన్ పార్కింగ్ లో పెడితే
తడిసి మోపెడు అవుతుందని కొంచం
దూరంలో అపోలో హాస్పిటల్ పక్క
వీధిలో పార్క్ చేసాను.
అక్కడ అయితే
ఫ్రీ పార్కింగ్! (మధ్య తరగతి తెలివితేటలు!)
సరే అలా పార్క్
చేసి స్టేషన్ కి వెళ్లి AC
బస్సులో
ఎక్కాను. అలిసిపోకూడదు
కదా అందుకని AC బస్సు.
అలవాటు లేని
ఆపోషణ! ఆ
బస్సు గచ్చిబౌలి కి వెళ్తుంది.
కనీసం ఒక
గంటన్నర ప్రయాణం.
కిటికీ పక్క
సీట్ లో కూర్చోని హాయిగా బైట
ప్రపంచం చూడ్డం మొదలెట్టాను.
కార్ డ్రైవింగ్
చేస్తున్నప్పుడు రోడ్ పక్క
ఉన్నవి చూసే టైం,
అవకాశం ఉండవు!
ఎన్నో కొత్త
కొత్త బిల్డింగ్స్, షాపులు కనిపించాయి.
ఇవన్నీ ఎప్పుడు
కట్టారో?!
ఈ
లోపల బస్సులో ఒకతను మొబైల్
లో గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు.
మొదలెట్టాడు
అని ఎందుకన్నానంటే అతను ఆ
కాల్ ఆపలేదు! ఈ "కాల్" అన్న మాటకి తెలుగేమిటో? అతని
జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ
అవతలి వ్యక్తితో డిస్కస్
చేసాడు. దరిదాపుగా
అతని జీవితచరిత్ర అంతా నాకు
తెలిసిపోయింది.
ఫర్వాలేదు.
నా దేశంలో
సామాన్య ప్రజలకి సమస్యలు,
అతను మాట్లాడే తీరుని బట్టి
చూస్తే, అనంతంగా
ఉన్నట్తున్నాయి!!
కాస్సేపయ్యాక
ఆయనకీ పోటీగా ఇంకొక అమ్మాయి
మాట్లాడడం మొదలెట్టింది
మొబైల్లో! ఈవిడ
ఆ ఫోన్ పట్టుకునే తీరు చూస్తే
పోలీస్ డిపార్టుమెంటు లో పని
చేస్తోందా అన్న అనుమానం
వచ్చింది. ఎందుకంటే
ఆ ఫోన్ ని పోలీస్ వాళ్ళు వాకీ,
టాకీ పట్టుకోనేట్టు
మూతికి ఎదురుగా పెట్టుకోని
మాట్లాడడం, అవతలి
వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు
మళ్ళీ చెవి దగ్గర పెట్టుకోవడం!
అమ్మాయి కాబట్టి
మూతి దగ్గరే ఎక్కువ సేపుంది
ఆ ఫోన్!! అవతలి
అబ్బాయి ఎవడో కానీ వాడికి
మాట్లాడే అవకాశం ఇవ్వకుండా
దులిపేస్తోంది. ఆ
అబ్బాయి ఫోన్ పక్కని పెట్టేసి
స్పీకర్ ఫోన్ ఆన్ చేసి అతని
పని అతను చేసుకుంటున్నాడేమో
కూడా. కేవలం
వినడమే కదా.
మంద్దేశంలో
సామాన్య ప్రజలు ఇంత ఫ్రీగా
పబ్లిక్ ప్రదేశాల్లో అందరికీ
వినిపించేట్టు ఫోన్లు
మాట్లాడుకుంటున్నారా?
ఎటు పోతోందీ (నా) దేశం?
ఇంకో
అమ్మాయి బస్సు ఎక్కింది అమీర్
పేట్ లో. ఏమిటో
తనలో తనే నవ్వేసుకుంటోంది.
తనలో తనే
మాట్లడుకుంటోంది.
నాకు ఒక్క
రెండు నిమిషాలు అర్థం కాలేదు.
పాపం పిచ్చిదేమో
అనుకున్నా. కాని
అలా కనిపించటంలేదు.
బట్టలు
చింపుకోలేదు. జుత్తు
చెరుపుకోలేదు. మరి
ఈ పిచ్చి చేష్టలు ఏమిటి.
బహుశా టీవీ
సీరియల్స్ ప్రభావం ఏమో?
వాటిల్లో
అందరూ ఇంకో వ్యక్తి తో మాట్లాడడం
కంటే వాళ్ళలో వాళ్ళు ఎక్కువ
మాట్లాడుకుంటూటారు .
ఈ అమ్మాయి
కూడా అదే టైపు ఏమో.
కాని మెల్లిగా
టికెట్ తీసుకున్నాక నా సీట్
ముందున్న సీట్ లో కూర్చుంది.
దగ్గరకి వచ్చాక
అసలు విషయం అర్థం అయ్యింది.
ఆమె రెండు
చెవుల్లో ఇయర్ ఫోన్లు,
ఆమె చేతిలో
ఉన్న మొబైల్ కి కనెక్ట్ చేసి
ఉన్నాయి. అదన్న
మాట సంగతి. ఇంత
సేపూ మొబైల్ లో మాట్లాడుతోంది
అన్నమాట.
ఇలా
ప్రజల మొబైల్ వ్యవహారం,
వ్యసనం చూస్తూ,
బైట కొత్తగా
కనిపిస్తున్న పాత బిల్డింగ్స్
చూస్తూ కాలక్షేపం చేసాను.
ఇంతలో బస్సు
తిన్నగా వెళ్లి సాయంత్రం
అయిదున్నరకి గచ్చిబౌలిలో
ఇన్ఫోసిస్ ఆఫీసు ముందు ఆపేసాడు.
హమ్మయ్య.
నేను కూడా
డ్రైవర్, కండక్టర్
తో పాటు బస్సు దిగాను.
కుసింత సేపు
పచ్చి గాలి పీల్చుకుని,
ఒక చాయ్ కొట్టి
(హైదరాబాద్
లో టీ అంటే కొడతారు!
చాయ్ అనాలి! టీ తాగుతాను అంటే మళ్ళీ కొడతారు! కొట్టాను అనాలి!! )
మళ్ళీ అదే
బస్సు లో ఎంచక్కా వెనక్కి
వెళ్ళిపోదామనుకున్నా.
కాని తానొకటి
తలిస్తే అన్నట్టు నేను చాయ్
కొట్టి కాళ్ళూపుకుంటూ బస్సు
దగ్గరకి వచ్చేటప్పటికి షాక్!!
ఈ రచన ఏదైనా పత్రికకి పంపిస్తే దీన్ని రెండు
సంచికల్లో వేసి మొదటి
సంచిక ఇక్కడ ఈ సస్పెన్స్ తో
ఆపెయ్యాలి అని ఎడిటర్ గారికి
విన్నపం చేసేవాడిని! ఇక్కడ నేనే ఎడిటర్ ని కాబట్టి ఇక్కడ ఆపేసి మిగతాది రేపు ;) ఆ తర్వాతేం జరిగింది! చెప్తాను. వింటూనే ఉండండి... రేడియో మిర్చి 98.FM ..ఇది చాలా హాట్ గురూ ;) రోజూ పొద్దున్నే దేవరాగం విత్ భారతి విని విని ఇలా అయిపోయాను ;) రేపటిదాకా ఎందుకు లెండి? హిప్పుడే చదివెయ్యండి
అక్కడ
నేను దిగిన బస్సు గుర్తు
పట్టడానికి వీలు లేకుండా
అలాంటివే ఇంకో నాలుగు బస్సులు,
ఇంకో నాలుగో,
ఐదో నాన్ AC
బస్సులు
ఉన్నాయి. దానికి
పెద్ద షాక్ ఎందుకు సార్. "
మీరు రజని టైపు! ఒక్క బస్సు దిగితే పది బస్సులు రెడీ మీకోసం!! సికింద్రాబాద్
స్టేషన్ కి వెళ్ళే AC
బస్సు ఏదో
చూసి హాయిగా ఎక్కేయ్యచ్చు
కదా" అంటారేమో. అక్కడే
ఉంది షాక్. అన్ని
బస్సుల ముందు బోర్డులు ఇన్ఫోసిస్
స్పెషల్ అని పెట్టేసారు!
ఇదేం గొడవ.
ఒక కండక్టర్
ని అడిగాను. ఇదేంటి
బాస్? అన్నీ
ఇన్ఫోసిస్ అని బోర్డులు
పెట్టారు అని. వాడు
నన్ను చూసి వీడెవడో బైటి
ఊరునించి ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాడిలాగా ఉన్నాడు అనుకోని (ఆయన గారు కూడా ఆ ఎర్ర బస్సు సంస్థలో పని చేస్తున్నా!) "సార్
సాయంత్రం అయిదు తర్వాత ఇక్కడికి
వచ్చే బస్సులు అన్నీ ఇన్ఫోసిస్
స్టాఫ్ స్పెషల్ అవుతాయి"
అని విశదీకరించాడు.
మరి
నా గతేమిటి. ఇలా
దేశం కాని దేశంలో ఊరి చివర
సాయంత్రం వేళ ఇలా ఒంటరిగా
ఎలా వెళ్ళాలి నా కొంపకి?
క్షణం క్షణం
లో శ్రీదేవి లాగ "దేవుడా,
దేవుడా"
అనుకోవడం
మొదలెట్టాను. (ఇలా "దేవుడా! దేవుడా!" అని జనరిక్ గా వేడుకుంటే ఏ దేవుడూ కాపాడ్దేమో అని ఒక అనుమానం! అందుకని కొంచం పేరు పెట్టి ఏదో ఒక దేవుడిని, మన కులదేవతనో, ఇలవేలుపునో, పరిస్థితి మరీ విషమంగా ఉంటే ఇద్దరు ముగ్గురు దేవుళ్లనో పేరు పెట్టి పిలిచి వేడుకుంటే పనవ్వుతుంది.) రోడ్
అటు వేపు చూస్తె బోల్డు ఆటో
లు వీలయినంత మందిని అంటే ఒక
అర డజను కి తక్కువ కాకుండా
ఎక్కించేసుకొని ఒక దాని వెనకాల
ఒకటి రయ్యి రయ్యిమని
వెళ్ళిపోతున్నాయి.
నేను కూడా
రోడ్ దాటి వెళ్లి అక్కడ నలుగురు
నిలపడితే నలుగురితో నారాయణా అనుకోని, వాళ్ళతో పాటు
నిలపడ్డాను. ఒక
ఆటో వచ్చింది ముగ్గురితో.
అంతే నా పక్కని
ఉన్న నలుగురు ఒక్క దూకు దూకారు
ఆ ఆటోలోకి. ముందు
డ్రైవర్ కి రెండు వేపులా
ఇద్దరు, వెనకాల
ఇద్దరు. నాకు
ఒక్క క్షణం భయం వేసింది.
బహుశా ఇదే
చివరి ఆటో ఏమో అందుకే ఆటోలో
చోటు లేక పోయినా నలుగురు
ఎక్కేసారు. నేను
కూడా వాళ్ళతో పాటు అడ్జెస్ట్
అవ్వక పొతే ఇక్కడే ఈ రాత్రి
గడపాలేమో. ఎందుకొచ్చిన
గొడవ. అని
నేను కూడా వెనక సీట్ లోకి ఒక్క
దూకు దూకాను. దూకాను
అనుకున్నా! సగం
శరీరం ఆటో బైటే వెళ్ళాడుతోంది.
అలాగే ప్రాణ
భయంతో లోపల ఉన్న వాడిని ఒక
చేత్తో , ఆటో రాడ్ని ఇంకో చేత్తో
పట్టుకొని కూర్చున్నాను.
అదృష్టం ఏమిటంటే
"ఎక్కడికి"
అని ఆటో వాడు
అడగలేదు ఎవర్నీ.
అడిగితే నా
దగ్గర సమాధానం ఉంటేగా.
ఆ ఆటో ఎక్కడికి
వెళ్తుందో తెలీదు.
నేనెక్కడ
దిగాలో తెలీదు.
మొత్తానికి
ఊళ్లోకే వెళ్తున్నాడు కదా
అని ఒక ధైర్యం. వాడు
ఆ ఆటోని విష్ణు చక్రంలా
తిప్పేస్తూ సందులు,
గొందులు
తిప్పేస్తూ, రోడ్
మీద గతుకులు, గుంటలు
పట్టించుకోకుండా రయ్యి
రయ్యిమని దూసుకుపోతున్నాడు.
వాడికి అలవాటు.
రోజుకి ఎన్ని
ట్రిప్పులు వేస్తే అంత ఎక్కువ
సంపాదించచ్చు. నా
పక్కని కూర్చున్న వాళ్ళంతా
వయసులో ఉన్న టెకీస్!
వాళ్ళంతా
ఇదేమీ పట్టనట్టు హాయిగా
సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.
నాకేమో ఒళ్ళు
హూనం. నా
దేశ సామాన్య ప్రజల కష్టాల
సంగతేమో కాని నా కష్టం మట్టుకు
భరించడం కష్టం గా ఉంది.
మొత్తానికి
ఒక పావుగంట అయ్యాక ఆటో కొండాపూర్
జంక్షన్ దగ్గర ఆపాడు.
హమ్మయ్య,
ఇక్కడినించీ
నాకు తెలిసిన హైదరాబాద్!
ముందు బస్సు
ప్రయాణానికి, తర్వాత
బస్సు లేని టెన్షన్ కి,
అటు పిమ్మట
ఈ ఆటో ప్రహశనానికి బాగా అలిసి
పోయానేమో విపరీతంగా ఆకలెయ్యడం
మొదలెట్టింది
వెంటనీ
పక్కనే ఉన్న ఒక టిఫిన్ సెంటర్
లో ఒక మసాలా దోశ లాగించేసాను!
ఆ
తర్వాత హుషారుగా,
ఉత్సాహంగా,
ఉల్లాసంగా
(కడుపు
నిండింది కదా!) వచ్చి
బస్సు స్టాప్ లో నిలపడ్డాను.
సిటీ బస్సులు
నాలుగయిదు ఒకదాని తోక పట్టుకొని
ఇంకొకటి వచ్చాయి, కష్టాల్లాగా!
అన్ని బస్సుల్లోనూ
పెజానీకం ద్వారం బైటి దాకా
వేళ్ళాడుతూ ఉన్నారు.
అయినా సరే
అస్సలు పట్టించుకోకుండా
స్టాప్ లో ఉన్న పెజలు అంతా ఆ
నాలుగయిదు బస్సుల్లో దూరిపోయారు.
ఆ బస్సులన్నీ
నా కళ్ళకి అభినవ పుష్పక
విమానాల్లా కనిపించాయి.
ఎంతమంది ఉన్నా,
ఎంతమంది ఎక్కినా
ఇంకా ఒక అర డజనుకి తక్కువ
కాకుండా జనం ఎక్కేయచ్చు
వాటిల్లో ;)
ఈ
పెజలంతా రోజూ అలా ఒకళ్ళ మీద
ఇంకొకళ్ళు ఎక్కేసి గంటలు
గంటలు ప్రయాణం చేయడానికి
అలవాటు పడ్డ పెజానీకం.
నేనలా కాదు
కదా. చస్తే
అలా భారీగా జనమున్న బస్సులో
ఎక్కదలుచుకోలేదు.
ఇది అతిశయోక్తి
! ఎందుకంటే
ఒహ వేళ అలాంటి దుస్సాహసం
చేద్దామనుకున్నా అది నా వల్ల
కాని పని. ఎక్కబోయి
కాలు జారి, చెయ్యి
పట్టు తాపీ దభీమని కింద పడే
ప్రమాదమే ఎక్కువ.
అందుకని
ఎంతసేపయినా సరే ఖాళీ బస్సులోనే
ఎక్కాలని డిసైడ్ అయ్యిపోయా.
ఒహవేళ అలా
పడకుండా పద్మవ్యూహంలోకి
అభిమన్యుడు చొచ్చుకెళ్ళినట్టు,
లోపలికి
దూసుకెల్లితే ఇంకో ప్రమాదం
ఉంది! అలవాటు
లేని వ్యవహారం కదా?
నా చొక్కా
చింపుతారు, పర్సు
కొట్టేస్తారు, షూ
తొక్కేస్తారు,
కళ్ళజోడు
విరిచేస్తారు, జుట్టు చెరిపేస్తారు, వాచీ లాగేస్తారు :(
ఎందుకొచ్చిన
రిస్క్ ఈ వయసులో.
కాసేపాగితే
కొంపలేం మునగవుగా?
ఆ
బస్సులన్నీ అలా దాదాపుగా నా
స్టాప్ లో ఉన్న పెజలనదరినీ
ఎక్కించెసుకొని వెళ్ళిపోయాయి.
నేను ఇంకో
ముగ్గురు మిగిలాం.
తర్వాత ఒక
రెండు నిమిషాలకే ఇంకో బస్సు
వచ్చింది. దాదాపు
ఖాళీగా! జనాలందరినీ
ఆ ముందరి కాన్వోయ్ బస్సులన్నీ
ఎక్కించేసుకున్నాయిగా!
పాపం వీడికి
డీజిల్ ఖర్చులు కూడా వచ్చేట్టులేవు
ఇలా ఖాళీగా వెళ్తే!
అయినా వాడి
లాభ, నష్టాల
సంగతి నాకెందుకు?
హాయిగా ఎక్కి,
దర్జాగా కిటికీ
సీట్లో కూర్చున్నా.
ఇది నాన్ AC! సాయంత్రం
అయ్యిందిగా ఫర్వాలేదు.
చల్లగానే ఉంది
కాబట్టి సామాన్య పెజానీకంలాగా
సర్దుకుపోవచ్చు.
అలా
మొత్తానికి మళ్ళీ స్టేషన్
కొచ్చి ఇంటికెళ్ళేటప్పటికి
రాత్రి 9 అయ్యింది.
మళ్ళీ ఆ బస్సు
ప్రయాణానికి అందులో నాన్ AC బస్సేమో భారీగా అలిసిపోయాను.
విపరీతంగా
ఆకలేసి డిన్నర్ కుమ్మేసి
నిద్రోయా!
ఇంతకీ
నా ముఖ్యోద్దేశం నెరవేరినట్టేనా?!
అంటే ఈ సంఘటనని
నా స్వీయజీవిత చరిత్రలో కాస్త
చిలవలు, పలవలు
చేసి ఒక చాప్టర్ చెయ్యచ్చా?
వచ్చా ఏమిటి
ఇంత కష్ట పడ్డాక?
ఒక చాప్టర్
రెడీ ;)