Monday, November 9, 2015

Diwali flashback!! దీపావళి ఫ్లాష్ బ్యాక్!!

ఫ్లాష్ బ్యాక్! ఫ్లాష్ బ్యాక్!!

అవి 1960's! నా చిన్నప్పుడు. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం రోజుల్లో!!

దీపావళి వస్తోందంటే కనీసం రెండు మూడు వారాల ముందునించి హడావిడి, పని మొదలయ్యేవి! ఇప్పటిలాగా చిచ్చుబుడ్లు, మతాబులు అమ్మడం, కొనడం లేవు ఆరోజుల్లో! ఇంట్లో చేసుకోవడమే :)

రెండు వారాల ముందు ఖాళీ చిచ్చు బుడ్లు కమ్మరి వాళ్ళు చేసి అమ్మేవాళ్ళు.  కనీసం ఒక 30/40 కొనుక్కొచ్చేవాళ్ళం. ఆ తర్వాత వాటి మూతికి చిన్న పేపర్ అంటించి ఒక రోజు ఎండలో పెట్టేవాళ్ళం. తర్వాత ముందుగా కొంచం సిసింద్రి మందు ఆ చిచ్చుబుడ్డిలో వేసి (వెలిగించినప్పుడు సులభంగా అంటుకోవడం కోసం!) దానిమీద భాస్వరం, సూరేకారం, గంధకం (?!) కలిపిన మందు బాగా సగం దాకా కూరి, ఒక పేపర్ అడ్డుగా పెట్టి వెనకాతల బంకమట్టి కూరి, రెండు మూడు రోజులు బాగా ఎండ పెట్టేవాళ్ళం! అంతే చిచ్చుబుడ్డి రెడీ!

దీనితో పాటు మతాబులు కూడా చేసేవాళ్ళం. ముందుగా పాత న్యూస్ పేపర్లని సుమారుగా ఒక అడుగు పొడువున్న గోట్టాలుగా తయారు చేసేవాళ్ళం, ఒక చివర చిన్న వత్తి లాగ చేసి.  దానికోసం మైదా పేస్టు మా అమ్మ చేసిచ్చేది. ఆ గొట్టాలు ఆరాక, వాటిల్లో కూడా ముందుగా మందు గుండు సగం దాక కూరి, వెనక సగం ఇసకతొ నింపి గొట్టం మూసేసే వాళ్ళం. వాటిని కూడా రెండు రోజులు బాగా ఎండపెట్టాక మతాబులు కూడా రెడీ!

మిగిలిన సిసింద్రి మందుతో ఎన్నొస్తే అన్ని సిసింద్రీలు చేసేసేవాళ్ళమి.

ఆ తర్వాత దీపావళి రోజు దాకా  అబ్బాయిలందరికీ "రోలు, రోకలి", కేపులు!! కేపులు కాల్చడానికి రెండు రకాల పిస్తోళ్లు ఉండేవి! ఒకటి పిస్తోలు లాగా ఉండదు. దాన్ని వర్ణించడం కూడా కష్టం!! ఒక మెటల్ ప్లేట్ మీద స్ప్రింగ్ ప్లేట్ ఉండేది. అందులో ఒక్కొక్క కేపు పెట్టి కాల్చాలి! పిస్తోళ్లు వచ్చాక కేపు రీళ్ళు రావడం మొదలయ్యింది. అప్పుడు చూడాలి మా మొహాలు! మతాబుల కంటే వెలిగిపోయేవి! ఎందుకంటారా లూజు కేపుల నించి రీళ్ళు కేపులు వస్తే మా ఫీలింగ్ ఎలాగ ఉండేదంటే, జోడుగుళ్ల గన్ ఉన్న వాడికి AK47 ఇచ్చినట్టు  ;)

ఆ పిస్తోళ్లు పట్టుకొని ఇల్లు వాకిలి, చెట్టూ, పుట్టా, ఊరు, వాడా అన్నీ పరిగెడుతూ "దొంగా పోలీస్" తెగ ఆడేవాళ్ళం. మధ్య మధ్యలో భయంకరమైన, నాలాంటి కాల్చేవాడు కూడా భయపడేంత (!) శబ్దం చేసే "రోలు, రోకలి"! దాన్ని నేను అటు వేపు చూడకుండా, ఒక చెవి, రెండు కళ్ళు మూసేసుకొని,  డాం అని పేల్చే వాడిని :(

నలుగురు పిల్లలం, అప్పుడప్పుడూ మావయ్యలు! ఫుల్ పండగే పండగ!

లీలగా గుర్తుంది. మా నాన్న ఒక మట్టి హుండీలో సంవత్సరం అంతా డబ్బులు వేసేవారు. అప్పుడప్పుడూ దీపావళి కి అది నిండితే దాన్ని మా నలుగురిని పిలిచి గది మధ్యలో ధబీలు మని కింద పదేసేవారు! అంతే గదంతా చిల్లర, మట్టి పెంకులు!! మేమందరం ఆ చిల్లర మొత్తం ఏరి, సార్ట్ చేసి లేక్కపెట్టేవాళ్ళం! ఎంతో చెప్పలేని ఆనందం! ఒక్కోసారి ఆ హుండీ డబ్బులతో మా అందరికీ కొత్త బట్టలు కొనేవాళ్ళు!

ఇహ దీపావళి రోజు సాయంత్రం అన్నీ కాల్చేసి, కొన్ని దాచేవాళ్ళం. తర్వాత రెండు రోజులు, వారం తర్వాత నాగుల చవితి రోజు కూడా కాల్చేవాళ్ళం!!

ఇప్పుడు అంత సరదాలు, హడావిడులు కనుమరుగయ్యాయి. బాణాసంచా కాల్చడం కూడా రాను రాను తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళకి అంతా కంప్యూటర్ లోనే కాలుస్తారు ఏమో :(

1 comment:

  1. entha baga varnimcharo, naa chinnappati rojulni, mastaru.
    rolu-rokallu dhaammanipimchina chivarakhari pillakayal batchllo bahusa nenu kuda okadini.

    alage into deepavali mandulu cheskodam kuda nenu school purtichesukune rojullone baga taggipoyindi.

    mallee aa rojulloki poyi chuskomani pampimcharu, sir. A million thanks to you.

    Deepavali subhakamkshalato,

    Chandu

    @chandu1302

    ReplyDelete