Saturday, February 28, 2015

ఈమధ్య ఆదివారం వస్తోందంటే భయమేస్తోంది :(

ఈమధ్య ఆదివారం వస్తోందంటే భయమేస్తోంది:(

అదేమిటి సార్? అందరికీ ఆదోరం అంటే అమితానందం కదా? అంటారేమో! అనేముందు ఒక్కసారి ఇవాళ ఆదివారమే కాబట్టి నాలాగా కాకుండా మీరంతా విపరీతంగా ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆసాంతం చదవండి. అప్పుడు తెలుస్తుంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఆదివారం అంటే ఎందుకు నేను భయపడుతున్నానో.

అసలు ఆదివారం అంటే ఏమిటి? అందరం వారం అంతా పని చేసి అలిసి పోతాం కాబట్టి శుభ్రంగా సెలవురోజు హాయిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఒక ఆరు రోజులు నిరవధికంగా పని చెయ్యడానికి సిద్ధం అయ్యిపోవడమే కదా?

కాని నేనో?

కారణం నం 1:ఆదివారం ఖాళీ కాబట్టి ఎవరు ఎక్కడికి రమ్మన్నా వాళ్ళతో తెగిన గాలిపటంలా ఊరంతా తిరిగేయ్యడం. దాంతో సాయంత్రానికి పనిరోజులకంటే ఎక్కువగా అలిసిపోవడం

కారణం నం 13: ఆరు రోజులు మా ఆవిడ చేతి వంట తింటాను కదా అందుకని ఒక్క రోజు ఆవిడకి కాస్త విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది, నాకు కూడా నా చేతి వంట (ఏ మాటకామాటే! నా వంట అమోఘం, అద్భుతం, అఖండం, ఇంకా ఇలాంటివే చాల చాల:) తిన్నట్టుంటుంది అని ఒక జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మి లాగా ఒక పెద్ద వంటకం కార్యక్రమం చేపడతాను. స్వీట్ చెయ్యడం పీకులాట పంచాంగం. తినడం నిమిషం లాగ! నేను చేసే ఆ వంటకం ఒక రెండు గంటలు వీజీగా పడుతుంది. తినడమో రెండు నిమిషాలు. కాని ఇలా ఈ నలభీమ పాకం చేసి అలిసిపోయి మళ్ళీ పుంజుకొనె లోగా సోమవారం వచ్చేస్తుంది

కారణం నం 44: ఆదివారం ఖాళీగా ఉన్నానని ఏదో ఒకటి కడగడమో, లేక బూజులు దులపడమో, ఇంకేదన్నా తుడవడమో ఇలాంటి భ్రుహత్పధకం ఒకటి చేపట్టి, అది ఎప్పటికీ అవ్వక, మధ్యలో ఆపలేక, ఎందుకు మొదలెట్టామో అని ఆత్మని అది జవాబివ్వకపోతే అంతరాత్మని, ఆపైన కుంఛమ్ ఓపిక మిగిలుంటే పరమాత్మని ప్రశ్నించి, ఎంత ప్రశ్నించినా  రాని జవాబు కోసం అలా శూన్యంలోకి చూస్తుంటే ఇంతలో పాత కాలం గోడ గడియారం ట్టంగ్ మని రెండు సార్లు కొట్టేటప్పటికి ఇంక స్నానం, ధ్యానం అన్నీ గాలికొదిలేసి హావురావురుమంటూ అన్నం తినేసి నిస్త్రాణంగా బోజ్జోవడం. లేచి చూస్తే ఏముంది "మీరు ఇవాళ లేచామనుకుంటున్నారేమో? మీరు లేచింది ఇవాళ కాదు. రేపు!" అని మా ఆవిడ సుప్రభాతం పలికితే అందులో గూడార్థం అర్థం చేసుకోనేటప్పటికి "ఏమిటీ ఈ పూట ఆఫీసుకి సెలవు పెట్టారా లేక వాళ్ళే ఇంక చాలు సెలవు తీసుకోమన్నారా" అన్న మా ఆవిడ ప్రశ్నతో గబుక్కుని పేపర్లో చూస్తే సోమవారం అని చదివాక అర్థం అయ్యేది. కుంభకర్ణుడి టైపులో ఒక 15 గంటలు బోజ్జున్నానని!

కారణం నం 72: అబ్బే ఇటువంటివి చేసి ఆదివారం అలిసిపోతున్నాం అని వెరైటీగా నేను మా ఆవిడా ఎంచక్కా బైటికి ఒక పెద్ద లాంగ్ డ్రైవ్ వెళ్లి బైట హోటల్లో భోజనం చేసి వద్దామని బయల్దేరితే, ఎటు వెళ్ళాలో తెలీక అలా బాగా దూరంగా ఉన్న ఏదో ఒక గుడికెళ్ళి అక్కడినుంచి ఏ హోటల్కి వెళ్ళాలని ఒక గంట తిరుగు ప్రయాణంలో డిస్కస్ చేసి చివరికి ఎప్పుడూ వెళ్ళే హోటల్కి ఎందుకు ఏదైనా కొత్త దానికి వెళ్దామని ఒక (పిచ్చి) నిర్ణయానికొచ్చి ఏదో కనిపించిన హోటల్లో ఒక కొత్త ఐటెం ఆర్డర్ ఇచ్చి అది వచ్చాక ఇలా కొత్త హోటల్లల్లో తెలీని ఐటమ్స్ చెప్పకూడదని నూట ఎనిమిదోసారి తిట్టుకుని, ఏదో తిన్నామనిపించి ఇంటికొచ్చి పడిపోయి భారీ ఎత్తుని అలిసిపోయాం కాబట్టి  వెంటనే ఒళ్ళు తెలీకుండా సాయంత్రం 7 దాక బోజ్జోని లేచి అనవసరంగా ఏమీ చెయ్యకుండా ఆదివారం వేస్ట్ అయిపోయిందని మరొక్క సారి నిద్ర మత్తులో వాపోవడం:(

వీటన్నితోపాటు నా ఏకలవ్య గురువుగారు www.Twitter.com/S_Sivakumar.  (అంటే నేను ఆయన్ని గురువుగా నియమించేసుకున్నాను. ఆయన అనుమతితో ప్రమేయం లేకుండా!:) Twitter లో #SundayScience  quiz అప్పుడప్పుడూ పెట్టినప్పుడు వచ్చీ రాని పరిజ్ఞానంతో వాటికి సమాధానాలు చెప్పడం, ఆయన సాయంత్రం కరెక్ట్ సమాధానాలు చెప్పేదాక విపరీతమైన మానసిక ఆందోళనకి గురవ్వడం (ఎందుకంటే నాకెంత వచ్చో, క్షమించాలి రాదో ప్రపంచం మొత్తం తెలిసిపోతుందేమోనన్న టెన్షన్ తో!) దాంతో ఇంకా మానసికంగా కూడా అలిసి పోవడం

ఇలా వేర్వేరు ఆదివారాలు పలుపలు విధములుగా విశ్రమించకుండా పరిశ్రమించి మామూలు పనిరోజులకంటే ఎక్కువగా అలిసిపోవడం అన్నది సర్వ సాధారణం అయిపోయింది.

మరందుకే ఆదివారం అంటే చెప్పలేని చెప్పుకోలేని భయం!

నోట్: పైన ఉదహరించిన కారణాల వరుస క్రమంలో ఏదో అపశ్రుతి దొర్లిందని పొరపాటు పడకండి! హైదరాబాద్లో ఆటోలో ప్రయాణించిన వాల్లెవరికైనా అలా అనిపించదు. ఎందుకంటే మా ఉళ్ళో ఆటో మీటర్లు అలాగే తిరుగుతాయి (అవి పని చేసినప్పుడు!)          

నోట్ 2: కాని ఇవాళ అనగా ఈ ఆదివారం మట్టుకు పైన ఉదహరించిన ఏ రకంగా కాకుండా ఇదిగో ఇది రాసి అలిసిపోయాను! మీరు భలేవారండీ! ఇంత నాలుగు ముక్కలు రాస్తే అలిసిపోతారేంటి ఎవరైనా? అని హాశ్చర్య పోయేవాళ్ళకి ఒక మనవి. రాసిన వాడికి తెలుస్తుంది ఆ "ప్రసవ వేదన"!!

No comments:

Post a Comment